Thursday, January 23, 2025

మువ్వా కవిత విశ్వం

- Advertisement -
- Advertisement -

Final improvement to writing becomes Poet's' skill

కొండ అద్దమందు అన్నట్టు తన కవిత్వంలో విస్తృత ప్రపంచాన్ని ఒడిసిపట్టుకున్నారు మువ్వా శ్రీనివాసరావు. ఆయన కవిత్వం విశ్వానికి స్థానిక పరిభాషను అద్ది ఆహ్లాదపరుస్తుంది. క్లిష్టమైన అంశాన్ని కూడా అరటిపండు తొక్క ఒలిచినట్టు చూపిస్తారు శ్రీనివాస రావు. అనుభూతి సౌకుమార్యం, ఆహ్లాదపరిచే భాష, అప్రయత్నంగా కురిసే పదసంపద, వివిధ వస్తువుల మానవీకరణ, శీర్షికా నైపుణ్యం మనసును ఎక్కడికో తీసుకెళ్తాయి. ఖమ్మం జిల్లా లంకపల్లిలో 1960 లో జన్మించిన మువ్వా శ్రీనివాసరావు అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ లో ఎమ్మెస్సీ టెక్ చదివారు. ‘సమాంతర ఛాయలు’, ‘సికస్త్ ఎలిమెంట్’, ‘వాక్యాంతం’, ‘వైరాయణం’ అనే కవితాసంకలనాలను వెలువరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా పురస్కారాన్ని పొందారు. గిడుగు రామూర్తి పురస్కారం, స్త్మ్రల్ పురస్కారం, సాహితీ మాణిక్యం అవార్డు, సోమసుందర్ అవార్డు మొదలైన అవార్డులను వివిధ సంస్థలు అందజేసి సత్కరించాయి. మువ్వా శ్రీనివాస రావు కవిత్వం నిండా ఎన్నో అంశాలు. ఎన్నో కొత్త ముచ్చట్లు. ఒక చోట చికాగో, లాస్ వేగాస్ దర్శనమిస్తాయి. మరో చోట ఘనీభవించిన సైబీరియాలోని బైకాల్ సరస్సు ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా నిలుస్తుంది. ఎక్కడి నుండో పెంగ్విన్ పక్షులు ఎగురుకుంటూ వస్తాయి. ధ్రువప్రాంత ఎలుగుబంటి పరుగెత్తుకుంటూ వస్తుంది. రాత్రి జీవితానికి, పందాలకు సుప్రసిద్ధమైన నగరం లాస్ వెగాస్. అమెరికాలో ఉన్న ఈ నగరం వినోదాలకు, గ్యాంబ్లింగ్ కు పేరొందింది. ఈ నగరంపై శ్రీనివాసరావు రాసిన కవిత ‘లావేగాస్’. ఈ కవితలోని కింది పంక్తులను గమనిస్తే ప్రపంచ స్థాయి విశేషాలను స్థానిక పరిభాషలో చెప్పడంలో శ్రీనివాసరావు సమర్థత తెలుస్తుంది. వాళ్ళక్కడ వెలుగుల వడియాలు పెట్టుకున్నారు/ వందలకొద్దీ సూర్యుళ్ళనీ/ వేలాది చంద్రుళ్ళనీ/ ఒకే గ్రైండర్లో నూరి/ వెలుగు వలయాల వడియాలు పెట్టుకున్నారు/ జీవితం అమెరికాది. ప్రత్యేకించి లాస్ వెగాస్ నగరానిది. రాత్రి జీవితానికి చెప్పిన పోలిక వడియాలు పెట్టుకోవడం. ఈ పోలిక తెలుగు జీవితానిది. ప్రపంచ విషయాలకు స్థానిక పరిమళాలను జోడించి చెప్పే శ్రీనివాసరావు కవిత్వానికి ఇది ఒక ఉదాహరణ. మువ్వా శ్రీనివాసరావు కవిత్వం కొత్త విషయాలను వెల్లడిస్తుందనేందుకు ‘Hire or Fire అను ఒక ఆర్థిక సరస్సు’ అనే కవితలోని కింది పంక్తులు ఉదాహరణ. అర్హత పత్రాలు అడ్డంగా పట్టుకుని/ అడుక్కోకుండానే అడుగడుగునా/ అడుక్కొంటూ ఉంటారు/ బెర్ముడా ట్రయాంగిల్ లోకి/ విసిరేసినా వెనక్కి తిరిగొచ్చే/ బూమరాంగ్ అనుకొంటారంతా/ ఆ డేగ కళ్ల ఆర్థిక వ్యవస్థని/ దానికీ అప్పుల తిప్పలు కోకొల్లలు/ అది కూడా కొందరికి/ సైబీరియాలోని బైకాల్ సరస్సే / ఈ పంక్తుల్లో పేర్కొన్న బెర్ముడా ట్రయాంగిల్, బైకాల్ సరస్సు పాఠకులను ఆలోచనలతో ముంచెత్తుతాయి. అట్లాంటిక్ మహాసముద్రానికి పశ్చిమాన త్రికోణాకారంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఎన్నో నౌకలు, విమానాలు గల్లంతయ్యాయి. సైబీరియాలోని బైకాల్ సరస్సు పైభాగం జనవరి నుండి మే వరకు మంచుతో ఉంటుంది. దానివల్ల అందులో నీరున్నప్పటికీ తాగేందుకు పనికిరాదు. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ లో స్నాతకోత్తర డిగ్రీ పొందిన శ్రీనివాస రావు కవిత్వంలో సైన్సు విషయాలు కూడా అక్కడక్కడా కనబడతాయి. కవిత్వమంటే/ సూర్యుడూ చంద్రుడూ కాదు /నేలతల్లి చూపుడు వేలి కదలిక మొదలయిన శక్తిమంతమైన కవితా పంక్తులతో కవిత్వం వస్తువుగా రాసిన కవితకు శ్రీనివాసరావు పెట్టిన శీర్షిక ‘భ్రమణ చలనం’. ఈ కవితలో ఒక చోట గ్రహణాలపై ఉన్న మూఢ నమ్మకాలను ఖండించడం కనబడుతుంది. చంద్రునికి మెరవటం తప్ప/ మడమ తిప్పటం తెలియదు/ అప్పుడప్పుడూ మనమే అడ్డొచ్చి/ గ్రహణం పట్టించి గగ్గోలు పెట్టేస్తాం/ ఈ పంక్తుల్లో గ్రహణం విషయంలో అపోహలను నిశితంగా విమర్శించడం చూడవచ్చు. ఈ పంక్తుల్లో ‘మనమే అడ్డొచ్చి గగ్గోలు పెట్టేస్తాం’ అనడం వ్యంగ్యాత్మక అభివ్యక్తి. ఈ కవితా శీర్షిక కూడా విజ్ఞానశాస్త్ర సంబంధి కావడం విశేషం. ‘ఉమ్మనీటి కన్నీరు’ అనే కవితలో కింది విధంగా పేర్కొంటారు శ్రీనివాసరావు. వళ్ళంతా కేంద్రక సంలీనానికి సిద్ధపడి/ పరమావేగంతో పరుగెడుతున్న/ పరమాణువులై పరవశించి/ తను విస్ఫోటనం చెందుతున్నప్పుడూ అసంబద్ధంగా/ పెండ్లికి ముందే చూలును నిర్ణయిస్తున్నారు. ఈ కవితలో తీగల గుండా ప్రవహించే విద్యుత్తేజం, తరంగ ప్రసారం మొదలైనవి కనబడతాయి. అక్కడక్కడా చదివి ఇదేదో సైన్సు సంబంధ కవిత అని భ్రమపడేందుకు కూడా అవకాశం లేకపోలేదు. సైన్సులోని వివిధ అంశాలను ఉంటంకిస్తూ కవి రాసిన ఈ కవిత లైంగిక వివక్షపై అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగకమానదు. అలా భ్రమ పడేందుకు ఆస్కారం కల్పిస్తూ కవితను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు కవి. గర్భస్రావం వారికే/ ఆ గర్భ శోకమూ వారిదే/ ఇప్పుడు తల దించితే/ ఇక ఎప్పటికీ తల ఎత్తలేరు/ ఇక ఉపేక్షిస్తే జరుగుతున్న ఉత్పాతాన్ని ఆపలేరు/ చివరి పంక్తులకు వచ్చేసరికి విషయాన్ని నేరుగా ప్రస్తావించి, లైంగిక వివక్షపై ఇంకా ఉపేక్షించకూడదని సందేశం