Thursday, January 23, 2025

ఈ మెజారిటీ లోకాన్ని మన్నిస్తావా సూఫీ?

- Advertisement -
- Advertisement -

ఈ సంపుటిలో మొట్టమొదట ఆకర్షించేది కథలన్నిటి వెనుక దాగి ఉన్న సూఫీ తత్వం, సూఫీ స్వరం. ‘అస్లీ ముస్లిం’గా ఉండడం కన్నా మతాతీతంగా మనుషు లందర్నీ ప్రేమించాలనే సామరస్య, సహోదర భావ నతో ఉండడమే ముఖ్యమన్న ప్రేమ ఈ కథలను నడి పింది. అదే సమయంలో రచయిత తన చుట్టూ ఉన్న జీవనంలోని దోపిడీ, పేదరికం, వివక్షల వంటివి రాయడానికి, ప్రశ్నించడానికి సంకోచించలేదు.

‘చారల పిల్లి’ వేంపల్లె షరీఫ్ మూడవ కథాసంపుటి. దీన్ని తన ఊరు వేంపల్లెకి అక్కడి మనుషులకి అంకితం ఇచ్చాడు. కానీ పుచ్చుకున్నది- కథలు చదువుతూ మధ్యమధ్య కళ్ళు తుడుచున్నవారు, మహాపాతకానికి జడవకుండా చారల పిల్లిని అంతం చేయాలనుకున్నవారు, కటికోళ్ల పిల్లోడి కాలిరిగిన దూడకి ఆకు పసరు పడినపుడు దానితో పాటు ఉప్పొంగిన గుండెలతో గెంతినవారు, పరిమళించిన పేద రిజ్వాన్ మానవత్వానికి, ఆత్మవిశ్వాసానికి నల్లబండ గుండెలను వెన్నలా కరిగించుకున్నవారు, అంతరంగమంతటినీ ముస్లిం సాంస్కృతిక సౌందర్యంతో నింపుకున్నవారు, నసీమూన్‌కి మంచి మట్కా నెంబర్ ఇచ్చి, ప్యారీకి శెభాష్ చెప్పి, షేర్నికి స్వాగతం పలికి, బద్రూన్‌ని ఓదార్చాలనుకున్నవారు- ఇంకా ఎంతోమంది ప్రేమికులు, భావుకులు, పోరాటశీలురు, సహనవంతులు, పరాజితులు, పీడితులు- పాఠకులు, ప్రజలు.

‘చారల పిల్లి’కి ముందు మాటలు రాసిన కె శ్రీనివాస్, ఓల్గా అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కోణాల ఆధారంగా ఇందులోని కథలని విశ్లేషించారు. ముస్లిం, రాయలసీమ, పేదవర్గపు అస్తిత్వాల నుంచి రాస్తున్నప్పుడు ఉండే సంక్లిష్టతలని అత్యంత సహజ సుందర శైలితో కథలుగా మలచడాన్ని ప్రశంసించారు. ఈ ప్రశంసలకి అన్నిందాలా అర్హమైనవి ‘చారల పిల్లి’ లోని కథలు. రచయిత తాను చొరబడకుండా నిగ్రహించుకోవడం వల్ల ఆయా పాత్రలే ముందుకొచ్చి కథా సూత్రాన్ని పట్టుకుని కథలని లాక్కుపోయాయి. రచయిత ప్రజ్ఞ కన్నా, రచయిత కన్నా రచనా సారమే ముందుకు వచ్చి కథలను వెలిగించింది.

ఈ సంపుటిలో మొట్టమొదట ఆకర్షించేది కథలన్నిటి వెనుక దాగి ఉన్న సూఫీ తత్వం, సూఫీ స్వరం. ‘అస్లీ ముస్లిం’గా ఉండడం కన్నా మతాతీతంగా మనుషులందర్నీ ప్రేమించాలనే సామరస్య, సహోదర భావనతో ఉండడమే ముఖ్యమన్న ప్రేమ ఈ కథలను నడిపింది. అదే సమయంలో రచయిత తన చుట్టూ ఉన్న జీవనంలోని దోపిడీ, పేదరికం, వివక్షల వంటివి రాయడానికి, ప్రశ్నించడానికి సంకోచించలేదు. రంజాన్ పండుగ సమయంలో ఈద్గా వదిలినపుడు వారు పంచే చిల్లర కోసం మైదానం బైట ఆంజనేయుడు, గంగమ్మ, గౌరమ్మ, గాంధీ వేషాలు కట్టే పేద జనాలు, ఆంజనేయుడి గుడి బైట షాపులు పెట్టుకుని వ్యాపారం చేసే సాయిబులను ‘సైకిల్ చక్రాలు’ కథలో చూస్తాము. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దది చేసి మైనారిటీలను దేశానికి శత్రువులుగా చూపిస్తున్న సందర్భాలలో ఈ కథ చదవడం చాలా ఊరట. ప్రేమ ముందు, అవసరం ముందు మత రాజకీయాలు నడవ్వని, ముస్లింలు ఈ దేశానికి ‘ఇతరులు’ కాదని నమ్మకంగా చెపుతాడు రచయిత.

