ప్రాంతదర్శి కానివాడు క్రాంతదర్శి కాలేడు అంటారు అమ్మంగి వేణుగోపాల్. తను పుట్టిన నేలపట్ల, ప్రాంతం పట్ల, జాతి పట్లఎంతో పావురం(ప్రేమ) ఉంటేనే పైకవితాపంక్తి రాయగలరు. అమ్మంగి వేణుగోపాల్ ప్రముఖ కవి, విమర్శకులు, మొట్టమొదటి కాళోజీ పురస్కార గ్రహీత. వీరి కవిత్వం ఎంత గొప్పగా ఉంటుందో వ్యక్తిత్వం కూడా అంతే గొప్పగా ఉంటుంది. కవిత్వమే కాకుండా నాటిక, కథానిక, విమర్శ, అనువాదం వంటి వివిధ ప్రక్రియల్లో రచనలు గావించి ఆయా ప్రక్రియలకు వన్నెతెచ్చారు. చక్కని శిల్పంతో హాస్యాన్ని, చమత్కారాన్ని మేళవిస్తూ కవిత్వం రాయడంలో అమ్మంగి సిద్ధహస్తులు. వ్యావహారిక భాష లో ఆధునిక జీవితాన్ని ఆవిష్కరించటం వీరి ప్రత్యేకత. సామాజిక సమస్యలను కవిత్వీకరించి చెప్పడంలోఅందెవేసిన చేయి. సాధారణ విషయానికి అసాధారణ కవిత్వాన్ని జోడించి చెప్పడంలో మేటి. సంక్లిష్టమైన జీవన తాత్వికతను సరళమైన భాషలోకి అనువదించడం వీరి ప్రతిభకు తార్కాణం. వీరు రాసిన యాభై నాలుగు కవితల సమాహారమే ‘ముఖచిత్రం’.ఇందులోని కవితలన్నీ వస్తువైవిధ్యంతో కూడినవి.
మచ్చుకు కొన్నింటిని పరిశీలిద్దాం. వేల వ్యాపకాల మనసును నియంత్రించి / వందల ఉద్వేగాల హృదయాన్ని అదుపులో ఉంచి/ ఏకాగ్రతతో చేసే మేధో మథనమే తపస్సుఅంటూ ‘బుద్ధుడు’ కవితలో తపస్సుకు సరికొత్త నిర్వచనమిచ్చారు. ‘మా పిల్లి మా ఇష్టం’ కవితలో పిల్లి చేసే చేష్టల్ని అద్భుతంగా కవిత్వీకరించారు. ముంగాళ్లనుసాచి శరీరాన్ని పెంచి/ ఏకాగ్రతతో చెదరని చూపుతో/ ఎలుక మీదికి లంఘించినప్పుడు చూడాలె/ అపసోపాలు పడి జింకను వేటాడినప్పటి సింహం కన్నా మా పిల్లే సూపర్ అంటూ పెద్దపులి కన్నా, సింహం కన్నా, చిరుత పులి కన్నా పిల్లే చాలా గొప్పదంటూ చమత్కరించారు.
నీతిగా, నిజాయితీగా బతుకుదాం అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో బక్రాలుగా మారిపోతారన్న విషయాన్ని హాస్యరసస్ఫోరకంగా వ్యక్తీకరించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో లెక్కే లేదు. అటువంటి కరోనాకు భయపడి దేవుడు కూడా మాస్క్ పెట్టుకునే ఉన్నాడు అంటూ రాసిన కవితలో ఉనికి కోసం, ఊపిరి కోసం పోరాడుతున్న/ రోగి మనసు ఒక ఉరిభూమి అంటారు. ‘మరుభూమి’ అనే పదం ఉంది కానీ ‘ఉరి భూమి’ అంటూ కొత్త పదబంధాన్ని ప్రయోగించారు. త్యాగం పరావర్తనమే ప్రేమ అంటూ త్యాగానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. రోగి మానసిక ఉద్వేగాలను ‘ఆపరేషన్’ కవిత ద్వారా ఆవిష్కరించారు.
