Wednesday, January 22, 2025

కాంగ్రెస్, బిఆర్ఎస్ విసుర్రాళ్ల మధ్య నలుగుతున్న తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి:   ‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం పనిచేస్తా’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేం ద్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన శనివా రం నిర్వహించిన పార్టీ విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. ఈ సం దర్భంగా మోడీ మాట్లాడుతూ మార్పునకు గ్యారెంటీ మోడీ అని, రెండు ప ర్యాయాలు పూర్తి మెజార్టీ ఇచ్చినందుకే దేశంలో అనేక మార్పులు తీసుకువచ్చామని అన్నారు. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని, దీనంతటికీ కారణం ప్రజలు తనకు అఖండ మెజార్టీ ఇవ్వడం వల్లే సాధ్యమైందన్నా రు. మోడీ నోట వచ్చిందంటే అది అ య్యి తీరుతుందన్నారు. అది 370 ఆర్టికల్ అయినా, అయోధ్యలో రాంలాల ను తిరిగి ప్రతిష్ఠించుకోవడం వరకు అందరూ చూశారని అన్నారు.

దీంతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశాన్ని అభివృద్ధి పథానికి తీసుకెళ్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ సార్వత్రికలకు నోటిఫికేషన్ ఇచ్చేకంటే ముందే ప్రజల తీర్పు బిజెపివైపే ఉందని నిరూపించారని, అందుకు ప్రత్యక్ష నిదర్శనం నిన్నటి మల్కాజ్‌గిరి రోడ్ షో, నేటి నాగర్‌కర్నూల్ విజయ సంకల్ప సభ నిదర్శనమన్నారు. ‘అబ్‌కీ బార్ చార్‌సౌ పార్’ అనే నినాదంతో దేశ ప్రజలు తమ పార్టీకి జేజేలు పలుకుతున్నారని అన్నారు. తెలంగాణ సమాజం కూడా ఇదే చెబుతోందని మోడీ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల గుండెల్లో బిఆర్‌ఎస్ పై ఉన్న కోపాన్ని భయంకరంగా చూశానని, తదుపరి దాని పరిణామం కూడా చూశానన్నారు. నేడు తెలంగాణ ప్రజలు మోడీని తిరిగి ప్రధానిని చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. జన సునామీ చూస్తుంటే మరోసారి భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వస్తామన్నా ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అనే విసురు రాళ్ల మధ్య నలిగి పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కలిసి తెలంగాణ ప్రజల కలలను నిర్వీర్యం చేశాయన్నారు. బిఆర్‌ఎస్ లూటీని ప్రజలు తిరస్కరిస్తే అంతకంటే పెద్ద లుటేరాలు తప్పుడు పథకాలతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.
బిజెపి గెలిస్తే కాంగ్రెస్ అవినీతికి అడ్డుకట్ట
పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ అవినీతికి అడ్డుకట్ట పడుతుందని మోడీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉండదన్నారు. అవినీతి అంతం కావాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడా కమలం వికసించాలన్నారు. తెలంగాణ ప్రజల మాట నేరుగా ఢిల్లీకి చేరాలంటే బిజెపి ఎంపిలు అందరూ గెలిస్తే అప్పుడే తాను సమస్యలన్నీ వారి ద్వారా తెలుసుకుని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని లూటీ చేశారు తప్ప, కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణలో కూడా అభివృద్ధి కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదన్నారు.
ఓటు బ్యాంకుగా వాడుకుని మోసం చేశారు
ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని ఈ వర్గాలను గత పాలకులు మోసం చేశారన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో దళిత సమాజాన్ని మోసం చేసిందని, దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి కెసిఆర్ మోసం చేశారని మోడీ దుయ్యబట్టారు. ఇపుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను యాదాద్రి లక్ష్మీనారసింహుని సన్నిధిలో జరిగిన ఒక కార్యక్రమంలో పీటలపై కూర్చొబెట్టి దళిత ప్రజాప్రతినిధిని కింద కూర్చోబెట్టిందని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో నిలబడితే ఓడించడానికి కాంగ్రెస్ అప్పట్లో కుట్రలు పన్నిందని, ద్రౌపదిముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించే ప్రయత్నం చేశారని, అలాంటి కాంగ్రెస్ పార్టీ దళిత సమాజానికి మేలు చేస్తుందంటే నమ్మాలా అని ఆయన ప్రశ్నించారు.
