Monday, November 18, 2024

కాంచనపల్లి కవిత్వంతో కరచాలనం చేద్దాం

- Advertisement -
- Advertisement -

తెలంగాణోద్యమంలో ప్రసిద్ధి చెందిన కవిగా, కథకు లుగా, విమర్శకులుగా, సాహితీ సంస్థల నిర్వాహకులుగా, తంగేడు పత్రికా సహ సంపాదకులుగా సుపరిచితులైన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు. గత నాలుగు దశాబ్దాలుగా సమగ్రమైన దృష్టితో కవిత్వం రాస్తున్న సృజనకారులు. అనుభూతి వాద కవిత్వంతో పాటుగా ఉద్యమ కవిత్వాన్ని బలమైన గొంతుతో వినిపించిన కవి కాంచనపల్లి. ఈ దశాబ్దిలో తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సామాజిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ, ప్రజా చైతన్యానికి దోహదపడే కవితల్ని విరివిరిగా రాస్తున్నారు, తనలో గూడు కట్టుకున్న గ్రామీణ ప్రాంత జీవన పోరాటాన్ని వెల్లడించే కవితల్ని ‘పెంకుటిల్లు’ పేరుతో వెలువరించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి గ్రామం నుండి ప్రారంభమైన ఆయన జీవన ప్రస్థానం అమెరికా ఆస్ట్రేలియా దేశాలను కూడా చుట్టి వచ్చింది. ఆ అనుభవాల అక్షరమాలికనే ఈ కవితా సంపుటి. ఈ సంపుటిలోని 51 కవితలు సమాజానికి కవికి మధ్యన జరుగుతున్న సంఘర్షణకు అద్దం పడుతున్నాయి.
సంక్షోభితమైన వర్తమాన మానవ జీవితాల్ని వ్యాఖ్యానించేది కవిత్వం. అదుపు తప్పుతున్న రాజ్యపాలన వ్యవస్థను నిర్మోహమాటంగా వ్యాఖ్యానించేది కవిత్వం. మనుషులతోనే నిర్మితమైన సమాజం వాళ్లతోనే సజీవంగా గమనాన్ని సాగిస్తున్నది. భూగోళంపైన ఎక్కడో ఒక చోట నిత్యం ఏదో ఒక నేపంతో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆధునిక జీవన విధ్వంసం వివిధ రూపాల్లో జరుగుతున్నది. ఆ గాయాలను చూస్తూ కవులు ఊరుకోలేరు కదా. యుద్ధ గాయాల్ని కవితా పాదాల్లో ఆలపిస్తుంటారు. మెరుగైన మానవ జీవనాన్ని కలగంటుంటారు. కాంచనపల్లి కూడా విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కలగంటున్నారు. ఈ కవి ఆకాంక్షలు కూడా అంతే కదా. అధర్మాన్ని, అన్యాయాన్ని కవిత్వ పాదాల్లో ఖండిస్తూనే ఉంటారు. సమ సమాజ నిర్మాణం తోనే విశ్వశాంతి వెల్లివిరుస్తుందనే ప్రగాఢమైన నమ్మకంతో’ ’నేను కలగంటాను’ కవితను రాశారు. ఇందులోని ఈ కవితా వాక్యాలు మనల్ని ఆలోచింపజేస్తున్నాయి.

‘మా అందరి కోసం ఆకాశంలో నవ్వుతూ చేరిన/ రక్త నక్షత్రమా/ పొద్దుపొడుపుగా మమ్మల్ని పలకరించే సూర్య కిరణమా/ ప్రతి క్షణము నేను కలగంటాను/ సమ సమాజ సాకారంతో/ ఒక యుద్ధం లేని విశ్వ మానవత కోసం/ నేను కలగంటాను’/ ఈ నేల మీద జీవించడమే ముఖ్యం. ఉపాధి లేక విలవిల్లాడుతున్న అనేకమంది నిరుద్యోగులు మధ్యలోనే తనువులు చాలిస్తున్నారు. ఉన్నత చదువులు పెంచుతున్న ఒత్తిడి కూడా విద్యార్థుల మరణాలకు కారణ మవుతున్నది. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలు, వివాహ బంధాలు, స్నేహ బంధాలు కూడా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో గెలిచి నిలవాలని ప్రతి కవి ఆశిస్తారు.