సహజమైన పదాలతో వస్తువును చక్కగా కవిత్వీకరించడం వేణుగోపాల్‌కు వెన్నతో పెట్టిన విద్య. మణికట్టు మీద/ శరీరంలోకి రహదారిని పరుస్తారు/.. ముక్కుతో పొడిచి షుగర్‌ను కొలిచి/ వడ్రంగి పిట్టలా ఎగిరిపోతుంది గ్లూకోమీటర్ అంటూ చెప్పిన విధానం అద్భుతం. వీరి కవితా పంక్తులు చక్కని సూక్తుల్లాగా కనిపిస్తాయి. శ్మశానానికి దగ్గరి దారి యుద్ధం అంటూ యుద్ధానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. సుప్రసిద్ధ గాయని లతామంగేష్కర్‌ను ఉద్దేశించి రాసిన కవిత ద్వారా ఆమె గానకళా ప్రావీణ్యతను ఆవిష్కరించారు. నీవు నీ పాటతో / పంచభూతాలకు ప్రాణం పోశావు/ సరిగమలకు సాహిత్యం నేర్పింది నీ పాటఅంటూ ఆమె గానం గొప్పతనాన్ని విశ్లేషించిన విధానం బాగుంది.
రాజకీయంలోనే కాకుండా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బిసిల గురించి రాసిన కవిత మన బిసిలు. నాయకుల సింహాసనాలకు/ నాలుగు కాళ్లు మన బిసిలు/ సోదర సోదరీమణులారా అంటే/ మరెవరో కాదు మన బిసిలే అంటూ సమాజంలో బిసిల సంఖ్య ఎంతో ఉన్నదన్న విషయాన్ని ఈ కవిత ద్వారా తెలియజేశారు. సకల వృత్తుల్లో, సకల కళల్లో ఆరితేరిన వారు బిసిలనీ, వారు ఖచ్చితంగా రాజ్యాధికారానికి రావలసిన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేశారు. ఆదివాసీల దేవతలైన సమ్మక్క సారలమ్మల ఉద్దేశించి రాసిన కవిత ‘తల్లులకు వందనం’. ఇందులో సమ్మక్క సారలమ్మలు తమ రాజ్య పరిరక్షణ కోసం తమ జాతిని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాల్ని బలిగావించిన విధానాన్ని తెలియజేశారు.
సుప్రసిద్ధ సినీనటి శ్రీదేవి మరణించినప్పుడు రాసిన స్మృతి కవిత ‘చాందినీ’. తల్లి ఖాళీని దేవుడు కూడా భర్తీ చేయలేడు/ తండ్రి తల్లిలో శతాంశమైనాకాగలిగితే అతడు దేవుడే అంటూ మాతృత్వం గొప్పతనాన్ని తెలియజేశారు. కరోనా సమయంలో వైరస్ సోకిన రోగి ఖచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనన్న నియమం ఎంత భయంకరమైందో తెలియజేస్తూ పద్నాలుగు రోజుల టైంబాంబును మోస్తూ/ క్వారంటైన్‌లో ఎండుటాకుల మధ్య వెనక్కినడుస్తూ/ వసంతాన్ని కలగనడం అసాధ్యం అంటూ ఆ రోగి మానసిక స్థితిని ఆవిష్కరించారు.
‘అటక’ ఎంత నాస్టాల్జియాను కలిగించే అంశమో మనందరికీ తెలిసిందే. చిన్నప్పటి ఎన్నో వస్తువులను అటక మీద పెట్టడం జరుగుతుంది. వాటి విలువ తక్కువే అయినా వాటిని చూసినప్పుడు మనం పొందే ఆనందం, అనుభూతి తక్కువేమీ కాదు. మూత ఇరిగినసందుక ఒక పుస్తక ప్రదర్శనశాలగా ఉంటుంది. ఇది బాల్యం నాటి విషయాల్ని జ్ఞాప్తికి తెప్పిస్తుంది. వెట్టి కార్మికునిలాగా ఎంత బరువునైనా నమ్మకంగా మోస్తుంది. అటక అంతగా ప్రాధాన్యం లేని వస్తువులనన్నింటినీ భరిస్తుందన్న విషయాన్ని తెలియజేశారు. తరతరాల కుటుంబ చరిత్రను/ కడుపులో దాచుకున్న కాలనాళిక ఈ అటక అంటూ అటక ప్రాధాన్యతను అద్భుతంగా ఆవిష్కరించారు.
