Sunday, December 22, 2024

ఆద్యంతం… చక్కటి కవితా సేద్యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కవుల ప్రతిభను కళ్లకు కట్టిన ‘కవితా వైభవం’

‘తెలంగాణ భాషా మాండలికమని, ఇది రాయరాద’నే సవాలుకు వందేండ్ల కిందనే జవాబు దొరికింది. నాటి గోలుకొండ కవుల సంచిక నుంచి, ఇప్పటి వరకూ వందలాది పుస్తకాల్లో తెలంగాణ కవులు రాసిన కవిత్వం, భాషా, సామెతలు, జాతీయాలు, నుడికారాలు మొదలైనవి విరివిగా చోటు చేసుకున్నయన్న దానికి ఇటీవలె ఆచార్య అనుమాండ్ల భూమయ్య రాసిన ‘తెలంగాణ కవితా వైభవం’ (పాల్కురికి నుండి గద్దర్ వరకు) అనే పుస్తకం గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ కవితా వైభవాన్ని, సాహిత్య పరిమళాల్ని ఇది బయటి ప్రపంచానికి భీకరంగా స్వరంతో వినిపించిందని చెప్పాలి. ఈ గ్రంథ రచయిత ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు వారధిగా నిలిచిన అతి కొద్దిమందిలో ఒకరు. సుప్రసిద్ధ అధ్యాపకులుగా, కవిగా, రచయితగా, గొప్ప ఉపకులపతిగా పేరు గడించారు. ఆచార్య భూమయ్యఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా చాలా సరళంగా సుబోధకంగా సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలా రాస్తారు. వీరి కలం నుండి సుమారు 50 రచనలు వెలువడడం విశేషం. వీటిల్లో ఏదో ఒక కొత్త అంశం చెప్పకుండా రచన చేయలేదని వాటి లోతుల్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.

‘తెలంగాణ కవితా వైభవం’ అనే పేరుతో 380 పేజీలా ఉద్గ్రంథాన్ని ఆచార్య భూమయ్య 2023 సెప్టెంబర్‌లో ప్రచురించారు. ఇందులో పాల్కురికి నుండి గద్దర్ వరకు గల కావ్య, కవితా విశేషాల్ని తెలియజేశారు. ప్రధానంగా పాల్కురికి సోమనాథుడిపై 8, కొఱవి గోపరాజు పై 3, బమ్మెర పోతన పై 5, శేషప్ప గురించి 1, గోలకొండ కవులపై 4, కాళోజీ నారాయణరావుపై 1, దాశరథి కృష్ణమాచార్య పై 2, డా. సి. నారాయణరెడ్డి పై 5, డా. పల్లా దుర్గయ్య పై 3 , పొట్లపల్లి రామారావు పై 1, గద్దర్ గురించి 2 అన్ని కలిపితే 35 వ్యాసాలున్నాయి. ప్రతీదీ దేనికదే ప్రత్యేకమైనదని చెప్పాలి. రచయిత సందర్భోచితంగా తెలంగాణ కవితా వైభవాన్ని వేనోళ్ళ కొనియాడారు. ప్రాచీన సాహిత్యంలోనిజటిలమైన పద్యాల విశేషాల్ని బాగా అర్థమయ్యేట్లు వివరించారు. వ్యాసాల్లో పరిశోధన, తులనాత్మకు చక్కని స్థానం కల్పించారు.

ప్రబుద్ధ పాఠకులు తప్పక మంత్రముగ్ధులౌతారు. ఈ గ్రంథంలోని వ్యాసాల్లో కవులు వారి రచనా విశేషాల్ని కూలంకషంగా పేర్కొంటూ… వాటి ప్రత్యేకతల్ని ఎంతో రమణీయంగా చర్చించారు. ఓ మూడు నాలుగు వ్యాసాల్లో సంభాషణాత్మక పద్ధతి ఇట్టే ఆకర్షిస్తుంది. వేదకాలంలో ఈ విధానం బహుళ ప్రాచూర్యంలో ఉండేది. గురుకులాల్లో గురుశిష్యుల మధ్య జరిగిన సంభాషణ వల్ల కష్టమైన అంశాలు కూడా సులభంగా బోధపడేవి. తెలుగు సాహిత్య విమర్శలో బహుశా ఈ పద్ధతిని వీరే ప్రవేశం కల్పించారనిపిస్తోంది. ‘పాల్కురికి సోమనాథుడు, కొఱవి గోపరాజు, పోతన, శేషప్ప ప్రాచీన కవులు.గోలకొండ కవులు, కాళోజీ, దాశరథి, సి. నారాయణరెడ్డి, పల్లా దుర్గయ్య, పొట్లపల్లి రామారావు, గద్దర్ ఆధునీకులు, వీరు కావ్య కీర్తిశేషులు. ప్రాచీన, ఆధునిక కవులు మొత్తం పదకొండు. పాల్కురికి సోమన మొదలుగా గద్దర్ వరకు గల కవుల కవితా విశేషాలకు సంబంధించిన ఈ వ్యాస సంపుటికి ‘తెలంగాణ కవితా వైభవం’ అని పేరు పెట్టాను.

800 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న ప్రాచీన, ఆధునిక తెలంగాణ కవుల కవితా విశేషాలు, సామాజికాంశాలు తెలుసుకోవటానికి ఈ వ్యాస సంపుటి కొంతైనా ఉపకరిస్తుందనుకొంటున్నాను’ అని ఆచార్య భూమయ్య ఈ పుస్తకానికి రాసిన ‘నా మాట’ లో పేర్కొన్నారు. అసలు కొన్ని విషయాలే కాదు చాలా అంశాల్ని రచయిత ఈ గ్రంథం ద్వారా ప్రస్ఫుటం చేశారు. ఈ గ్రంథంలో ప్రతిభామూర్తి ‘పాల్కురికి సోమనాథుడి’ పై 8 వ్యాసాలున్నాయి. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర పై చాలా లోతైన అంశాల్ని బయపెట్టారు. ముఖ్యంగా వీరశైవ మత ప్రభావాన్ని పాల్కురికి ఎంతవరకు తీసుకెళ్ళాడనే దాన్ని చెప్పారు. తొలి తెలుగు కవి నన్నయ సంస్కృత భాష ఆధారంగా రచనల్ని చేస్తే, పాల్కురికి మాత్రం సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో జానుతెనుగులో తమ రచనల్ని చేశారని భూమయ్య పేర్కొంటూ…‘ఉరుతర గద్యపద్యోక్తుల కంటె/సరసమై బరిగిన జాను తెనుంగు/ చర్చింపగా సర్వసామాన్యమగుట/కూర్చేద ద్విపదలు కోర్కెదైవారా’ (పుట: 25) అనే ద్విపద పాదాల్ని ఉదహరిస్తారు.పాల్కురికి తెలుగులోనే కాకుం డా సంస్కృతంలో, కన్నడంలో రచనలు చేసిన మొదటి కవి అని నిర్ధారించారు. జానుతెనుగు తేటతెనుగు గురించి చాలా స్పష్టంగా తెలిపారు.తెలంగాణ తొలి వెలుగు పాల్కురి సోమననాథుడని ఉద్ఘాటించారు. పాల్కురికి సోమన, తిక్కన, పోతన మొదలైన కవులకు మార్గదర్శకుడయ్యాడని నిరూపించారు.

15 వ శతాబ్దపు కొఱవి గోపరాజు రాసిన ‘సింహాసన ద్వాత్రింశిక’లోని తెలంగాణ కథను ప్రత్యేకంగా ప్రస్తావించి. అందులో తెలంగాణలోని యాదాద్రి, వరంగల్, బాసర వంటి పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని స్పష్టం చేశారు. ఎక్కడో ఉత్తర భారత దేశంలోని విక్రమాదిత్యుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చి జ్ఞానోదయం పొందుతాడని తెలిపారు. ఈ కథలోని ప్రకృతి వర్ణనల్ని బాగా విశ్లేషించారు. వంద పద్యాల్లో రాయడిన బమ్మెర పోతన రామాయణ విశేషాల్ని ఆచార్య భూమయ్య ఈ గ్రంథంలో ప్రస్తావిస్తూ… రాముని అవతారం మొదలుగా పరిసమాప్తి వరకు గల సంపూర్ణ రామాయణంగా తేల్చారు. నారదుడు వాల్మీకికి చెప్పిన సంక్షిప్త రామయాణాన్ని పోలి ఉందని, ఇది శతకం లో రాయబడిందని ఆయా పద్యాల్లోని సారాన్ని ప్రతిఫలింపజేశారు. తర్వాత పోతన రాసిన శ్రీకృష్ణ కుచేలుర స్నేహాన్ని, కుంతి భక్తి యోగాన్ని, పోతన ద్రౌపది మొదలైన కథా విశేషాల్ని మనసుకు హత్తుకునేలా రాశారు. హరిభక్తి, వైరాగ్యం, సమకాలీన స్థితిగతులతో కూడిన కాకుత్సం శేషప్ప కవి రాసిన నరసింహ శతకంలోని పద్యాల్ని క్రోడీకరించి మంచి వ్యాసాన్ని అందించారు ఆచార్య భూమయ్య.

సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో తెలంగాణలో వెలువడిన మొట్టమొదటి కవితా సంకలనం ‘గోలకొండ కవుల సంచిక’ గురించి రాసిన వ్యాసంలో గోలకొండ కవులనగా తెలంగాణలోని కవులు మాత్రమేనని ఇది 1934 వెలువడిందని చెప్పారు. అంతేకాకుండా అందులోని కవులును వారు రాసిన కవితా విశేషాల్ని తెలిపారు. ఇందులో మొత్తం 354 కవితలు ఉన్నాయన్నారు. కాగా సంచిక స్వరూపం, కవితావస్తువు, స్తోత్రములు, మహాపురుష ప్రశంస. శృంగారం, హితోపదేశం, సంచికాప్రకటన, వివిధ వర్ణనలు, కథాలహరి, ప్రబోధం, నిజాం రాష్ట్ర ప్రశంస, కవిత్వ తత్త్వం, సంకీర్ణం లాంటి వివరాల్ని చాలా స్పష్టంగా ఆచార్య భూమయ్య తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో సామాజిక చైతన్యం అనే వ్యాసంలో భూమయ్య ఆంధ్రోద్యమం గురించి మాడపాటి చెప్పిన విషయాల్ని గుర్తు చేశారు.

ఆంధ్రుల్లో ఉన్న చైతన్యమెటువంటిదో గోలకొండ కవుల సంచిక వల్ల తెలుస్తుందనివారన్నారు. ఇది గొప్ప సామాజిక చైతన్యానికి నిదర్శనమని చెప్పారు. తర్వాత గోలకొండ కవుల సంచికలో కేవలం కవులే కాకుండా కవయిత్రులు కూడా ఉన్నారంటూ… భక్తి భావన. పూర్వాచారాల పట్ల గౌరవం, దేశభక్తి, స్త్రీ విద్య, మాతృభాషాభిమానం అనే అంశాలపై స్త్రీలు రాసిన విశేషాల్ని సోదాహరించారు. కాళోజీ నారాయణ రావు పాల్కురికి లాగా ప్రజల భాషలో రచనల చేశారని ఆచార్య భూమయ్య అన్నారు. ఆకలి, పేదరికంపై కాళోజీ చెప్పిన మాటల్ని ఎప్పటికీ మరిచిపోలే మంటూ… ‘అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలిక లొకచోట, అలసిన దేహా లొకచోట’ (పుట: 232), మాతృభాష ఉన్నతికి చెందిన ‘ఏ భాషరా నీది యేమి వేషమురా? ఈ భాష ఈ వేషమెవని కోసమురా? ఆంగ్ల మందున మాటలాడ గలుగగనే / ఇంతగా గుల్కెదవు ఎందు కోసమురా? తర్వాత అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా? (పుట: 233) వంటి కవితల్ని ఉదహరించారు. తర్వాత ఓటు విలువను, తెలంగాణ ప్రాంత ఉద్యమం నేపథ్యం కోణంలో వచ్చిన కవితల్ని గుర్తుచేశారు. “ఓ నిజాము పిశాచమా! కానరాడు / నిన్ను బోలిన రాజు మా కెన్నడేని /తీగెలను తెంపి అగ్నిలో దింపినావు /నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ (పుట: 238) అన్ని దాశరథి కృష్ణమాచార్య కవిత వైశిష్ట్యాన్ని వ్యాసకర్త గుర్తుచేశారు.

అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయంలలో దాశరథికి తెలంగాణ ప్రాంతం పట్ల గల అభిమానం వ్యక్తమవుతుందన్నారు. మహోంధ్రోదయం (1955)లో దాశరథి తెలంగాణ వారంతా ఒక్కటై ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని సాగిన ఆ ఆంధ్రోద్యమాన్ని సమర్థించాడని రచయిత చెప్పాడు. తెలంగాణ అటు ఆంధ్ర, రాయలసీమ- ఈ మూడు ప్రాంతాలను కలిపి దాశరథి మహాంధ్ర అన్నాడని గుర్తు చేశారు .డా. సి. నారాయణరెడ్డి నాగార్జునా సాగరం, కర్పూర వసంతరాయలు, ఋతుచక్రం రచలనల్ని ఆచార్య భూమయ్య గొప్పగా విశ్లేషించారు. దుర్గయ్యగారిపై రాసిన వ్యాసాల్లో వారి కల్పనా, కవితా శక్తుల్ని కొనియాడారు. వీరు రాసిన గంగిరెద్దు ఎంతో గొప్పదని అన్నారు.

