Wednesday, January 22, 2025

ఏటూరి ‘కలల కార్ఖానా’

- Advertisement -
- Advertisement -

Telangana kavithalu in telugu

ఇటీవల ‘కలల కార్ఖానా‘(కవితా సంపుటి)ని వెలువరించిన నెల్లూరు రేబాల గ్రామానికి చెందిన కవి ‘ఏటూరి నాగేంద్రరావు గారు‘ రైల్వే శాఖలో ఉద్యోగం చేసి,2018లో పదవీ విరమాణానంతరం హైదరాబాద్ లో స్థిరపడినప్పటి నుండి సాహితీ సంబంధిత వ్యాసంగాలతో మరింత మమేకమై పూర్తి సమయాన్ని సాహితీ వ్యాసంగాలకే వెచ్చిస్తున్నారు.
124 పేజీల విడివి గల్గిన ‘కలల కార్ఖానా‘(కవిత్వం)ను ‘నవమల్లెతీగ‘ విజయవాడ వారు ప్రచురించారు. ప్రముఖ కథకులు,నవలాకారులు విమర్శకులు ‘సాగర్ శ్రీరామకవచం‘ గారు వ్రాసిన ‘ముందు మాట‘ కవి రచనా శైలికి దర్పణంగా నిలుస్తుంది.‘చిన్ని నారాయణరావు‘ గారికి అంకితమివ్వబడిన ఈ సంపుటిలో మొత్తం 80 కవితలు ఉన్నాయి.
ఏటూరి వారు నాపై అభిమానంతో ఈ పుస్తకాన్ని కొన్ని రోజుల క్రితమే పంపించినప్పటికీ…..
తన కవిత్వపు నాడిని పట్టుకోవడం నాకు కొంత సవాలుగానే నిలిచింది.ఎందుకంటే కవిత్వం తాలూకు నాకున్న కొన్ని సందేహాలు సందిగ్ధాలపై ఈ ‘కలల కార్ఖానా‘ నాపై కొన్ని ప్రశ్నలను సంధించడమే దీనికి గల ప్రధాన కారణం.
ఈ పుస్తకాన్ని పఠించే క్రమంలో నాకు వచ్చిన సందేహాలను అధ్యయనం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రాచీన కాలపు గ్రీకు కవిత్వ,తత్వ,తర్క రీతుల్ని,16,17 శతాబ్దపు ఆంగ్ల కవిత్వ పోకడల్ని,ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల 20వ,శతాబ్దపు తొలి, మలి దశల్లో తెలుగు సాహిత్యంలో వచ్చిన పెను సాహితీ ప్రక్రియల పరిణామాల్ని కూడా కొంత ఆధ్యయనం చేయవలసి వచ్చింది.అందుకే ఈ రెండు మాటలు వ్రాయడానికి ఇంత ఆలస్యమైంది.ఒక సీనియర్ కవి కవిత్వాన్ని ఒంటపట్టించుకునే ప్రయత్నంలో ఇలాంటి సాహసాలు అప్పుడప్పుడు చేయక తప్పదు గదా!
ఇకపోతే.. ‘కలల కార్ఖానా‘ గురించి రెండు విషయాలు..
కవి ఎదుర్కొంటున్న ఒంటరితనపు అనుభవ సారాన్నంతా మదించి, తనకున్న సున్నితత్వపు స్వభావంతో ఆత్మాశ్రయ తోరణిలో కూడిన తాత్వికతను, విషాదాన్ని, ఆవేశాన్ని, ఆవేదనల్ని,ఇలా సమస్త భావోద్వేగాల్ని సమన్యయ పరచుకుని మానసికంగా దృఢంగా నిలదొక్కుకునే ప్రయత్నపు ప్రతిరూపమే ఈ ‘కలల కార్ఖానా’

