చేయి తిరిగినరచయితల తీరే వేరు. వారి రచన తాలూకు హుందాతనం(dignity), గాంభీర్యం (seriousness), విశ్వసనీయత (credibility)మొదటి నాలుగైదు వాక్యాల్లోనే స్పష్టంగా తెలిసిపోతాయి. కవులకు, కవిత్వానికి కూడా ఈ విషయంవర్తిస్తుంది. సాదత్ హసన్ మంటో, పైన చెప్పిన రకానికి చెందినవాడని తెలియజేసే పుస్తకం మంటో క్లాసిక్స్ అనే ఈ అనువాద గ్రంథం. దీన్నిఉర్దూనుండి తెలుగులోకి అనువదించినవారు మెహక్ హైదరాబాదీ. ఈ కథల్లోని దాదాపు అన్ని పాత్రలు ముస్లిం వ్యక్తులవే. రచయిత ఎక్కువగా ఏ మనుషుల మధ్య జీవిస్తాడో వారే అతణ్ని బాగా ప్రభావితం చేసే వీలుంది. ఎందుకంటే వారిని పరిశీలించడం ఒకవిధంగా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. తెలియని వ్యక్తులను పాత్రలుగా మలిస్తే కథలో సహజత్వం లోపిస్తుంది. సోమర్సెట్ మామ్ ఎన్నో దేశాల్లో ప్రతిచోటా ఒకటి రెండు సంవత్సరాల పాటు వరుసగా జీవించి, తన చుట్టూ ఉన్న వ్యక్తులను నిశితంగా పరిశీలించి, కథలు రాశాడు. కనుకనే వాటిలో సహజత్వం చోటు చేసుకుంది. అందుకే వాటిని రక్తమాంసాలున్న పాత్రలు అని అభివర్ణిస్తాం.
ఈ పుస్తకంలోని మొదటి కథ పేరు మామిడి పళ్లు.పదవీ విరమణ పొందిన ఒక బీద ముస్లిం వృద్ధుడు పెన్షన్ ఆఫీసులోని ఉన్నతాధికారికి ప్రతి యేటా మామిడిపళ్ల బుట్టను పంపుతాడు. దానికి కారణం, గతంలో తన తండ్రికి ఆయన ఆత్మీయుడు కావడం. ఇట్లా అనుకుంటాం మనం. కానీ ఇదే కథలో ఈ వృద్ధుడే ఒక డీఎస్పీకి కూడా అట్లా మామిడిపళ్ల బుట్టను పంపుతాడు. ఆ పోలీసాఫీసరు ఈ వృద్ధుని తండ్రికి మిత్రుడు కాదు. ఆ పండ్లు తన తోటలో కాసినవని ఇద్దరికీ చెప్తాడు వృద్ధుడైన కరీం. అంటే ఇతరులకు సహాయం చేయాలనే బలమైన కోరిక కొందరిలో సహజంగానే ఉంటుందని చెప్పడం. ఇక ఈ కథలో కొసమెరుపు ఏమిటంటే, నిజానికి అతనికి మామిడి తోట అంటూ ఏదీ లేదు. అంగడిలో కొని, వాళ్లకు పంపుతాడు ఆ పండ్లను. ఆ విషయం చెబితే వాళ్లు వాటిని తీసుకోరనే భయంతో అలా అబద్ధమాడుతాడు. వేసవికాలంలో మధ్యాహ్నం పూట వేడిమి మరీ ఎక్కువగా ఉన్నప్పుడుఅతడు సాధారణంగా తన ఇంట్లోని బాత్రూంలో చల్లని గచ్చు మీద చాప వేసుకుని పడుకుంటాడు. కానీ, కొనిపెట్టిన మామిడి పళ్లు చెడిపోకూడదని ఈసారి వాటిని బాత్రూమ్ లో పెట్టి, తను చాలా వేడిగా ఉన్న పక్కగదిలో పడుకుంటాడు. ఆ వేడిమి ధాటికి చనిపోతున్నప్పుడు, ఆ మామిడిపళ్ల బుట్టలను తప్పకుండా ఆ ఇద్దరికీ పంపించాలనీ, అవి అంగడిలో ఖరీదు చేసిన పండ్లు అనే రహస్యాన్ని వారికి అసలే తెలుపకూడదనీ భార్యకు చెప్పిఒట్టు వేయించుకుని వెంటనే చనిపోతాడు.
