గోదాదేవి 1300 సంవత్సరాల కిందట మధురభక్తి ద్వారా శ్రీరంగనాథుడిని ప్రేమించి ఆ స్వామి స్వయంగా పల్లకి పంపే విధంగా స్వామి ప్రేమ సాధించిన పరమ భక్తురాలు. భగవంతుడి పారవశ్యంలో మునిగిపోయిన వారిని ఆళ్వార్ అంటారు. తమిళంలోవిష్ణుభక్తులను ఆళ్వార్ అని పిలుస్తారు. క్రీస్తుపూర్వం 4200, 2700 మధ్య కాలంలో ఆళ్వార్లు జీవించారు. గోదా ఆండాళ్ ఒక్కరే మహిళా ఆళ్వార్. గోదాదేవి కన్న ముందు 10మంది ఆళ్వార్లు ప్రసిద్ధులు. శ్రీవిల్లి పుత్తూరులో క్రీస్తుశకం 776లో జనకునికి సీతవలె అయోనిజ గా తులసీ వనంలో పెరియాళ్వార్ కు లభించింది. తిరుప్పావై, అంటే సిరినోము లేదా శ్రీ వ్రతం, పేర ఎనిమిది పాదాలతో 30 పద్యాలు (తమిళంలో పాశురాలు అంటారు) రచించారామె.
డిసెంబర్ 16 న మార్గశీర్ష మాసం మొదలైంది. ఈ రోజు (22.12.21) న ఏడో పాశురం. శ్రీవిల్లి పుత్తూరులో చెలికత్తెలను బృందావనంలో గోపికలుగా భావిస్తారుగోదా. వారిని పొద్దున్నే మేలుకొలిపి, యమునాస్నానాలు చేసి, యశోదానందనుడిని ఆరాధించే వ్రతాన్ని తిరు (శ్రీ) ప్పావై (నోము) (అంటే శ్రీనోము లేదా సిరినోము) సాగిస్తారు గోదాదేవి. మొదటి 5 గీతాల్లో వ్రతనియమాలుంటాయి. తొలి పాట (మార్గళిత్తింగళ్ …) లో చంద్రుడు 16 కళలతో వికసించిన నాడు తెల్లవారుఝామున పవిత్రులమై శ్రీకృష్ణుని దర్శిద్దాం, ఆయన పఱై (వాయిద్యపరికరమనీ, మోక్షమనీ అర్థం) ఇస్తానన్నారంటూ గోపికలవంటి చెలికత్తెలకు సుప్రభాతం పాడుతున్నారు. నారాయణుడై ప్రక్రియ, లక్ష్యం కూడా అంటున్నారు. ఈ వ్రత లక్ష్యం నారాయణుడు. సాధనకూడా ఆయన నామమే. ఈ గీతంలో భగవంతుడి పరత్వం సూచిస్తారు.
1. యశోద ఒడిలోని కొదమసింగం
మార్గశీర్షపు వెన్నెలలోన తెల్లవారకమున్నె యముననీట
భక్తి భాగ్యాల మునిగితేల రారండు, వ్రేపల్లె పడుచులార
వేలాయుధమ్ముదాల్చి నందనందనుడదిగో నిలిచినాడు
వేయికన్నులార్పక కాచు వేలుపతడని తెలియరో కొమ్మలార
యశోద ఒడిలోని కొదమసింగము వాడు, కలువకన్నుల రేడు
కారుమబ్బుమేనివాడు, చంద్రసూర్య చలువకాంతుల జల్లువాడు
వరద వాత్సల్యగుణాభిరాముడు నారాయణుడు, నెల నోము పట్టి
కలిసి భజింతము రండు, పరై వరాల కలిమి కైవల్యమిచ్చునతడు.
2. వ్యూహ స్వరూపం పాలకడలిపై విష్ణువు
రెండో పాటలో వ్రత నియమాలు ఉంటాయి,పాలు నెయ్యి మాని, తెల్లవారుఝామున స్నానం చేసి, పూలు కాటుకలు పెట్టుకోకుండా, చేయరాని పనులు వదిలేసి, చాడీలు చెప్పకుండా మనసు నొప్పించకుండా, హితవులు వింటూ చేస్తూ నారాయణుడిని చేరుదాం అని గోదాదేవి ప్రబోధిస్తున్నారు. ఈ పాటలో పాలకడలిలో శయనించిన నారాయణుడు వ్యూహస్వరూపుడంటారు.