తిమ్మన రాసిన ‘పారిజాతాపహరణము’ కావ్యానికి దుర్గయ్య తెలంగాణ భాషా పరిమళాన్ని అద్దినాడంటూ… ‘భూమాతకు అవి, అవిసిన/ పుండు మీద బుట్రలయ్యె/ ఐదు వేళ్లు సమానముగ/ నమరియుండ వెవ్వరికిని/ భూములు నోళ్లు దెఱచె/ గొడ్డు గోద ఆలిగోల బాలగోల/ చిప్పగోల, కుండగోల/ కాళ్ల వెళ్లబడి మ్రొక్కిరి/ ఆమె కనుల బాష్పవారి/ అలుగులు బారుచునుండెను/ వేలుబెట్టు సందిచ్చిన / కాటుబెట్టు ఘటికుడుపు / అడకత్తులోని పోక యయ్యె/’ (పుట: 344) అన్న గేయాన్ని ఉదహరిస్తూ… ఇందులోని ‘మత్తడులు దూలెను, జగడగొండి, నక్కియుండి, పూసగుచ్చినట్టు, ధుమ ధుమలాడు, నమ్మూ నమ్మకు, కొంప ముంచు, కాని మాటలు, గుండెకు గునపము, పాలిపోయే, పీలవడిన కుత్తుక, మనసు చిల్లులు పడినట్లు మొదలైన తెలంగాణ పలుకుబడులు ఈ గేయ ప్రబంధంలో చాలా ఉన్నాయని ఆచార్య భూమయ్య తెలిపారు.

పొట్లపల్లి రామారావు కవితోక్తుల సంపుటి ‘అక్షరదీప్తి’ పై రాసిన వ్యాసంలో కవితల్ని ముక్తకాలుగా పేర్కొంటూ వీటిని సూక్తులుగా అభివర్ణించారు. పాటకు గజ్జె కట్టిన గద్దర్, బిడ్డల యాదిలో గద్దర్ అనే వ్యాసాలు పుస్తకం చివర్లో తెలంగాణీయతకు నిదర్శనంగా నిలుస్తాయని చెప్పవచ్చు. తెలంగాణకు కవిత, పాట రెండు కళ్ళులాంటివని చెబుతూ… గద్దర్ పాటల్లోని పల్లెజీవనం, సమకాలీన గ్రామీణ ప్రజా జీవితానికి విడదీయరానిదని ఆచార్య భూమయ్య వక్కాణించారు. దోపిడీకి గురియై చావలేక బ్రతుకుతున్న కూలీల, అన్నార్తుల దుర్భర జీవితాన్ని వర్ణించటం. సాయుధ పోరాటానికి సంసిద్ధులను చేయటమనేవి గద్దర్ పాటల్లో గొప్ప లక్షణాలని వ్యాకర్త చెప్పారు. ఈ విధంగా 35 వ్యాసాల్లో అటు ప్రాచీనం నుండి ఇటు ఆధునికం వరకూ తెలంగాణ ప్రాంతానికి చెందిన సుమారు 12 మంది ప్రముఖులైన కవులూ వారి రచనల్లోని విశేషాల్ని ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఎంతో లోతైన దృష్టిని కనబరిచారు. ప్రతి వ్యాసంలోనూ కావ్యాన్ని లేదా కవిత సంపుటి ప్రాథమిక అంశాల్ని ప్రస్తావించారు. వ్యాసకర్త చర్చించే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో ఎంతో అభ్యుదయకరమైన అంశాలు ఉన్నాయన్నది నిశితంగా పరిశీలిస్తే అవగవతమవుతుంది. ఈ వ్యాసాల పుస్తకం ‘తెలంగాణ కవితా వైభవాన్ని’, ‘మత్తవేదండమునెక్కి ఢంకా భజాయించి’ నట్లుందని అభివర్ణించవచ్చు.

‘తెలంగాణ కవితా వైభవం’ (పాల్కురికి నుండి గద్దర్ దాకా), రచయిత: ఆచార్య అనుమాండ్ల భూమయ్య,) (ప్రతులకు : ఎ. మనస్వినీ దేవి, ఫ్లాటు నెం. 519, ఎ- బ్లాక్, అపురూప జగపతి హైట్స్, ఆదర్శనగర్, ఉప్పల్, హైదరాబాద్-500039, 88970 73999

డా. బడిగె ఉమేశ్
9494815854

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News