ఇదే కథను అనుభవం లేని వేరే రచయిత రాస్తే అందులో సహజత్వం లోపించే అవకాశముంది. బీదవాడైనా అట్లా పండ్లను కొని ఎవరు పంపుతారు అనే అపనమ్మకం పాఠకునికి కలగకూడదంటే, అటువంటి అనుమానం అసలే రానీయకుండా చిత్రించాల్సి ఉంటుంది మొత్తం పాత్రను. అంటే ఆ పాత్ర స్వభావం ఈ విషయంలో నమ్మశక్యంగా ఉండేలా అవసరమైన ప్రతిచోటా వాక్యాలను చొప్పించాలి.Every sentence counts in the story అన్నది ఇక్కడ ప్రధానంగా చెప్పదల్చుకున్న విషయం. నిజానికి, సంభవించడానికి వీలు లేని సంఘటనలు అంటూ ఏవీ లేవు- ముఖ్యంగా ఈ కాలంలో.వాటిలో దేన్నైనా కథలో భాగం చేయవచ్చు. కానీ ఆ సంఘటన ఆ కథలో నిజంగా జరిగిందని పాఠకుడు పూర్తిగా నమ్మాలి.ఎన్నో ఘోరమైన సంఘటనలను చదువుతుంటాం మనం పత్రికల్లో. అవి తరచుగా జరిగేవి కావు. అటువంటి అరుదైన సంఘటనను కథలో పెట్టి దానికి విశ్వసనీయతను కలిగించడం ప్రతిభ ఉన్న రచయితలు మాత్రమే చేయగలరు.
కథారచనలో మంటోకు ఉన్న బహుముఖీన ప్రజ్ఞను చూపిస్తాయి ఈ కథలు. రొటీన్ కథలకు భిన్నమైనవాటిని ఈ పుస్తకంలో చేర్చడం అనువాదకుడు చేసిన ఒక మంచి పని. వంద కేండిల్ బల్బ్ అనే కథ మంటో లోని రచనా సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పట్టి చూపిస్తుంది. పాఠకుడిని బాగా ఆలోచింపజేయడం ఇందులోని గొప్పతనం. అట్లా ఆలోచించి కథలోని అసలు విషయాన్ని గ్రహించింతర్వాత, పాఠకుడు ఒక రకమైన షాక్ కు గురి అవుతాడు.‘స్వేదం’ కూడా ఇటువంటి మరొక కథ.‘అనాకారి’ కథలో చివర్న ఒక గొప్ప మలుపు లేదా కొసమెరుపు ఉంది. కొసమెరుపు సహజంగా ఉండేలా రాయటం కూడా అందరు రచయితలకు సాధ్యం కాని పని. ఓ. హెన్రీ కథలు దాదాపు అన్నీ కొసమెరుపును కలిగి ఉన్నవే. అతనిద లాస్ట్ లీఫ్ అనే ప్రసిద్ధ కథలోని ముగింపులో సహజత్వం, వాస్తవికత ఉన్నాయి. అందుకే ఆయన కొసమెరుపు కథకుడుగా ప్రసిద్ధుడు. మొదట్లో అందరూ ఆయనకు జై కొట్టినవాళ్లే. కానీ తర్వాత కొందరు అతని కొన్ని కథల ముగింపులను ప్రశ్నించారు. అవి సహజంగా లేవని ఆరోపించారు. అయితే అట్లా అభ్యంతరం చెప్పబడిన ఓ. హెన్రీ కథల సంఖ్య చిన్నదే. సోమర్సెట్ మామ్ రాసిన The Consul, The Dream, A Friend In Need కథల ముగింపులు కూడా పూర్తి సహజంగా లేవని తప్పక అనిపిస్తుంది కొందరికి. అయితే మంటో రాసిన అనాకారి అనే ఈ కథ ముగింపు మాత్రం సహజంగా ఉంది.
