Tuesday, November 5, 2024

గణాంకాలే సాక్ష్యం

- Advertisement -
- Advertisement -

తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానం

సంపాదనలో తెలంగాణ ప్రజలే టాప్
ఐదేళ్ళల్లో అనూహ్య పెరుగుదల
2022-23లో తలసరి ఆదాయం రూ.3,12,398
2017-18లో తలసరి ఆదాయం రూ.1,58,360
2023లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,72,276
5ఏళ్ళల్లో 28.52% పెరిగిన తలసరి ఆదాయం

25.33%తో రెండో స్థానంలో తమిళనాడు
25.32%తో మూడోస్థానంలో కర్ణాటక
22.99%తో నాలుగోస్థానంలో ఒడిషా
ఆర్‌బిఐ నివేదికే స్పష్టం చేసింది
అద్భుత ప్రగతికి అంకెలే సాక్ష్యం
థ్యాంక్స్ టు కెసిఆర్ గారు: కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ / హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నివేదిక స్పష్టంచేసింది. 2017-18వ ఆర్ధిక సంవత్సరం నుంచి 2022-23వ ఆర్ధిక సంవత్సరం వరకూ గడచిన అయిదేళ్ళల్లో తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం 28.52 శాతం పెరిగి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచిందని ఆర్‌బిఐ నివేదిక తెలిపింది. 2017-18వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 1,58,360 రూపాయలు ఉండగా అది కాస్తా 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి వచ్చేసరికి 3,12,398 రూపాయలకు పెరిగిందని, అంటే ఈ అయిదేళ్ళల్లో తలసరి ఆదాయం 28.52 శాతం పెరిగిందని ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది.

రెండో స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉందని, తమిళ ప్రజల తలసరి ఆదాయం గత అయిదేళ్ళల్లో 25.33 శాతం పెరిగిందని, మూడో స్థానంలో ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గత అయిదేళ్ళల్లో 25.32 శాతం పెరిగిందని ఆర్‌బిఐ నివేదిక వివరించింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న ఒడిషా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 22.99 శాతం పెరిగింది. ఇలా గణాంకాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరుకు నిలువెత్తు నిదర్శనమని, ఈ గణాంకాలే తెలంగాణ అభివృద్ధిని తెలుపుతున్నాయని, అందుకు తమ పార్టీ అధినేత కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు స్పష్టంచేశారు. ఇదే అంశాన్ని ట్విట్టర్‌లో (ఎక్స్) కెటిఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, నగదు బదిలీ పథకాలు సత్ఫలితాలను ఇచ్చాయని, తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని ఆర్‌బిఐ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయని కెటిఆర్ సగర్వంగా వివరించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై తాను మాట్లాడాల్సిన అవసరం లేదని, ఆర్‌బిఐ నివేదికలో పొందుపరిచిన పదాలే మాట్లాడుతున్నాయని కెటిఆర్ ట్విట్టర్‌లో సగర్వంగా పేర్కొన్నారు. ఇంతటి ఘనతను సాధించిపెట్టిన కెసిఆర్‌కు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు కెటిఆర్. ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక, ఐటి, ఫార్మా పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ బూమ్‌కు ఇచ్చిన ప్రోత్సాహకాలు అన్నీ అన్ని వర్గాల ప్రజలకు, విద్యావంతులు, నిపుణులకు సైతం ఉపాధిని కల్పించాయని, అందుకే అన్ని వర్గాల ప్రజల సంపాదన కూడా భారీగా పెరిగిందని, దాంతో తలసరి ఆదాయం పెరిగిందని ఆర్‌బిఐ నివేదిక చెప్పకనే చెప్పిందని కెటిఆర్ మాత్రమే కాకుండా బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సైతం సగర్వంగా అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 3,12,398 రూపాయలు ఉండగా అదే కేంద్రంలో బిజెపి పాలిత ప్రభుత్వ జాతీయ తలసరి ఆదాయం కేవలం 1,72,276 రూపాయలు మాత్రమే ఉందని, అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణలో తలసరి ఆదాయం 1,40,122 రూపాయలు అధికంగా ఉందని బిఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ గణాంకాలే కెసిఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి స్వర్ణయుగమని చెప్పడానికి సాక్షాలని సగర్వంగా అంటున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ఏడాదిలో అంటే 2014-15వ సంవత్సరంలో తలసరి ఆదాయం 1,24,104 రూపాయలుగా ఉండేదని, అక్కడి నుంచి కెసిఆర్ దార్శనికతతో చేపట్టిన అనేక పథకాలు, పాలసీల మూలంగా ఏకంగా తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 3,12,398 రూపాయలకు పెరిగిందని, ఇంతకంటే కెసిఆర్ పాలన గొప్పదని చెప్పడానికి ఇంకేం కావాలి, రాజకీయాల కోసం, స్వార్ధ ప్రయోజనాల కోసం, విమర్శల కోసమే విమర్శలు చేసే వారికి ఈ గణాంకాలే జవాబు చెబుతున్నాయని వివరించారు.

అంతేగాక 2014-15వ సంవత్సరం నాటికి రాష్ట్ర జిడిపి 4,16,332 కోట్ల రూపాయలుగా ఉందని, కానీ కెసిఆర్ దార్శనిక పాలన మూలంగా తెలంగాణ రాష్ట్ర ఆస్తులు (జిడిపి) 2023-24వ ఆర్ధిక సంవత్సరం నాటికి రికార్డుస్థాయిలో 14,49,708 కోట్ల రూపాయలకు పెరిగిందని, అంటే గడచిన పదేళ్ళల్లో ఏకంగా 10,33,376 కోట్ల రూపాయలు పెరిగిందని వివరించారు. ఈ అంకెలే కెసిఆర్ పాలనలొని గొప్పతనం గురించి మాట్లాడుతున్నాయని, ఇక ఎవ్వరెన్ని రకాలుగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేతలు సగర్వంగా వివరించారు. కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడే కాకుండా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం ఉన్న నాయకుడని ఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయని ఆ నాయకులు వివరించారు. తలసరి ఆదాయంలోగానీ, ఆర్ధికాభివృద్ధిలో గానీ తెలంగాణ రాష్ట్రానికి సాటిలేరని, కనీసం పోటీపడే రాష్ట్రం కూడా దేశంలోనే లేదని, అతి తక్కువ కాలంలో అంతటి ఘనమైన అభివృద్ధిని సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆర్‌బిఐ నివేదికలోని గణాంకాలే స్పష్టంచేశాయని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News