అందజేస్తారు. ‘ఇసుక పూల జ్ఞాపకం’ కవిత కూడా సైన్సు అంశాలపై రాసిందే. విజ్ఞాన శాస్త్ర ఫలాలు సామాన్యుడికి చేరాలన్న చక్కటి సందేశంతో ముగిసే ఈ కవితలోని కింది పంక్తులు చూద్దాం. సిలికాన్ హార్డ్ వేర్ బొందిలోకి/ సాఫ్ట్ వేర్ తొడిగి చాకిరీ చేయించుకుంటున్నారు/ సాగరాలపై సైకత తీరాల అలక తీరేదెన్నడో/ సామాన్యులకు సైతం సైన్సు ఫలాలు అందేదెప్పుడో/ ఎంతో క్లిష్టమైన అంశాలను సైతం కవిత్వ భాషలో రాసి మెప్పించగలగడం శ్రీనివాసరావు కవిత్వ గొప్పదనమని ఈ పంక్తులు తెలియజేస్తాయి. శ్రీనివాస రావు కవితల్లో మరో ఆకర్షించే అంశం శీర్షికానైపుణ్యం. ఈ శీర్షికలను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. (1) తెలుగు పదాలు/ తెలుగు కలిసిపోయిన ఇతరభాషల పదాలతో శీర్షిక పెట్టడం (2) తెలుగు పదాలు, ఇతర భాషల పదాలు కలగలుపుగా శీర్షిక పెట్టడం (3) పూర్తిగా పరభాషాపదాలతో శీర్షిక పెట్టడం.
(1) తెలుగు పదాలు/ తెలుగులో కలిసిపోయిన ఇతరభాషల పదాలతో శీర్షిక: ఈ విధమైన శీర్షికల్లో భాషా చమత్కారం, మానవీకరణం ముఖ్యంగా కనబడతాయి. ప్రసార మాధ్యమాలు అనవసర విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడాన్ని నిరసిస్తూ శ్రీనివాసరావు రాసిన కవిత శీర్షిక ‘దారి తప్పిన కన్ను’. ఈ కవితలోని కింది పంక్తులు కవితాలక్ష్యాన్ని వెల్లడిస్తాయి. గురుతు చేయాలిప్పుడు/ గ్రద్ద కళ్లెట్టుకొని వీడు/ చూడాల్సింది చూడక/ గమనించాల్సినవి విడిచిపెట్టి/ సెలబ్రిటీల బెడ్రూముల్లోకి తొంగిచూస్తుంటాడు/ హెచ్చరించాలిప్పుడు/ ఈ కవిత శీర్షికలో పేర్కొన్న ‘కన్ను’ మీడియాను సూచిస్తుంది. మీడియాను మానవీకరించడం ఈ శీర్షికలో కనబడుతుంది. రహదారుల పరిస్థితికి అద్దం పట్టే కవితకు శ్రీనివాసరావు పెట్టిన శీర్షిక ‘రోడ్ల గొణుగుడు’. కింది పంక్తులతో ఈ కవిత ప్రారంభం అవుతుంది. / రోడ్లు వేదనతో నా చెవిలో వూదిన రహస్యం/ మాటలుగా మార్చి మీకిస్తున్నా/ ఈ కవితలోనూ శీర్షికలోనూ రోడ్డును మానవీకరించడం కనబడుతుంది. ‘సూర్యుణ్ణి పొయ్యిలో పెడదాం’ పాఠకులను ఆకర్షించే శీర్షిక. ఈ కవిత కింది పంక్తులతో ప్రారంభం అవుతుంది.
ఒరేయ్!/ నాలుగు నిప్పులు పోయండ్రా/ సూర్యుని నెత్తిమీద/
ఈ పంక్తుల్లోనూ మానవీకరణ కనబడుతుంది. కవి సూర్యుడిపై నిప్పులు వేయమని ఎందుకంటున్నాడనే సంశయం పాఠకుడిలో కలుగుతుంది. దీనికి సమాధానం కింది పంక్తులు ఇస్తాయి. నిప్పుల కొలిమయిన సూర్యుడు/ నీళ్ళ తర్పణం ఇస్తుంటే చూసి/ ఆర్పటానికొస్తున్నామనుకున్నాడేమో/ తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు. తర్పణం ఇస్తుంటే చూసి ఆ నీటితో సూర్యుడి వేడిని ఆర్పేందుకు వస్తున్నామని అనుకున్నాడేమో అనడం కవి చమత్కారం.
