Wednesday, January 22, 2025

స్త్రీహృదయ సంఘర్షణల ప్రతిబింబం

- Advertisement -
- Advertisement -

నిర్మలారాణి తోట గారిది అరుదైన కవిత్వం. సరస్వతి దేవి కటాక్షం ఎక్కువ ఉన్నదేమో కవిత్వాన్ని చాల అర్థవంతంగా, ఆర్ద్రతగా విరివిగా రాస్తున్నారు. ఆమె కవితలలో ఎంతో సామాజిక అంశాలు, స్త్రీల మనోవేదనలు గోదారినదిలా ప్రవహిస్తుంటది. వర్తమాన కాలాన్ని , పరిస్థితుల్నిలోతైన వీక్షణతో అవగాహన చేసుకొని అభ్యుదయ దృక్పథంతో దిశా, నిర్దేశం చేయాలనుకునే కవయిత్రి నిర్మలారాణి తోట. ‘అద్దం నా చిరునామా కాదు’ అనే మూడవ కవితా సంపుటితో మన ముందుకు వచ్చారు. ఈ పుస్తకంలో మొత్తం 120 పేజీలు, 50 కవితలు ఉన్నాయి. వారి కవిత్వం మనం కూడా చదువుదాం. ‘అమ్మనై పుట్టినందుకు.. ’ అనే కవితలో (పేజీ 60 )
పాతికేళ్ళు ప్రాణంలా పెంచుకొని
పరాయింటి పిల్లకు వరదానం చేసి
నీ జీతం జీవితం నాదికాదంటే..
కన్నపేగు పాశం చంపుకోలేక
నువ్ కన్న పిల్లలకు దాసీనయ్యా !

ఈ కవిత నేటి పరిస్థితులకు అద్దంపట్టే విధంగా ఉంది. కన్నపేగుపడే వేదన అంతా ఇంత కాదు . కడుపులో బిడ్డను మోస్తున్నప్పటి నుండి బయటి ప్రపంచానికి తీసుకురావాడినికి తన ప్రాణాన్నిపణంగా పెట్టి పురుడుపోస్తుంది. బిడ్డ పెద్దవాణ్ణి చేసే క్రమంలో ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతుంది, ప్రయోజకున్ని చేసి పెండ్లి చేస్తే, భార్యమోజులోపడి కన్నతల్లిని కడకుపెడితే ఎంతటి కడుపుకోత కలుగుతుంది తల్లికి. వయస్సుడికి మంచానపడ్డాక చీత్కారానికి గురిచేస్తూ, బుక్కెడు బువ్వ పెట్టడానికి వంతులవారీగా లెక్కలు వేసుకుంటే కళ్లారా చూస్తూ ఏమిచేయలేని అచేతనంతో మిగిలిపోతున్నారు తల్లులు, నేటి సమాజంలో ఎంతో మంది కన్నతల్లుల ఆవేదనను ఈ కవితలో కళ్లకుకట్టినట్టు చెప్పారు.

‘శనివారమంగడి!’ అనే కవితలో శ్రమజీవుల పొట్టతిప్పల గురించి హరేక్ మాల్ ఏక్ జిందగీ అంటూ వారి చెమట చుక్కల జీవన పోరాటంకై అంగట్లోనే ఆశలన్నీ పెట్టుకొని వస్తే అక్కడి బేరసాలకు ఎలా బేజారు అవుతారో చెప్పే కవిత. ‘అన్యధా శరణం నాస్తి’ అనే కవితలో కామంతో కళ్ళుమూసుకుపోయి మృగాళ్ల ఆడవారి మీద అఘాయిత్యాలకు పాల్పడుతుంటే నువ్వు కొడుకువైన, తండివైనా లేక భర్తవైన ఒకటే అంటూ, నువ్వు మగాడివి అనే నిజం ఆడతనాన్నే కాదు అమ్మతనాన్ని కూడా వణికిస్తుందంటూ, పాలు పట్టడానికి, లాలపోయడానికి భయమేస్తుందిరా అంటూ స్త్రీ మానసిక వేదనను చదువుతూంటె కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.క వయిత్రి స్త్రీ అయినందున, స్త్రీలలో జరిగే సంఘర్షణను, వారు చూసే జామాజిక కొననాల్ని, కోరుకుంటున్న సమాజ మార్పుల గూర్చి చాలా చక్కగా తన కవిత్వంలో కవిత్వీకరించారు. కవితలు చాలా మందే రాస్తారు కానీ సమాజ శ్రేయస్సు కోసం రాసేవారు కొందరే ఉంటారు, అందులో మొదటి వరసలో ఉంటారు మన కవయిత్రి నిర్మలారాణి గారు.