మోడు వారిన వృక్షాలు తొలకరికి చిగురించినట్లుగా కష్టాలు ఎల్లకాలం ఉండవని, చీకట్లు పోయి వెలుగు ప్రసరించినట్లుగా, ఇబ్బందులు తాత్కాలికమని ధైర్యాన్ని చెబుతున్న కవిత ‘జీవించు’. సభ్య సమాజంలో కరుణాత్మకంగా జీవించాలని కవి కోరుకుంటున్న వైనానికి మనమంతా తప్పకుండా మద్దతు ఇవ్వవలసిందే. ముందు బతికుంటేనే కదా ఏదైనా సాధిస్తావనే సందేశాన్ని అందిస్తున్న ఈ కవిత నేటి యువతరానికి కను విప్పులాంటిది. వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరు ఈ కవితను తప్పకుండా నేటి యువతరానికి వినిపించాలి.

‘విస్తరించిన చీకటి ఖండం మీద/ విరిగిపోయిన రేపటి కలల మీద/ నువ్వొక చందమామగా జీవించు/ నువ్వొక తెల్లారి తాకే చిరుగాలిలా జీవించు/ భగ్న ప్రేమ విలాపాన్ని నీలో వంపుకొని/ ఒక తాజ్ మహలై/ అర్ధరాత్రి రాలిపోతున్న చుక్క కనులలో/ ఇంకా మెరిసే బతుకు ఆకాశానివై/ అధికార నిరంకుశత్వం/ విసిరే కత్తి అంచుల మీద/ కరుణపై జీవించు’/ ఇవ్వాల ప్రపంచమంతా ఒక గ్రామంగా మారిపోయింది. అంతర్జాలంతో మన జీవన విధానం గణనీయమైన మార్పులకు కారణమైనది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల నుండి యువకులు పట్టణాలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు గ్రామాలు పట్టణాల నుండి విదేశాలకు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం యువత వలస వెళుతున్నారు.

వాళ్ల చదువులకు తగ్గ ఉద్యోగ అవకాశాలు అక్కడే లభిస్తున్నాయి. ఇది కాదనలేని వాస్తవం. కుటుంబంలో ఉన్న ఒకరిద్దరు పిల్లలు అమెరికాకో, ఆస్ట్రేలియాకో, యూరప్ కో వెళ్లిపోతే ఇంటి దగ్గరున్న తల్లిదండ్రుల పరిస్థితి గూర్చి అనేక నవలలు, కథలు,కవితలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. అయినా కవులు ఇంకా రాస్తూనే ఉంటారు. వాటిలోని కొత్తదనం మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. తమ పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లడంతో, ఇంటి దగ్గర జీవితం చివరి దశలో పిల్లలతో ఉన్న జ్ఞాపకాలన్నీ వాళ్లను వెంటాడు తుంటాయి.’ ఇంటికాపు ’కవితలో ఈ విషయాలన్నీ స్పష్టంగా మనతో ముచ్చటిస్తున్న కవి గారితో మనమంతా ఏకీభవించకుండా ఉండలేము. అట్లా అని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళు ఇక్కడే ఉండాలని ఆపలేం. గత పరిస్థితుల్ని తలుచుకుంటూ భవిష్యత్తు మీద ఆశను పెంచుకోవడం తప్పదు. తల్లిదండ్రుల వేదనామయమైన పరిస్థితికి అద్దం పడుతున్న ఈ కవిత హృదయానికి హత్తుకుంటుంది.

‘రెక్కలు మొలచిన రెండు పావురాలు/ అమెరికా కొకటి ఆస్ట్రేలియా కొకటి/ బతుకు పిట్టగూడులై ఎగిరిపోయినప్పుడు/ ఏకాకులమై మిగిలిపోయిన/ అనివార్యపు చరమాంకపు బాటలో/ ఇప్పుడు ఒకరికొకరం బంధీలం/ తోటమాలీ../ నీ ప్రేమ సౌరభవంతో/ మిగిలిపోయిన పాట నువ్వే పాడాలి/ శిశిరం చెట్టును మళ్ళీ చిగురించనీయాలి’/ ప్రపంచం మీద ఎవరైనా సరే క్రూరంగా ప్రవర్తించడం సరైనది కాదని ప్రతి కవి కోరుకుంటాడు. ఏ మూల ఎలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరిగిన నిర్ద్వంద్వంగా కవి ఖండిస్తాడు. మనిషి దయతో జీవించాలి అంటాడు.

తోటి మనిషి పట్ల సహానుభూతితో ఉండాలని అప్పుడే మానవీయమైన సమాజం ఏర్పడుతుందని ’ ఓకే మానవుడు ’ కవిత ద్వారా హృదయాంతరంగాన్ని మనతో పంచుకుంటున్నారు కవి. ఈ కవిత వాక్యాలు చదివినప్పుడల్లా అనవసరమైన యుద్ధాలు వద్దని కోరుకుంటున్నాడు కవి.

