మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు ‘గంగా జమున తెహ్ జీబ్‘ గా అభివర్ణించిన నేల – తెలంగాణ!!. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో భారతదేశంలోనే ప్రముఖమైనది – తెలంగాణ!!. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాల కు సంధాన వారధి మన తెలంగాణ. భారతదేశం ఎలా అయితే మొత్తం ఉప ఖండ లక్షణాలను కలిగి ఉందో, మన దేశంలో తెలంగాణ కూడా అంతే వైవిధ్యతను, విశిష్టతను కలిగి ఉంది. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర ఆనవాళ్లతో పాటు ఆధునికంగా కూడా ఎంతో ప్రత్యేకతను సాధించింది. తెలంగాణలో కుతుబ్ షా రాజుల కాలం నుంచి కూడా అన్ని జాతుల, సంస్కృతుల ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు! నిజాంల కాలంలో కూడా ఇతర రాష్ట్రాలు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ నగరంలో ఎంతో కలిసి మెలసి జీవిస్తున్నారు ఇదంతా తెలంగాణ ప్రజలలో నరనరానా జీర్ణించుకున్న ‘అతిధి దేవోభవ‘ అన్న భావన వల్లనే సాధ్యమైంది.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం !
ఇంత గొప్ప చారిత్రక వైభవం, పోరాట స్ఫూర్తి ఉన్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలకు గురైనదో మనకు తెలుసు. నిధులు, నీళ్ళు, నియామకాల పరంగానే కాకుండా మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, మన పండుగలు, ఉత్సవాలు, మన వేడుకలు అన్ని నిర్లక్ష్యం చేయబడ్డాయి. మన భాష, మన యాస ఎంతో అపహాస్యం చేశారు. కళలు సంస్కృతి , సినిమాలలో మన తెలంగాణ భాష ఎంతగానో అవహేళన కు గురి అయింది. ఈ వివక్ష నుంచే తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు.
నిజానికి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ సాంస్కృతిక పోరాటమే!
60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదురుకున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ గౌరవ సిఎం కేసీఆర్ సారథ్యంలో పెద్ద ప్రజా ఉద్యమం మొదలైంది. 14 ఏళ్ల పాటు సకల జనుల ను కలుపుకొని, మన ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ఉద్యమాన్ని నడిపించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సాధించి చూపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిదే!
తెలుగు భాష సాహిత్యాల వికాసంలో తెలంగాణ పాత్ర
తెలంగాణ ప్రాంతం సాంస్కృతికంగా, సాహిత్య పరంగా, కళల పరంగా ఎంతో ఘనమైన చరిత్ర కలిగి ఉంది. తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త ప్రక్రియలు, సంప్రదాయాలు మన తెలంగాణ కవుల నుంచే మొదలయ్యాయి. పంపన, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, బండారు అచ్చమాంబ వంటి తెలంగాణ సాహితీ మూర్తులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. బడిపలుకుల భాష కన్నా పలుకుబడుల భాష కావాలని చెప్పిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి అయిన సెప్టెంబర్ 9ని తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.
సకల కళల నిలయం
తెలంగాణ రాష్ట్రంలో సకల కళలు ఉన్నాయి! శాస్త్రీయ సంగీతం హిందుస్థానీ, కర్ణాటక సంగీతం… కూచిపూడి, భరతనాట్యం, కథక్, పేరిణి వంటి శాస్త్రీయ నృత్యాలు… ఒగ్గుడోలు, చిందు యక్షగానం, డప్పులు వంటి ఎన్నో జానపద కళారూపాలు… ముషాయిరా, సూఫీ సంగీత్, గజల్ వంటి హైదరాబాదీ దక్కని కళా రూపాలు మన తెలంగాణకు దేశంలోనే ప్రత్యేకతను సాధించి పెడుతున్నాయి… గుస్సాడీ, లంబాడి , కొమ్ము కోయ వంటి గిరిజన కళారూపాలు, చిత్రకళ, ఫోటోగ్రఫీ, మిమిక్రీ, మైమ్, మ్యాజిక్ వంటి ఎన్నో ప్రాచీన, ఆధునిక, నవీన కళారూపాలకు, కళాకారులకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణా ఉంది. ఇంత గొప్పతనం తెలంగాణలో ఉన్నప్పటికీ, గత ప్రభుత్వాలు మన సంస్కృతిని, మన పాటను, మన భాషను అణిచివేశారు.. వివక్ష చూపించారు. నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ అవతరణ తర్వాత ఈ ఏడేళ్లలో 60 ఏళ్ల లోటును భర్తీ చేసేలా సాంస్కృతిక, కళా, సాహిత్య రంగాలలోఅన్ని రాష్ట్రాల కన్నా గొప్ప అనిపించేంతగా వికాసాన్ని సాధించడం ఒక అద్భుతం అనే చెప్పాలి.
