ప్రముఖ కళింగాంధ్ర కవి గంటేడ గౌరునాయుడు గారు రైతు సంఘీభావ కవిత్వం పేరిట రోజుకు ఒక కవిత చొప్పున రాస్తూ, పుస్తకంగా ఆవిష్కరించారు. అదే నిరసన కాలంలో రైతు సాధకబాధకాలను పద్యంలో నిక్షిప్తం చేస్తూ మరో కవనాన్ని విభిన్నంగా కొనసాగించడం అద్వితీయం. ’సేద్యగాడు’ పేరిట 103 సీస పద్యాలతో ఒక అద్భుతమైన రైతు కావ్యాన్ని గౌ.నా తీర్చిదిద్దడం అమోఘం. స్వతహాగా రైతుబిడ్డగా పుట్టిన కవి కాబట్టి, ఆద్యంతమూ శ్రమజీవుల జీవనాన్ని ప్రతిబింబింపజేస్తూ కావ్యగానం చేయడం అతనికి పరిపాటు. అతని ఉద్యమ నేపథ్యం అలాంటిది మ రి. శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాట ప్రభా వం ఈ ప్రాంత ప్రతీ కవి, రచయిత మరియు కళాకారులపై పడుతుందని సాధారణీకరించడలో కొత్తేమీ లేదు. ప్రత్యేకించి చెబితే ఉత్తరాంధ్ర ప్రజలకు వలసలు అనివార్యం. ఎన్నో సహజ వనరులు ఉన్నప్పటికీ వాటి వినియోగిత లోపంగా ఈ నేలతల్లి నిత్యమూ విలపిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ ప్రాంత రైతులు మరియు వివిధ కులవృత్తుల వారి జీవనంలో ఈతిబాధలు సహజాతి సహజం. ముంబాయి, చెన్నై, హైదరాబాద్ మరి యు కోస్తాంధ్ర పట్టణాల అంతటా ఏ శివారు ప్రాంతాలను చూసినా ఉత్తరాంధ్ర ప్రజల నివాసాలే కనబడతాయి. బిక్కు బిక్కుమంటూ, భయం భయంతో తమ వలస జీవనాలను అమాయకంగా, ఆదుర్దాగా గడపడం షరామామూలే. ఈ సేద్యగాడు పద్యకావ్యంలో ఆయా వలస జీవుల కష్టనష్టాలను హృద్యంగా ప్రస్తావిస్తాడు కవి. కరో నా కాలంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఎ టుపోవాలో, ఎలాపోవాలో తెలియని స్థితిలో దేశ ప్రజలు తమ ఇళ్లకు తిరుగుముఖంగా నడక బాట పట్టడం దయనీయం. బీహార్, ఒరిస్సా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర జనం తమ స్వస్థలాలకు చేరుకునే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ గౌ.నా మాస్టా రు తమ సేద్యగాడులో స్పృశిస్తూ విలపిస్తారు.
గౌ.నా బహుముఖ ప్రజ్ఞాశాలి. వచన కవిత, కథ, గేయం, పద్యం రాయడంలో ప్రసిద్ధినొందారు. గాయకుడిగా, చిత్రకారుడిగా కూడా తనదైన శైలిలో సాహితీ సాంస్కృతిక లోకంలో ముద్ర వేసుకున్నారు. ’పాడుదమా స్వేచ్ఛా గీతం’ పాట ద్వారా యావత్తు ప్రపంచానికి పరిచయమయ్యారు. అతని కలము నుండి సేద్యగాడు మొత్తంగా సీస పద్యాలతో నిర్మితమైంది. రైతు వేదనలు-సంవేదనలు; కర్షకుని కష్టాలు-నష్టాలు; సైరికుని సమస్యలు-పరిష్కారాలు మొత్తంగా చూస్తే కష్టజీవుల జీవితాన్ని యథాతథంగా చూపారు. కావ్యవస్తువైతే ఆద్యంతమూ కరుణ రసాత్మకంగా కొనసాగుతుంది. మాస్టారి స్వగ్రామం ’దళాయిపేట’ కొండ దిగువన ఉన్న నాగావళి నది తీరాన ఉంటుంది. ఇంటిల్లపాదికీ తిండిని పెట్టే మడిసెక్క బందమడి. ఆ మడిలో దుక్కిదున్నడం, దమ్ము చేయడం, సేను కోయడం, వోవులేయడం, అవసరమైతే కావడితో నీళ్లు మోస్తూ ఆకు బట్టలు తడపడం మొదలైన ప్రక్రియలతో అలవిమానిన అనుబంధం ఆ మడితో గౌ.