Sunday, September 8, 2024

ప్రజలకు భద్రత, ధైర్యం కల్పించడంలో ప్రభుత్వం వెనకాడదు

- Advertisement -
- Advertisement -

Etela Rajender

 

హైదరాబాద్ : ప్రజలకు భద్రత, ధైర్యం కల్పించడంలో ప్రభుత్వం వెనకాడదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొవిడ్ నివారణ ఏర్పాట్లలో తెలంగాణ దేశంలోనే ముందుందని, వైరస్ కట్టడి కోసం సిఎం ప్రతిక్షణం పర్యవేక్షిస్తుందన్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలను కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . దీనిలో భాగంగా శుక్రవారం ఆయన మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ…రాష్ట్రంలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం మెరుగైందని, రెండు మూడు రోజుల్లో కొంత మందిని డిశ్చార్జ్ చేస్తామని మంత్రి అన్నారు.

అతి త్వరలోనే కరోనా కట్టడి అవుతుందని ఆయన తెలిపారు. ఒకవేళ కరోనా పెషెంట్ల సంఖ్య పెరిగినా, వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. కరోనా చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, ప్రైవేట్ వైద్య కళాశాలలను వాడుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కళాశాలలను వారం రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా ఆయా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. కరోనా చికిత్స అందించే ప్రైవేట్ వైద్యులకు కూడా ప్రభుత్వమే అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. బాధితుల కోసం 10 వేల బెడ్లు, 700 ఐసియూ, 170 వెంటిలెటర్స్‌ను ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో క్రాస్ కంటామినేషన్ జరగలేదని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా ప్రభుత్వం ముందుగానే ఏర్పాట్లు చేసిందన్నారు.

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వార్తలు వచ్చిన రోజు నుంచి వైద్యాధికారులను సిఎం అలెర్ట్ చేశారన్నారు. విదేశీ ప్రయాణికులు రాష్ట్రంలోకి రాకుండా ఇప్పటికే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, వైరస్ ఇంక్యూబెషన్ పీరియడ్‌లో ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధీనంలో దాదాపు 7వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మరో 3 వేల బెడ్లు కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మొదటి ఫేజ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా చికిత్స అందిస్తామని, రెండవ ఫేజ్లో జిల్లా కేంద్రాల్లో ఉన్న మెడికల్ కాలేజీ హాస్పిటల్స్‌ను వినియోగిస్తామని మంత్రి తెలిపారు.

అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పిపిపి(పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్)ను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. వారి స్టాఫ్‌కు అవసరమైన పాసులు, రవాణా సదుపాయం, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి వెల్లడించారు. ప్రతి మెడికల్ కాలేజీలో ఒక నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేసి కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సర్లు కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసుకున్నామని, వారం రోజుల్లో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తమ ఆధీనంలోకి వస్తాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

 

Telangana is in forefront of Covid prevention
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News