‘వికసించిన ప్రపంచ పద్మం మీద వాక్యమై జీవించు/ ప్రవహించే జీవితం నది మీద వసంతమై మాట్లాడు/ మతం పూజించిన రక్త పుష్పాలు శిశిరం చిత్రం కింద వాడిపోని/ ఖడ్గం అంచులో కరుణగా నిలబడు/ తుపాకి గుండె నుంచి జీవామృతాన్ని చిందించు/ సుఖం దుఃఖం అవమానం గౌరవం విజయం ఓటమి/ అందరికీ ఒకటే ’/ జ్ఞాపకాల వలపోత ’పెంకుటిల్లు’ కవిత. నేడికి వాడిపోనీ బాల్యపు అనుభవాల స్మృతుల గుచ్చం. ఆ పసితనపు అనుభూతులను చెమ్మగిల్లిన నయనాలతో పంచుకుంటున్నారు. ఇల్లు అంటే కేవలం ఇల్లు మాత్రమే కాదు. అక్కడి మట్టితో, గోడలతో, పండుగలతో, ఉదయాలతో, సాయంత్రాలతో, రాత్రులతో, స్నేహితుల ఆటలతో గడిపిన అన్ని సమయాల్లోని సంగతులు తోసుకుంటూ వస్తాయి. కనిపెంచిన తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, నానమ్మ తాతలు, చెట్లు, పూల మొక్కలు, వాడలోని అనుబంధాలు, ఊరితోనున్న ఆత్మీయతలు ఈ కవితలో వ్యక్తీకరించారు. తరతరాల బతుకు చిత్రాలకు ప్రతీక ఈ పెంకుటిల్లు కవిత. అప్పటి సందడి ఇప్పుడిక్కడ లేకపోవచ్చు. జీవన యానానికి తెరచాపల నిలబడిన ఆ ఇల్లు వెలవెల పోతున్నది కావచ్చు. కవికి మాత్రం అదొక అపూర్వమైన కట్టడమే. నిత్యం దాన్ని స్మరించుకోకుండా ఉండలేరు. ఆనాటి తన సుమధురమైన క్షణాల్ని మనతో ఇలా పంచుకుంటూనే ఆవేదన చెందుతున్నారు కాంచనపల్లి. మనము ఆ జూలపల్లి గ్రామంలో తిరుగుతున్నట్టే ఉంటుంది. ఆ ఇంటి పరిసరాలతో మమేకమైపోతాం.

‘ఒక నిట్టూర్పునై పెరట్లోకెళ్ళి/ చేదబావి నీళ్లు మీద పోసుకున్నానా/ నాన్న కౌగిలించుకున్నట్టయింది/ ఈ పందిరికి కుటుంబం సంతోషం అంతా/ బీర పూవులై పూసినట్లయింది/అక్క కోసం, చెల్లి కోసం/ బతికున్న జానపదం సిబ్బిలో/ గుమ్మడాకుల బతుకమ్మ పేర్చేవాళ్ళం/ ఈ వాకిట బతుకుని బాల్యం/చిర్రగోనెతో చిమ్మేవాణ్ణి/ ఈ వీధంతా రాత్రికి/ఆకుల రాజయ్య ఆత్మ తిరిగేది/ కొన్ని తరాల పగలు రాత్రుల్ని/ జీర్ణం చేసుకున్న కదలని నది లాంటి పెంకుటిల్లు/ నా బాల్యాన్ని ప్రతిఫలిస్తు బీటలు బారిపోయింది/ కూలిపోతున్న కలల అద్దమై/ వెలవెలబోతూంది’/ ఉద్యోగ బాధ్యతల్లో అవిశ్రాంతంగా గడిపిన వాళ్లు రిటైర్మెంట్ తర్వాత సాయంత్రం పూట పార్కుల్లో ఒకచోట చేరి మాట్లాడుకోవడాన్ని ‘బతుకు ప్రయాణంలోని/గాయాల రాళ్లకు లేపనం’ మంటూ ‘సాయంత్రపు పార్కులు’ కవితను రాశారు. ఇంటిముందు ‘వాలు కుర్చీ’లో కూర్చున్న నాన్న ఊరంతాటికీ పెద్దదిక్కులా ఉండేవారని చెప్తూనే ‘నిరంతర జీవ యుద్ధార్తులకు/ విశ్రాంతిని వడ్డించే విస్తరి అది/ఒకప్పుడు నవయౌవన లావణ్యంతో/మురిసిపోయిన ఆ వాలు కుర్చీ/ కాలు విరిగిపోయి ముడుచుకొని/అటక ఎక్కేసింది’ అనే వాక్యాలతో అద్భుతంగా వర్ణించారు. కనుమరుగైపోతున్న తెలంగాణ పనిముట్లను గూర్చి రాసిన కవిత ‘కుదురు’. అందులో ఇలా అంటారు. ‘నిన్ను తలుచుకొనుడు అంటే/ ఊరుని తలుచుకునుడే/నిన్ను కవిత్వం చేసుడంటే/నన్ను నేను వెతుక్కునుడే’. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల,పరీక్షల్లో తారుమారైన పరిటాల వల్ల, మనస్తాపంతో ఊపిరిని వదులుకున్న విద్యార్థులం గురించి ’బతికి సాధించండి..’ అనే ప్రేరణాత్మకమైన కవితను రచించారు.