నాకు ఉంది. తోటపల్లి కొత్త బ్యారేజీ కట్టడంతో ఏరు పొంగి ప్రవహించి బందమడిలోకి ఇసుక మేట వేసేది. ఆ నేలపై నిలబడి జాషువాగారి ’ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కలసిపోయె’ అనే పద్యంతో గతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం జరిగేది. ఈ నేపథ్యంలోనే మాస్టారి నోట వెంబడి ’ఇచ్చోటనే నేను ఎడ్లు ఏరును పూసి దుక్కులు సెమడోడ్సి దున్నినాను’ అనే సీస పద్యపాదం అప్రయత్నంగా దొర్లింది. ఇదేదో బాగుందని భావించి, తన మస్తిష్కంలో పొడచూపిన భావాలను రంగరిస్తూ పద్య కావ్యానికి శ్రీకారం చుట్టారు. మాస్టారికి పద్యాలు అంటే ఎంతో ఇష్టం. చిన్నతనము నుండే రంగస్థల నాటకాలను ఆసక్తిగా తిలకిస్తూ, పద్య ప్రవాహ ఒడిలో సేదతీరుతూ పరవశించిపోయేవారు. పద్య నాటకాలకు ఉత్తరాంధ్ర పేరెన్నికగన్నది. ఈ నేలతల్లి అనేకమంది లబ్ధప్రతిష్టులైన రంగస్థల కళాకారులకు జన్మనిచ్చింది. అందుకే ఆయనలో పద్య ప్రక్రియ నిర్మాణంపై మరింత తృష్ణ కలిగింది. ప్రత్యేకించి కళింగాంధ్ర మాండలికంలో పద్య కావ్యాన్ని అల్లడంలో మాస్టారు ఎంతో శ్రద్ధ కనబరిచారు. ఈ కావ్యములో అత్యుత్తమమైన పద్య సాహిత్య సృజన చేశారు కూడా. ఉపజాతుల పద్యాలలో సీస పద్య నిర్మాణం బహుకష్టం. సీసపద్య నిర్మాణానికి పెట్టింది పేరు శ్రీనాథుడు. ఆయన గ్రాంథిక భాషలో పద్యాన్ని రసవత్తరంగా నిర్మిస్తే, గౌ.నా సిక్కోలు మాండలిక భాషలో అంతే రసరమ్యంగా సీస పద్య నిర్మాణం చేపట్టడం విశేషం. ఈ కావ్యంలో సీస పద్య నిర్మాణంలో తేటగీతి పద్యం వాడుకున్నారు. తేటగీతికి పద్య పాదములు నాలుగు కంటే ఎక్కువగా రాసుకునే సౌలభ్యం ఉండబట్టే, మాస్టారు తేటగీతికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు. పద్యంలో విస్తృతమైన భావనలను నిక్షిప్తం చేయడం కవికి కష్టమైన పని. అదే పద్యాన్ని విమర్శకులు అనేక దృక్కోణాల్లో వీక్షిస్తూ, వేనవేలు అభిప్రాయాలను వ్యక్తపరచగలరు. కానీ సేద్యగాడు లోగల పద్యాలకు విస్తృతమైన భావ పరిధి ఉంది. విమర్శకులే కాదు అతి సామాన్య పాఠకుడు కూడా అబ్బురపడి, అంతే ఉదాత్తంగా సాంత్వన పొందగలరు.
ఈ ’సేద్యగాడు’లో ఆణిముత్యాల్లాంటి ఐదారు పద్యాలను సమీక్ష చేద్దాం.
రైతన్నను అన్నదాతగా జనం కొనియాడడం సహజం. అంటే దీనిని ’పేరు గొప్ప ఊరు దిబ్బగా’ అభివర్ణించవచ్చు. క్షేత్రస్థాయిలో చూస్తే రైతు పంటలు పండించడమే పరమావధిగా భావిస్తాడు. కానీ పంట అందిన తర్వాత తను పెట్టిన పెట్టుబడి, తన కుటుంబం పడిన శ్రమను లెక్కవేసి చూస్తే అంతా శూన్యం. గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులు పాలుకావడం సర్వసాధారణం. అందుకే కవి ఈ పద్యంలో ’సేద్యగాడని జనం చెప్పుకొనుటె కంటె-అతనికన్నను కూలియన్న నెరవు/ అతని శ్రమతోనె బతికేను అంతమంది-అయిననాతని కుండదు అసలు విలువ‘ కష్టజీవులు అనివార్యంగా వలస బాట పట్టడానికి కారణం అనుభవపూర్వకంగా ’రైతు కన్నా కూలీయే మిన్న’ అనే భావన కలగడం.