టీట్వాల్ కుక్క అన్నది ఒకవిధమైన వ్యంగ్యకథ అని చెప్పవచ్చు. రెండు దేశాల సైనికులు యుద్ధం చేయడం మాని, వారి శిబిరాల మధ్య అటూయిటూ తిరిగే ఒక కుక్కను గూఢచారిగా అనుమానిస్తారు. ఆఖరుకు దాన్ని కాల్చి చంపుతారు. టోబా టేక్ సింగ్ హృదయ విదారకమైన కథ. భారతదేశ విభజన తర్వాత ఇండియా పాకిస్థాన్ లలోని ఖైదీలను ఎవరి మాతృదేశానికి వాళ్లను పంపినట్టే, మానసిక రోగులను కూడా అదే విధంగా సొంత దేశానికి పంపాలని నిశ్చయింప బడుతుంది. వారిలో బిషన్ సింగ్ ఒకడు. టోబా టేక్ సింగ్ నిజానికి పాకిస్తాన్ లోని ఒక ఊరి పేరు. కానీ అది కచ్చితంగా ఎక్కడుందో చాలా మందికి తెలియదు. బిషన్ సింగ్ ను అందరూ టోబా టేక్ సింగ్ అని పిలవడం ఈ కథలోని విచిత్ర అంశం. కానీ బాగా ఆలోచిస్తే ఇందులో ప్రతీకత ఉందని తెలిసిపోతుంది. కథాంతంలో టేక్ సింగ్ చనిపోయిన పరిస్థితి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య పేరూ ఊరూ లేని భూభాగంపై టోబా టేక్ సింగ్ నిర్జీవంగా పడి ఉండటంతో కథ ముగుస్తుంది.
ఇందులో కూడా వ్యంగ్యాత్మకమైన ప్రతీకత ఇమిడి ఉంది. వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన అవకాశమిస్తే అనే కథలోని ఇతివృత్తం కూడా కొంతవరకు ఇలానే హృదయ విదారకంగా ఉంటుంది. కానీ ఆ రెండు వేర్వేరు కథలు అన్నదాంట్లో సందేహం లేదు. మంటో దాదాపు ప్రతి కథను చక్కగా తీర్చిదిద్దాడు. మొదట చెప్పిన మూడు లక్షణాలు పుస్తకంలో స్పష్టంగా అనుభూతమౌతాయి పాఠకునికి. బీదతనం కారణంగా పడుపువృత్తి చేసే స్త్రీల దుర్భర వేదనను ప్రతిబింబిస్తాయి ఇందులోని కొన్ని కథలు. అవి మంటో లోని సహానుభూతిని ప్రతిఫలింపజేస్తాయి. మొత్తం మీద ఇవన్నీ జీవమున్న చక్కని కథలు. అందరూ చదవదగినవి కూడా. మెహక్ హైదరాబాదీ చేసిన అనువాదం బాగుంది. దానికి గల కారణాలలో, నేరుగా ఉర్దూలోంచి తర్జుమా చేయడం కూడా ఒకటి కావచ్చు. ముఖ్యంగా తెలుగుభాషను ప్రయోగించిన తీరు అనువాదకుడు ముస్లిం అనే విషయాన్ని ఎంతమాత్రం తెలియనివ్వదు. అందుకు అనువాదకుణ్ని అభినందిస్తున్నాను.
ఎలనాగ
98669 45424