వృద్ధ కళాకారులకు పింఛన్లలో పెంపుదల
తెలంగాణా అవతరణకు పూర్వం పేద వృద్ధ కళాకారులకు కేవలం 500 రూపాయలుగా ఉన్న పింఛను మొత్తాన్ని 2014 అక్టోబర్ నుండి ప్రభుత్వం 1500లకు పెంచింది. మళ్లీ తిరిగి 2021 రాష్ట్ర అవతరణ వేడుకల కానుకగా ఈ మొత్తాన్ని రూ. 3016/- కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇవేగాక అరుదైన కళాకారులకు ప్రత్యేక పింఛను రూ.10 వేల చొప్పున అందజేస్తూ, ప్రభుత్వం కళాకారుల పట్ల తన గౌరవాన్ని చాటుకొంటున్నది.
శాస్త్రీయ సంగీత నృత్య వికాసం
తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక, హిందుస్థానీ, శాస్త్రీయ సంగీతాలను, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాల వికాసం కోసం 6 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలను నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా ఈ సంస్థల నుండి వందలాది మంది విద్యార్థులు శాస్త్రీయ సంగీత, నృత్య రంగాలలో నైపుణ్యాలను సాధిస్తున్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలు
‘ తెలుగు సాహిత్యంలో తెలంగాణ ప్రాంత కవులు, సాహితీవేత్తలు చేసిన కృషిని చాటి చెప్పడానికి, కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో నిర్వహించాం. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ సభలను ముందుండి నడిపించి తెలంగాణ సాహితీ, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటారు!
అకాడమీల ఏర్పాటు
ఉమ్మడి పాలనలో రద్దు చేసిన అకాడేమీలను తెలంగాణా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసింది. తెలంగాణలో సాహిత్య పరమైన అంశాల అభివృద్ధికి తెలంగాణ సాహిత్య అకాడమీని, సంగీతం, నాటకం, నృత్యాల వికాసం కోసం తెలంగాణ సంగీత నాటక అకాడమీని ఏర్పాటుచేసింది.
తెలంగాణ సాంస్కృతిక సారథి
తెలంగాణ ఉద్యమంలో పాటలు ఎంతగా ప్రజలను ప్రభావితం చేసాయో మనందరికీ తెలుసు! పాటకు పట్టాభిషేకం చెయ్యడానికి, అలాంటి ఉద్యమ కళాకారులకు తగిన గౌరవం ఇవ్వడానికి ‘తెలంగాణ సాంస్కృతిక సారథి‘ అనే వినూత్నమైన వ్యవస్థను ఏర్పాటు చేశాము.హైకోర్టు ఆదేశాలను అనుసరించి తెలంగాణ సాంస్కృతిక సారథికి కొత్తగా నోటిఫికేషన్ జారీచేసి, ప్రత్యేక నిపుణుల కమిటీ ద్వారా అర్హులైన కళాకారులలో 550 మందిని ఎంపిక చేసింది.
ఆడిటోరియంల నిర్మాణం
తెలంగాణలోసాంస్కృతిక వికాసం కోసం మహతి ఆడిటోరియంను గజ్వేల్ లో,విపంచి ఆడిటోరియంను సిద్దిపేటలో నిర్మించడమే కాక, వరంగల్లులో కాళోజీ కళాకేంద్రం ను అత్యంత అధునాతనమైన రీతులలో నిర్మిస్తున్నాం. అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్ లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి పేరు మీద ‘ సినారె సారస్వత సదనం‘ నిర్మించే చర్యలు చేపట్టి, శంకుస్థాపన కార్యక్రమాలను కూడా నిర్వహించింది.
