Wednesday, January 22, 2025

నీడల దృశ్యంలో నుడికారపు వెలుగు

- Advertisement -
- Advertisement -

రచయిత ఒక పదాన్ని ప్రయోగిస్తే అది పాఠకుల హృదయంలో నాటుకొని మేధోవలయంలో విస్తరించి వారి ఆలోచనలను ప్రభావితం చేయగలిగినపుడు ఆ మాట అర్థవంతమవుతుంది. పలుకుబళ్ళు అందుకు సహకరిస్తాయి. సూటి అర్ధాన్నిచ్చే పదాలు అనివార్యమయినప్పటికీ ఒక మాటని కవి ఎంతటి బలోపేతమయిన భావనలను సృష్టించగలిగేలా ఉపయోగించగలడో ఏనుగు నరసింహారెడ్డి నీడలదృశ్యం ద్వారా ఋజువు చేసినారు. ఏ రచనా భాషకయినా మాట్లాడే భాషే మూలం. ఎన్ని పరిణామాలు, సంస్కరణలు, వాదాలు రచనాభాషను ప్రభావితం చేసినా రాసే భాషకు మాట్లాడే భాషకు కొద్దోగొప్పో తేడాలు ఉండకుండా ఉండవు. రాసే భాష ప్రధాన ప్రయోజనాల్లో సాహిత్య రచన ఒకటి. ఆ రచన కవిత్వీకరించబడినపుడు ప్రయోజనాలను అంచనావేయలేనంత సమున్నత శిఖరాలపై నిలబడుతుంది. ఔన్నత్యం కలిగిన కవిత్వాన్ని అమ్మభాష కమ్మదనాలతో నింపిన సంపుటి నీడలదృశ్యం.
నీడలదృశ్యం సంపుటిలో ప్రతీకాత్మకత, వేదనాభరిత వ్యక్తులు, సంఘలునలు, సందర్బాలు దృశ్యీకరింపబడిన నీడలై పాఠకుల మనసులను కమ్ముకుంటాయి. అయినప్పటికీ భాషా ప్రేమికులు నీడలదృశ్యంలోని నుడికారపు వెలుగులు, పలుకుబళ్ళ కాంతులు, సామెతల చెణుకుల నుండి తప్పించుకుపోలేరు.
ఒక ప్రాంతపు ప్రజలు సరసమైన పధ్ధతిలో అభివ్యక్తీకరించిన పదాలు, పదాల సముదాయాలు పలుకుబళ్ళుగా, జాతీయాలుగా ప్రఖ్యాతి పొందుతాయి. వీటి పుట్టుకకు ఆధారాలు కానీ, కాలావధి కానీ ఉండదు. భాషా పరిణామ క్రమంలో కొన్ని వాడుకలో లేకుండాపోయి కొన్ని కొత్తగా వస్తుంటాయి. విన సొంపైన ఉదహారణాలుగా ఉండి చెప్పదలుచుకున్న విషయాన్ని హత్తుకు పోయేలా చేసి భావవ్యక్తీకరణకు ఊతంనిస్తూ, ఆనందాన్నిస్తూ భావాన్ని అవగతం చేస్తాయి. ప్రతిభాషలోనూ జాతీయాలు పలుకుబళ్ళు నుడికారపు సొబగులు భాషాపరిపుష్టికి దోహదం చేస్తాయి. ఇవి మౌఖికంగా జనబాహుళ్యoలో ఉన్నప్పటికీ ప్రముఖులయిన కవులూ రచయితలు వీటినిసందర్భోచితంగా గ్రంథస్థం చేసినపుడు శాశ్వతత్వాన్ని పొంది కవిత్వాన్ని బలోపేతం చేస్తాయి. ఇలా ఎన్నో పలుకుబళ్ళకు సామెతలకు నుడికారపు సొంపుకూ ‘నీడలదృశ్యం’ ద్వారా స్థిరత్వాన్ని కలిగించడం లో సఫలకృతుడయినాడు కవి.
భాషా సౌందర్యంలో ఈ సంకలనంలో కిరీటంగా నిలిచే కవిత ‘తొండి’.
ఆట ఆటతిర్గ లేదు
సంపుడు బంజెం కాకుంటనే
కాయలింట్ల బడుతున్నై