మరో పద్యంలో ఇదే భావనను మరోలా కవి వ్యక్తం చేస్తాడు. ‘బురదబుక్కి తిరిగి బురదకక్కుటె గాని-పట్టెడన్నమునిచ్చు పంటరాదు/ నేలబుగ్గిని తోడి నెత్తికెత్తుటె గాని- గింజుకున్నా ఒక్క గింజరాదు/అలిసి వొళ్ళు పులిసి అప్పు మిగులు గాని- కాలమేనాడును కలసి రాదు/ముప్పూటలా గుండె ముక్కలౌనే గాని-మన పాలకుల సాయమసలు రాదు‘ బహిరంగ సభల్లో పాలకవర్గాలు రైతులను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం షరామామూలే. కానీ వారి మేలుకోరి ఒక్క పైసా కూడా విదల్చకపోవడం దారుణం కాదా!
సిక్కోలు సీమ ప్రజలు తమ గతకాలపు వైభవాలను తలచి జీవించడాన్ని కవి పద్యాల్లో హృద్యంగా అల్లుతాడు. ‘విశ్రాంతిగా అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే రాత్రులను, జామురాతిరి వేళ దాకా వీధుల్లో వినే బోనులోడి పాటను, తెల్లారిజాము వరకు పద్య నాటకాలు తిలకించే సందర్భాలను, అమ్మలక్కలు కలిసి గైరమ్మ పాటలు పాడడాన్ని కవి ఎంతో భావగర్భితంగా స్పర్శిస్తారు. ‘లేవు నేడవి, పల్లెలే లేవు నేడు-పల్లె కతలన్ని కలలన్ని పారిపోయి/వచ్చిపడ్డాయి ఇళ్లకు వరదలాగ-జీడిపాకాల టీవీల సీరియళ్లు‘ అంటూ జానపదులు ప్రపంచీకరణ మాయలో పడి తమ మూలాలను, ఆనవాళ్లను చెరిపేసుకోవడాన్ని కవి మనముందు ఉంచుతూ దుఃఖితమతుడవుతాడు. టీవీ సీరియల్స్ ను జీడిపాకంతో పోల్చడం కవి సాహితీ చతురతకు నిదర్శనం.
అందరికీ అన్నం పెట్టే అన్నదాతే నేడు అంగడి కెళ్లి అన్ని సరుకులు కొనుక్కోవడం పట్ల ఆందోళన చెందుతాడు కవనయోధుడు. ‘అన్నియేళల తిండికి అందుబాటు-కూరనారలు పండీవి గుడ్డిమీద/ఉప్పు కిరసనూనీ సబ్బు ఊసుతప్ప-కొన్నదే లేదు కోమటి కొట్టుమీద/కాలమే మారి మా రైతు కతలు మారి-లేదు కొననిది ఒకటైన లేదు యిపుడు‘ కాలానుగుణంగా పండిన కూరగాయలనే రైతు కుటుంబ సభ్యులు వండుకు తినేవారు. మిగతా పండించిన ధాన్యాన్ని, అపరాలను దాచుకుని తినడం రైతుకు రివాజు. కానీ నేడది తిరగబడింది. బిక్కుబిక్కుమంటూ క్యూలైన్లలో నిలబడి ప్రభుత్వం అందించే ఉచిత నిత్యావసర సరుకుల కోసం ఎగబడటం చూస్తే, రైతు పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో! అర్థం చేసుకోవచ్చు. పాడి పంటలను ప్రజలందరికీ చౌకగా మరియు ఉచితంగా అందిస్తూ, రైతేరాజు అనే నానుడిని ప్రతిష్టింపజేసిన ఈ లోకంలో రైతు పరిస్థితి నేడు దయనీయంగా మారడాన్ని సాహితీ సేద్యగాడు జాలిగా స్పృశిస్తాడు.
పిల్లా తిరుపతిరావు
7095184846