Wednesday, January 22, 2025

భాస్కరోక్తులు

- Advertisement -
- Advertisement -

Telangana kavithalu in telugu

సాహితస్యహితం ‘సాహిత్యం’ అంటే హితంతో కూడుకొని హితాని బోధించేది సాహిత్యం. సాహిత్యానికి భావం జీవకర్ర. సాహితీ గ్రంథాలన్నీ సంఘానికి మేలు చేస్తాయి. పద్యాలు రాస్తే కవులుగాను, గద్యాలు రాస్తే రచయితలుగా పరిగణిస్తారు.
పద్యం అజరామరం. ఎన్ని ప్రక్రియలు వచ్చినా అన్నింటిని తట్టుకుని నిలబడిందంటే, పద్యం ఎంత గొప్పదో చెప్పవలసిన పనిలేదు.ప్రతికవి మొదటి మెట్టు శతక ప్రక్రియతోనేప్రారంభిస్తాడు.సర్వసాధారణంగా సంఖ్య నియమం, మకుట నియమం, ఛందో నియమం కలిగి, ఆత్మాశ్రయ కవిత ధర్మంతో ఒప్పివున్న పద్య రచనను శతకమని అంటారు. శతకం అంటే నూరు పద్యాలు గలది అని అర్థం. శతకాలు నూరు పద్యాలకు మించి ఉన్నాయి. శతక ప్రక్రియ సర్వ జనాదరణ పొందడంతో సాహితీ ప్రక్రియలోని ప్రముఖ ప్రక్రియలో ఒకటిగా పేరుపొందింది.
తెలుగు సాహిత్యంలో పండితారాధ్యుడు ‘శివ తత్వ సారం‘ తో శతక రచనకు శ్రీకారం చుట్టినప్పటికీ శతక రచనకు ఉండవలసిన లక్షణాల తో ఒప్పి ఉన్న శతకం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘వృషాధిప శతకం‘.ఆ తరువాత ఎన్నో శతకాలు రచింపబడ్డాయి.
డాక్టర్ నలిమెల భాస్కర్ గారు పుట్టి,పెరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా .14 భారతీయ భాషలు నేర్చుకుని ఒక భాషలో నుండి, మరొక భాషలోకి అనువాదాలు చేస్తున్న అనువాదకులు, పండితులు, కవి ర,చయిత పరిశోధకుడు .తెలంగాణ భాషకు తొలిసారిగా డాక్టర్ నలిమెల గారు కూర్చిన ‘తెలంగాణ పదకోశం’ తెలంగాణ భాష ఉద్యమానికి, ఊతం ఇచ్చింది.
డాక్టర్ నలిమెల గారు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థిగా ఈ భాస్కరోక్తులు రాసుకొని, భద్రంగా దాచుకున్నటువంటి శతక పద్యాలు. ఇవి ఇప్పటికీ తాజాగా ఉండటమే కాకుండా, కాలానుగుణంగా కనిపించడం ఈ పద్యాలలోని ప్రత్యేకత. ఈ శతకంలో
‘వాస్త వమ్ము తెలుపు భాస్కరోక్తి ‘అన్న మకుటంతో వివిధ సామాజిక అంశాల ను స్పృశిస్తూ, సమకాలిన సమాజానికి అనుగుణంగా ‘భాస్కరోక్తులు‘ రాశాడు.

దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు పేరు మీద మద్యం షాపులు వెలిశాయని ఆవేదన వెలబుచ్చాడు.

‘గాంధీ పేరు మీద బ్రాందీ షాపులు వెలిసె
వాసుదేవుపేర వైనుషాపు పావనమగు
పేర్లు పాడు చేయకు మన్న
వాస్తవము దెల్పు భాస్కరోక్తి‘

నేటి కాలంలో కాసుల మీదనే మనుషులకు ధ్యాస ఉందని క్రింది పద్యంలో వాస్తవం తెలిపారు.

‘కట్నమేమో చూడ ఘనముగా పదివేలు
పిల్ల మోము చూడ మెల్ల కన్ను
కాసు ధ్యాస ఉన్న కన్నులు
చూచునా
వాస్తవము దెలుపు భాస్కరోక్తి

నేటి కాలంలో యువత ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చాడు.

ప్రేమ పేరు చెప్పి ప్రేయసి యని పిల్చి
అనుభవించి ఆమె నడవి దోల
ప్రేమ కాదు కామ నామనుట
తగు‘
మన భూమి ధర్మ భూమి, కర్మ భూమి యని నేడు అది ఏమైందని ప్రశ్నించాడు.

‘ధర్మ భూమి మనది కర్మభూమి మనది
ధర్మమేది మనదు కర్మ మేది ధర్మ కర్మములకు దయ్యము పట్టెనో‘ బతుకు నేర్పు వాడే బడిపంతులని బడిపంతులు గొప్పతనాన్ని చెప్పాడు.
‘బ్రతుక లేనివాడు బడిపంతు
లగునన్న మాటనిపుడు రూపు మాపవలయు
బ్రతుక నేర్పువాడు బడిపంతులగునురా‘ రైతు ,సైనికుడు గురువును త్రిమూర్తులుగా పోల్చడం కవిగారి ప్రత్యేకత.
పూజలంద ఈ త్రిమూర్తులే యర్హులు
సైరికుండు గురుడు సైనికుండు
శాశ్వతాభ్యుదయపు జాతి స్తంభాలు రా‘
డాక్టర్ నలిమెల భాస్కర్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. తాను విద్యార్థిగా రాసుకున్న పద్యాలు నిజానికి ఇప్పటికీ, సమాజంలో జరుగుతున్న అంశాలను స్పృశిస్తూ, ముందే ఊహించి రాసినట్లు అనిపిస్తుంది. కవిగారు రాసిన ప్రతి పద్యం ఆణిముత్యంగా చెప్పవచ్చు.తెలంగాణ భాష పై సాధికారిక పరిశోధన చేసి ఇతర ద్రవిడ బాషలతో పాటు ఉర్దూ సంస్కృతాలతో ఉన్న సంబంధం బాంధవ్యాల డిఎన్‌ఏ విప్పి చూపించిన భాషావేత్త .తమిళ, తెలుగు, కన్నడ ,మలయాళ భాషల్లో తులనాత్మక అధ్యయనం చేసి ఎం.ఫిల్, పిహెచ్. డి పట్టాలు పొందిన భాషా పరిశోధకుడు డాక్టర్ నలిమెల భాస్కర్ గారు.
సామాన్యులకు సైతం చదివితే అర్థమయ్యే రీతిలో, వాడుక భాషలో భాస్కరోక్తులు రాసిన కవి గారి కలమునుండి ఇలాంటివి మరెన్నో పద్యాలు జాలువారాలని కోరుకుంటూశతథా, సహస్రాభివందనాలు.
‘భాస్కరోక్తు‘లు పుస్తకంలో మొత్తం పేజీల సంఖ్య 32. ముఖచిత్రం చాలా బాగుంది. ఆకర్షణీయంగా ఆలోచించదగ్గ రీతిలో ఉంది. పుస్తకం వెల 40 రూపాయలు పుస్తకం ముఖచిత్రం పత్తి పాక గ్రాఫిక్స్ చక్కగా చేశారు. పబ్లికేషన్ రంగినేని చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల.
పుస్తక ప్రతులకు:
డాక్టర్ నలిమెల భాస్కర్
ఇంటి నెంబర్ 95 218/1 ప్రగతి నగర్, రాంనగర్ కరీంనగర్ 500001
9966229548

యాడవరం చంద్రకాంత్ గౌడ్
9441762105

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News