పి.వి. శత జయంతి వేడుకలు:
తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు గారి శతజయంతి వేడుకలను నిర్వహిస్తూ, ఆ మహనీయునికి చక్కని నివాళిని అందిస్తున్నాం. ఆయన జన్మస్థలమైన వంగరను పర్యాటక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధికి చర్యలు తీసుకున్నది. ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించ వలసిందిగా శాసన సభ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ పివి. నరసింహారావు మార్గ్ గా నామకరణం చేయడం జరిగింది.
తెలంగాణ వైతాళికుల జయంతులు
గతంలో మన జాతి రత్నాల గురించిన జయంతి గాని, వేడుకలు గాని జరగలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ తేజోమూర్తులు అందరి జయంతులు, వర్ధంతులు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నాం. భక్త రామదాసు,సర్దార్ సర్వాయి పాపన్న, చిట్యాల ఐలమ్మ,ఈశ్వరీబాయి,భాగ్యరెడ్డివర్మ,పైడిమర్రి వెంకట సుబ్బారావు, దేవులపల్లి రామానుజరావు, పైడి జయరాజ్, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి మహనీయులను నిరంతరం స్మరించుకుంటూ ఈ ఉత్సవాలను సాంస్కృతిక శాఖ నిర్వహిస్తూ వారి నుండి ఈ తరం స్ఫూర్తి పొందాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది.
తెలంగాణ వైతాళికుడు,మహా పరిశోధకుడు, గోల్కొండ పత్రిక సంపాదకుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి 125వ జయంతి ఉత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించడం విశేషం!. గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి, వీరశైవ ప్రజల దైవం మహాత్మా బసవేశ్వర జయంతి ని, గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జయంతి ని, తెలంగాణ ఉద్యమకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ వంటి వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నది. వారితో పాటు మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్, సావిత్రిబాయి పూలే వంటి సంఘసంస్కర్తల జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ అన్ని సామాజిక వర్గాల ప్రజలలో చైతన్యాన్ని నింపుతున్నది.
అవార్డులు – పురస్కారాలు
ప్రముఖ సాహితీవేత్త, ప్రజాకవి కాళోజీ నారాయణరావు,మహాకవి దాశరథి గారి జయంతి వేడుకలు తో పాటు వారి పేరిట ప్రతి సంవత్సరం సాహితీ పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి విశిష్ట పురస్కారాలు నగదు బహుమతులతో పాటు అందిస్తున్నది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వివిధ విభాగాలలో అత్యున్నత స్థానాన్ని సాధించిన ఆడబిడ్డలకు ప్రతి సంవత్సరం విశిష్ట పురస్కారాలను అందిస్తూ ఆడబిడ్డలను గౌరవిస్తున్నది.
అధికారికంగా పండుగల నిర్వహణ
తెలంగాణ అంటేనే ఉత్సవాల నేల! ఉమ్మడి పాలనలో ఒకప్పుడు ఎంతో వివక్షకు గురైన మన ఆత్మగౌరవ పండుగలు… బతుకమ్మ, బోనాలు! రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం వీటిని అధికారిక పండుగలుగా ప్రకటించి ప్రతి ఏటా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఇవేగాక ఉగాది, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తూ అన్ని మతాల సామరస్యతను అమలుచేస్తున్నది.ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర – సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వమే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నది! ఇవేకాక కేస్లాపూర్ నాగోబా జాతర, ఏడుపాయల జాతరను ఇంకా ఎన్నో గ్రామీణ గిరిజన జాతర పండుగలను నిర్వహిస్తున్నది.