వినుడు సౌభాగ్యసుదతులార, ఇది ఇడుముల బెట్టువ్రతముకాదు
పరమానందబ్రహ్మము చేర్చునోము నియమాలు తెలియరండి
పాలకడలి నాథుడి పాలు మనము, వేరు పాలు మనకేలమగువలార
కృష్ణయ్య నెయ్యము సాధింప నెయ్యి మానుదాము పూబోడులార
తెల్లారి స్నానాలు కద్దు, పూలు కాటుకల సొబగులొద్దు
చేయరాని పనులు వద్దన్న చేయకుండుటె మేలు, చాడీలు,
మనసు నొప్పించు విరుపులొద్దు, హితవులు వినడమే మనకు మంచి
దానధర్మాలతో నడచి దామోదరుని చేరుటే మన తిరునోము దారి.
3. మూడులోకాలు కొలిచిన వామనుడు
మూడో పాశురంలో విష్ణువు అవతారాల వివరణ ఉంటుంది. తొలుత లోకాలు కొలిచిన వామనుడిని కీర్తిస్తూ, నారాయణుడే గో క్షీర సస్యసంపద వెల్లివిరిసే కారణమంటూ గోపికలకు వివరిస్తున్నారు.
మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు
అంతలోనె ఆకాశానికెదిగి లోకాలనెల్ల పాదాల కొలిచినాడు
నోముస్నానాల పునీతమై త్రివిక్రముని నోరార వేడుదాము
నెలమూడు వానల, వెన్నెల సోనల వ్రేపల్లె సస్యశ్యామలంబు
ఎదిగిన పైరుల నిండిన జలాల త్రుళ్లి పడు మీన సంచయంబు
తెలుపుకలువపూల తెలవారుదాక నిదిరుంచు తుమ్మెదలు
కృష్ణువేణువు తాకి సేపులెగసి గోవులిచ్చును క్షీర కుంభవృష్ఠి
సిరిసంపదలకేమి కొదవ రారండి సిరినోము జేయ సీమంతులార.
4. కాల స్వరూపుడు నల్లనయ్య
నాలుగవ పాశురంలో జ్ఞానం ఇచ్చే ఆచార్యుడు మేఘం వంటి వాడనీ, ఆశ్రయించడానికి భగవంతుడు అందుబాటులో ఉంటాడనీ, ఆచార్యుడు ఆశ్రయించే బోధన చేస్తాడనీ వివరిస్తారు. విష్ణునామాలు కీర్తిస్తూ వ్రతం ముందుకు వెళ్తున్నది. పర (1) వ్యూహ (2) విభవ (3) తత్వాలు మొదటి మూడు పాటల్లో వివరించిన గోదాదేవి, ఈ గీతంలో అంతర్యామిత్వాన్ని బోధిస్తున్నారు.
క్షార జలధి నావరించి అలల జలము పీల్చి గగనమెక్కి
జగత్కారకుడు, కాల స్వరూపుడు నల్లనయ్య రంగురాసి
గంభీర జలదము, మహనీయ సుందర బాహుదండుడైన
పద్మనాభు కుడిచేతి సుదర్శన చక్రంపు మెరుపు మెరిసి
స్థిరమైఎడమ దక్షిణావర్త పాంచజన్యంపు పిడుగులుమిసి,
ఆలసించక విష్ణు శార్ఞమ్మువిడిచిన శరపరంపరల విసిరి
పుడమి జీవరాశి బ్రతుక జీవధారలిచ్చు పర్జన్యదేవుమ్రొక్కి
మార్గళినోము స్నానాలు జేతము లేచి రారండు లేమలార.
5. చీకట్లు తొలగించి కట్టు తెంచే క్రిష్ణయ్య
అయిదో పాశురంలో మధురలో పుట్టి, వ్రేపల్లెలో యశోద బంధాలకు కట్టుబడిన శ్రీకృష్ణుని శరణువేడుతూ ధ్యానించాలని బోధిస్తున్నారు గోదాదేవి.
