తెలుగులో వచ్చిన స్వీయ చరిత్రలను పరిశీలిస్తే అవి సాహిత్యపరమైనవి, రాజకీయపరమైనవి, ఆధ్యాత్మికమైనవి, సాంఘికమైనవి, సాంస్కృతికమైనవి ఇలా రకరకాలుగా కనిపిస్తాయి. సాహిత్యపరమైనవిగా చూస్తే కందుకూరి ‘కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్ర’, చిలకమర్తి వారి ‘చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్రము’ ఇంకా శ్రీశ్రీ ‘అనంతం’ తదితరాలు అనేకం ఉన్నాయి. రాజకీయ ప్రస్థానంతో రాసిన స్వీయ చరిత్రల విషయానికి వస్తే టంగుటూరి ప్రకాశం గారి ‘నా జీవితయాత్ర (3 భాగాలు), కొండ వెంకటప్పయ్య గారి ‘కొండా వెంకటప్పయ్య పంతులు స్వీయ చరిత్ర’ మొదలైనవి వున్నాయి. ఆధ్యాత్మికమైన వాటిలో స్వామి జ్ఞానానంద, ఎక్కిరాల వంటి తత్వవేత్తలు రాసుకున్నవీ వున్నాయి.
సాంఘికమైన వాటిలో మామిడిపూడి వెంకటప్పయ్య గారి ‘మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు’, మందుముల నరసింగరావు గారి ‘50 సంవత్సరాల హైదరాబాదు’ చరిత్ర తదితర రచనలు చూడొచ్చు. సంస్కృతిక ప్రధానమైనవి తీసుకుంటే తిరుమల రామచంద్ర గారి ‘హంపీ నుంచి హరప్పా దాకా’ మొదలయినవి అత్యంత ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఇట్లా తెలుగులో గొప్ప స్వీయ చరిత్రలు అనేకం వచ్చాయి. అన్నీ వైవిధ్యంతో వున్నవే. అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న వారాల ఆనంద్ కూడా ‘యాదోంకీ బారాత్’ అంటూ తన స్వీయ చరిత్రను పాఠక లోకం ముందుంచారు. ఇది కేవలం ఆత్మకథ మాత్రమే కాదు. ఆది నుంచి అంతం వరకు ఆనంద్‌లోని ఆత్మారాముడి ఆత్మఘోష. ‘కల్పన కన్నా కూడా యదార్థమే ఒక్కొక్కప్పుడు అద్భుతంగా ఉంటుందని’ అని ఆంగ్లంలో ఒక సూక్తి ఉంది (truth is stranger than fiction) అంతేకాదు ఎంతమాత్రం చదువరులు కాని వారితో కూడా స్వీయ చరిత్ర చదివించొచ్చు.
ఎందుకంటే ఎదుటివారి జీవితాల్లోకి తొంగి చూడాలనే కుతూహలం చాలా మందిలోనూ కనిపిస్తుంది. అందుకే ఆత్మకథల్ని చదవనీయండి, చదివి నవ్వనీయండి, ఏడవనీయండి. తన బతుకు పుస్తకాన్ని తెరచిన పుస్తకంలా మార్చి తన బలాల్ని, బలహీనతల్ని తన బలగం ముందు ఉంచారు ఆనంద్. మనల్ని మనమైతే మాత్రం బయటేసుకునే ధైర్యం మనలో ఎంత మందికి ఉంటుంది. ధైర్యం ఉంటే మాత్రం తరిగిపోయిన కాలంలోని కరిగిపోయిన బాధలను తిరిగి అక్కున చేర్చుకుని అక్షరీకరించే శక్తి ఎంతమందికుంటుంది. ‘గొప్పలే కాదమ్మా తప్పులూ రాయాలి’ అని రాసుకున్న ఆనంద్ వాక్యాలు ఎందరో రచయితలకు కనువిప్పు. ఒక వ్యక్తి జీవితనుభవాల సమాహారమే స్వీయచరిత్ర. ఇది చదివితే మనసున్న వారికెవరికైనా సాటి మనిషి కష్టసుఖాల పట్ల సానుభూతి, అవగాహన కలుగుతాయి. అప్పట్లో స్థానిక చరిత్రలు, భూమి కొలతల వివరాలు, ఆస్తిపన్నుల లెక్కలు గ్రామ జనాభా, సరిహద్దులు గ్రామనామాలు, ఉపద్రవాలు, కరువు కాటకాలు, కులమతాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు పబ్బాలు, తగాదాలు, విశ్వాసాలు వంటి వాటిని ప్రతిబింబించే విధంగా ‘కైఫియత్’ లుండేవి.
