Wednesday, January 22, 2025

తెలంగాణ మాండలికానికి జీవం పోసిన యశోదారెడ్డి

- Advertisement -
- Advertisement -

Telangana kavitvam details

నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవనాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను వాటి వైవిధ్యాలను తెలిపే విధంగా ఆమె అనేక కథలు రాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో రగలకముందే యాస భాష పట్టింపులు లేని కాలంలో నే తెలంగాణ మాండలికాన్ని లోతుగా అధ్యయనం చేసిన కవయిత్రి పాకాల యశోదారెడ్డి.
యశోద రెడ్డి గారు 8- 8 -1929న మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో కాశిరెడ్డి సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. వ్యవసాయ ఆధార కుటుంబం. చిన్నప్పుడే తల్లిదండ్రి మరణించడంతో రుక్కునమ్మ పెంచి పెద్ద చేసింది. చదివే ప్రాణంగా భావించిన యశోదారెడ్డి పల్లెటూరు ప్రజల నోటి నుండి జాలువారే పల్లె పదాలను నానుడులను చమత్కారాలను జోడించి అద్భుతమైన కథలు రాసింది. ‘సూటిదప్ప పక్క పోటెరుగదు నా మాట’ అని పొల్లుబోని వ్యక్తిత్వంతో తెలంగాణ మాండలిక పదసంపదకు అభివృద్ధికి మరియు దాని పరిరక్షణకు అలుపెరుగని కృషి చేసిన గొప్పకథారచయిత్రి. బెజవాడ గోపాల్ రెడ్డి తిరుమల రామచంద్ర ప్రోత్సాహంతో తెలంగాణ మాండలికంలో సాహిత్యాన్ని సృష్టించి పల్లెటూరు వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించడంలో తనకు తానే సాటి. చిరు ప్రాయంలో12 ఏళ్ల వయస్సు నుండే రచనలు చేయడం ప్రారంభించి సుమారు 30 గ్రంథాలు ప్రచురించారు. పారిజాతాపహరణ పర్యాలోచనం, ఆంధ్ర సాహిత్య వికాసం, ఉత్తర హరివంశములు, భారతంలో స్త్రీ, అమరజీవులు, నేమాని భైరవకవి, నారదీయం, చిరు గజ్జలు, మా ఊరి కథలు, రచ్చబండ, ద్విపద వాంగ్మయం, ప్రబంధ వాంగ్మయం, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల రచనలతో సాహిత్య పరిమళాలను తెలంగాణలో వెదజల్లారు తెలుగులో ‘హరివంశములు’ అనే అంశంపై పరిశోధన చేసి పట్టాను పొందారు.
యశోద రెడ్డి మంచి వక్త పండితులు మెచ్చే భాషలోనూ మరియు ముచ్చట గొలిపే మాండలిక భాషలో సభికులను ఆకట్టుకునే విధంగా ప్రసంగించేవారు.ఆమె ఉపన్యాసాలను విని వాగ్దాటిని మెచ్చి ప్రముఖ చిత్రకారుడు పి.టి.రెడ్డిగారు ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఆమె ఉద్యోగ, సాహిత్య జీవితానికి ఎంతో తోడ్పాటు అందించారు పి.టి.రెడ్డి గారు. చిత్రకళా ప్రదర్శన కోసం రెడ్డి గారితో కలిసి విదేశాలు సందర్శించి ‘భారతీయ చిత్రకళ’ అనే పుస్తకాన్ని రచించారు మాండలిక భాషకు ఊపిరి పోసి పదబంధాలను నుడికారాలను భాషలో వస్తున్న మార్పులను గురించి పుస్తకాలు రచించారు. స్త్రీల పైన, భాషా సాహిత్యం పై తెలంగాణ యాసలో వందల కొద్ది వ్యాసాలు రాశారు. ఎవరికి అవగాహన లేని కాలంలోనే సాహిత్యంలో తెలంగాణ మాండలికానికి యాసకు భాషకు స్థానం కల్పించారు. అచ్చమైన తెలంగాణ బిడ్డ మూడు నుండి నాలుగు వేల పదాలు అన్ని స్వచ్ఛమైన పుట్ట తేనె లాంటి మాండలిక పదాలను సేకరించారు. తెలంగాణ భాష అంటే మమకారం తెలుగు భాష కాక ఆంగ్ల సంస్కృత భాషలలో గొప్ప పండితురాలు. హైదరాబాదులోని ఉమెన్స్ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన ఏకైక మహిళ.నవల, కథ, కవిత, వ్యాసం వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. మూసి, ఆంధ్ర ప్రదేశ్, జాగృతి, ప్రజాతంత్ర,నా తెలంగాణ, హారతి పత్రికల్లో యశోద రెడ్డి గారి పరిశోదాత్మక వ్యాసాలు ప్రచురితయ్యేవి. తెలంగాణ మాండలికంలో రాసిన కథలు వ్యాసాలు హాస్య రచనలు ఎచ్చమ్మ ముచ్చట్లు మొదలైన కథలు ‘జర వినుకోవే తల్లి’ శీర్షికలో ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి. రేడియో ప్రసంగాలు కూడా ఇచ్చేవారు దక్కన్ రేడియోలో పిల్లల నాటికలు కథలు మాండలిక భాషలోప్రసారం చేసిన మొట్టమొదటి మహిళ యశోదా రెడ్డి. ఆఘనత తనకే దక్కింది. అనేక భాషా సాహిత్య సంఘాలకు సభ్యురాలుగా ఉండి ఎన లేని సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ రచయిత్రి,ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిలీట్ గౌరవ పురస్కారాన్ని పొందారు.మూడు దశాబ్దాల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా భాషా సాహిత్యాలకు వెలకట్టలేని సేవలందించారు. స్వ చ్ఛమైన తెలంగాణ గ్రామీణ భాష ను, యాసను దేశానికి పరిచయం చేసిన తొలితరం కథారచయిత్రి యశోద రెడ్డి. 7-10-2007లో పరమపదించారు. యశోదారెడ్డి వారసులుగా తెలంగాణ యాసను భాషను రక్షించుకోవలసిన బాధ్య త ప్రతి తెలంగాణ బిడ్డపై ఉంది.

కొమ్మాల సంధ్య
9154068272

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News