Monday, December 23, 2024

జీవితాలను ‘దురస్తు’ చేసిన కథలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సామాజిక చరిత్రను, రాజకీయ పరిణామాలను, ఆర్థిక స్థితిగతులను సాంస్క ృతిక వికాసాన్ని, మానవ సంబంధాలను రికార్డు చేస్తూ రాసిన మెరుగైన కథలను పాఠకులకు అందిస్తూ సాగుతున్న ఈ కథా ప్రయాణం అప్పుడే దశాబ్దపు (20132023) మైలురాయిని చేరుకుంది. అనంతమైన కాలగమనంలో 10సంవత్సరాలు రేణువంతే అయినా మా మట్టుకు మాకు ఇదొక గొప్ప నడక. ఈ దశాబ్ద కాలం లో ఎంతో మంది సీనియర్ కథకులు కథలు రాయడం ఆపేశారు. అదే సమయంలో మరెన్నో కొత్త చిగుళ్లు కథా రచనలోకి వచ్చి చేరాయి. గతంలో ఒకరిద్దరు తెలంగాణ వార్షిక కథా సంకలనాలు తెచ్చే పనికి పూనుకున్నా ఏవో కారణాల వలన మధ్యలోనే చాలించుకున్నారు.

ఈ ప్రస్థానం ఇలా నిరాటంకంగా కొనసాగటానికి మమ్మల్ని నడిపించే ఇంధనం సహృదయ పాఠకుల ఆత్మీయ ఆదరణే. మంచి కథలు కాలపు పుటల్లో దాక్కొని పోకుండా వాటిని పాఠకుల గుండెదాకా చేర్చాలనే మా ఆరాటం. జీవితం ఎంత ముతకగా, కటువుగా ఉన్నా దానికి కొంత ‘షుగర్ కోట్’ వేసి, శిల్పమనే జీవత్వాన్ని తొడిగి రాసిన ఏ కథనూ వదిలి వేయకుండా ఈ కథా సంకలనాల్లో చోటు కల్పించాము. ఏ భావజాలాలకు, వాదాలకు, ధోరణులకు, ప్రాంతాలకు లొంగకుండా వస్తువును, శిల్పాన్ని సమతూకంతో మేళవించి రాసిన కథలను పట్టుకున్నామనే అనుకుంటున్నాము. ఈ సంకలనాల్లో చోటు లభించని వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు. ఆ మాత్రం డెమొక్రటిక్ వాయిస్ వారికి ఉంది కూడా. ఇందులో చోటు దొరికిన కథలు తెలంగాణకు ప్రాతినిథ్య కథలా? అని ప్రశ్నించవచ్చు.

సమకాలీన జీవితాన్ని ఈస్తటిక్ సెన్స్‌తో రాసిన ఏ కథనైనా మరోసారి పాఠకుల దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నించాము. కేవలం వస్తువే కథ కాదు. అలాగే కేవలం శిల్పమే కథగా మారదు. అలాంటి కథలు ఈ సంకలనాల్లో కొన్ని చొరబడి ఉండవచ్చు. అలాంటివి జీవితాన్ని నిరలంకారంగా చెప్తూనే సమాజాన్ని ఏ కొంతో ప్రభావితం చేసే కథలని మేం భావించాము. అందుకే అలాంటి కథలు కొన్ని రాకపోలేదు. కొన్ని చేరకూడని కథలు చేరిపోయాయని విమర్శకులు, సమీక్షకులు మా దృష్టికి తేకపోలేదు. అటువంటి వాటిని ఇకముందు పరిహరిస్తామని హామీ ఇస్తున్నాము.

ఈ నేల మీద ఏ ప్రాంతంలో అయినా మనిషి జీవితంలో భూమి ఎంతో కీలకంగా పనిచేస్తోంది. 1990ల నుంచి ఈ నిజం మరింత ప్రభావవంతంగా నిరూపితమవుతూ వస్తోంది. ఈ దశలోనే భూమి యాజమాన్యంలో, కౌలు రైతు వ్యవస్థలో ఎన్నో లొసుగులు ముంచెత్తి ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దీన్ని సవరించడానికి 2020లో ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. భూముల వారసత్వ హక్కును, రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని ప్రజలు భావించారు. కాని మరిన్ని చిక్కులు రైతుల, భూస్వాముల నెత్తి మీదకు కూర్చున్నాయి. కబ్జాలో ఒకరుంటే మరొకరి పేరు మీద భూమి నమోదై ఉండడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ పీకులాటను సరిదిద్దడానికి తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి రైతుల ప్రాణాలు పోతున్నాయి. ఇదే అదనుగా బలవంతులు బలహీనుల భూములను తమ పేరు మీద మార్చుకొని దర్జాగా అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు.‘భూమిపట్టా’ కథలో రత్తయ్య, ‘ఋణం’ కథలో హన్మంతు పరిస్థితి అదే. భూమి పట్టా చేసుకోవాలని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి పట్టా కాగితాన్ని చూడకముందే ప్రాణాలు వదిలారు.