(2) ఆంధ్రాంగ్ల భాషల పదాలతో శీర్షిక: ‘గ్లోబలూరు’, ‘నాతో ఓ సౌండ్ షేడ్’, ‘జెండర్లెస్ నుడికారం’, ‘wayకటి’, ‘Hire or Fire’ అను ఒక ఆర్థిక సదస్సు, ‘Blenders కాదు Blunders pride కాదు’ మొదలైన శీర్షికలను ఈ తరహా ఉదాహరణలుగా చెప్పవచ్చు. ‘గ్లోబల్ విలేజ్’ అన్న పదబంధాన్ని మనం ఎప్పుడూ వింటాం. దీనికి సమానార్థక పదబంధమే ‘గ్లోబలూరు’. ఈ కవితలో శ్రీనివాసరావు కింది విధంగా పేర్కొంటారు. నాయకత్వం వచ్చినా/ వాళ్ళాయన చోదకత్వంలో మసలే వాళ్ళకు/ మా వూరి ముఠా మేస్త్రీ చిట్టెమ్మను/ పరిచయం చెయ్యాలని ఉంది. చాలామంది మహిళా ప్రజాప్రతినిధుల వెనుక వారి భర్త కానీ కుమారుడు కానీ తండ్రి కానీ ఉండడం సమకాలీన రాజకీయాల్లో మనం నిత్యం చూసే అంశం. ఈ పరిస్థితిని తన కవిత్వంలో విమర్శిస్తారు ఈ కవి. ఈ పంక్తుల్లో వారికి వ్యతిరేక స్వభావం కలిగి, స్వతంత్రంగా పని చేసే మహిళను పరిచయం చేయాలని భావించడం వెనుక లక్ష్యం మహిళా సాధికారత వాస్తవరూపం ధరించాలన్నబలమైన ఆకాంక్షే. ఇక్కడ భర్త చోదకత్వం అని పేర్కొన్నా కుమారుడు, తండ్రి మొదలైనవారిని కూడా కవి దృష్టిలో పెట్టుకున్నట్టు భావించాలి. ఈ పంక్తుల్లో ఎక్కడా ‘మహిళ’ అని కానీ ఆ పదానికి పర్యాయ పదాలను కానీ కవి ఉపయోగించకపోవడం గమనార్హం. సమర్థవంతమైన కవిత్వ రచనకు ఇది నిదర్శనం. చీకటితో పోలిక ఉండే పదమైన ‘wayకటి’ని ఒక కవితకు శీర్షికగా పెట్టారు శ్రీనివాసరావు. ఈ కవితలోని కింది పంక్తులను చూద్దాం. బ్రహ్మాండమంతా బయట/ హృదయం లోపల/ ప్రేమ సమాధుల స్మశానం/ బయట అంతా వెలుగు ఉన్నా హృదయాంతరాళాల్లో చీకటి దాగి ఉందని నర్మగర్భంగా చెప్తారు ఈ పంక్తుల్లో కవి. స్థూలంగా చూస్తే తెలుగుతో పాటు ఆంగ్ల భాషా పదాలను కూర్చి శీర్షిక పెట్టడం వ్యంగ్యాన్ని, విమర్శను చూపడమేనని తెలుస్తోంది.
(3) పూర్తిగా ఆంగ్ల భాషా పదాలతో శీర్షిక: ‘వై.. మి’, ‘న్యూ ఇరా’, ‘ఎటర్నల్ జర్నీ’, ‘కరప్టెడ్ సాఫ్ట్ వేర్’, ‘డెడ్ ఎండ్’, ‘స్లీపింగ్ విత్ ఎనిమీ’, ‘ఫైర్ బాక్స్’, ‘థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్’ మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. ‘వై.. మి’ అనే కవిత కింది విధంగా ముగుస్తుంది. శూన్యపు సుడిగుండాల్లో చిక్కి/ నేనే ఎందుకు ఎక్కెక్కి ఏడ్వాలి/ తన నుంచి తానే దూరంగా పారిపోతున్న/ ఈ విశ్వాన్ని పట్టుకొని నేనెందుకు వేళ్ళాడాలి?!/ ఎన్నో ఆలోచనలను రేకెత్తించే కవిత ఇది.