పుస్తక ప్రచురణలు, డాక్యుమెంటరీలు
తెలంగాణ చర్రిత, సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, కళలు, కళారూపాలకు సంబంధించిన ఎన్నెన్నో తెలియని, విస్మత అంశాలను పుస్తకాలుగా ప్రచురించడం ద్వారా తెలంగాణా వైభవాన్ని, కీర్తిని భావితరాలకు అందించే ప్రయత్నంలో సఫలీకృతం అయిందనే చెప్పాలి. వీటికి తోడు ప్రస్తుత కాలం అంతా దృశ్యమాధ్యమమే ప్రధానం కనుక అరుదైన, అంతరించిపోతున్న జానపద, గిరిజన కళారూపాల మీద డాక్యుమెంటరీలను రూపొందించి రెఫరెన్సులుగా అందిస్తున్నాం.
ఇతర ప్రాంత సంస్కృతులకు గౌరవం
గౌరవ సీఎం కేసీఆర్ గారు హైదరాబాదులో,తెలంగాణలో నివసిస్తున్న ఇతర రాష్ట్ర సంస్కృతులు, ప్రజలను మన రాష్ట్ర ‘అభివృద్ధి భాగస్వాములు‘గా వర్ణించారు. అందుకే మన రాష్ట్రంలో నివసిస్తున్న తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, కశ్మీరీ, ఒడియా ప్రజల పండుగలను ప్రభుత్వం ప్రతి ఏటా ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తూ వారందరితో ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకొని ఇతర నగరాలు, రాష్ట్రాలకు మన తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
స్వతంత్ర భారత అమృతోత్సవాలు
భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం– భారత స్వాతంత్య్ర ఉద్యమం! దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా, 75 వారాల పాటు స్వతంత్ర భారత అమృతోత్సవాలను రాష్ట్ర లోని 33 జిల్లాలలో ఘనంగా నిర్వహించడానికి గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో సన్నాహాలు చేశాము.
కరోనా కాలం
‘ ప్రస్తుతం కరోన ప్రబలిన నేపథ్యంలో సాంస్కృతిక, సాహిత్య కళాకార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా డిజిటల్ మాధ్యమంలో నిర్వహిస్తూ కళాకారులలో ఉత్సాహాన్ని నింపుతున్నాము. దీనికి గాను 6సి వ్యూహాన్ని (Corona Cannot Control Culture Creativity and Cinema) రూపొందించుకుని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల విద్యార్థుల కోసం ఆన్లైన్ విద్యను దేశంలోనే మొదటిసారిగా ఏప్రిల్ 2020 నుండే ప్రారంభించాము. వీటికి తోడు ఆన్లైన్ ద్వారా నృత్య, సంగీత, నాటకోత్సవాలను, జానపద గీతాలు, కర్రసాము, సినిమా స్క్రిప్ట్ రచన, నటన వంటి అంశాలలో వర్క్ షాపులను విజయవంతంగా నిర్వహిస్తూ కళాకారులలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేయడం విశేషం. సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా కరోనా మీద ఎన్నెన్నో అవగాహనా గీతాలను, చైతన్య గీతాలను రాయించి ప్రజలలో బాధ్యతను పెంచే ప్రయత్నం చేస్తున్నాము. పేదరికం దిగువన ఉన్న కళాకారులకు ఆర్థిక సహకారాన్ని, ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులను అందిస్తూ కష్టకాలంలో ఆదుకుంటున్నది తెలంగాణా ప్రభుత్వం.
రేపటి వైపు
భారతదేశంలో అత్యంత పిన్నవయసు కలిగిన 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటికీ, ఈ 7 ఏళ్ళలో అభివృద్ధి-సంక్షేమ రంగాలలో సాహితీ, సాంస్కృతిక, కళారంగాలలో మిగతా రాష్ట్రాలన్నిటి కన్నా మిన్నగా దూసుకు వెళ్తున్నది. ఈ ఏడేళ్ళ అనుభవాలను అనుసరించి, రేపటి భవిష్యత్ చిత్రపట రచనను చేసుకుం టూ సకల జనుల, సర్వ కళాకారుల వికాసం కోసం మరొక్కసారి పునరంకితం కావాల్సిన స్ఫూర్తిని తీసుకుంటూ ముందడుగు వేస్తున్నది.
సకల కళల ఖజానా తెలంగాణ!
- Advertisement -
- Advertisement -
- Advertisement -