Monday, December 23, 2024

విజయానికి బాట ‘చైతన్య స్పూర్తి’

- Advertisement -
- Advertisement -

telangana kavulu rachanalu in telugu

ఒక అక్షరం ఎంతో మంది ఆలోచనా విధానాన్ని మార్చి విజయ పథంలో నడిపించటానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలుపుటకు చిరునామా ‘ చైతన్య స్ఫూర్తి -చిటికెన వ్యాసాలు.‘ మన చుట్టూ నిత్యం జరుగుతున్న అనేక సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని చక్కని సామాజిక స్పృహతో డా. చిటికెన కిరణ్ కుమార్ ‘చైతన్య స్ఫూర్తి‘ అనే వ్యాస సంపుటిని వెలువరించారు. కవిగా, కథకునిగా, వ్యాసకర్తగా, ఇంటర్నేషనల్ బెనెవో లెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడిగా డా. చిటికెన కిరణ్ కుమార్ అభ్యుదయ భావజాలంతో, సమాజాన్ని చైతన్య పరుస్తూ అనేక రచనలు చేస్తున్నారు. ఈ మధ్యనే తాను రాసిన వ్యాసాలలో కొన్నింటిని పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఇవన్నీ కూడా వివిధ దినపత్రికలో ప్రచురితమైనవే. ఇందులో మొత్తం 24 వ్యాసాలు ఉన్నాయి. ప్రతి వ్యాసం దేనికదే ప్రత్యేకంగా ఉండి, పాఠకులకు ఎదో ఒక సందేశాన్ని అందించేలా ఉంది. జాతీయ కవి, సినీ గేయ కవి, రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, మాజీ మంత్రివర్యులు, పూర్వ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్ లతో పాటు పలువురు ప్రముఖులు ఈ పుస్తకానికి సందేశం అందించడం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.
వనితా! నీకు వందనం!! అంటూ ప్రారంభించిన ఈ పుస్తకంలో అనునిత్యం స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి ప్రస్తావించారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై జరిగే దాడులను అరికట్టలేకపోతున్నామని ఆవేదన చెందారు. వారిపై జరిగే అఘాయిత్యాలను అరికట్టాలంటే సమాజంలో మార్పు రావాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని అభిప్రాయపడినారు. స్త్రీ విద్య దేశానికి ప్రామాణికమని, ఒక బాలిక చదువుకుంటే భవిష్యత్ లో తన కాళ్లపై తను నిలబడి ఆర్థిక భద్రత పొందుతుందంటారు. తన కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడానికి, గౌరవం పొందడానికి, సమాజ శ్రేయస్సుకు స్త్రీ విద్య అవసరమని పేర్కొన్నారు. అంతేకాక ‘ఆ కమ్మని పలుకే అమ్మ‘ అంటూ అమ్మ ప్రేమ గురించి రాసిన వ్యాసం అమృతంలాగా ఉంది. మాదక ద్రవ్యాల వినియోగంతో యువతీ యువకులు ఎలా పెడత్రోవ పట్టి పతనమువుతున్నారో మరొక వ్యాసంలో తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు గల యువత మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని యువత మాదక ద్రవ్యాల వాడకం వీడి సమ సమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అంతేకాక తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తమ పిల్లలు ఎం చేస్తున్నారనే విషయాన్ని ఓ కంట కనిపెట్టాలంటారు. భారత దేశ ఉన్నతిని ప్రపంచం నలుదిశలా చాటిన స్వామి వివేకానందని జీవితాన్ని నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని హితబోధ చేశారు. తన వ్యాసాలతో యువతలో ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశారు రచయిత చిటికెన.
కరోనా సృష్టించిన విలయతాండవం గురించి, మనుషుల మధ్య అనుబంధాల గురించి తెలియజేశారు. ఆ సమయంలో తమ జీవితాలను కూడా పణంగా పెట్టి పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది చేసిన సేవలను కొనియాడారు. కాలుష్య నియంత్రణ మన అందరి బాధ్యత అని చాటి చెప్పి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం ఆలోచింపజేసే విధంగా ఉంది. యుద్దాలు మానవ వినాశనానికి కారణం అవుతున్నాయని వాటి వలన కలిగే నష్టాలను వివరించారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో మంది చిన్నారులు తమ వాళ్ళను కోల్పోయి అనాథలుగా మారడం బాధాకరమని అన్నారు. సమాజ శాంతితోనే ప్రపంచ శాంతి నెలకొంటుందని ఆశించారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విలువలతో కూడిన సంస్కృతి, సాంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయని మన అలవాట్లు ప్రపంచానికి దిక్సూచిగా మారనున్నాయని అన్నారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య గురించి, తెలంగాణ ప్రాంతంలో అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ గురించి, చేనేతన్నల జీవితాల గురించి, అంతర్జాలంలోని మాయాజాలం గురించి, అంతర్జాతీయ జీవ వైవిధ్యం గురించి, సమాజంలో రచయితల బాధ్యత గురించి ఇలా అనేక అంశాలను ఈ వ్యాసాల్లో చర్చించారు. సమాజంలో నెలకొన్న కొన్ని సమస్యలకు సమాధానంగా నిలిచింది ఈ పుస్తకం. సమకాలీన సమాజంలో ఏది నిజం ఏది అబద్దం అనే అంశాలను విశ్లేషిస్తూ సమాజంలోని వాస్తవ సంఘటనలను సవివరంగా వివరించారు. పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యతను, వ్యాయామం చేయడం వలన ఉపయోగాలను తెలియజేశారు. ఆత్మ విశ్వాసం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు అనే విషయాన్ని యువతకు గుర్తుచేశారు. మనోధైర్యంతో ముందుకు సాగాలని సమస్య ఏదైనా మన సంకల్పబలంతో ఎదుర్కోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
సాహిత్యం ద్వారా సమ సమాజ మార్పు కొరకు అహర్నిశలు తపిస్తున్న కవి చిటికెన సమకాలీన సమస్యలపై ఎప్పటికప్పుడు తన కలం ద్వారా అక్షర పోరాటం చేస్తున్న సాహితీ యోధుడు. కవిగా, రచయితగా, వ్యాసకర్తగా, కథకుడిగా, సమీక్షకుడిగా రాణిస్తూ అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పలు సాహితీ సంస్థలచే పొందిన డా. చిటికెన కిరణ్ కుమార్ కలం నుండి సమాజాన్ని చైతన్య పరిచేలా మరెన్నో రచనలు రావాలని ఆశిద్దాం.
చైతన్య స్ఫూర్తి పుస్తకం వెల. 110 రూపాయలు
ప్రతులకు….
డా. చిటికెన కిరణ్ కుమార్
12-9-103, సర్దార్ నగర్,
సిరిసిల్లా జిల్లా. పిన్. 505 301 తెలంగాణ.
సెల్. 94908 41284

కందుకూరి భాస్కర్
9703487088

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News