మాయల అంతర్యామి ఉత్తర మధురలో కృష్ణుడై పుట్టినట్టి
దేవకీ వసుదేవ పూర్వపున్నములు నిండిన పసిడి పంట,
మలయానిలముల తిరిగి సోలెడు యమునా విహారి వేణుధరుడు
యాదవకులరత్న దీపకుండు, గోపాలవీర యదు నందనుండు
యశోద గోరుముద్దలగోరు నవనీతచోరు విష్ణుమూర్తి
రాగరంజితమనోసుమాల నర్చించ పునీతమై వచ్చినాము
చీకట్లు తొలగించు కృష్ణలీల, కట్లు తెంచు కృష్ణ ధ్యానము
పాపాల దూదిరాశిని బూదిచేయుకృష్ణనామమే మాకు శరణు
6. విషపూతన ప్రాణాపహారి
గోదాదేవి ఆరునుంచి 15వ పాశురం వరకు పదిమందిఆళ్వార్లకు ప్రతీకలుగా భావించి పది మంది చెలికత్తెలను గోపికలుగా భావిస్తూ నిద్రలేవమంటున్నారు. పక్షులు కూస్తున్నాయనీ, తెల్లవారిందని గమనించాలంటున్నారు. పూతన, శకటాసురులను వధించిన బాలకృష్ణుని భాగవత లీలలు పాడుతూ, ఈ పాశురంలో అస్మద్గురుభ్యోన్నమః గోదాదేవి తన తండ్రిగారు పెరియాళ్వార్ కు మేలుకొలుపు పాడుతున్నారు.
కీచకీచు పక్షుల కిలకిలల కలకలల తెల తెల్లవారు
గోపురశిఖరాల శంఖారావములు జనుల పిలుచు
మాయమాత పూతన స్తనవిషప్రాణముల పీల్చినాడు
కాలుజాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు
క్షీరసాగరశయను యోగనిద్రలో లోకాల కల్పించినాడు
యోగిహృధ్యానగమ్యు మునుల మనములమనెడువాడు
ఎక్కడకదులునోనయని ఎడదపట్టి రుషులు లేచినారు
భక్తితాపసుల హరిహరి ధ్వనులు వినుడు మేలుకొనుడు
7. కడవల్లో కవ్వాల సవ్వడులే సంపద
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
తెలుగు కవితానువాదం
అదిగోవినలేదా కీచుకీచు పిట్టల కిలకిలారావములు
భారద్వాజ పక్షుల మధుర సంభాషణలా నిక్వణాలు
కుండలలో చిక్కగా నిండిన మజ్జిగల చర్రు చర్రున
నిలువెత్తు కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు
ఊగెడు గోపికల కేశాల రాలిన పూలవాసనాలు తాకలేద
వగలు నగలు నగవులు కలిసి దీపించు వెల్గులు చేరలేద
పీతాంబరుని వేడక ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల
మనము తెరచి మాధవుడినె తలచెదము తనివిదీర.
పక్షులు కూస్తున్నాయి, శంఖాలు ఊదుతున్నారు. యోగులు లేవగానే హరి హరి అని పలువురు స్మరణ చేస్తున్న ధ్వనులు కూడా వినిపిస్తున్నాయి. పక్షులది శబ్దశక్తి, శంఖనాదం ప్రణవనాద శక్తి, మూడోది హరినామస్మరణ. పక్షికి జ్ఞానం ఒక రెక్క అయితే మరొక రెక్క సాధన.
భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా ‘తిఱవ్‘ రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అంటూ మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గోదమ్మ వివరిస్తున్నారు. భగవంతుడే సముద్రం. పాలంటే భగవంతుని స్వరూపగుణ విభూతులు. వాటిని మననం చేయడమే మథించడం. భగవంతుడి యందు బుద్ధి నిలపాలనే పట్టుదలే మందర పర్వతం. మథనంలో దైవశక్తులు అసురశక్తులు కూడా సాయ పడతాయి. దైవ శక్తులు జయించి భగవత్కటాక్షంచేత అమృతత్వాన్ని పొందుతారు, అసుర శక్తులు నశిస్తాయి.
