హైదరాబాద్: అంకుర సంస్థలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర స్థానం అవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. సీఐఐ- తెలంగాణ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలే దీనికి కారణమని వివరించారు. అంకుర సంస్థలు అందించే వస్తు, సేవలు వినియోగించుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన వ్యాపార సంస్థలను కోరారు. అంకుర సంస్థల ఆర్థిక అవసరాల విషయంలో సమగ్ర విశ్లేషణ చేపట్టాలని సూచించారు. టీ-హబ్ సిఈఓ శ్రీనివాసరావు మహంకాళి మాట్లాడుతూ అంకుర సంస్థలకు అవసరమైన ప్రపంచ స్థాయి సౌకర్యాలను టీ-హబ్ అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్వెస్ట్ ఇండియాకు చెందిన పెట్టుబడుల నిపుణుడు అనుభవ్ కుమార్ దాస్, గాయం మోటార్స్ సీఈఓ రాజ గాయం, ఇంటెగ్రా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ శ్రీరాం సుబ్రమణ్య, సీఐఐ- తెలంగాణ మాజీ ఛైర్‌పర్సన్ వనితా దాట్ల పాల్గొన్నారు.