కుటుంబంలోకి ఒక కొత్త పిల్లాడు వచ్చినప్పుడల్లా అవధులు లేని సంతోషం మనల్ని ఆవరిస్తుంది. నాడు జాషువా కవి ’కొత్త పెత్తందారు’ అంటే నేడు కాంచనపల్లి ’ ఒక కొత్త బాటసారి’ అంటూ తన మనవడు దక్షు గురించి, అతని ఆటల గురించి రాసిన ఈ కవితా వాక్యాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ‘అమోఘ సామ్రాజ్యాధి పత్యాలు/వీని బాల ప్రపంచం ముందు/పగటి చంద మామలవుతాయి’. మనవరాలు తస్విక కోసం కూడా ‘వేకువ.. మరో వేకువ’ అంటూ రాసిన కవితలో ‘దాన్ని ఎత్తుకుంటే/ఒక లలిత ప్రపంచం/ఎదగా నర్తించదూ/దాని పాల బుగ్గల/ఊట నవ్వులలో/రమణీకరించిన ఎన్నో జన్మల/మానవతా చింతన/జీవన వాక్యమై ఒదిగిపోదూ’

యుగయుగాలుగా తరతరాలుగా మానవుడే విజేత. ప్రపంచ యుద్ధాల విధ్వంసాన్ని, అణుబాంబు విస్ఫోటనాన్ని తట్టుకొని కూడా మనిషి నిలబడే ఉన్నాడు. అతి భయంకరమైన అంటూ వ్యాధులను తట్టుకొని జీవిస్తూనే ఉన్నాడు. అట్లాంటిది ఈ దశాబ్దిలోని అత్యంత భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది. మానవ వైజ్ఞానిక, సాంకేతిక, వైద్యశాస్త్ర నిపుణుల నిరంతర కృషి ఫలితంగా వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. దాంతో కోట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడారు. ’ మానవుడే విజేత’ కవిత మన ప్రగతికి నిదర్శనంగా ఉంది. ఈ వాక్యాలను చదువుతుంటే నాతో పాటు మీరు కూడా ఏకీభవిస్తారు.

‘నువ్వు వేసిన ఏ అడుగు వ్యర్థం కాదు/ ఎక్కుపెట్టిన తుపాకి గురి తప్పదు/ ప్రతి విలయానికి ఎవడైనా నువ్వు/ సమాధానపు చిరునామావి/ ఏ కరోనా అయినా/ తన కలుగు వెతుక్కోవలసిందే / ప్రతి యుద్ధానికి చివర/ నువ్వే తిరుగులేని విజేతవి/తెల్లటి శాంతి గీతానివి’/ కవిత్వం మీద కవి మీద కవితను రాయని కవి ఉండడు. కవి ఎప్పుడు అనధికార శాసనకర్తనే. ఎలాంటి కవిత్వం రాసిన కవి అయినా సరే అతనెప్పుడూ ప్రజల పక్షపాతినే. కొందరు నేరుగా చెప్పవచ్చును.కొందరు నర్మగర్భంగా చెప్పవచ్చును. అంతరార్థమంతా ఒకటిగానే ఉంటుంది. సరళ పదాలు వాడిన, గాంభీర్యంతో కూడిన పదాలను వాడిన, శబ్దలంకారాలను వాడిన అర్ధాలంకారాలను వాడిన మానవుడే నా కథానాయకుడని ప్రపంచ కవులందరు అంటారు. ఎన్ని వాదాలు సిద్ధాంతాలు ఉన్నా కానీ మూకుమ్మడిగా అందరూ మానవత వాదానికే ఓటేస్తారు. అందుకే మానవీయమైన కవిత్వానికి మనుగడ ఎక్కువ. అట్లాంటి కవిత్వాన్ని తెలుగులో రాస్తున్న అతి కొద్ది మంది కవుల్లో మన కాంచనపల్లి గారు కూడా ఒకరు. సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అని జాషువా గారు అన్నట్లుగా కవి ‘చనిపోయి బతుకుతాడు’ అంటూ కవుల గురించి ఒక గొప్ప కవితను రాసాడు. ప్రతి వాక్యం మనలో నూతనోత్తేజ ఉద్వేగాన్ని కలిగిస్తుంది.