ఒక విధంగా చెప్పాలంటే…
ఈ సంపుటిని వెలువరించే సమయంలో బహుశా తాను ఏదో ఒత్తిడిలో ఉన్నారని నా మనసుకు అనిపించింది.
అంటే ఈ సంపుటి రచనాకాలం వర్తమాన పరిస్థితులు తన మనసుపై చెరగని ముద్ర వేసి ఉండవచ్చు.సహజంగా ఈ గుణం ప్రతి కవికి ఉండే సహజ లక్షణమే!
లేకుంటే…
సమాజంలో ఉన్న అన్ని రకాల రుగ్మతలను ఈ కవి మనో నేత్రంతో పసిగట్టి, ఒడిసిపట్టి, చలించి, కొన్నింటిని చీదరించుకొని ఆయా స్పందనలను అంతర్లీనంగా సమన్వయ పరచుకునే ప్రయత్నంలో తనకు ఉన్న భావార్తినంతటినీ కవిత్వకరించే ప్రయత్నం చేసి ఉండవచ్చు.
ఎందుకంటే ‘కలల కార్ఖానా‘లోని ప్రతి కవితలోను కవి ‘కథా నాయకుని‘గా నిలిచి తన వ్యక్తిగత ముద్రను ప్రతిబింబింపజేసే ప్రయత్నం చేశారు.
అందుకే తన వ్యక్తిగత భావోద్వేగాలే బహుశా ‘కలల కార్ఖానా‘ కవిత్వపు లావా ప్రవాహమై వారి మనసు కలం నుండి ఇలా విస్ఫోటనం చెంది ఉండవచ్చు!
అంతే కాక మహమ్మారి ప్రభావం చేత ‘కవిత్వం అంతకు ముందూ ఆ తర్వాత అన్నట్టూ‘ 2019వ సంవత్సరం కవిత్వ రచనా శైలికి ఒక విభజన రేఖ విధించింది.మహమ్మారి నాటి విపత్కర పరిస్థితులు కవుల రచనా దృక్పథంలో,వారి కవిత్వ నిర్మాణంలో,వారి రచనా శైలిలో అనేక మార్పులకు లోనైయ్యేలా చేసింది.
ఒక విధంగా మానవ జాతిపై ప్రకృతి కన్నెర్ర చేసిందా అన్నట్టు ఆనాటి పరిస్థితులు అద్దం పడతాయి. ఇప్పటికి కూడా ఆ చీకటి ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. సరిగ్గా అలాంటి భావనతో కూడిన వ్యక్తికరణే కవి ఇలా చేస్తాడు…
‘చాలా రోజులైంది/ సముద్రంలా నిద్రపోయి / కాలం మరణాన్ని/ పాడుతున్నప్పుడు../ దేని కోసం వెతుకులాట!/ ఇందాక మాట్లాడిన మనిషే/ ఇట్టా కనబడ్డట్టే కనబడి/ మాయమైపోతున్నాడు./ అంతా కల్లోల సముద్రంలా ఉంది.’ … ఇలా అని తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు.
‘వాగ్ధానం‘ కవితలో ఏటూరి జీవితానికి తాలూకు ఆశావద దృక్పథాన్ని తత్వాక తోరణిలో భలే చమత్కారయుతం ఇలా కవిత్వకరించారు…
‘జీవితాన్ని నిర్వహించడమంటే/ కుర్చీలో నుంచి లేచినంత సులభం కాదు./ ఇక్కడ పుట్టడం నీ అదృష్టం అనుకుంటే ../ ప్రతిరోజుకు కృతజ్ఞతలు తెలుపు.’
ఇలాంటి అంతర్మథనంతో కూడిన జీవితానుభవాల తాత్విక భావ ప్రకంపనలు తరచు ఏటూరి కవిత్వంలో ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ….ఇలానే ‘నిరీక్షణ‘ కవిత్వంలో కూడా ఇలా…
‘వద్దంటున్నా ఎందుకు/ జీవితం గతంలోంచి తొంగిచూస్తుంది!/ ఎందుకు నా స్వేచ్ఛని నియంత్రిస్తుంది!’ …ఇదే కవితలో మరో సందర్భంలో….
‘సమస్యలు నన్ను పట్టి చుట్టి ఒత్తితే/ నాలోంచి ఏం స్రవిస్తుంది../ అశ్రువుల కుంభవృష్టి తప్ప!’ …. ఇలాంటి పొదుపైన పదాలతో మెరుపుల్లాంటి వాక్యాలు ఏటూరి కవిత్వంలో కోకొల్లలు
‘కలల కార్ఖానా‘ కవితలో
అంతర్ముఖంగా దాగి ఉన్న కల్లోలాల తాలూకు భావ ఆర్తిని ప్రజ్వలింపజేసే ప్రయత్నంలో.. తనలో తాను మదనపడుతూ… తనను తాను ప్రశ్నించుకుంటూ… చివరికి తనకు తాను పదిలపరచుకునే ప్రయత్నాన్ని ఇలా కవిత్వకరిస్తాడు.