వాగ్దానమంతా
సునామీ రాక ముందటి మాట
పంచవర్ష పర్వదినం జరిగిపోయినట్లు
ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్
————————-
మెట్రో పాస్ తోటి
కండక్టర్లను దబాయించాలె
పూనక మెక్కి శిగమూగే బదులు
సందుళ్ళ ఈగిపోవుడు బెటర్
————————-
లేగల్లేగలు కొట్లాడి
దూడెల కాళ్ళిరుగ్గొట్టినట్లు
రెండు గుంపుల నడుమ
బక్కెడ్లు దస్కుతై
————————-
ప్రజలిచ్చిండ్రని బలుపును
నెత్తికెక్కించుకుంటరు
————————-
ఖాయిష్ జెసి జెండాలెగురేస్తే
వాటిరంగులెందుకు ఎలిసి పోయిన వన
————————-
అంతా నెత్తికెత్తుకుంటిమి జాడు
————————-
నొసల్తో వెక్కిరించినా
నోరెంట నవ్వొక్కటే జూస్తిమి జాడు
ఇప్పుడు కుడుస్తం
————————-
దీన్ని ప్రజాసామ్యమ్యమన్న
బద్మాష్ గాన్ని పట్కరాపో
వాన్నెత్తిన మన్నుబోస్త (తొండి)
కథారచనలోనూ ఇతర వచన ప్రక్రియలలోనూ సులభంగా సామెతలను ప్రయోగించగలుగుతారు. కానీ ఏనుగునరసింహారెడ్డి మాత్రం సామెతలను నుడికారాలను కవిత్వంలోనూ అలవోకగా అల్లిన విధానాన్ని ఈ కవితలో గమనించవచ్చు. ‘నొసటితో వెక్కిరించినా నోరెంట నవ్వొక్కటే జాస్తిమి’ ‘లేగల్లేగలు కొట్లాడి దుడెల కాళ్ళిరుగ్గొట్టినట్లు‘ అని ఔచితీవంతగా ప్రమోగించినారు. భాషలో ఆదాన ప్రాదానాలు జరుగుతాయి. అందులోనూ కొంతకాలం అధికార భాషగా ఉండి ఆధిపత్యం ప్రదర్శించిన ఉర్దూ భాష స్థానిక తెలుగులోనూ మిళితమై భాషాభిమానుల ఆదరణను పొందుతున్నది. ‘తొండి’ కవితను అందుకు ఉదాహరణగా నిలిపికారు కవి. ‘ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్’ సామెతనే కాకుండా ఖాయిష్జేసి, బద్మాష్ గాన్ని మొదలయిన పదాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. సంపుడుబంజెం, పూనకమెక్కి, శిగమూగే, నెత్తికెత్తు కుంటిమి వంటి పలుకుబళ్ళు, కుడుస్తం, నెత్తిలమన్నుబోస్త, దస్కుతై, ఈగిపోవుడు, బొక్కబోర్లపడుతం మొదలయిన దేశీ నుడికారాలతో నిండిన ‘తొండి’ కవిత భాషా పరమైన ప్రత్యేకతను సంతరించుకుంది.
పిల్లల్లాగే అమ్మలు/ పిచ్చి పిచ్చి చేస్తుంటరు /ఎక్కడో మొదలు పెట్టి / ఎక్కడనో తేలే/
తెల్లారగట్ల బాలసంతు కధలా (రాలక ముందటి పూలు)/ కొండలు పొట్టిగుట్టల నెత్తుల్జూస్తున్నై
సోల్పూతుగా నడుస్తూ నడుస్తూ (ప్రేమశిల)

ప్రకృతిలో జీవించే అజ్ఞానానికి
దింపుడుగల్లం పరుచుకొని
ఏడంతస్తులకు ఎదిగినందుకు (లావావిలాపం)
పెద్ద గద్ద మట్టిల దుంకులాడితే / ఇయ్యర మయ్యర జంపిన (జలాజంత్రం)

దస్త్రాల చిట్టడివిలో
మోరలెత్తిన క్రూరమృగాలు
కన్నుపొడుచుకున్నా
కానరాని వెలుగురేఖ (ఇల్లుచేరేదెట్లా )