గోవులంటే వాక్కులు, వేదములు, ఆ గోవులిచ్చే పాలు భగవత్ స్వరూప గుణ విభూతులు. గురువుద్వారా తెలుసుకుని మనసులో దృఢముగా నాటుకొనేట్టు గుర్తుచేసుకోవడం పెరుగు. ఆ అనుభవరూపమగు పెరుగును, భగవత్ సంబంధమనే కవ్వానికి, భగవత్ ప్రీతి అనే త్రాడు గట్టి చిలికితే అవి పనులు. ఫలితాలు – ప్రేమతో భగవంతుడికే అర్పించే మనస్సు ఏర్పడుతుంది అది వెన్న వంటిది. భగవంతుడి ఎడబాటు అనే వేడి సోకితే ఆ వెన్న కరిగిపోతుంది.
సముద్ర మథనం చేసినప్పుడు మూడు ధ్వనులు వచ్చాయి. సముద్రంలో మందరము పెట్టినపుడు, సముద్రం ఎత్తు కావడం వల్ల సముద్రంలోకి వెళ్లక నదుల నీళ్లు వెనక్కితిరిగిపోతున్న ధ్వని ఒకటి, వాసుకి అనే పామును మందరపర్వతానికి కట్టి లాగుతున్నప్పుడు రాపిడికి వచ్చే ధ్వని మరొకటి, కొండ తిరుగుతున్నప్పుడు సముద్రంలో సుడులుసుడులుగా తిరిగే చప్పుడు మూడోది.
గోపికలుచిలికేప్పుడు వారి పాట, వారి ఆభరణాల ధ్వని, చిలికే పెరుగు ధ్వని మూడు వస్తూ ఉంటాయి. మనచుట్టూ లోకంలో ఉండే విషయాలనుంచి విషయవాసనలు మనలోకి ప్రవహిస్తూ ఉంటాయి. భగవంతుని యందు బుద్ధి నిలిపినపుడు ఈ వాసనలు లోపలికి రాలేక వెనక్కి పోతుంటాయి అప్పుడొక ధ్వని. శ్రధ్ద అనే వాసుకితో కట్టి భగవత్ప్రాప్తి కామన అనే అధ్యవసాయముతో మనలోని దైవాసుర శక్తులు అటూ ఇటూ లాగితే ఒక ధ్వని వస్తుంది. మనం మననం చేయడం వల్ల భగవత్ స్వరూప గుణ విభూతులు పొంగి పొరలుతాయి. అది మూడో ధ్వని. పరమాత్మ ప్రాప్తికోసం శ్రవణ మనన నిధి ధ్యానములే మథనము అని క్షీరసాగర మథనం వంటి రెండు మూడు ప్రతీకలను గోదమ్మ ఈ పాశురంలో చూపారు. దధిమథనం ఒక యజ్ఞం వంటి పవిత్ర కార్యం. గోపికలు తెల్లవారుజామున లేచి స్నానం ముగించి కురులు అలంకరించుకుని పూలు ముడిచి, బొట్టు పెట్టుకుని పాడికుండను పట్టుకుంటారు. చిలకడం మొదలు పెడతారు. వారి ధ్యానము తపస్సు అదే. వెన్నతీసే పని ఇది అని శ్రీ భాష్యం అప్పలా చార్యుల వారు వివరించారు. ఈ పాశురంలో రెండో గోపికను నిద్రలేపారు. ఈ పాశురంలో కులశేఖర ఆళ్వారులను మేల్కొలుపుతున్నారు.
నాయకప్పెణ్పిళ్లాయ్ అంటే గురువునకు గురువైన పరమాచార్యుడని అర్థం. కనుక అస్మత్పరమ గురుభ్యోన్నమః అని ఈ పాశురంరోజున స్మరించుకోవాలి. గోదమ్మకు నమస్కారాలు, ఆమె పాదాలకు వందనాలు.