మే నెలలో ఎండలు ఎంతగా దంచి కొడుతాయో, తద్వారా ఎంతగా జనులు బాధకు గురవుతారో తెలియజేస్తూ రాసిన కవిత ‘మే బీభత్సం’. సూర్యుడు పొద్దున ఏడు గంటల వేళకొద్దిసేపు / సిఐడి నవ్వులాగా స్నేహంగానే ఉంటాడు/ పన్నెండుదాటీ దాటగానే/ లాకప్‌లో వేసి దంచుతుంటే/ చేయని నేరాలను కూడా చేసినట్లు ఒప్పుకొని/ చెమట గుండంలో మునిగిపోతాం అంటూ వేసవి కాలంలో సూర్యుని తీవ్రత ఏ విధంగా ఉంటుందో చమత్కార పూర్వకంగా చెప్పిన విధానం బాగుంది. కరోనా గురించి రాసిన మరో కవిత ‘నీడరంగు’. మృత్యుదేవత అంతటా తానుండలేక/ కరోనాను సృష్టించింది అను కవితా పంక్తులు దేవుడు అంతటా ఉండలేక అమ్మను సృష్టించాడు అన్న వాక్యాన్ని గుర్తుకు తెప్పిస్తాయి. కరోనా సమయంలో లాక్ డౌన్ వల్ల ఎంతమంది వలస కూలీలు తమ పుట్టిన గడ్డకు వెళ్ళిపోతూ వాహనాలు లేకపోయినా కాలినడకతో వారు పడిన యాతనను హృదయ విదారకంగా ఈ కవిత ద్వారా ఆవిష్కరించారు.
లక్షలాది వలస కూలీల కంటికి/ సొంతూరు తప్ప అంతా శత్రు దేశమైంది/ లోకాన్ని సమాధి స్థితికి నెట్టేసిన కరోనాను/ ఖాతరు చేయనిదొక్కటే మొండి ధైర్యం అంటూ ధైర్యంగా ఉన్నవాళ్లే ఆ మహమ్మారి బారి నుండి బయట పడ్డారన్న సత్యాన్ని చెప్పారు. ప్రముఖ కవి, దిగంబర కవులలో ఒకరైన నిఖిలేశ్వర్ గురించి రాసిన కవిత ఆయన కవిత్వ విశిష్టతను, వ్యక్తిత్వాన్ని తెలియజేసే విధంగా ఉంది. గ్రీష్మతాపం మీద జలపాతమైనవాడు/ దుఃఖాశ్రుమేఘాల మీద/ ఝంఝగా వీచినవాడు/ అంతస్తుల మేడ పక్కనున్న/గుడిసెను గుండెకు హత్తుకున్నవాడు అంటూ నిఖిలేశ్వర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన విధానం బాగుంది. వచన కవిత్వం రాసి మెప్పించిన వారిలో అమ్మంగి వేణుగోపాల్ ముందు వరుసలో ఉంటారు. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన ఎలనాగ అన్నట్లు అమ్మంగి కవిత్వంలో ఆత్మాశ్రయ ధోరణి ఉంటుంది.
కవిత్వం బలంగా రావాలన్నప్పుడు కవి వస్తువుతో పూర్తిగా మమేకం కావడం చాలా ముఖ్యం. ఏ వస్తువుతో అయితే కవి పూర్తిగా మమేకం అవుతాడో ఆ వస్తువును చాలా చక్కగా కవిత్వీకరించడం జరుగుతుంది. ఒకవేళ మమేకం కాలేకపోతే గొప్ప కవిత్వం కవి రాయలేడు. అమ్మంగి వేణుగోపాల్ తాను ఎంచుకున్న వస్తువు పట్ల పూర్తిగా మమేకమై కవిత్వం రాయడం వల్ల వీరి కవిత్వంలో చిక్కదనం కనిపిస్తుంది. అదే విధంగా బలమైన వ్యక్తీకరణలు ఉన్నాయి. సరళమైన పదాలతో సహజమైన భాషను ఉపయోగిస్తూ అద్భుతమైన కవిత్వం రాయడం వీరికే చెల్లుతుంది. ఆడంబరమైన భాషకు ఆమడ దూరంలో ఉండే కవులలో అమ్మంగి వేణుగోపాల్ ఒకరు. చాలా సరళమైన భాషను మాత్రమే ఉపయోగిస్తారు. కానీ అక్కడక్కడ సంస్కృత పదభూయిష్టమైన సమాసాలను కూడా ప్రయోగించారు. అద్భుతమైన భావుకత, చమత్కారం, అలంకార ప్రయోగం కలిగిన చక్కని కవితల్ని రాసిన అమ్మంగి వేణుగోపాల్ అభినందనీయులు.
డా. తండు కృష్ణకౌండిన్య
9704731346