మనుషుల మధ్య భూమి సృష్టిస్తున్న అలజడి మాటల్లో చెప్పలేనిది. భూమి కోసం రక్త సంబంధీకులు కూడా దూరం అవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత భూమికి ఎక్కడలేని గిరాకీ పెరిగి మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలే ప్రధానమనే విధంగా జీవితాలు మారిపోయాయి. ‘జాయిజాదులు’ లేకుంటేనే కుటుంబాలు కలిసుంటాయని ‘జాయిజాదులు’ కథలోని లచ్చుమవ్వ చెప్పకనే చెప్తుంది.

‘అలుకుపూత’ కథలోని ముత్యం ఉన్న భూమిని ఊరి వైద్యం కోసం ఒక డాక్టర్ హాస్పిటల్ కోసం ధారపోసి, కుటుంబానికి ఏ ఆసరా లేకుండా చేశాడు. ఆయన మనుమడు, కొడుకు కూడా జీవితంలో పెనుగులాడుతుంటారు. వారసత్వంగా వచ్చిన కుల వాయిద్యం ‘రుంజ’ను అమ్ముదామని మనుమడు ప్రయత్నించడం తీర్చలేని విషాదం. ‘పెద్దబతుకమ్మ’ కథలో పూలమ్మ, గోపాల్ అనే అన్నాచెల్లెళ్ల మధ్య చిచ్చుపెట్టింది కూడా ఈ భూమే. పెళ్లినాడు ‘పిల్లనిస్తే చాలు కట్నం ఏమీ వద్దు’ అన్న బావ పరమేశ్ భూమికి ధర పెరిగే సరికి ఆస్తిలో వాటా కావాలని ఉన్న భూమి చెరిసగం వస్తుందని పంచాయితీ పెట్టించాడు.

భూమిని వదిలిపెట్టి కుల వృత్తిని నమ్ముకున్నా బతుకుదెరువు కరువే అయింది. ‘సారె’ కథలో శ్రీకాంత్ కులవృత్తిని మాని తన తల్లిదండ్రులను నగరానికి రమ్మంటాడు. నగరాల్లో జీవించడానికి భరోసా ఎవరు కలిగిస్తారు? అనే పెనుగులాటతోనే కుమిలిపోయిన తండ్రి లక్ష్మయ్య ప్రాణాలు వదులుతాడు. నేటి తరం కులవృత్తులను ధ్వంసం చేసి ప్టణాలకు తరలి జీవికను వెతుక్కుందామనుకుంటోంది. పాత తరం కులకశ్పిని వదిలి బతుకుడెట్లా అని తన్లాడుతుంది. ఈ రెండు తరాల మధ్య అంతరం ఎన్నటికి తీరేను?

‘సారె’ కథలోని పరిస్థితులకు విలోమ కోణం ‘జెజ్జెనక..’ కథలో కనిపిస్తుంది. మేమే కులవృత్తిలో నలిగిపోయాము. మీరు కూడా మళ్లీ డప్పులు కొట్టుడు, చెప్పులు కుట్టుడు ఎందుకు? మీకు ఆ దుస్థితి వద్దని దళితుడైన ఎల్లయ్య కొడుకు, కూతురును కష్టపడి చదివించాడు. బిడ్డ బిఇడి చేసి టెట్ పాసైనా, కొడుకు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పిహెచ్.డిలు చేసినా ఉద్యోగం లేదు. ఇల్లు గడవాలంటే ఏదో ఒక పనికావాలె గదా! అందుకే ఎల్లయ్య కూతురు పనికి ఆహారపథకం పనులకు పోతుంది. ఈ విషయం తెలిసిన ఎల్లయ్య కొడుకు కిరణ్ తన చెల్లె అంత పెద్ద చదువు చదివి గిట్ల కూలి పనులకు పోవుడేందని బాధ పడుతాడు. “రాష్ర్టం వస్తే బతుకులు బాగుపడుతయని కొట్లాడినం. కొలువులు దొరికి ముసలోల్లకు ఇంత తిండిపెడతమని ఆశపడ్డం. కానీ, చూస్తుండగనే మమ్ముల గాయిదోళ్లను చేసిన్రు. దేనికీ గొరగాని బతుకులు చేసిన్రు. ఇట్లా నిరుద్యోగ అవస్థ పడలేక ఈ మధ్యనే ఉరిపోసుకు సచ్చిన నా క్యాంపస్ స్నేహితులు ఒక్కొక్కరుగా గుర్తుకొస్తు”ంటారు కిరణ్‌కు. పూట గడవాలంటే ఎట్లా అని మదనపడుతూనే చివరికి కిరణ్ కూడా తన తండ్రి ఆకాంక్షకు భిన్నంగా సావు డప్పు కొట్టడానికి పూనుకుంటాడు.