బాపు రేఖా విశేషాలు
బాపు తిరుప్పావై గీతార్థాలను వివరించే అద్భుతమై కళాఖండాలను సృష్టించారు. భాగవతంలోని కథ దధిమధన శ్రీకృష్ణలీలను గోదాదేవి అంతర్లీనంగా అల్లితే దాన్ని మన కళాకారుడు బాపు అద్భుత చిత్రంగా ఆవిష్కరించినారు. వ్రేపల్లె గోపికలు నిత్య భక్తులు. పెరుగుచిలుకుతూ, అమ్ముతూకూడా శ్రీకృష్ణుని స్మరిస్తారు. మాట, చేత, మనసు ద్వారా చేసే వ్యాపారాలన్నీ కృష్ణుడికి అర్పిస్తున్నారు. మేం కృష్ణునికే చెందిన వారం, ఏం చేసినా ఆయన కోసమే అంటారు. నెత్తిన పాలు పెరుగు మోస్తూ పట్టణానికి వెళ్లి అక్కడ పాలు పెరుగూ అని అమ్మేందుకు గోవిందా దామోదరా మాధవా అని అరిచేదట. ప్రభాత సమయాన యశోద ఇంట చేతి కడియాల గలగలలతో తిరిగే కవ్వం, కన్నయ్య అల్లరి, సంతోషంగా పాలిచ్చేగోవు, నెత్తిన కుండలతో మాట్లాడే గోపికలు. ఈ మనోహర దృశ్యంలో, వ్రేపల్లెలో ఒక ఉదయాన్ని బాపు మన ముందుంచారు.
8. కేశి రాక్షస సంహారం
గోదాదేవి నమ్మాళ్వార్ ను మూడోగోపికను నిద్రమేల్కొలుపుతున్నారు. “అస్మత్సర్వ గురుభ్యోన్నమః” ఈనాటి ఆచార్యనమస్కార మంత్రం.
కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
మెయ్‌వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వందు నిన్ఱోమ్, కోదుకలముడైయ
పావాయ్! ఎన్దిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ,
దేవాది దేవనై శెన్ఱు నాం శేవిత్తాల్,
ఆ వా వెన్ఱారాయ్‌న్దరుళేలో రెమ్బావాయ్!
తెలుగు భావార్థ గీతిక
తూరుపుదెలవారు గోధూళివేళ గోవులు కదిలినాయి
దూడలవెంట ఉదయకిరణాల మెరయు గడ్డిమేయ
నీతోడ కలిసిపోవ నీయింటి వాకిట నిలిచినాము
భక్తిమణిదీపమా మావెంట రావమ్మ హరిని జేర
పఱై పరములగోరెడు నోము నోచుదామని చెప్పుదాము
కేశిరాకాసి నోరు జీల్చి. చాణూరముష్ఠుల గూల్చి
లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె
కృష్ణ సంస్పర్శస్నానాలుజేయ రావమ్మ కృష్ణవేణి.
తూర్పు దిక్కున ఆకాశంతెల్లబారింది. లేతగడ్డి మేయడానికి గేదెలను నాలుగువైపులా విడిచిపెట్టారు. కృష్ణుడి కోసం వెళ్లడమే ఫలమూ, వ్రతమూనని మనతోటి గోపికలంతా మనస్ఫూర్తిగా తలస్తున్నారు. అందరంకలిసిపోదామని ఉద్బోధిస్తున్నారు. ఇంట్లో ఉన్న గోపికను బయటనుంచి గోదాదేవి పిలుస్తున్నారు. “ఓ చిన్నదానా! నిన్ను కూడా పిలుచుకుని పోవడానికి వచ్చి నీవాకిట నిలబడ్డాం. శ్రీ కృష్ణుడిని చేరాలని నీకూ కుతూహలంగా ఉంది కదా మరి వెంటనే లేచి రావమ్మా. ఆతనిని కీర్తించి పఱై డక్క పరికరాన్ని (లేదా ముక్తిని) అడిగి తీసుకుందాం రా” అంటున్నారు.
