Monday, December 23, 2024

చూపునిచ్చే అందే కథలు

- Advertisement -
- Advertisement -

‘The storyteller sets the vision, values and agenda of an entire generation that is to come’
STEVE JOBS
కాలగతిలో ఎందరో మహానుభావులైన కథకులు తమ ఆనవాళ్లగా అద్భుతమైన కథలు ముందుతరాల వారికి వదిలివెళ్లారు.అందులో కొందరు తమ కులం వల్లనో, అవకాశాలు అంది రావడం వల్లనో,స్వయం ప్రతిభ వల్లనో తొందరగా వినుతికి ఎక్కితే, కొందరు ఎంత ప్రతిభ వున్నా కారణాంతరాల వల్ల చరిత్ర గతిలో విస్మృతిలోకి జారిపోయారు.అటువంటి వారిలో ప్రథములు శ్రీ అందే నారాయణస్వామి గారు (19081982).
అంది వచ్చిన వివరాల ప్రకారం శ్రీ అందే నారాయణస్వామి గారికి చాలా చిన్న వయసులోనే విషజ్వరానికి వేసిన మందు వికటించి అంధత్వం వచ్చిందని, అయినా నిపృహ చెందకుండా , తనకు తెలిసిన జీవితాల్ని స్ఫురణ ద్వారా , వినికిడి ద్వారా కథలుగా మలచారని..తద్వారా ఎంతోమంది ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారని.
నాకు వెంటనే పురాతన గ్రీకు రచయిత,కవి హోమర్ ; ఇంగ్లీషు కవి జాన్ మిల్టన్ ; ఐరిష్ నవలాకారుడు, కథారచయిత జేమ్స్ జాయిస్; అర్జెంటీనా కథా రచయిత జార్జ్ లూయిస్ బోర్జెస్; అమెరికన్ రచయిత్రి హెలెన్ కెల్లర్; అమెరికన్ కార్టూనిస్ట్, రచయిత జేమ్స్ థర్బర్ ; అమెరికన్ నవలా,కథా రచయిత్రి అలైస్ వాకర్; బ్రిటీష్ రచయిత ఆలివర్ సేక్స్ ; ఇంగ్లీషు రచయిత్రి స్యూ టౌన్సెండ్ , మన తెలుగులో రేచీకటి ప్రాప్తించిన చిలకమర్తి లక్ష్మీనరసింహం మొదలయిన వారు మదిలో మెదిలారు. వీరిలో కొంతమందికి పాక్షిక అంధత్వం వుంటే, కొంతమందికి మన నారాయణస్వామి గారిలా దురదృష్టవశాత్తు మధ్యలోవచ్చింది.వీరంతా తమకున్న దృష్టిలోపాన్ని అధిగమించి, జ్ఞాన చక్షువుతో అద్భుతమైన రచనలు చేసారు.
అందే నారాయణస్వామి గారు ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి తన కథారచన సాగించారు.అయితే అది ఆయన అంత సామాన్యంగా కూడా తీసుకోలేదు.తన సర్వ శక్తులు కూడదీసుకొని ఆయన తన మనసులోని కథలను పైకి చదువుతూ తనవాళ్లతో రాయించారు.ఆయన కథలు మూసకథలు కావు.ఒక సంఘటనో లేదా సంఘటనల చుట్టూ అల్లుకున్న కొన్ని మాటలు కాదు.ఏవో కొన్ని పాత్రల అతుకుల అలుకుడు కాదు. కాలక్షేపానికి చెప్పుకునే ఉబుసుపోని కబుర్లు కాదు.ఏ పరమార్ధిక ప్రయోజనము ఇవ్వనిది కథ కాదు.కథ చదవక ముందు ,కథ చదివిన తర్వాత మనం ఒకేరీతిగా వుంటే అది మంచి కథ కాజాలదు.కథ చదివిన తర్వాత మనసులో మంచో,చెడో ఏదొక మార్పు రావాలి.ఒక జీవిత శకలాన్ని చూసిన అనుభవం కలగాలి.ఆయా వ్యక్తుల మధ్య మనం కూడా తారాడి, ఆ వ్యక్తుల సాధకబాధకాలు మనం కూడా పడాలి.
సదరు మనుషుల మనసుల్లో, ఆలోచనల్లో చెలరేగిన మానసిక అల్లకల్లోలం దగ్గరగా చూసి,అనుభూతించి, విభేదించి,ఏకీభవించి,మనలో మనం కూడా వాదించుకుని ఆనందించి,బాధపడి,తేటపడి,చివరికి కథతో పాటు కుదుటపడేట్టు చేసేదే కదా కథంటే..!నారాయణస్వామి గారి
కథలు అటువంటి అనుభవాన్ని ఇస్తాయి.
