Monday, December 23, 2024

స్వచ్ఛ భారత్‌లో తెలంగాణే అగ్రగామి!

- Advertisement -
- Advertisement -

Telangana is the forerunner in Swachh bharat

బహిరంగ మలవిసర్జన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి 2014లో దేశమం తా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్(ఎస్‌బిఎంజి) పథకానికి వచ్చే అక్టోబర్ నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లుగా ఈ పథకం వల్ల ఎంతవరకు సత్ఫలితాలు వచ్చాయో సమీక్షించుకుంటే అసలు పథకం ప్రారంభంలో ప్రభుత్వం చూపించిన శ్రద్ధ రానురాను లోపిస్తుందనే చెప్పవచ్చు. 2020 ఫిబ్రవరిలో అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన (ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ ఒడిఎఫ్) నుంచి విముక్తి పొందాయని ప్రభుత్వం ప్రకటించి ఈ పథకం రెండో దశను ప్రారంభించింది. ఘనవ్యర్థాల నిర్వహణ యాజమాన్యం అనగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఎస్‌డబ్లుఎం) వ్యవస్థలను గ్రామాల్లో ఏర్పాటు చేయడమే ఈ రెండో దశ లక్షం. అన్ని గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (వ్యర్థ జలాల నిర్వహణ యాజమాన్యం) వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్లు ( 2024 25) వ్యవధి ఉన్నా వీటి పురోగతి చూస్తే చాలా మందకొడిగా కనిపిస్తోంది. దేశం మొత్తం మీద కేవలం 10.1 శాతం గ్రామాల్లోనే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, 6.1శాతం గ్రామాల్లోనే లిక్విడ్ మేనేజిమెంట్ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి.

ఈ రెండు వ్యవస్థలు మొత్తం గ్రామాల్లో 5 శాతం మాత్రమే ఏర్పాటయ్యాయి. అండమాన్‌నికోబార్ దీవులు తప్ప ఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌డబ్లుఎం, ఎల్‌డబ్లుఎం వ్యవస్థలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయలేకపోయాయి.అయితే ఎస్‌డబ్యుఎం (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) అమలులో అన్నిరాష్ట్రాల కన్నా తెలంగాణ అగ్రగామిగా ఉండడం విశేషం. ఈ వ్యవస్థను విస్తరించడంలో తెలంగాణ 99.8 శాతం గ్రామాల వరకు ఉండగా, తరువాతి రాష్ట్రం తమిళనాడులో 97.2 శాతం గ్రామాల వరకు సాధించి రెండోస్థానంలో ఉంది. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లో తెలంగాణ 33.3 శాతం గ్రామాల్లో విస్తరించగా, తమిళనాడు 1.4 శాతం మాత్రమే సాధించగలిగింది. ఎస్‌డబ్లుఎం, ఎల్‌డబ్లుఎం ఈ రెండు వ్యవస్థలు తెలంగాణలో 33.2 శాతం గ్రామాల్లో అమలవుతుండగా, తమిళనాడులో కేవలం 1.4 శాతం గ్రామాల్లోనే అమలవుతోంది. పుదుచ్చేరిలో 56.5 శాతం గ్రామాల్లో ఎస్‌డబ్లుఎం అమలవుతుండగా, 0.9 గ్రామాల్లోనే ఎల్‌డబ్లుఎం అమలవుతోంది. సిక్కింలో 30.5 శాతం గ్రామాల్లో ఎస్‌డబ్లుఎం , 30 శాతం గ్రామాల్లో ఎల్‌డబ్లుఎం గ్రామాల్లో అమలవుతున్నాయి.ఈ రెండు వ్యవస్థలు సిక్కింలో 28.8 శాతం గ్రామా ల్లో అమలవుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో 29.7 శాతం గ్రామాల్లో ఎస్‌డబ్లుఎం,26.9 శాతం గ్రామాల్లో ఎల్‌డబ్లుఎం అమలవుతున్నాయి. రెండు వ్యవస్థలు 25 శాతం గ్రామాల్లో అమలవుతున్నాయి. కేరళలో 29 శాతం గ్రామాల్లో ఎస్‌డబ్లుఎం, 28.2 శాతం గ్రామాల్లో ఎల్‌డబ్లుఎం, రెండు వ్యవస్థలూ 28 శాతం గ్రామాల్లో విస్తరించాయి. మిజోరంలో 23 శాతం గ్రామాల్లో ఎస్‌డబ్లుఎం, 19.1 శాతం గ్రామాల్లో ఎల్‌డబ్లుఎం, రెండు వ్యవస్థలూ 18.8 శాతం గ్రామాల్లో అమలవుతున్నాయి. ఇక మిగతా దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్, డయ్యు, ఉత్తరాఖండ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, హర్యానా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అసోం, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో గరిష్ఠంగా 17 శాతం నుంచి కనిష్టంగా 2 శాతం గ్రామాల్లో మాత్రమే ఈ వ్యవస్థలు ఏర్పాటు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, వంటి పెద్ద రాష్ట్రాలు కూడా 5 శాతం కన్నా తక్కువగానే అమలు చేయగలిగాయి. 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత గ్రామా ల్లో 15 మాత్రమే ఎస్‌డబ్లుఎం వ్యవస్థను 10 శాతం వరకు మాత్రమే విస్తరింప చేయగలిగాయి. ఇక వ్యర్థ జలాల నిర్వహణ (లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ) వ్యవస్థను పరిశీలిస్తే ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కనీసం సగం గ్రామాల్లోనైనా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయాయి.

మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 10 మాత్రమే 10 శాతం మించి గ్రామాల్లో ఎల్‌డబ్లుఎం ను ఏర్పాటు అయ్యాయి. ఈ రెండు వ్యవస్థ్లల పథకాలు ప్రారంభమైన దగ్గర నుంచి వీటి వృద్ధి చాలా మందకొడిగా ఉంది. దాదాపు 6 లక్షల గ్రామాల్లో 29,874 గ్రామాల్లో ఈ రెండు వ్యవస్థలు ఏర్పాటు అయ్యాయి. ఈ వ్యవస్థల్లో 73 శాతం 6 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితం కావడం విశేషం. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్‌బిఎంజి) పథకానికి బడ్జెట్‌లో రూ. 7192 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ కేటాయింపు మొత్తం ఇదివరకటి మూడేళ్ల కేటాయింపుల కన్నా 28 శాతం తక్కువ. గత ఏడాది రూ.9994.1కోట్లు ఈ పథకానికి కేటాయించారు. ఇదే విధంగా ఈ నిధుల వినియోగం కూడా గత రెండేళ్లలో మూడింట నాలుగొంతులు తగ్గిపోయింది. 2019 20లో నిధుల్లో 82.5 శాతం వినియోగించే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ డేటా ప్రకారం 202122 లో సంబంధిత మంత్రిత్వశాఖ జనవరి వరకు 21 శాతం మాత్రమే వినియోగించగలిగినట్టు తెలుస్తోంది. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే గత ఏడాది నిధుల వినియోగం 49.5 శాతం వరకే ఉన్నట్టు స్పష్టమైంది. కరోనా రాకముందు కూడా ఈ పథకం నిధుల వినియోగం బాగా తగ్గింది. ఈ పథకం ప్రాథమిక దశలో నిధుల వినియోగం వరుసగా, మూడేళ్లు 2015 16 నుంచి 2018 19 వరకు బడ్జెట్ అంచనా కన్నా ఎక్కువగానే కనిపించింది.

కానీ 2018 2019 లో బహిరంగ మలవిసర్జన నుంచి గ్రామాలను విముక్తి చేయాలన్న లక్షానికి చేరువవుతున్నట్టు కనిపించినా బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో 84.3 శాతం మాత్రమే వినియోగించడమైంది. 2014 అక్టోబర్ 2 న ప్రారంభమైన ఈ పథకంలో 2019 నాటికి దేశం మొత్తం మీద బహిరంగ మల విసర్జనను పూర్తిగా నివారించాలని లక్షంగా నిర్దేశించుకున్నా ఈ గడువు దాటి మూడేళ్లవుతున్నా వందలో పదో వంతు కూడా పూర్తికాలేదు. మొదటి మూడేళ్లలో 60 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ ఈ మేరకు కార్యక్రమాలు సాగక ఫలితాలు అంతంత మాత్రం అయ్యాయని పరిశోధనల్లో బయటపడింది. 2017 లోనే ఈ పథకం అమలు తీరుపై అనేక అధ్యయనాలు సాగాయి. ప్రభుత్వం, పారిశ్రామిక రంగం సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) అధ్యయనంలో వెలువడిన స్వచ్ఛభారత్ చిత్రానికి, ప్రభుత్వనిర్వహణ విభాగం, స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వేలో వెలువడిన చిత్రానికి తేడా అంతగా లేదని వివరాలు చెబుతున్నాయి. దేశం మొత్తం మీద 62.45 శాతం మరుగుదొడ్లు వినియోగం అవుతున్నట్టు స్వచ్ఛ్ సర్వేక్షణ్ వెల్లడించగా, 63.73 శాతం వినియోగమవుతున్నట్టు స్వచ్ఛ్‌భారత్ మిషన్ పేర్కొంది.

ఏకంగా 91.29 శాతం మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నట్టు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకటించింది.ఇవన్నీ దాదాపు ప్రభుత్వ భాగస్వామ్యంతో సాగిన సర్వేలు కాబట్టి ఇందులో వాస్తవాలు ఎంతో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కానీ స్పష్టం కాదు. ఇక 2017లోనే కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. టాయిలెట్ల నాణ్యత, నిర్వహణ ప్రధాన అంశాలుగా వాటర్ ఎయిడ్ 2017 నివేదిక అందించిన సమాచారం వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్టు బయటపడింది. ఆ నివేదిక ఎనిమిది రాష్ట్రాల సమాచారాన్ని వివరించింది. ఈ పథకం లబ్ధిదారుల కుటుంబాల్లో నాలుగో వంతు మంది కన్నా తక్కువ మంది తాము స్వయంగా చొరవ తీసుకుని మరుగుదొడ్లు నిర్మించుకున్నామని చెప్పినట్టు నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందిన గ్రామాలుగా వేటినైతే ప్రకటించారో ఆయా గ్రామాల్లోనే అధ్యయనం చేయగా అసలు బండారం బయటపడింది.

కె. యాదగిరి రెడ్డి- 9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News