తెలుగు సాహిత్యంలో అస్తిత్వచలనాల దశ ప్రారంభమైన 1990ల నుంచి సాహిత్యకారులు అనేక వర్గాలుగా, సమూహాలుగా చీలిపోయారు. ఎవరి అనుభవాలను వారే రాయాలనే ‘సోయి’తో భిన్న సామాజిక వర్గాల్లోంచి ఎదిగి వచ్చిన రచయితలు ఆయా వృత్తుల విధ్వంసాన్ని, ఆయా కులజీవితాల్లోని జీవన పోరాటాన్ని, సంక్లిష్టతల్ని, ఆంతరిక సమస్యల్ని ఏకరువు పెట్టారు. దీని వల్ల ఎన్నో కొత్తకొత్త అభివ్యక్తీకరణలు, జార్గన్‌లు సాహిత్యంలో చేరి తెలుగు భాషను మరింత సంపద్వంతం చేసిన మాట వాస్తవమే అయినా విశాలమైన రచయితను బొన్సాయి మొక్కలాగా ఒక కుండీలో కుదించినట్లు అయింది. తమ సొంత గొడవను మాత్రమే రాస్తూ విశాలమైన దృష్టితో కాకుండా గంతలు కట్టిన గుర్రంలాగా ఒకే మార్గంలో వేగంగా పరిగెత్తారు రచయితలు. తత్ఫలితంగా గత మూడు దశాబ్దాల్లో విభిన్న అస్తిత్వ వేదనా సాహిత్యాన్నే మూటగట్టుకున్నాం.
ఈ మూస నుండి బయటపడి ఉదాత్తమైన మానవీయ విలువల్ని సాహిత్యీకరించిన వారు, ఈ ఖాళీని భర్తీ చేసిన రచయితలు చాలా తక్కువ మందే కనిపిస్తారు. అలాంటి ఒకానొక ప్రాపంచిక దృక్పథంతో, రోజు రోజుకు అంతరించి పోతున్న మానవీయ విలువల్ని తట్టిలేపుతున్న కథాసాహిత్యాన్ని సృజిస్తున్న వర్ధమాన కథా రచయిత కటుకోజ్వల మనోహరాచారి.
అస్తిత్వవాద కథకుల్లా కాకుండా మనోహరాచారి ఈ నేల మీద జీవించే మనిషి, మనిషిలా జీవించాలంటే ఏయే విలువల వెలుగులో జీవించాలో చెప్తూ ఉత్తమ సంస్కార లేపనాన్ని మన గుండెలకు పూసే కథల్ని రాసాడు. దీనికి తార్కాణమే ఈ ‘సుదూరతీరాలు’ కథా సంపుటి. సమాజంలో రోజు రోజుకు అడుగంటిపోతున్న మానవీయ విలువల్ని మళ్ళీ ప్రతిష్ఠించడానికి మనోహరాచారి కథనొక ఆయుధంగా వాడుకుంటున్నాడు. నక్షత్రపు తోటలో నుంచి ఏవో కొన్ని పరిమళ రహిత చుక్కల్ని తెంపుకొచ్చి మన హృదయపు వాకిట్లో నాటేవాడు కాదు మనోహరాచారి. నేల విడిచి సాము చేయకుండా మన చుట్టూ పరుచుకున్న జీవితాల్లోంచే కథా వస్తువునెన్నుకొని దాన్ని తాత్త్విక స్థాయికి తీసుకుపోయే రచనా మెలకువ తెలిసిన కథా రచయిత.
ఈ కథా సంపుటిలోని ‘ఆత్మీయులు’, ‘సక్కుబాయి ఓ బాయ్ ఫ్రెండ్’ ఈ రెండు కథలు మాత్రమే ప్రేమ చుట్టూ తిరుగుతాయి. మిగిలిన కథలన్నీ మావవతా విలువల్ని పెంపొందించే కథలు. ‘పల్లెతనం’ కథ ఒక్కటి ఇప్పటి పల్లెల నిజస్వరూపాన్ని ఎత్తిచూపిన కథ. సినిమాల్లో చూపించేలాంటి పల్లెటూళ్లు కావు ఇప్పుడున్నవి. “పచ్చని చెట్లు, పంటపొలాలు, వాగులు వంకలు, బావులు, చెరువులు, చింతచెట్లు, మామిడితోటలు, సాయంకాలం వీధి నాటకాలు, భాగవతాలు…” అని పల్లెటూరు అనగానే ఏమేమో ఊహించుకుంటాం. కాని ‘పల్లెతనం’ అంతరించిపోయి అక్కడ కూడా ఎన్నో రాజకీయాలు, రంగులు మార్చే మనుషులు, కరువు, భూఆక్రమణ లాంటివి ముంచెత్తి నిత్యం పుండులా రగిలిపోతూ రసికారే పల్లెలే ఇప్పుడున్న పల్లెలని, పల్లెల వాస్తవ ముఖచిత్రాన్ని కళ్లకు కడుతాడు రచయిత.
