Monday, December 23, 2024

కళలు, సంస్కృతి, నైపుణ్యాలకు తెలంగాణ నిలయం

- Advertisement -
- Advertisement -
పాలమూరు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ

మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్‌నగర్ బ్యూరో : వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు వేదికగా శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని బిజెపి పూరించింది. ఆదివారం ‘పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభ’లో పాల్గొని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. మహబూబ్‌నగర్ లో తొలుత అధికారిక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ ’పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి మహిళలు నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే.. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటున్నదని స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం వస్తుందన్నారు.

సమ్మక్క, సారక్క సెంట్రల్ ఆదివాసి,గిరిజన విశ్వవిద్యాలయం..
ములుగు జిల్లాలో కేంద్ర అదివాసి గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని,ఇందుకు రూ. 900 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఆదివాసి, గిరిజన విద్యార్దులు పేదరికం కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేక పోతున్నారని, వారిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ఆదివాసి విశ్వవిద్యాలయంను మంజూరు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణా గిరిజన దేవతలుగా కీర్తిస్తున్న సమ్మక్క సారక్క సెంట్రల్ ఆదివాసి,గిరిజన విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. పసుపు పండించే రైతులను ఆదుకునేందుకు, కనీస మద్దతు ధర లభించేలా జాతీయ స్దాయి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రైతులు బంగారంలాంటి పసుపును పండిస్తున్నారని, ఈ పసుపును విదేశాలకు ఎగుమతిని రెట్టింపు చేయడం వలన రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సుగంద దినుసులు, మసాల దినులు పండించే రైతులకు కూడా ఈ బోర్డు పరిదిలోకి తీసుకొస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా రైతులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రబుత్వం అనేక సాహసోపేతమై-న చర్యలు తీసుకుందని ప్రదాని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.3400 కోట్లు మద్దతుధర చెల్లిస్తే తాము ఒక్క ఏడాదిలోనే రూ. 27 వేల కోట్ల నిధులను గిట్టుబాటు మద్దతు ధరకు చెల్లించామని వెల్లడించారు.

మూతపడిన ఎరువుల కర్మాగారం తెరిపించాం..
రామగుండంలో మూత పడిన ఎరువుల కర్మాగారాన్ని రూ. 6300 కోట్లు వెచ్చించి తిరిగి ప్రారంభించినట్లు ప్రధాని చెప్పారు. ఒక్క ఎకరాకు సబ్సిడి కింద రైతుకు రూ. 18 వేలు కేంద్రం భరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోనే పిఎం కిసాన్ కింద రూ. 10 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సహాయంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. 2014లో 2500 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 సంత్సరాల్లో 2500 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. స్వచ్చభారత్ కింద మరుగుదొడ్లు, ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ముద్ర రుణాలు కల్పన వంటి వాటితో మహిళా సాధికారిత దిశగా దేశం అడుగులు వేస్తోందని చెప్పారు. మహిళలకు చట్టాల రూపకల్పనలో చోటు ఉండేలా పార్లమెంట్‌లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు అసెంబ్లీలో కూడా చోటు ఉంటుందని చెప్పారు. స్వచ్చభారత్‌ను సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని వెల్లడించారు. సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపిలు బండి సంజయ్, అరవింద్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, లక్ష్మణ్, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, శాంతకుమార్, నాగూరావు నామాజి, ఆచారి, పి .చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News