Saturday, December 28, 2024

వచనకవిత్వానికి కావ్యగౌరవం కల్పించిన కవిసేన

- Advertisement -
- Advertisement -

మనిషితత్త్వాన్ని కవిత్వతత్త్వంగా మలిచిన మహాకవి మాత్రమే కాదు. దేశ చరిత్ర అంటే ఆ దేశపౌరుడి ఆత్మకథే అని నిరూపించి దార్శనికుడు. అలా అని దార్శనికుడిగా అంతటితో ఆగిపోలేదు. ఆగిపోతే ఆయన సాహితీ మూర్తిమత్వానికి సుసంపన్నత్వం చేకూరేది కాదు. ఆధునిక కవికులగురువుగా ఆయన బాధ్యత సంపూర్ణంగా నెరవేరినట్లు అయ్యేదీ కాదు. ఈ రెంటినీ ఒనగూర్చి శేషేంద్రను ప్రపంచకవిగా విశ్వసాహితీవేత్తగా నిలబెట్టిన రచన కవిసేనమేనిఫెస్టో. కవిసేనమేనిఫెస్టో ఆధునిక విమర్శకు దిశానిర్దేశనం చేసిన లాండ్ మార్క్ లాంటి రచన. వైజ్ఞానిక ఉద్యమానికి సిద్ధాంతగ్రంథం, సునిశిత కవిత్వ విమర్శకు గీటురాయి. ఆయనే దాన్ని ’ఆధునిక కావ్యశాస్త్రమ్’ అన్నారు. ఈ మానిఫెస్టో 30 పేజీల్లో రాద్దామని మొదలుపెడితే 350 పేజీల ఆధునిక కావ్యశాస్త్రమైంది. సంప్రదాయనేత్రాలలో ఆధునికతను చూడగల దృష్టగా మనముందు గుంటూరు శేషేంద్ర శర్మను నిలబెట్టిన రచన ఇది.
తనువగు శబ్దార్థంబులు/ధ్వని జీవ మలంక్రియావితానము సొమ్ముల్/ తనరు గుణంబులు గుణములు/ ఘనవృత్తులు వృత్తులౌర కావ్యేందిరకున్ అన్నాడు భట్టుమూర్తి. కవిత్వం రాయాలంటే ఈ కవితా సామగ్రియావత్తూ ఉండవలసిందే. బాహ్యంగా చూస్తే కవిత్వం అత్యంత శక్తిమంతమైన శబ్ద యోజన. అలంకారం, బింబం, ప్రతీకలు, మెటఫర్ మొదలైనవి కావ్యసామగ్రి. అందువల్లనే కవిత్వానికి ఆకర్షణ. ఆ శక్తి అయస్కాంతానికి కూడా ఉండదు. ఈ శక్తే జాంతవదశలో ఉన్న మనిషిని సభ్యమానవుడిగా, సంస్కారవంతుడిగా మార్చింది. యుగయుగాలుగా మానవ సమాజంలో సంస్కృతినీ, నాగరికతనూ సృష్టించింది కవులే. ఈ కవులే లేకపోతే మానవ సమాజానికీ అరణ్యానికీ తేడా ఉండేది కాదు. కాబట్టి కవిది సమాజంలో సర్వోన్నతస్థానం అని నిరూపించే రచన కవిసేనమేనిఫెస్టో. ఇందులో శబ్దశక్తిని తూచగల ఆలంకారికుడుగా దర్శనమిచ్చిన శేషేంద్ర మనస్సు ఒక కవితా ప్రయోగశాల. అప్పటివరకూ ఆధునిక కవిత్వానికి ఇతమిత్థంగా చెప్పలేని అస్పష్టభావనలకు ఒక రూపం వచ్చింది ఈ రచనలోనే. అనుభవాన్ని వడపోసి, పద్యాలను చిత్రిక పట్టి పదభావచిత్రాదులతో కొంగొత్త కవిత్వవ్యక్తిత్వాన్ని సారభూతంగా అందించింది కవిసేనమేనిఫెస్టో.
ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ ఒరవడి కొనసాగుతోందంటారు గానీ నిజానికి శేషేంద్ర భాషను సరళం చేసి, అభివ్యక్తికి పదునుపెట్టి, తాత్వికతను అద్ది, వచనాన్ని కవిత్వంగా తీర్చి దిద్దాడు. ప్రాచీనులు చెప్పిన చమత్కారాన్ని వీథుల్లో, బస్స్టాండులలో, కాఫీ హోటళ్లలో, రైల్వే స్టేషన్లలో మాట్లాడే భాష శ్రోతకు అందించాడు. శ్రీశ్రీని యుగకవి అంటారు. శ్రీశ్రీకి పూర్వం ప్రేమ, వగైరాలు కావ్య వస్తువులు. శ్రీశ్రీ విప్లవాన్ని కావ్యవస్తువుగా ప్రవేశపెట్టాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తెలుగు కవిత్వంలో విప్లవ కవిత్వమే ప్రధానంగా వస్తోంది. శ్రీశ్రీ కవిత్వంలో కొంత ప్రబంధధోరణి ఉంది. భావంలో అభ్యుదయం ఉన్నా భాషలో నాటి పరిమళాలు పోలేదు. కానీ శేషేంద్ర కొత్త ఆలోచనకు కొత్తబట్టలే కట్టించాడు. వచనకవిత్వానికే పట్టం కట్టించాడు. ఆ అనుభవసారమే కవిసేన. కావ్యశాస్త్రవేత్త అయిన శేషేంద్ర చేసిన ప్రయోగాల ఫలమూ ఆధునిక వచనకవిత్వానికి ఆయన చేసిన లక్షణమూ కవిసేనమేనిఫెస్టో. శేషేంద్ర ఒక డైనమెట్ శక్తిని తీసుకొని కవిత్వం అనే వెన్ను ముకలోనికి కొత్త అభివ్యక్తిగా ఎక్కించాడు. దాని ఫలితమే కవిసేన మేనిఫెస్టో. శేషేంద్రకి పాశ్యాత్యసాహిత్యం భారతీయ అంలంకారశాస్త్రం శరీరం ఆత్మ అని ఈ రచన చూస్తే తెలుస్తుంది. పాశ్చాత్య అలంకార సిద్ధాంతాలనూ, భారతీయ అలంకార సిద్ధాంతాలనూ శేషేంద్ర ఇందులో సమన్వయించి చూపారు. తెలుగులో అభ్యుదయసాహిత్యం రాకపోతే ఇటువంటి విమర్శగ్రంథం. వచ్చి ఉండేదికాదు. పాశ్చాత్యుల ప్రతీకవాద ప్రభావం ప్రబలంగా శేషేంద్రపై ఉన్నట్లు ఈ గ్రంథం నిరూపిస్తుంది. అనుభూతి వాదానికి ఇది శాస్త్రీయపునాదిని ఏర్పరచింది. కవిసేన వచ్చిన తర్వాత ఒక మంచి మార్పు వచ్చింది. పూర్వం తెలుగుకవిత్వం వచన కవిత్వమనే పేరుతో వచన మైనస్ కవిత్వం. ఈ ఉద్యమం ప్రారంభమయ్యాక ప్రధాన కవిత్వ లక్షణమైన ఆలంకారికత లేక కావ్యాత్మకత కలిగిన కవిత్వాన్ని యువతరం రాయడం ప్రారంభించింది. కవిసమ్మేళనాలకు శ్రోతలు అసంఖ్యాకంగా వచ్చేవాళ్లు. ఇది ఒక చారిత్రక సత్యం.ఆ ఒరవడి నేటిదాకా కొనసాగింది. ఇప్పుడు వస్తున్నదంతా అదే రకమైన కవిత్వం. కవి అన్నవాడు అదే యాంగిల్‌లో రాయక, ఇంకెట్లా రాస్తాడు? దీని వల్లనే కవిసేన ఆధునిక తెలుగు వచనకవిత్వానికి కావ్యగౌరవం కల్పించడమే కాదు ఇతర భారతీభాషల్లోని కవిత్వం కన్నా తెలుగు కవిత్వం అత్యుత్తమంగా ఉండేలా తీర్చిదిద్దింది.

డా. అద్దంకి శ్రీనివాస్
9848881838

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News