మిగతా వృత్తులవారికన్నా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి సమాజం మీద ఒకింత ‘గురు’తర బాధ్యత ఎక్కువే ఉంటుంది. రచయిత ఉపాధ్యాయుడు కావటం మూలాన్నే కావచ్చు ఇందులోని ‘పసిమనసులు’, ‘బడిబాట’తో పాటు ఇతర కథల్లో కూడా పిల్లల చదువు నేపథ్యంగా తొంగి చూస్తుంది. ఇప్పటి తల్లిదండ్రుల్లో ఉన్న ‘సాంకేతిక విద్యావ్యామోహం అనే బలహీనతను చక్కగా వినియోగించుకొని’ కార్పోరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాటిల్లో మానవీయ విలువలు మినహా అన్నీ నేర్పుతున్నారు. అందుకే సమాజం ఇంత ఘోరంగా రూపుదిద్దుకుంది. పిల్లలు ఏ స్పందనా లేని మరయంత్రాలుగా తయారయ్యారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకోబోతున్న సందర్భంలో కూడా దేశం నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించలేకపోయింది. దీనికి కారణం, డ్రాపవుట్స్, ఇర్రెగ్యులర్స్ పెరగడమే. ఇంకా ముప్పయి శాతం మంది పిల్లలకి ‘బడిబాట’లో కాళ్లకు ముళ్లే దిగుతున్నాయి. ఉపాధ్యాయులు కూడా బెల్లు, బిల్లులాగ తయారవుతున్నారు. కాని పాఠాలు చెప్పడంతో పాటు విద్యార్థుల కుటుంబ నేపథ్యాన్ని, ఆర్థిక నేపథ్యాన్ని కూడా అధ్యయనం చేస్తే, విద్యా వ్యవస్థ మూలాల్ని అర్థం చేసుకొని అంకిత భావంతో పనిచేస్తే విద్యా ఫలాలను అందరికీ చేరువ చేయొచ్చుననే గొప్ప దార్శనికతతో రాసిన కథ ‘బడిబాట’.
జీవితంలో నాన్న గొప్పతనాన్ని, త్యాగ గుణాన్ని విప్పిచెప్పిన రెండు కథలు ‘పరిత్యాగి’, ‘క్షమించవా’. కన్నపేగు అభివృద్ధి కోసం నాన్న ఎంతగా తపించిపోతాడో మన లోలోపలి ప్రాణాలు కదిలిపోయేలా వర్ణించిన కథలివి. కొడుకుకు ఉద్యోగం రావడానికి కోరి చావును ఆహ్వానించిన తండ్రి ఒకరైతే, నువ్వు చేయలేవు, నీతోకాదు అని వ్యతిరేక ప్రేరణతో కొడుకులో కర్తవ్యాన్ని రగిలించిన, మండించిన తండ్రి మరొకరు.
‘దూరతీరాలు’, ‘కాంతిదూతలు’, ‘చేయూత’ కథలు మానవత్వాన్ని శిఖరస్థాయికి తీసుకుపోయిన కథలు.
పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడి నాలుగు పైసలు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో పిల్లలకు ఇంగ్లీష్ చదువులు చదివించి దగ్గరుండి ‘దూరతీరాల’కు పంపిస్తున్న తరం మనది. “కార్పోరేట్ బళ్లలో చదివినా కన్నతల్లినీ, జన్మభూమిని మర్చిపోవద్దని, వాటి గొప్పతనాన్ని చెప్పే చదువులు కావాలి నేడు. మన గొప్పతనం ప్రపంచానికి చాటాలి కాని, పరాయి గొప్పతనం కోసం మన ప్రతిభను పణంగా పెట్టకూడదు. ఈ సత్యం నేడు ప్రతి పిల్లాడికీ, ప్రతి విద్యా సంస్థా నేర్పించగలగాలి. అప్పుడే మన మేధస్సూ నిలుస్తుంది. గౌరవమూ దక్కుతుంది” అంటూ దూరతీరాల్లోని ఎడబాటుతనాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది ‘దూరతీరాలు’ కథ.
వ్యక్త్తిత్వ నిర్మాణం, మానవీయ విలువలు గూగుల్లో దొరికేవి కావు. వాటిని పిల్లలకు ఉగ్గుపాల నుండే నేర్పించి మంచి పౌరులుగా, మానవత్వం పరిమళించే మనుషులుగా చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దాలని, ఈ విషయంలో పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని సున్నితంగా చెప్పే కథ ‘కాంతిదూతలు’.
చనిపోయిన తరువాత కనీసం శవాన్ని వేసుకోవడానికైనా ఒక సొంతిల్లు ఉండాలని ఎంతో ఆర్ద్రంగా చెప్పే కథ ‘చేయూత’. కాని జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో, రియలెస్టేట్ భూవ్‌ులో భూముల ధరలకు రెక్కలొచ్చిన పరిస్థితుల్లో ఎంత మందికి సొంతింటి కల నెరవేరుతుంది? శవాన్ని రోడ్డు మీద పెట్టుకొని నిరీక్షించే వారికి ఎవరు చేయూతనిచ్చి ఆపన్నహస్తం అందిస్తారు? అన్నది కోటి రూకల ప్రశ్న.