మార్పునకు గ్యారంటీ “మోడీ”
దేశంలో మార్పు జరగాలంటే ప్రధానిగా మోడీ ఉంటేనే గ్యారంటీ అన్న విశ్వాసంతో దేశ ప్రజలు ఉన్నారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ మోడీ అంటే మార్పుకు గ్యారంటీ అన్న విశ్వాసంతో ప్రజలు ఉన్నారన్నారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపే విధంగా ముందుకు సాగుతామన్నారు. 23 ఏళ్లుగా సిఎంగా, పిఎంగా ప్రజలు సేవ చేసే భాగ్యాన్ని కల్పించారన్నారు. అదేవిధంగా దేశంలో శాశ్వత ఇళ్లు, పేదలకు బ్యాంకు ఖాతాలు, ప్రతి ఇంటికీ నల్లా నీరు, విద్యుత్తు , ఉచితంగా వ్యాక్సినేషన్ వంటివి మొదటిసారి పేదలకు చేరాయన్నారు. బిజెపి పాలనలో దేశంలోని 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇంకా పేదరికంలో ఉన్న ప్రజలను పేదరికం నుంచి బయటపడే విధంగా కృషి చేస్తానన్నారు. తెలంగాణలో కూడా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానన్నారు.
తెలంగాణలో అమలవుతున్నవి కేంద్ర పథకాలే…
తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందంటే సంక్షేమం ముందుకు సాగుతుందంటే కేంద్ర ప్రభుత్వ పథకాల పుణ్యమేనని మోడీ అన్నారు. ఒక్క తెలంగాణలో కోటి మంది పేదలకు ఉచితంగా బ్యాంకు ఖాతాలు కోటి యాభై లక్షల మందికి కేవలం రూ. 20 ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని కల్పించామని అన్నారు. 67 లక్షల మందికి చిరు వ్యాపారులకు ముద్ర రుణాలు ఇచ్చామని అన్నారు. 80 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. తెలంగాణలోని మాదిగ సమాజాన్ని బలోపేతం చేసే విధంగా ముందుకు సాగుతామన్నారు. అవినీతిమయం, కుటుంబ పాలనతో పబ్బం గడుపుకునే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సామాజిక వాదంతో రొట్టెలు కాల్చుకునే ప్రయత్నం చేశారే తప్ప ఈ సమాజం బాగు కోసం పాటు పడలేదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కెసిఆర్ బహిరంగంగా చెప్పడం దళిత జాతిని, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ను కించపర్చడమేనని అన్నారు.
అధికారం ఇవ్వండి..అవినీతిపరుడు మిగలడు
తెలంగాణలో భూ మాఫియాకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రోత్సాహం అందిస్తోందని మోడీ ఆరోపించారు. ఈ కుటుంబవాద పార్టీలలో అవినీతి ఎక్కువ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2జి లాంటి భారీ స్కాంలకు పాల్పడితే, బిఆర్‌ఎస్ ప్రాజెక్టుల పేరుతో ఇతర భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని విమర్శించారు. తమకు అధికారం కల్పిస్తే అవినీతిపరుడు ఎవరూ మిగలరని మోడీ అన్నారు. అవినీతిపరులకు శిక్షపడే విధంగా ఓటుతో అధికారం అందిస్తే తెలంగాణలో అవినీతి లేకుండా చూస్తానన్నారు. పార్టీ ఇంటింటికీ వెళ్లి శ్రేణులు దేశంలో బిజెపి ఎందుకు అధికారంలోకి రావాలో చర్చించాలని, వారిని చైతన్యవంతులను చేయాలని మోడీ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదిక ద్వారా నమోఇన్ తెలుగు పేరుతో తెలుగులో తన ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రతి కార్యకర్త ప్రజలకు చేరవేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటు బ్యాంకును డబుల్ చేశారని, ఈ ఎన్నికలలో పార్లమెంట్ సీటును డబుల్ డిజిట్‌లో తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్నారని మోడీ అన్నారు. బిజెపి ఎంపి అభ్యర్థులను పరిచయం చేయిస్తూ వీరిని మీ ప్రతినిధులుగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని మోడీని పార్టీ అభ్యర్థులు రాష్ట్ర, జిల్లా నాయకులు శాలువాలు మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ అభ్యర్థి డికె. అరుణ, నాగర్‌కర్నూల్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, నల్గొండ అభ్యర్థి సైది రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆచారి, ఎల్‌విఎస్ ప్రభాకర్ ప్రసంగించారు. బంగారు శృతి, నాగర్‌కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డితో పాటు రాష్ట్ర జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News