ఈ రోజు పాశురంలో కేశి రాక్షస సంహారం కథ ప్రస్తావిస్తారు గోదమ్మ వారు. గుఱ్ఱం రూపం లో ఉన్న కేశి అనే రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతులు పెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. కేశి రాక్షసుడిని చంపడానికి శ్రీకృష్ణుడు ఏ ఆయుధమూ ప్రయోగించలేదు. కేవలం చేయిని ఉబ్బిస్తూపోయాడు. ఉబ్బిన చేయి శరీరంలో ఇమడక, ఆ పరిమాణాన్ని భరించలేక ఆ అశ్వరూపాసురుడి నోరు పనిచేయదు. స్వార్థంతో మింగడానికి తప్ప,అజ్ఞానంతో నోరుమూసుకుని ఉండి, మూర్ఖంగా తెరవడానికి ఇష్టపడని, స్వామిని నుతించని వారి నోళ్లను తెరిపిస్తాడు. కేశవుడంటే క అనే పరబ్రహ్మ స్వరూపం, అ అంటే విష్ణు స్వరూపం, ఈశ అంటే రుద్ర రూపం. త్రిమూర్తుల సమ్మేళనం కేశవుడు. అయిదు ఇంద్రియాలు శరీరం అనే రథానికి కట్టిన గుఱ్ఱాలు మనను అయిదు వైపులా లాగుతుంటాయి. మనస్సు అనే కళ్లాన్ని బుద్ధి అనే సారథి చేతులో పెట్టగలిగితే రథం సక్రమంగా సాగుతుంది. లేకపోతే ముక్కలైపోతుందని ఉపనిషత్తులు హెచ్చరిస్తాయి. ఇంద్రియాలను చంపడు కాని అదుపులో పెట్టుకుని మారేట్టు చేయడం గురించి భగవంతుడు వివరిస్తాడు.
ఇంకా కౌమారం దాటక ముందే, బలరామ కృష్ణులు భయంకరులైన మల్ల విశారదులు చాణూర ముష్టికులను ఎదుర్కొని ఓడించారు. చాణూరుడు క్రోధానికి కోపానికి పాపానికి ప్రతీక. కామం కోపం పోవాలంటే గురువు అనుగ్రహం కావాలి. చాణూర ముష్టికులను అవలీలగా సంహరించిన వీరులు. మదజలం స్రవించే కువలయాపీడము అనే మత్తగజంతో పోరాడి, మావటిని చంపి దాని రెండు దంతములు పెఱికి భుజాన మోస్తూ రామ కృష్ణులిద్దరూ కంసుని సభలో ప్రవేశించి మల్ల వీరులను మట్టి కరిపిస్తారు. మంచెల మీద ఉన్న రాజులు ఆశ్చర్యభయోపేతులవుతూ ఉంటే కంసుని సింహాసనం దగ్గరికి వెళ్లి, ఒక్క ఉదుటున కిందపడవేసి పిడి గుద్దులతో చంపేసిన కృష్ణుడు అప్పడికి ఇంకా యువకుడుకూడా కాదు. నూనుగు మీసాల కౌమార దశస్కుడు. ముష్టికాసురుడు అంటే ఎంత తిన్నా ఇంకా కావాలనే వాడు కామములు తీరని వాడు. చాణూరుడు క్రోధానికి ప్రతీక. కామక్రోధాలను జయించాలి. అందుకు భగవంతుడు ఆచార్యుని ద్వారా అనుగ్రహించాలి. నమ్మాళ్వార్ ను ఈరోజు ప్రబోధిస్తున్నారు.
బాపురేఖావైభవం
కేశి సంహార కథనాన్ని తన కుంచె రేఖలతో బాపు మన కళ్లకు కట్టినట్టు కనిపింపజేస్తారు. కేశి అనే రాక్షసి గుఱ్ఱం రూపంలో వచ్చింది. దాన్ని కృష్ణుడు సంహరించిన కథనం ఈరోజు బాపు చిత్రానికి ఇతివృత్తం. కంసుడు పంపిన ఒక్కో రక్కసిని ఒక్కోరకంగా చంపేస్తాడు బాలకృష్ణుడు. తన నోట్లో చేయి పెడితే చిక్కాడనుకుని కొరికి వేయబోతాడు కేశి. కాని తన చేయిని ఉబ్బిస్తూ ఉక్కిరి బిక్కిరిచేసి చంపేస్తాడు. కేశినిచంపి కేశవుడైన మాధవుడిని కలిసి వేడుకుందామంటూ గోదమ్మ కనులుమూసుకున్న దృశ్యం ఇది.
మాడభూషి శ్రీధర్