‘ఎవడో వాడు /కవి గాడు../ వాన్నెందుకు ఉరి తీయకూడదు?/ అవనత శిరస్సుతో వాడెక్కడ/ నెత్తురు జెండాగా మొలుస్తాడో/ లాభం లేదు/ వాడు చచ్చి కూడా బతుకుతాడు/ అసలు కవి అనేవాన్ని/పుట్టకుండానే చేయాలి/ నిజమే../పాటకు రెక్కలొచ్చాయి/ పాటగాడు లేకపోయినా/ పాట యవ్వనంతో బతుకుతుంది/ ఇక బతుకుతూ చనిపోయేవాడు/ చనిపోయినా బతుకుతాడు’/ ‘నేనెందుకు కవిత్వం రాస్తున్నాను?’ అని ఈ కవితా సంపుటికి తన సాహిత్య నేపథ్యాన్ని సవివరంగా మనకందించారు. ఈ వాక్యాలను ఒకసారి చదివితే నా అంతరంగం మనకు అర్థమవుతుంది. ‘మన రాష్ట్రం మనకు వస్తే సరిపోదు. కవిత్వంలో పూర్తిస్థాయి తెలంగాణ సోయి కొనసాగాలి. ప్రజా తెలంగాణ సాధించాలె. అదే లక్ష్యంతో ‘కల ఇంకా మిగిలే ఉంది’ కవితా సంకలనం, తరువాత ‘ఒక వర్షం కురిసిన రోజు’ కథల సంపుటి తెచ్చిన. తర్వాత ‘తరాజ’ విమర్శనా వ్యాస సంపుటి తెచ్చిన. ఇప్పుడు అదిగో ఆ ప్రయత్నంలోనే ఈ ‘పెంకుటిల్లు’ కవితా సంపుటి. ఒక దాశరథి లాగా, కాళోజీ లాగా, ప్రజా కవిత్వం రాయడమే కోరిక. సామాజిక తే లక్ష్యం ప్రజలే ఇస్తటిక్స్. బాధలో నన్ను, నాలో బాధను, అక్షరించడమే మార్గం.

కలలకు వాస్తవ జీవనానికి మధ్యన జరిగే యుద్ధరావమే కాంచనపల్లి కవిత్వం. వస్తు వైవిధ్యంతో పాటుగా విభిన్నమైన అభివ్యక్తీకరణలతో ఈ కవితా సంపటి మనల్ని ఆలోచింప చేస్తుంది. ప్రఖ్యాత కవి, తెలంగాణ ఉద్యమకారుడు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, బహు గ్రంథకర్త, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా పనిచేసిన జూలూరి గౌరీ శంకర్ కు ఈ కవితా సంపుటిని అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్నారు. నిరుత్సాహాన్ని దరి చేరనియ్యకుండా ‘నువ్వు గెలిచే వాడివి..’ అంటున్న ఈ కవిత మనందరికీ ఆదర్శనీయమైనది. ‘మెలకువ కలల్ని మింగే/పడమటి కొండలు/ పగలబడి నవ్వుతున్నాయి /వీరుడా నువ్వు ఒక ప్రశ్నవై ఎలా తలెత్తగలవ్?/ప్రతి అడుగులో నిశ్శబ్దంగా అసూయలు దాగి చూస్తుంటాయి/ఇప్పుడు నిన్ను తనలోకి/అనువదించుకునే వాళ్లందరిని/నువ్వు రేపు అనువదించక తప్పదు/వీరుడా.. అడుగు ముందుకే’. హృదయాంతరంగమైన కవిత్వాన్ని జీవనోత్సాహానికి అన్వయిస్తున్నారు. మానవీయమైన సమాజం మీద అపారమైన ప్రేమను కురిపిస్తున్న కాంచనపల్లి గారి కవిత్వంతో కరచాలనం చేద్దాం. ఆయన భావాల పూదోటలో నడయాడుదాం.

గోపగాని రవీందర్
9440979882

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News