తరాల మధ్య అంతరాలకు అద్దం పట్టే కవిత ‘న్యూ ఇరా’./ పాత తరం/ ప్రాంతం/ దేశం/ మతం/ మాతృభాషా మార్చినప్పుడల్లా తల్లడిల్లింది. / తరువాత తరం మనసు పెరిగి/ మనిషి ఎదిగి/ తేడాలను అధిగమించినా/ ఈ తరమూ/ భయంతో బిక్కుబిక్కుమంటూనే ఉంది. తర్వాతి తరం భేదాలను అధిగమించినా నవతరం ఎందుకు భయపడుతోందో తెలుసుకోవాలంటే శ్రీనివాసరావు కవిత ‘న్యూ ఇరా’ చదవలసిందే. ఈ విధంగా ఆంగ్ల భాషాపదాలతో శీర్షికను పెట్టడం వస్తువును బలంగా పాఠకుడికి అందేలా చేయడమే. శ్రీనివాసరావు కవిత వస్తువులను మానవీకరిస్తుంది. పదాలతో ఆడుకుంటుంది. అలంకారాలతో పరిపుష్టి పొందుతుంది. ‘ఆశాగీతం’ అనే కవితలో కింది విధంగా రాస్తారు కవి. మేఘాల చెవుల్లో/ గుసగుసలాడే గిరి శిఖరపు/ అంచున నిలబడి/ అంతులేని దూరాలను/ అమాంతం కళ్లతో పీల్చేయాలనిపిస్తుంది. ఈ పంక్తుల్లో మేఘాలను, శిఖరాలను మానవీకరించడం కనిపిస్తుంది. కళ్లతో చూడడం సాధారణం. కళ్లతో పీల్చడం ఇక్కడ కవి పేర్కొన్న ప్రత్యేక లక్షణం. ఈ పీల్చే స్వభావం ఎలా వచ్చింది? పీల్చడం వల్ల జరిగేది ఏమిటి? మేఘాలు ఎలా ఏర్పడ్డాయి? భూమిని పీల్చడం ద్వారా. మేఘాల సమీపంలో ఉండడం వల్ల కవికి కూడా ఆ ధర్మం సిద్ధించిందని కవి సమయం. మరి పీల్చడం వల్ల మేఘాలకు లభించేది ఎంతో దూరంలోని భూమిపై ఉన్న నీరు, తేమ. అలా సుదూరంగా ఉన్న వాటిని సైతం పీల్చగలగడం అంటే ఆశావాహ దృక్పథాన్ని కనబర్చడమే. అందుకే ఈ కవితకు ‘ఆశాగీతం’ అనే శీర్షిక పెట్టారు కవి. ‘తలపూలు’ అనే కవిత తలపులలోని పూల గురించి చెప్తుంది. నీ తల్లో నిత్యం/ నా తలపుల పూలు/ నీ కళ్ల చూపుల్లో వలపు వాసన/ జ్ఞాపకాల వర్షం. తలపులలోని పూలను- ‘తల పూలు’గానూ ‘తలపులు’గానూ భావించేందుకు ఆస్కారం కల్పిస్తూ రాసిన కవిత ‘తలపూలు’. ‘అంతా లెక్కే’ అనే కవితలో కవి కింది విధంగా పేర్కొంటారు. కొలవడం రానివాడు/ కొలువుకూ పనికిరాదు/ మేలుకొలుపుకూ పనికి రాదు. కొలవడం, కొలువు, మేలుకొలుపు పదాల మధ్య చక్కటి సమన్వయం సాధించి రాసిన ఈ పంక్తులు పాఠకుడిని ఆకర్షిస్తాయి. శ్రీనివాసరావు కవిత్వం పాఠకుడికి సూదంటు రాయి. ఆయన కవిత్వంలో విషయ వైవిధ్యం గోచరిస్తుంది. చక్కటి శైలీ విన్యాసం దర్శనమిస్తుంది. భాషా చమత్కారాలు పుష్కలంగా కన్పిస్తాయి.

డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News