జెజ్జనక కథలో కిరణ్‌ది ఒక సంఘర్షణ అయితే ‘బోన్గిరి టు లష్కర్’ కథలో సునీతది మరో పోరాటం. పని చేసే చోట కనీసం కూర్చునే హక్కు లేకపోవడం నిజంగా ఎంత పెద్ద విషాదమో అనుభవిస్తేనే కాని అర్థం కాదు.
సునీతలాగే పనికోసం నగరం వచ్చి జీవితాన్ని కొనసాగించడానికి ఎంతో అసౌకర్యాన్ని, బాధను గుండెలో దాచుకొని పరిస్థితుతో కలబడే కథ ‘సుభాషిణి పెళ్లి’లో సుభాషిణిది.

నగరంలో చీకటి నీడలే కాదు సాఫ్ట్‌వేర్ రంగంలో అంతా వెలుతురే ఉంటుందను కుంటాం. ‘సూర్యుని నీడ’ కథ ఐటి రంగంలోని డొల్లను కళ్లకు కడుతుంది. భాస్కర్, మేఘనలు ఉద్యోగం పోయి ఒకరు, ఉద్యోగం చేస్తూ మరొకరు ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటారు. దీపం కింద నీడను కూడా పట్టించుకోవాలనే ఎరుకను కలిగిస్తుందీ కథ.
విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తూనే తనకు అన్నీ ఉన్నాయనే ఊహాలోకంలో బతుకుతుంటాడు హనీఫ్ ‘ఖుష్ మిజాజ్’ కథలో. హనీఫ్ స్నేహితుడైన కథకుడు కథ చివర ఈ విషయాన్ని తెలుసుకొని షాక్‌కు గురవుతాడు. నిజంగానే ఇదొక మానసిక స్థితి. లేనివి ఉన్నట్టుగా భావించుకొని బీదరికపు బాధను దాటడం ఎంతో దు:ఖాన్ని కలిగిస్తుంది.
తరాలుగా వస్తున్న సంప్రదాయాలను, మూఢత్వాన్ని ఎదిరించే ప్రయత్నం ఎవరూ చేయరు. ఎక్కడో ఒక చోట ఎదురు తిరిగితే సమాజం వారిని ఇనుపముక్కు కాకుల్లాగా పొడుచుకు తింటుంది. కాని ‘ఉల్లిపూసలు’ కథలో పూలమ్మ తిరుగుబాటు మామూలుది కాదు. యుగాలుగా ఆడపిల్ల పుట్టుకతో వచ్చిన బొట్టు, గాజులను తీసివేయడానికి ఎవరికీ హక్కు లేదని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బతకాలనే భరోసాను కల్పిస్తుందీ కథ.

యౌవనంలో జీవితం ఎంతో రంగులమయంగా, ఎంతో సరదాగా ఉంటుంది. అయితే ఆ చిలిపి చేష్టలు జీవితాంతం వెంబడిస్తాయి. అలాంటి అల్లరి పిల్ల ‘వెలుగురేక’ కథలో కీర్తి. కాని చివరాఖరికి జీవితం మనల్ని పలకరించే విధానం మనం ఊహించని విధంగా ఉంటుంది. దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయాలనే సున్నితత్వాన్ని రంగరించి చెప్పే కథ ‘వెలుగురేక’.
ఈ కథా సంకలనంలోకే భిన్నమైన కథలు రెండున్నాయి. అవి ‘మా సెల్లే మల్లక్క’, ‘స్తూపం’ కథలు. ఇవి రెండు మావోయిస్టుల జీవితాల్లోని రెండు కోణాల్లో సాగిపోతాయి. మల్లక్క సూడో నక్సలైట్ అయితే, అయిలయ్య ఉద్యమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రజాజీవి. దేశ విభజన సమయంలో జరిగిన హింసను, ఆందోళనలను ఎన్నింటినో మనం మంటో కథల్లో చదివాం. అయితే నిజానికి విభజన రేఖ గీసిన రాడ్‌క్లిఫ్ అనుభవించిన మానసిక వేదన ఎలా ఉంటుందో చూపించిన కథ ‘ఆత్మ అగ్ని.. అది నిన్ను దహిస్తుంది’.

2022లో ప్రధానంగా కథకులను కలవర పరిచిన విషయాలు ప్రధానంగా భూమి సమస్య, నిరుద్యోగం, మానవీయ సంబంధాలు, స్త్రీల జీవితాలు, ప్రేమ, నక్సలైట్ ఉద్యమ వెలుగు నీడలు ఇలా ఈ కథా సంపుటి ఎంతో ప్రత్యేకతకు సంతరించుకుంది. వస్తు వైవిధ్యంతో పాటు శిల్ప రీతులను కూడా మన గమనింపులోకి తెస్తాయీ కథలు.

(డిసెంబర్ 24న నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండలో ‘దురుసు’ తెలంగాణ కథ 2022 ఆవిష్కరణ సందర్భంగా)
డా. సంగిశెట్టి శ్రీనివాస్,
డా. వెల్దండి శ్రీధర్
9866977741

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News