‘కావ్యకన్యక’, ‘మందు’భాగ్యుడు’ కథలు ఈ సంపుటిలోకెల్లా చాలా విలక్షణమైన కథలు. శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలదేవికి అంతఃపురంలో జరిగిన చిన్న సంఘటన వల్ల పొడసూపిన భేదాభిప్రాయాన్ని అరణంగా వచ్చిన నంది తిమ్మన కవి తన కావ్య రచన ద్వారా తొలగించాడనే చారిత్రక సన్నివేశాన్ని ఎంతో సమర్థవంతంగా చిత్రించాడు. ఈ కథలోని వాతావరణ చిత్రణ, సంభాషణల తీరు సహృదయ పాఠకులను ఆ కాలంలోకి తీసుకెళ్లి ‘ఆహా’ అనిపిస్తాయి.
కరోనా కాలంలో విధించిన లాక్‌డౌన్‌లో నాలుక పిడుచకట్టుకొనిపోయిన మందుబాబుల అవస్థలు వర్ణించడానికి అక్షరాలు చాలవు. సోషల్ డిస్టెన్స్‌ను కూడా కాలదన్ని మందుకోసం వైన్స్ మీద ఎలా ఎగబడ్డారో ఎలక్ట్రానిక్ మీడియాలో చూసి మనమంతా ఆశ్చర్యపోయాం. చార్లీచాప్లిన్ హాస్యం వెనక దాగిన విషాదాన్ని చూపినట్టుగా ‘మందు’ భాగ్యుడు’ కథ మంచి హాస్యంతో నడుస్తుంది.
రోగగ్రస్థంగా మారిన సమాజాన్ని తన కథల ద్వారా చికిత్స చేయాలని తాపత్రయపడే సామాజిక డాక్టర్‌గా కనిపిస్తాడు మనోహరాచారి. రేపటి తరం పట్ల, కుళ్లిపోయిన సమకాలీన తరం పట్ల రచయిత చెందే ఆవేదనే తన చేత ఈ కథలు రాయించాయని అనిపిస్తుంది ఈ కథలన్నీ చదివిన తరువాత. అపారమైన వస్తువైవిధ్యంతో, సరళ శిల్పంతో సాగే ఈ కథలన్నీ వర్తమాన సమాజానికి ప్రతిబింబాలుగా తోస్తాయి. డాక్టర్ మోహన్‌ప్రసాద్, రామ్మోహన్, నాన్న, రాంబాబు, శ్రీనివాస శర్మ, శ్రీకర్, శ్రీజ, రాజగంగారాం, గణేష్, కావేరి, సుభద్ర, టీచర్, నంది తిమ్మన ఇట్లా ఈ కథల్లోని పాత్రలన్నీ ‘కాంతిదూతలు’గా మారి ఆయా జీవితాల్లో వెలుగును నింపేవే.
‘ఆత్మీయులు’, ‘కావ్యకన్యక’ కథలు వస్తుపరంగానే కాదు, శిల్పపరంగా కూడా మంచి కథలు. ఇవేకాదు ఇందులోని కథలన్నీ మెరుగైన సమాజాన్ని కలగన్న కథలు. సగటు మనుషుల సంబంధాలను మానవీయం చేసే కథలు. మనుషుల గుండె గదుల్లో పరుచుకున్న చీకటి వైపు కాంతిరేఖల్ని ప్రసరించే కథలు. మానవ సంబంధాలు రోజుకింత వికటిస్తున్న ప్రస్తుత సందర్భంలో రావాల్సిన, అవసరమైన కథలు.
సమస్యల్ని ఎత్తిచూపడమే కాకుండా ఇందులోని కథలన్నింటికీ రచయిత తనదైన ఒక ముగింపును కూడా జోడించాడు. ఆయా కథలకు అదే ముగింపు కాకపోయినా కథను మొండిగా వదిలేయకుండా ఒక స్థిర బిందువు వద్ద వదిలేయడం వలన పాఠకులకు గందరగోళం తప్పింది. ప్రతి సమస్య మీద రచయితకు ఉన్న స్పష్టతతో పాటు పాఠకులకు కూడా ఉండాల్సిన కోణాన్ని సూచించినట్లుగా కనిపిస్తుంది.
మూడు దశాబ్దాలుగా సాహిత్య వ్యవసాయం చేస్తోన్న మనోహరాచారి వివిధ పాటలు, వచన కవిత్వం ద్వారా పాఠకలోకానికి సుపరిచితుడు. అంతేకాదు విశేష పాఠకాదరణ పొందిన విశిష్ట కథకుడు కూడా. గతంలో ‘నవ్వుతున్న నేలతల్లి’ తో కథా సాహిత్యంలోకి అడుగుపెట్టిన మనోహరాచారి అతి తొందరగా నిలదొక్కుకొని అత్యంత వేగంగా కథలు రాస్తున్న వర్తమాన కథకుడు.
డా॥ వెల్దండి శ్రీధర్,
9866977741