ఈ ‘కైఫియత్ల’ కు ‘కవిలెలు’ అని మరొక పేరుండేది. ఆంగ్లంలో వీటిని విలేజ్ రికార్డ్ అనేవారు. ఆనంద్ స్వీయచరిత్ర చదివితే అందులో ఉన్న ఎన్నో అంశాలకు సంబంధించిన వివరాలు ఉన్న కైఫియత్‌లను మనం తెలుసుకోవచ్చు. సిల్వర్ ఫీలిగ్రి, మిఠాయి పరిశ్రమ, జాతరలు, సినిమా, కాగితపు బతుకమ్మలు, అప్పటి విద్యా విధానం, విద్యార్థుల ప్రవర్తన, బొమ్మల కొలువు… ఇలా ఎన్నెన్నో తన జ్ఞాపకాల కొలుపు లో భాగమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిల్వర్ ఫిలీగ్రీ పరిశ్రమ దానికోసం ఉన్న ఒక సొసైటీ, వారి పనితనం గొప్పతనం ఇవ్వన్నీ కళ్ళకు కట్టినట్టు వివరించారు.
మేదరి ఇళ్ళలో బతుకమ్మ ఆకారపు బద్దలతో చేసిన దానికి తెల్ల కాగితం అద్ది దానిపై రంగు రంగు పేపర్ కాగితాలతో పూలు పూలుగా అద్ది అందమైన బతుకమ్మలను చేసి విక్రయించేవారు. వీటిని అత్తింటివారు కొత్త కోడలుకు పెళ్లయిన మొదటి సంవత్సరం బతుకమ్మను పిండివంటలతో పాటుగా తీసుకెళ్ళి చీరె సారే గజ్జెల కోలలు బతుకమ్మతో పాటుగా వాయినంగా ఇచ్చేవాళ్ళు. ఆ బతుకమ్మను భద్రంగా ఐదేళ్లు ఆడుకుని ఐదవ సంవత్సరంలో నిమజ్జనం చేసేవారు. అప్పటికి ఆ కొత్త కోడలు పిల్ల పాపలతో పెద్ద ముత్తైదువ అయ్యేది. ఆ బతుకమ్మ నిండు నూరేళ్ళు చల్లగా బతుకుమని దీవించేది. ఇంత చక్కటి ఆచారాన్ని ఆనంద్ తన రచనలో ఆడబిడ్డల యవ్వనపు జ్ఞాపకాల దొంతరలు ఒక్కసారిగా దొర్లించారు. జాతరలు మనిషి జీవనం లో ఎలా మమేకమైపోయాయి అనే అంశాన్ని తన జాతర అనుభవాలతో పాఠకులకు జాతర చేశారు. సౌకర్యాలు ఎక్కువై సంతోషాలు తక్కువై మారిన జీవనవిధానం చూసి వచ్చిన మార్పును మనం పోల్చుకోవచ్చు.
దీనితో ఇప్పుడు కనిపిస్తున్న సంతోషాలు కూడా పెద్ద మొత్తంలో నటనలే, కొద్ది మొత్తంలోనే మనసు పొరల్లోంచి వచ్చేవి అని తెలుస్తుంది. అట్లని బుగ్గలు ఊది బూగలు పట్టి పరవశించాల్సిన ఆనంద్ బాల్యం అంత అందమైనదేమి కాదని తన బాల్యంలోనే కొన్ని సంఘటనలు తనలో తెలియని ఆత్మసంఘర్షణలను కలిగించాయని, ఉమ్మడి నివాసంలా ఉన్నా, ఆ ఇంట్లో నేనేమీ గొప్ప బాల్యం అనుభవించలేదని ఆ రోజుల్లో వాళ్ళు నన్ను మౌన సంద్రంలోకి తోసేశారు అన్నారు…. మాటను మింగలేక /బయటకు పలకలేక/ ఆనాడే మౌనం నా దేహాన్ని కప్పేసింది అంటూ తన వేదనకు సిరా రంగు పోశారు. స్వీయ చరిత్ర అంటేనే మానవ చరిత్ర దాన్ని సమాజ చరిత్రగా కూడా మనం చూడడంలో తప్పులేదు.