పై కవితావాక్యాలలో బాలసంతుకథ, సోల్పూతు, దింపుదుగల్లo, ఇయ్యర మయ్యర, కన్నుపొడుచుకున్నా మొదలయిన పలుకుబళ్ళు నీడల దృశ్యంలోని కవితా శిల్పవిన్యాసానికి వన్నెలద్దినాయి.
సాయంత్రాలు మత్తులో
ఛీర్లు కొడుతూ ఉంటే
నువ్వు కంట్లో వత్తులు వేసుకున్నవైనం
ఎక్కడ బయటకి వస్తది
————————————————-
నువ్వు పిలిస్తే/ సుదంటు రాయెందుకని
వాళ్ళు కన్ ఫ్యూజన్ (విరి దండ)

కవి వ్వక్తిత్వాన్నే కవిత్వీకరించినారనిపించే కవిత ’విరిదండ’. కవితానడక తొట్రు పడకుండా ’కంట్లో వత్తులు వేసుకున్న వైనం’ ’సుదంటురాయి’ జాతీయలను పొదిగిన తీరువల్ల జాతీయాలు కవితను అలంకరించాయో, కవితే జాతీయాలను అలంకరించిందో తెల్చడం కష్టసాధ్యమనిపిస్తుంది. ఈ రెండు జాతీయాల స్థానంలో మరేమీ ఊహించలేనంతగా కేంద్రీకృతమై కవి అంతరంగాన్ని పాఠకులకు చేరవేసినారు.
ఆనూపానూ, సుడిగుండాలు, చెవికెక్కడం, గురి విందలు వంటి జాతీయాలే కాకుండా మిడిగుడ్లేసి, కన్నంటగానే, చిల్లంకొల్లం, శీకటంబట్టిందా, డొమ్మరగంతులెయ్యడం, బైలెల్లే, దేవులాడుకుంటరు, వీరంగమేసి, దిభిల్లుమంటై, ఒంటిమందం, దేవునర్ర వంటి దేశినుడికారాలు నీడలదృశ్యంలో అడుగడుగునా కనిపిస్తాయి. ఏడుగుర్రాలరాజు, సగపుటావిడ వంటి నూతన ప్రయోగాలు కనిపించి అబ్బురపరుస్తాయి. ప్రధానంగా కవచకుండలాలు మొ॥పదబంధాలకు నీడలదృశ్యంలో స్థానాన్నిచ్చి పలుకుబళ్ళుగా స్థిరపరిచినారు కవి. తొండి, కొరివిదయ్యం, ఇచ్చల్ల, జలాజంత్రం లను కవితా శీర్షికలుగా ఉంచడం కవికి భాషపై గల మక్కువను తెలియజేస్తూ సంకలనానికే ఆకర్షణగా నిలిచింది.
నరసింహారెడ్డి కవే కాక వృత్తిరీత్యా అదనపు కలెక్టర్ గా ఉన్నారు. వీరు రెవిన్యూశాఖలో వివిధ హోదాలలో పని చేస్తూ విధుల నిర్వహణలో భాగంగా తెలంగాణలోని విభిన్న ప్రాంతాలలో నివసించడం జనంతో మమేకమై ఉంటూ అన్ని వర్గాల వారికి అన్ని వయసుల వారికి చేరువై సంభాషణలు జరుపడం వారి నుడికారాలపై గల పట్టుకి దోహదపడి ఉంటుంది. కేవలం పుస్తక పఠనం వల్ల ఇంతటి భాషా చమత్కృతి సాధ్యం కాదు.

ఒకే దేశం ఒకే భాష
సంస్కృతం ముందు
తల్లిగొంతుకలు సవతిపిల్లలైనై (వేదాలదాకా వెనక్కి)

అంటూ అమ్మ భాష పట్ల బాధను వ్వక్తం చేసిన కవి

సభలకు అంతంత సమయం
ఎందుకు పెడతావంటే
ఏం చెప్పను
సాక్షాత్తూ మాతృభాషలో
సరళ వ్యవహారపు సద్గ్రంథం
చదువుతున్నానని
ఎలా చెప్పాను (వాడిపోని పూలకోసం)

అంటూ వారు ఎటువంటి భాషకు ప్రాధాన్యతనిస్తున్నారో వారికి భాషాపరమైన మక్కువ ఏమిటో స్పష్టం చేస్తున్నారు. విద్యావంతులు కాని మారుమూల గ్రామీణుల భాషా స్వచ్ఛతను తన కలం నిండా నింపుకున్న కవి ఈయన. ’నీడలదృశ్యం’ అమ్మభాషలోని మాధుర్యాన్ని పట్టుకొన్నది.

డా. కాచాపురం దుర్గాదేవి
7893093495

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News