Sunday, December 22, 2024

కవిత్వానికి పర్యాయపదం ‘రాత్రిసింఫని’

- Advertisement -
- Advertisement -

నా సాహితీ వృక్షానికి తల్లివేరు మా ఊరే అంటూ తాను వచ్చిన మూలాల్ని మరువకుండా అస్తిత్వ స్పృహతో కవిత్వాన్ని రాస్తున్న కవి డాక్టర్ బాణాల శ్రీనివాస్. వీరు గతం లో వెలువరించిన కవిత్వ రచనలు పర్యాయపదం, ఆచూకీ, కుంపటి. కాదేదీ కవిత కనర్హం అన్నట్లు అద్భుత భావచిత్రణతో, విభిన్న వస్తు వైవిధ్యంతో కూడిన కవితలే ఈ సంపుటిలో ఉన్నాయి. పరసవేది సోకి ఇనుము బంగారమైనట్లుగా చక్కని అలంకారిక ప్రయోగం, భావ చిత్రణతో ఎలాంటి వస్తువైనా అందమైన కవిత్వంగా ముస్తాబవుతుంది. ఎలాంటి వస్తువునైనా చక్కని కవిత్వంగా మలిచే నైపుణ్యం శ్రీనివాస్ సొంతం. ఇందులోని కవితలన్నీ పాఠకుల్ని ఆలోచింప జేసి ఆనందానుభూతిని కలిగించే విధంగా ఉన్నాయి. మచ్చుకు కొన్ని కవితల్ని పరిశీలిద్దాం. ‘ఇతిహాసగాయం’ కవితలో ఆకాశం కొలనులో ఆడుకుంటున్న నక్షత్రాల చేపపిల్లలు అంటూ ఊహకందని సరికొత్త భావచిత్రణ చేశారు. మనిషితనాన్ని మరిచిపోయిన మనిషి ప్రకృతిని ధ్వంసం చేస్తూ తాను కూడా ధ్వంసమై గూడు దొరకని పక్షులు గిలగిలా కొట్టుకుంటున్న వైనాన్ని ఇలా కవిత్వీకరించారు. విశ్వాన్ని జయించాలనుకొని పాతాళంలో పడిపోయి/ ఆశల మబ్బులపై ఎగిరే ఆకాశ విహంగాలు/ స్వార్థం ఊబిలో కూరుకుపోతున్న అత్యంతాధునిక మానవ యంత్రాలు. అదే విధంగా ‘అరచేతిలో గ్లోబు’ కవితలో జీవితానికి పర్యాయపదం గాయం/ నిరంతరం గాయపడుతూ ఆయుధాలనన్నీ ఎదుర్కొన్నప్పుడే/ అద్భుత ఔషధా యుధమవుతావు /ఆఖరికి నీవో తెల్ల పావురమవుతావ్ అంటూ జీవితం గాయం వేరు కాదు నిరంతరం గాయపడ్డప్పుడే, ఆయుధాలను ఎదుర్కొన్నప్పుడే అద్భుత ఔషధ ఆయుధంగా తయారు కావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలియజేశారు. ‘రాత్రిసింఫని’ కవితలో యుగాల నుంచి ఆకాశ సముద్రంలో/ ఒంటరి నావికుడే సందమామ అంటూ చక్కని భావచిత్రణ గావించారు. కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది కవిత్వమంటాడు మహాకవి. అదే విధంగా నిన్ను కదిలించే కవిత్వ పాదాల్ని/ కనుపాపలకద్దుకొని నాటుకోవాలి మనో మైదానంలో అంటూ కదిలించే కవిత్వాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదన్న విషయాన్ని ‘కవిత్వశంఖం’ కవితలో ప్రస్తావించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా బారినపడి ఎంతో మంది పిట్టల్లా రాలిపోయారు. కరోనా దెబ్బకు మనిషికి అనుబంధాల విలువ తెలిసింది. మానవ సంబంధాలను గుర్తించడం జరిగింది. నీతిగా నిజాయితీగా బతకాలన్న ఆలోచన కలిగింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కవి ‘కనుమరుగైన చిరునామాలు’ కవితలో ఇలా అంటారు. అక్షరాయుధాలతో పరీక్షల యుద్ధానికి/ సన్నద్ధమవుతున్న బాల సైనికులు/ లాక్ డౌన్ పుణ్యమా అని / విడిపోయిన స్నేహబంధాల్ని నెమరువేసుకుంటూ/ కనుమరుగైన చిరునామాల్ని వెతుక్కుంటూ/ తీపి చేదు అనుభవాల్ని పంచుకుంటున్న లేతగుండెలు అంటూ కరోనా వల్ల కొంత మేలే జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించారు. లేవలేని స్థితిలో ఉన్న తన తల్లిని చూసినప్పుడు హృదయం ద్రవించి రాసిన కవిత ‘అమ్మొక సముద్రం’. ఎందరినో లాలించి పాలించిన అమ్మ ఇవాళ నిస్సహాయస్థితిలో ఉన్నదని తెలియజేస్తూ తన చేతుల కొమ్మలతో ఎందరినో ఎత్తుకున్న అమ్మ చేతులేనా? ఆకులన్నీ రాలిపోయిన చెట్టుకొమ్మల్లా ఎండిపోయినవి అంటూ అమ్మ దీనాతి దీనావస్థను ఆర్ద్రంగా తెలియజేశారు. ప్రసిద్ధకవి జూలూరి గౌరీ శంకర్ గురించి రాసిన కవిత ‘కవిత్వ కాలభైరవుడు’. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమించబడిన సందర్భంగా ఈ కవిత రాయబడింది. జూలూరి దీర్ఘ కావ్యాల కవిగా ప్రసిద్ధి. వారి బహుముఖీన ప్రతిభను కవిత్వీకరించిన విధానం అద్భుతంగా ఉంది. కవిత్వం తనను ఆవహిస్తుందో/ మరి తను కవిత్వాన్ని ఆవహిస్తాడో/ కలం పడితే చాలు/ దీర్ఘ కవితల గంగా ప్రవాహమైన/ ఇరువది మూడు దీర్ఘ కావ్యాల అతిదీర్ఘ సంతకం అంటూ జూలూరి కవిత్వ రచనా ప్రతిభను కొనియాడారు. వారిని కవిత్వ కాలభైరవుడుగా, మాటల మాంత్రికుడుగా, కవితా క్రాంతదర్శిగా, కవి కర్షకుడుగా, బిసి వాద కవిత్వ ఉద్యమ ఆద్యుడుగా, ఉద్యమ చరిత్రను రికార్డు చేసిన నవ చరిత్రకారుడుగా, సాహితీ ఉద్యమకారుడుగా, హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకుడుగా ఈ కవిత ద్వారా ఆవిష్కరించిన విధానం బాగుంది. ‘నీటినిప్పు’ కవితలో అద్భుత భావచిత్రణ కలిగిన కవితా ఖండికలు ఉన్నాయి. ఇందులోని ఖండికలన్నీ ఈ కవి అద్భుత మైన భావుకతకు, నిశిత పరిశీలనా దృక్పథానికి నిదర్శనంగా ఉన్నాయి. పొడిచే పొద్దు ఎరుపులో/ పరుగులెత్తే వాగువడి /పలిగిన పలుగురాయిలో/ మెరిసే మెరుపు వాడి/ వలస పాలకుల చెదల్ని కాల్చే/ నీటి నిప్పు తెలంగాణ అంటూ తెలంగాణ గడ్డ గొప్పతనాన్ని, సాహిత్య సాంస్కృతిక వైభవాన్ని తెలియజేస్తూ కన్ననేల సంకెళ్ళను తెంచడం కోసం కవిత్వ ఆయుధాలుగా మారి తెలంగాణకు పురుడు పోద్దాం అంటూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కవిత్వీకరించారు.
ఇల్లాలును గృహ కవచంగా అభివర్ణిస్తూ రాసిన కవితలో జీవితపు ఆటుపోట్లను కంటిరెప్పలకేలాడే /కన్నీటి సముద్రాల్ని దాటుకుంటూ ఒడ్డుకు చేరిన నావలా అంటూ అభివ్యక్తీకరించిన విధానం వీరి రచనా శక్తికి నిదర్శనం. శ్రమకు నిలువెత్తు రూపమై ఎల్లవేళలా కుటుంబాన్ని కాపాడుకునే రక్షణ వలయంలా రాత్రి ఇంటిని వెలిగించే వెన్నెల దీపం అంటూ అభివర్ణించిన విధానం బాగుంది. కొన్ని కవితా పంక్తులు సూక్తుల్లా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి. మచ్చుకు కొన్ని- కురిస్తే ఖాళీ అవుతాయి మబ్బులు/ ఎంత కురిసినా ఖాళీ కానివే కళ్ళు, ప్రవహించి ఆగేది నదీ ప్రవాహం/ ఎప్పటికీ ఆగనిదే రక్త ప్రవాహం, మనిషికి ప్రాణం గాలి/ పాటకు ప్రాణం గాలే. ఇలా చిన్న చిన్న కవితా పంక్తుల్లో అద్భుతమైన భావాన్ని దట్టించి చెప్పగల సమర్థులు. బాధలోంచి వచ్చే భావమే కవిత్వం/ వేదనలోంచి