ఆత్మకథ అంటే మనిషి తన ప్రవృత్తిని సింహావలోకనం చేసుకోవడమే. ఆత్మకథ ఆ మనిషి (కవి) వేసిన ప్రతి అడుగు అది భయంగానైనా, ధైర్యంగానైనా, ఒక సన్నివేశాన్ని చెప్తుంది. ఓ ఆంగ్ల కవి, ‘కాలసంద్రపు సైకత తీరాల మహాపురుషుల అడుగుజాడలు మానవాళికి మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తాయి’ అన్నాడు. మరి ఆనంద్ వేసి తాను రాసిన అడుగులు, అనుభవాలు పాఠకులకు నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. విమర్శో, సమీక్షో ఏదో ఒకటి రాయాలని అనుకుని మరోసారి ‘యాదోంకీ బారాత్’ అంటూ జ్ఞాపకాల ఊరేగింపులో నేను ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో అధ్యాయం చదువుతుంటే సమీక్ష రాయాలన్న విషయం మరచి ఆపేక్షగా చదువు ఉండిపోయా. రాయటం మాటేమో గానీ చదవడమైతే పూర్తయింది. కరీంనగర్ ప్రాంత ప్రభావమా లేక హిందీ పాటల భావమా తెలీదు కానీ తన కథకైతే ‘యాదోంకీ బారాత్’ అంటూ హిందీ పేరు పెట్టుకున్నారు ఆనంద్. ఇక్కడ మాతృభాష చిన్నబుచ్చుకోకూడదు అనుకున్నారేమో, ‘జ్ఞాపకాల ఊరేగింపు’ అన్నారు వెనువెంటనే.. గడచిన రోజులెప్పటికీ మంచివే అనే మన పెద్దల మాట ముమ్మాటికీ నిజమే కదా! ఆనంద్ రాసిన అధ్యాయాలన్నీ చదువుతుంటే ఫిల్మ్ భవన్ అంటూ, సినిమాలంటూ, సినిమా విమర్శలంటూ ఓ యాత్రికుడిలా తిరిగేసి, ఈలేసుకుంటూ జీవితాన్ని ఏలేసినట్టుంది.
ఎన్నో రచనలు చేసి ఎన్నో పుస్తకాలు అచ్చేసుకున్న ఆనంద్‌కు, ఎన్నో భాషల కవిత్వాన్ని అనువదించిన ఆనంద్‌కు, తన ఆత్మకథ రాసుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ అలా అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఒక కవిగా ఆనంద్ కల్పనకు, ఊహకు, భావనలకు అడ్డు అదుపు లేవు ఎంతైనా ఏమైనా రాసుకోగలడు. కానీ ఒక సామాన్య మనిషిలా రాసుకునే తన ఆత్మకథలో పంచభూతాలే కాదు ఇరుగు పొరుగు వారు ఉన్నారు. అనుభవాల్లో ఉండేవి మరయంత్రాలు కాదు మనుషులేగా… నిజంగా జరిగితే మాత్రం నీకు నచ్చినట్టు వ్రాయడానికి ఇదేం నీ జాగీరు కాదు అనే రక్త సంబంధీకులు ఉంటారు. నే చేసిందంతా మర్చిపోయావా? ఈ రోజు నా గురించి అలా రాసేంత పెద్దోడివయ్యావా? అనే స్నేహితులుంటారు. పరిచయస్తులుంటారు.
ఈ అవధులన్నీ అధిగమించి, జ్ఞాపకాల ఊరేగింపు చేయాలంటే మనసుని ఎంత మరిగించాలో! ఆనంద్ మనసు అధ్యాయాల వారీగా ఎన్ని ఉలి దెబ్బలు తిన్నదో! ఈ పుస్తకం చదివితేనే అర్థం అవుతుంది. జీవిత గాథ ఆనంద్ దే అయినా ‘యాదోంకీ బారాత్’ చదివిన వారి సమకాలికులు మలి వయసులో ఎందరో వాళ్ళ బాల్యంలోకి తొంగిచూసుకునే ఉంటారు. ఊహిస్తూ జీవితాన్ని, కవిత్వాన్ని రాసుకోవడం తెలికే కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయడం చాలా బరువు. ఆ బరువును రాయడం, రాస్తూ అక్షరాల వెనక బాధను దాయడం, ఆ బాధను దాచి గాథగా అచ్చువేయడం ఎంత మందికి సాధ్యం. తను దాటిన విపత్తులను కూడా తన విద్వత్తుతో హృద్యంగా మలిచిన ఆనంద్‌కు హృదయపూర్వక అభినందనలు. అహర్నిశలు చేసిన కృషికి అనతికాలంలోనే రూపుదిద్దిన ఆనంద్ ఆత్మకథ ‘యాదోంకీ బారాత్’ కు ఇదే పాఠకలోక ఆత్మీయ అభివాదం.
కల్వకుంట్ల శ్రీలతరావు
9491480386