చాలీచాలని జీతాలతో ఉద్యోగమిడిస్తున్నా ఆర్‌టిసి కార్మికులు జీతల పెంపుకోసం రోడెక్కితే, వారి ఉద్యోగాలు ‘సెల్ఫ్ డిస్మిస్’ అంటూ అవహేళన చేసిన పాలకులను ఎండగడుతూ ‘సెల్ఫ్ డిస్మిస్’ అనే కవితలో (పేజీ. 77) పాలకుడంటే కన్నతల్లికదా, గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డకు గుక్కెడు పాలియ్యలేవా అని పలికే మాటలు ఎంతో ఆలోచింపజేసేవిగా ఉన్నా యి. ఆడవారికి అందం, అలంకారణ ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ఆ అందాన్ని అద్దంలో చూసుకొంటారు, కానీ కవయిత్రి తానురాసిన పుస్తక శీర్షికకు ‘అద్దం నా చిరునామా కాదు’ అంటున్నారంటే తనకు తన గూర్చే కాకుండా సమాజం గూర్చి అని చెప్పకనే చెప్పారు. ఇలాంటి రచనలే కావాలిప్పుడు.

తెలంగాణలో ఆడవారి అతి పెద్ద పండుగ తొమ్మిదొద్దుల్లా పెద్ద బతుకమ్మ. పువ్వులాంటి బ్రతుకును పండగ చేసుకునే సంబురం, పొద్దంతా పనులకు వెళ్లి పొద్దిమికి వాకిట్ల అడుగులే కలుస్తాయి అంటూ ‘సద్దుల పండుగ’ను (పేజీ 63) చాల చక్కగా బావవ్యక్తీకరించారు. అదే విధంగా ‘ఓపెన్ సీక్రెట్’ అనే కవితలో (పేజీ 67) ఆడవారిని ఒక మాంసపు ముద్దగానే చూసే వక్రబుద్ధి ఉన్న మగవారు, కురుచబుద్ధితో ‘మైక్రోస్కోపిక్’తో చూసే చూపులకు ఆరుగజాల చీరకు చిల్లులు పడతాయి అంటూ రాసిన కవిత ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంటుంది. Poetry should begin with emotion in the poet, and end with the same emotion in the reader. The poem is simply the instrument of transference అంటాడు ఆంగ్ల కవి- Philip Larkin. కవిత్వం కవిలో ఉద్వేగంతో మొదలై, పాఠకుడిలో అదే భావంతో ముగియాలి. పద్యం కేవలం బదిలీ సాధనం.

కవయిత్రి నిర్మలారాణిగారు తాను అనుకున్న భావాన్ని పాఠకుడికి అదే భావాన్ని చేర్చడంలో సఫలీకృతురాలైందని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుత లోకపోకడల గూర్చి ‘చెలిమి చెలిమెలు’ కవితలో, ఒక్కసారి ఓడిపోయి చూడు, రూపాయి కింద నలిగిచూడు, మనవారో ఎవరో, జీవితం అంటే తెలుస్తుందని మనదగ్గర ఏమీలేని రోజు మన నుండి కనుపాప కూడా తప్పుకుంటుంది అని చెప్పుతారు కవయిత్రి. అంతేగదా జీవితం మొత్తం కరెన్సీ కాగితాలతో ముడిపెట్టుకున్నపుడు అవిలేని రోజు ఒక్కొక్కటి దూరమై జీవితం అంధకారమే కదా.

ఉత్తర తెలంగాలో ఎక్కువ ఆడవాళ్లు చేసే పని బీడీల తయారీ. వాటిని తయారు చేయడానికి పడే తిప్పలగూర్చి ‘బీడీ బీడు బతుకులు’లో ( పేజీ 98) బీడీలు సుట్టి సుట్టిపొగాకు ఆసనైతే బొండిగల కుసుందంటూ, ఆ పైసలు ఎన్కేసిందేంలేదంటూ బీడీలు చుట్టే వారి జీవన స్థితిగతుల గూర్చి చాల చక్కగా చెప్పిన కవిత. ఈ పుస్తకంలో కవితలు ఎక్కువ స్త్రీల గురించి, వారి మనోవేదన గూర్చి రాశారు. ఎవరన్నారు స్త్రీ హృదయం సున్నితమని..? కోల్పోవడం, రాజీపడడం తనకు పురిటినుంచే అలవాటుఅంటూ స్త్రీ హృదయ సంఘర్షణ గూర్చి కవయిత్రి నిర్మలారాణితోట తన కవితలలో ప్రస్ఫుటంగా చెప్పారు. ఇంకా అనేక సామాజిక అంశాల మీద కూడా చక్కని కవిత్వాన్ని రాశారు. కరీంనగర్ ప్రాంత వాడుకభాషలో ఎక్కువ రచన సాగుతుంది. కవయిత్రి నిర్మలా రాణి మరెన్నో సాహిత్య సంకలనాలు వెలువరించాలని అభిలాషిస్తూ. ఈ పుస్తకం కావాల్సిన వారు 91547 67654 నంబర్‌ను సంప్రదించగలరు. వెల 125/-.

గాజోజి శ్రీనివాస్
9948483560

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News