Friday, November 15, 2024

తెలంగాణ అన్ని రంగాలలో సుభిక్షంగా ఉంది

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా తయారవుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పాత బాన్సువాడలో రూ. 1.05 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ శాఖ సహాయ అధికారి (ఎడి) కార్యాలయం, రైతుబంధు సమన్వయ సమితి కార్యాలయం, వ్యవసాయ శాఖ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు పక్కకు తప్పుకుంటే మిగిలిన రంగాలు, కుల వృత్తులు దెబ్బతింటాయన్నారు. రైతు తాను బతకడంతో పాటు పది మందిని బతికిస్తాడని, మంచి పంటలు పండి, రైతుల దగ్గర డబ్బులు ఉంటే కొనుగోలు శక్తి పెరిగి వ్యాపార రంగం బాగుంటుందన్నారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, రైతుబంధు డబ్బులు రావడంతో బీడు భూములు కూడా సాగులోకి వచ్చాయన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అన్నారు. రాష్ట్రంలో ధాన్యం మొత్తం ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరుకుందన్నారు. గతంలో ఏ మీటింగ్ అయినా పెట్టి రైతులు, వ్యవసాయ రంగం గురించి మాట్లాడాలంటే భయం అయ్యేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు వంటి పథకాలతో నేడు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామన్నారు. వ్యవసాయంలో విత్తనాలు, ఎరువులు, నీళ్లతో పాటుగా రైతు చెమట కూడా అంతే ముఖ్యమన్నారు. రైతులు కూడా ఆధునీక పద్దతులపై అవగాహన పెంచుకోవడంతో పాటుగా, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అలవాటు చేసుకోవాలన్నారు. రైతులు టీవిలలో వ్యవసాయానికి సంబంధించిన ప్రోగ్రాంలు చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారమని, ఏటా వందల కోట్ల రూపాయల విలువైన విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు. రైతులలో పరివర్తనం రావాలని, నూతనంగా ఆలోచించి అధిక లాభాలను అందించే కొత్త పంటలను సాగుచేయాలన్నారు.
ప్రైవేట్ మిల్లర్ల బాధలను తప్పించడానికి సీఎం ఆలోచనలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాకు ఒక రైస్‌మిల్లును ఏర్పాటు చేయడానికి నిర్ణయించారన్నారు. ఒక్కొక్క మిల్లుకు రూ. 250 కోట్ల పెట్టుబడి, గంటకు 60 టన్నుల కెపాసిటి కలిగి ఉంటుందన్నారు. అనుబంధం పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారన్నారు. బాన్సువాడ ప్రాంతంలో కూడా ఒక మిల్లును ఏర్పాటు చేస్తారన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో పుష్కలంగా నీళ్లున్నాయని, అయినా ప్రాజెక్టులు కట్టరన్నారు. దీంతో భూములు వృధాగా ఉంటున్నాయన్నారు. వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీల నీళ్లుండగా, అవసరమైన మరో 5 టీఎంసీలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో నెల రోజులు తిరిగితే ఒక్క టీఎంసీ నీళ్లు కూడా వచ్చేవి కావన్నారు. ఇప్పుడు అంతా మన రాష్ట్రం, మన ప్రభుత్వమని, మన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కొంతమంది నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో 4 వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కేవలం 600 రూపాయల పెన్షన్ ఇస్తున్నారన్నారు. ముందు మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఇచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడాలన్నారు.
కేవలం ఎన్నికలలో ఓట్ల కోసమే ఈ నాటకాలన్నారు. పేద ప్రలను మోసం చేయడానికి ఈ హామీలని, ప్రజలు మీ మాయ మాటలు నమ్మరన్నారు. దేశంలో అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధ్ది సంస్థ ఎండి, అంతర్జాతీయ విత్తన సర్టిఫికెట్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కేశవులు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎఎంసీ చైర్మన్ నర్సింలు, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, ఆత్మ కమిటి చైర్మన్ మోహన్ నాయక్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, సంగ్రాం నాయక్, భూషణ్ రెడ్డి, తహసీల్దార్ గంగాధర్, నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News