మెజారిటీ మతతత్వవాదులే కాదు చాలా మంది ప్రగతిశీలురు, తాము ముస్లిం మతానికి చెందకపోయినా ముస్లిం కల్చర్ మీదా అందులో జరగాల్సిన సంస్కరణల మీదా ఉదారంగా తీర్పులు ప్రకటిస్తూ ఉంటారు. ముఖ్యంగా బుర్కా విషయంలో విరుచుకుపడే మెజారిటీ మతం వారు ఘూంఘట్, ఇతర హిందూ మత చిహ్నాల ఊసే ఎత్తరు. మైనారిటీలుగా ఉన్న సమూహాలలోని పీడక స్వభావాన్ని వివక్షను, ఆయా సమూహాలలోని వారే చర్చకి పెట్టడం ద్వారా ఇతరుల సాంస్కృతిక చొరబాటుని, ఉద్ధరణ పేరుతో జరిగే మోరల్ పోలీసింగ్‌ని ఆపినవారవుతారు.ఈ కథలు ఆ పని చేశాయి. ముస్లిం సమాజంలో లోపాలుగా చెప్పబడుతున్న అంశాలను జీవన వాస్తవికత నుంచి అర్థం చేయించాయి. మగపిల్లల కోసం వరుసగా పిల్లల్ని కంటూ పోతున్న బద్రూన్, వివాహానికి వెలుపల పరిష్కారం కోసం ప్రయత్నించడం కనువిప్పు. బుర్కాల సంగతి తరువాత, బైటకి వచ్చినపుడు దుప్పటి కప్పుకునే స్త్రీలని అర్థం చేసుకోవడం ఒక ఎరుక. స్త్రీలను పూర్తిగా ఇంటికి పరిమితం చేయడంలోని అమానవీయతని స్త్రీ పాత్ర ఉన్న ప్రతికథ నుంచి గ్రహించడం కొత్త అవగాహన.

పాతకి కొత్తకి మధ్య నిరంతరం జరిగే ఘర్షణని సాధారణ సాహిత్యం రికార్డ్ చేస్తూనే ఉంది. ముస్లిం సంస్కృతికి ఆధునికతకి ఉన్న వైరుధ్యాన్ని కూడా బడేపీర్ కథ చెపుతుంది. ఖవ్వాలి పాటలకి నుంచి కొత్త సినిమా పాటలవైపు తరం మారుతూ ఉండడం, దాన్ని అంగీకరించడానికి హింస పడే వలీ ఏటికి ఎంత కాలం ఎదురీదుతాడో చూడాలి. ఈ కథ పరోక్షంగా దర్గా నిర్వహణ వ్యవస్థని కూడా కళ్ళకి కడుతుంది. గుళ్ళ మాన్యాలు చాలక, ఇతర జీవిక దొరక్క యాతనపడే పూజారుల గురించి చాలానే సాహిత్యం వచ్చింది. కానీ దర్గా వ్యవహారాలు చూసే ముతవల్లి గురించి, దర్గా నిర్వహణ వ్యవస్థ గురించి చాలా అరుదుగా, బహుశా మొదటిసారేమో తెలుగు సాహిత్యం వినడం!

మనుషుల పట్ల ప్రేమ, సహనం, సామరస్యాలతో పాటు ముస్లిం స్త్రీలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, అధిక సంతానం, వరుస కాన్పులు, అనారోగ్యాలు, వారి లైంగిక జీవితం మీద తీవ్ర నిర్బంధం వంటి అంశాలను, అందులోని హింసని ఈ సంపుటిలోని కథలు వెలికితెచ్చాయి. అయితే ఆ పని మొరటుగానో, వార్తా కథనాలు మాదిరి పచ్చి యథార్థమే లక్ష్యంగానో కాక చదువరుల హృదయాన్ని కదిలించడం, ఆలోచనలకి తావియ్యడమే లక్ష్యంగా రచయిత చూపు ఉంది. ఈ సంపుటిలో కథలని నడిపిన భాష వల్ల కూడా వీటి వస్తుగాఢత, శైలీసరళమై అనేక మందిని చేరుకోగల స్వభావాన్ని సంతరించుకుంది. రాయలసీమ ప్రాంత మాండలికం, అందులోనూ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ముస్లింల మాండలికాన్ని, యాసలను వాడారు. అందులోనూ ఉపభేదాలు ఉన్నాయి. కథంతా చిక్కని మాండలికంలో నడపగల భాషా సంపద ఉండి కూడా కథనం మామూలు భాషలోనూ సంభాషణలు మాండలికంలోనూ వాడటం షరీఫ్ ఎంచుకున్న పద్ధతి. అది కథల నడకని ప్రవాహ వేగానికి మళ్లించింది.

చివరిగా ఈ కథకునికి ఒక విన్నపం. నెయ్యిలో కాల్చిన గోధుమ రొట్టెలని రోట్లో వేసి దంచి, ఆ రొట్టెల పొడిలో చక్కెర, తురిమిన కొబ్బెర, మరికొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి, జామ్మనే తియ్యని వాసనతో మలీదా దివ్వెలు చేసేది కదా మీ అమ్మమ్మ! నమాజు అయ్యాక పెద్దలను, నమాజీలను పిలిచి ప్రసాదం పెడితే నిష్టగా తిని దువా చేసి వెళ్ళేవారు. సర్వమత ప్రేమికుడా, ఓ సూఫీ! ఆ తర్వాత మీరంతా వరుసలు పేని కూచున్నట్లు మేము కూడా బుద్ధిగా కూచుని దువా చేస్తాము. ఎక్కడ ఉన్నా సరే అమ్మమ్మకి చెప్పి ఈసారి గ్యార్మీ పండుగకి చేసే మలీదా దివ్వెల ప్రసాదం మాకూ పంచుతావా?

కెఎన్ మల్లీశ్వరి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News