ప్రపంచానికి ఏ సమయమూ/ చూపడం లేదు/ శిథిలమౌతున్న/ నా గడియారం./ నన్ను చుట్టేసిన ఏవో/ చింపిరి అల్లికలు/ రాలుతున్న కన్నీళ్లూ/ తూట్లు పొడుస్తున్న/ జీవితంపైకి చాస్తూ/ నాట్యం చేస్తుంటుంది./.. చితి మంటల్లోకి తోసి/ ఎన్నో కలల్ని దగ్ధం చేస్తున్నారు./ అక్కడ కాలుతున్నది/ నా కలల కార్ఖాణానేనా…./ ఏమో! / ……నా ఆత్మ ఎక్కడెక్కడో / కలుగుల్లో దాగుంటుంది./ నాకు నేనే ఓడిపోతుంటాను/ గెలుస్తాను/ ఆకాశపు దారుల్లో!/ ఈ కాలానికి నేనేమి/ సంకేతాలివ్వాలి?/ …..కలల కార్ఖానానికి / ఏ అలంకరణలూ లేవు./ అవి నిరంతర/ అంతర దహనమే!
చివరిగా ‘ప్రాచీన రాత్రి లోకి‘ వెళితే!
ఈ కవిత చదివేటప్పుడు నా హృదయం ద్రవించిపోయింది.ఈ కవిత చదువుతున్నంత వరకూ, ఆ తర్వాత కూడా పదే పదే నన్ను పలకరిస్తూనే ఉంది.మానవ జీవన గమనంలో కొన్ని సందర్భాల్లో పూల రహదారులు ఉంటాయి.ఆ రహదారులెంబడి పూల పరిమళాల ఆస్వాదనలో అవధులు లేని ఆనందపు అనుభూతుల్ని పొందుతాడు మనిషి.
ఇది నాణానికి ఒక పార్శ్వం.
మరో పర్శ్వంలో ఉన్నట్టుండి కొన్ని నిశీధి నీడలు కమ్ముకుని జీవితాన ఏదొక ఉపద్రవం సంభవించి ఉన్న ఆనందాన్ని అట్లే ఆవిరి చేసి తన ఉక్రోశాన్ని బాహాటంగా వెల్లకక్కుకుంటుంది.
బంధాలు,బాంధవ్యాలకు విలువనిచ్చే మానవ జీవితంలో ఇలాంటి సంఘటనలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఈ సంఘర్షణాత్మక విషాద సంఘటనలు కొన్ని సందర్భాల్లో మనిషి మనుగడను కూడా ప్రశ్నిస్తాయి.
ఈ విషాద సంద్రాన మునిగిపోతున్న మనిషి…
దేనినైనా ఊతంగా పట్టుకుని ఒడ్డున చేరాల్సిందే.
తాను నిలబడాల్సిందే!
తనతో పాటు ప్రయనించేవారిని నిలబెట్టాల్సిందే!
ఇదే మనిషి జీవిన ప్రయాణపు పరమార్ధం.
ఇలా నిలబడే ప్రయత్నంలో ఈ కవి కవిత్వాన్నే ఊతంగా చేసుకున్నాడు.

ఇదిగో ఈ విధంగా….
‘దేన్నైనా మోయడం/ దు:ఖమే కదా!/ నాలోని అవస్థ నన్ను/ కౌగిలించుకొని దు:ఖపు/ గొలుసుల్ని వేస్తూ ఉంది./ నగరం నిద్రలో ఊగిసలాడుతుంటే/ చివరి నిద్రను తవ్వుకుంటూ నేను!/ గుండెల మీద పిడిబాకులు/ కవాతు చేస్తున్నట్టుంది./ నాకే అర్థంకాని మరేదో బాధ నన్ను శూన్యంలోకి విసిరేస్తున్నది/ దు:ఖాన్ని త్రాగుతూ/ ఈ మట్టి పొరల క్రింద/ ఊపిరింకా నవ్వుతుంది./ ఏదో జరగాల్సి ఉంది./ మరోలా నేను లేవాలి./ ఒక ప్రాచీన రాత్రిలోకి/ నేవెళ్ళిపోవాలి.’
ఏదేమైనా ఈ కవి ‘కలల కార్ఖానా‘లో జీవితమను హరివిల్లులో అన్ని రంగుల్ని పరిచయం చేశారు. ఆ హరివిల్లు వర్ణాల్ని పరిశీలనగా అజ కట్టే చాకచక్యం మాత్రం పాఠకునిదే.అయితే మీరు కూడా ఆ అనుభూతిని పొందండి.ఒక్కసారి ఏటూరిని పలకరించి చూడండి.పుస్తకాన్ని కూడా చదవండి.
ధన్యవాదములతో….!
చివరిగా చిన్నమాట!
ఏటూరి గారు!
మీలాంటి సీనియర్ కవుల వల్ల కవిత్వం కొత్త రంగులు, హంగులూ పులుముకోవాలి. / ఆ రంగుల్ని, హంగుల్నే ఆసరాగా చేసుకుని గుండెల నిండా ఆత్మస్థైర్యాన్ని నింపుకుని మీరు సహితం నిలబడాలి. అదే కోణంలో కవిత్వాన్ని కూడా నిలబెట్టాలి. / మీ లాంటి వారి కవిత్వపు పరిమళాన్ని మాలాంటి వారూ సహితం ఆస్వాదించాలి, అనుభూతిని పొందాలి, మేము సహితం నిలబడగలగాలి, మరొక్కరిని నిలబెట్టగలగాలి. అలాంటి ప్రేరణాత్మకమైన కవిత్వం మీ కలం నుండి కొత్త రంగులు, హంగులతో వన్నెలద్దుకుంటూ….
హృదయానికి హత్తుకునే కవిత్వానికి మీ కలం జీవం పోయాలని ఆకాంక్షిస్తూ!! మీకు నా అభినందనలు తెలియజేస్తున్న!
వెల :100/-
ప్రతులకు :
ఏటూరి నాగేంద్రరావు
7416665323

మాధవరావు మోకా
9440272950

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News