Wednesday, January 22, 2025

ఆదాయార్జనలో తెలంగాణ నెంబర్.3

- Advertisement -
- Advertisement -
రాజ్యసభకు ఆర్థికశాఖ నివేదిక
కేంద్రం అండదండలతో తొలి రెండు స్థానాల్లో గుజరాత్, హర్యానా

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదాయ వనరులను సముపార్జించుకోవడంతో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. దేశంలోని 28 రాష్ట్రాల రెవెన్యూ వసూళ్ళల్లో గుజరాత్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో గణనీయమైన వృద్ధిని సాధించాయని, మిగతా రాష్ట్రాలు రెవెన్యూ వసూళ్ళల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయని ఆర్ధికమంత్రిత్వశాఖ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతోనే గుజరాత్, హర్యానా రాష్ట్రాలు రెవెన్యూ వసూళ్ళల్లో మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయని, కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అండదండలు లేకపోయినా, ఆర్ధికంగా అనేక రకాలుగా వేధింపులకు గురిచేసినా సొంత కాళ్ళపై నిలబడి మూడో స్థానంలో ఉందని అధికారవర్గాలు సగర్వంగా వివరించాయి.

2022-23వ ఆర్ధిక సంవత్సరంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆదాయంలో 76.03 శాతం రెవెన్యూ వసూళ్ళను రాబట్టుకోగా, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వసూళ్ళల్లో73.95 శాతం ఆదాయాన్ని సమకూర్చుకొందని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ రాజ్యసభకు నివేదించింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో 70.60 శాతం వరకూ రెవెన్యూ వసూళ్ళను రాబట్టుకొందని ఆర్ధిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక మిగతా 25 రాష్ట్రాలన్నీ 70 శాతానికి లోబడే ఆదాయాన్ని రాబట్టుకొన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 1,37,644 కోట్ల 73 లక్షల రూపాయలు కాగా, రెవెన్యూ వ్యయం మాత్రం 1,81,039 కోట్ల 60 లక్షల రూపాయల (76.03 శాతం) వరకూ ఉంది. అదే విధంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 85,932 కోట్ల 88 లక్షల రూపాయలు కాగా రెవెన్యూ వ్యయం మాత్రం 1,16,198 కోట్ల 63 లక్షల రూపాయల (73.95 శాతం) వరకూ ఉంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 1,33,633 కోట్ల 56 లక్షల రూపాయలు కాగా రెవెన్యూ వ్యయం మాత్రం 1,89,274 కోట్ల 82 లక్షల రూపాయల వరకూ ఉందని ఆ అధికారులు సగర్వంగా వివరించారు. అయితే గుజరాత్ రాష్ట్రానికి రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వ్యయంలో ఉన్న వ్యత్యాసం సుమారు 56 వేల కోట్ల రూపాయల వరకూ ఉండగా, ఆ లోటులో అధికభాగం కేంద్ర ప్రభుత్వమే నిధులను సర్దుబాటు చేసి ఆదుకొందని, అదే విధంగా హర్యానా రాష్ట ప్రభుత్వ రాబడుల కంటే వ్యయం సుమారు 30 వేల కోట్ల రూపాయలు ఎక్కువగా ఉందని, ఈ లోటును కూడా కేంద్ర ప్రభుత్వమే వివిధ పథకాలు, రెవెన్యూ లోటు సర్దుబాటు పేరుతో ఆర్ధికంగా ఆదుకొందని ఆ అధికారులు వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయిని కూడా అదనంగా ఇవ్వకపోగా ఇంకనూ అప్పులపైన ఆంక్షలు విధిస్తూ, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల్లో భారీగా కోతలు విధించడమే కాకుండా న్యాయబద్దంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలను కూడా కేంద్రం ఎగ్గొట్టిందని, దాంతో రెవెన్యూ రాబడులకు, ఖర్చుకు మధ్య నున్న వ్యత్యాసాన్ని లోటును పూడ్చుకోవడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వచ్చిందని, దాంతోనే ఏకంగా 56 వేల కోట్ల రూపాయలను సొంత ఆదాయ మార్గాల్లో నిధులను సమీకరించుకోవాల్సి వచ్చిందని ఆ అధికారులు వివరించారు. నీతి ఆయోగ్ సిఫారసుల్లో రావాల్సిన నిధులను కేంద్రం ఎగ్గొట్టిందని, 14వ ఆర్ధిక సంఘం సిఫారసులు, 15వ ఆర్ధిక సంఘం సిఫారసులను కూడా కేంద్రం పట్టించుకోకపోవడంతోనే న్యాయంగా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధుల్లో ఏకంగా ఒక లక్షా 35వేల కోట్ల రూపాయలను రాష్ట్రం నష్టపోయిందని, ఈ అంశాన్ని ఇటీవల ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు కూడా అనేక సందర్భాల్లో కూలంకషంగా గణాంకాలతో వివరించారని ఆ అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News