వచ్చే నాదమే కవిత్వం అంటూ కవిత్వానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. కునారిల్లిపోతున్న కులవృత్తుల గూర్చి, కులవృత్తులను నమ్ముకొని బతుకు ఈడుస్తున్న బహుజనుల జీవనదైన్యాన్ని గూర్చి ‘బహుజనం’ కవితలో ఏకరువుపెట్టారు. సమస్త వృత్తుల, సమస్త చిహ్నాల్ని ప్రస్తావించడం జరిగింది. మా కండ్లకుంపట్లో/ ఎండి బంగారం కరిగించి కరిగించి/ నాజూకైన నగల్ని చేసి/ అందానికి అందాన్ని అమర్చి/ వాడిపోయిన ఊరికి సొగసులద్దినా/ కడుపు నిండని పని చేసుకునే/ వన్నె తగ్గిన బంగారాలం అంటూ కునారిల్లుతున్న కంసాలి వృత్తిని తెలియజేశారు. అదే విధంగా మంగలి వృత్తి గురించి ఇలా అంటారు. మా వేళ్ళ కత్తులతో/ మొద్దుబారిన చేతులకు సాన పెట్టి పెట్టి/ అడ్డంగా పెరిగిన మీ గడ్డాల అడవుల్ని నరికేసే/ ఎండిన పేగుల మంగలోల్లం అంటూ మంగలి వారి గురించి కవిత్వీకరించిన విధానం గొప్పగా కనబడుతుంది.
వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లు ఒక్క జీవితాన్ని వెలిగించడానికి, బాల్యస్మృతుల్ని తిరిగి ఇవ్వడానికి, అమ్మ ప్రేమను గుర్తు చేయడానికి, చరిత్రపుటల్లో పేరు శిలాక్షరం కావడానికి సంజీవని లాంటి ఒక్క కవిత్వపాదం చాలు. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అన్న ఒక్క పద్యపాదంతో దాశరథి తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘సంజీవని లాంటి పాదం’ కవిత ద్వారా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఒక్క వాక్యం చాలు/ నీలో నిద్రాణమై ఉన్న నేను/ నిప్పురవ్వను చేసి/ నిశిరాత్రులు నిండిన నీ జీవితాన్ని వెలిగించేందుకు అంటూ వాక్యం గొప్పతనాన్ని తెలియజేసిన విధానం బాగుంది. మహమ్మారి కరోనాను అధిగమించడానికి తగు జాగ్రత్తలు తీసుకున్న విధానాన్ని ఒక యుద్ధంతో పోల్చారు. యుద్ధమంటే కత్తులు, తుపాకులు, అణుబాంబులు/ ఇప్పుడు కనిపించని కరోనాపై/ మాస్కులతో సానిటైజర్లతో/ ముసుగువీరులమై సమర సూర్యులమై/ ఐసోలేషన్ తో సాగించే నయా యుద్ధం అంటూ ఐసోలేషన్ కవిత ద్వారా తెలియజేశారు. కరోనా సమయంలో ప్రజలు తమ తమ ప్రాంతాలకు వెళ్లడానికి పడిన యాతన వర్ణనాతీతం. ఆ బాధల్ని ‘వలసజీవులు’ కవితలో తెలియజేశారు. కలల నీడల కింద కదులుతున్న సంచారులు/ కనిపించని కరోనా విషసర్పం గాట్లకు/ కంటిపాపల్లో ఇంట్లోని పాపలు కదలాడుతుంటే /కాలాన్ని కరగదీస్తూ దూరాన్ని అరగదీస్తూ/ అశ్రునదులై ప్రవహిస్తున్న వలస ప్రాణులు అంటూ వలస జీవుల వెతల్ని ఏకరువు పెట్టారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖ కవి సిద్ధార్థ అన్నట్లు బాణాల కవిత్వం స్పష్టంగా గోచరమవుతూనే అనుకోకుండా అస్పష్ట రూపచిత్రమై ఆకట్టుకుంటుంది. అద్భుత భావచిత్రణ, చక్కని శిల్పంతో కూడిన కవిత్వాన్ని రాసిన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు సర్వదా అభినందనీయులు.

డా. తండు కృష్ణకౌండిన్య
9704731346

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News