శ్రీ పెనుగొండ లక్మ్షీనారాయణ గారు అందే నారాయణస్వామి కథలు కు సర్వసమగ్రమయిన పరిచయం‘విస్మృత కథా రచయిత అందే నారాయణస్వామి’ రాస్తూ..‘అందే నారాయణస్వామి గారు తన కథలలో సామాజిక అసమానతలను, స్వాతంత్య్రానంతరం పాలకపక్షాలు సామాన్య ప్రజల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరులను నిరసించారు. స్త్రీలకు ఆస్తి హక్కు వుండాలన్నారు.వితంతు స్త్రీల సమస్యలను ప్రస్తావిస్తూ, అంతర్లీనంగా ఆనాడు సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాలను విమర్శించారు. లేమి వలన రైతు,కూలీ కుటుంబాలు పడుతున్న అగచాట్లను ప్రతిబింబించారు.ధనికుల,వడ్డీ వ్యాపారుల పీడనను చిత్రించారు. శ్రమజీవుల పట్ల, పేదల పట్ల ఎంతో ప్రేమను ప్రకటించారు. ధార్మికత, జీవకారుణ్యం, స్నేహమాధుర్యం, సృష్టిలో తేడాలు,పల్లెసీమల జీవన విధానం, జానపదుల మనస్తత్వ పరిశీలన వీరి కథలలో విస్తరించాయి.వీరి కథలు సహజత్వానికి సమీపంగా వుంటాయి. కుల,మత వర్గాలు సామరస్యత కలిగి వుండాలనేది వీరి తాత్విక దృష్టి.‘ అనడం నిజంగా నిజం. నారాయణస్వామి గారి కథలను క్షుణ్ణంగా చదివి అంటున్న మాట.
అందే నారాయణస్వామి గారి కథలు వస్తుసౌష్టవంతో, అప్పటి సామాజిక పరిస్థితులు కళ్లకు కడుతూ, కథలోకి పాఠకుడ్ని సునాయాసంగా లాక్కెళ్లిపోయి, అనాయాసంగా పెద్దకథలను కూడా ఒక్కపెట్టున చదివించేయగలవు. ఆయన కథల్లో పాత్రల మానసిక చిత్రణ , సంఘర్షణ చాలా లోతుగా వుండి చాలాసార్లు ఆశ్చర్యకరంగా కథాకథనం సాగుతుంది.ఎదుటివారి మనసులో దూరి వారి ఆలోచనలు చదివేసి రాసారా అనిపిస్తుంది .చాలా కథల్లో ఒక స్పష్టమైన సామాజిక ప్రయోజనం ముందు వుంచుకొని ఆయన కథలు రాసినట్టు తెలుస్తుంది.
ఆయన తన రచనలను స్వాతంత్య్రం పూర్వం ముందు ప్రారంభించి స్వాతంత్య్రం వచ్చాక కూడా చాన్నాళ్లు కథా రచన కొనసాగించారు. తొలి కథా సంపుటి వ్యత్యాసాలు’ ( 1940 ) లో, రెండవది ’స్నేహితుడు’ ( 1956 )లో , మూడవది ’ ఉపాసనా బలం ( 1957 )లో, నాలుగవ కథాసంపుటి ’ కారుణ్యం (1958 ) లో వెలువడినాయి.ఇవి గాక రెండు నవలలు ’ ఇద్దరు తల్లులు ’ ; ’ కష్టసుఖాలు’ వెలువడ్డాయి.ఈ నాలుగు కథా సంపుటాలలో ఇరవై ఎనిమిది కథలకు మరో ముప్పది కథలు జతచేసి ముద్రించిన ’ అందే నారాయణస్వామి కథలు’ చాలా అంశాల పరంగా విశిష్టమైనది. పెనుగొండ గారు అన్నట్టు అందే నారాయణస్వామి గారు అప్పటి పరిస్థితుల్లో అంత ప్రాముఖ్యత లోకి రాక విస్మృత కథకుడు అయాడు.కథా నిర్వహణలో గొప్ప ప్రతిభాశాలి అయి వుండి కూడా వెలుగులోకి రాలేకపోయారు.
WALTER MOSLEYఅన్నట్టు ‘A good short story asks a question that can’t be answered in simple terms‘ … ఆ రోజుల్లోనే ఆయన రాసిన కథలు అభ్యుదయ భావాలతో,జాతీయ భావాలతో నిండి వుండి ఆయా కాల పరిస్థితులను ప్రశ్నించే స్వరం కలిగి వున్నాయి.స్త్రీ ల అభ్యున్నతి కాంక్షించి , వారి సర్వతోముఖాభివృద్ది కోరుకున్న ఏకైక బహుజన రచయితగా ఆయన నిలబడుతున్నాడు.స్త్రీలకు ఆస్తిహక్కు వుండాలని వాదించిన ఆయన కథల ఫలితంగా నేడు స్త్రీలకు పురుషులతో సమానంగా ఆస్తిహక్కు రావడం ఆయన భవిష్యత్ దృష్టికి తార్కాణం.అలాగే తన సామాజిక వర్గానికి చెందిన ఎన్నో వృత్తిపరమైన, సామాజిక పరమయిన సమస్యలు కథల్లో చిత్రించిన రచయితగా అందే నారాయణస్వామి గారు సాహిత్య చరిత్రలో నిలబడుతారు.సామాజిక వివక్షను,అసమానతలను ఆ విధంగా ప్రశ్నించిన బహుజన రచయిత మరొకరు లేరు.
అలాగే చేనేతల సమస్యల మీద గొంతెత్తిన మొదటి బహుజన రచయిత కూడా వీరే. ఇక ఆయన కథల్లో మనం ఈ రోజు ఆధునిక వ్యక్తీకరణలు గా అనుకుంటున్న అనేక టెక్నిక్ లను ఆయన ఆ రోజుల్లోనే ప్రవేశపెట్టాడు. ’ నువ్వు కాదూ..’ కథలో ఎద్దు తలతో మాట్లాడించడం ఊహించలేనిది.’తానొకటి తలిస్తే..’ కథలో స్త్రీ పాత్రల్లోని ఎత్తుపల్లాలను అరవింద, దుర్గమ్మ పాత్రలతో ఒక పాత సినిమా చూస్తున్నంతగా, కళ్లకు కట్టినట్డుగా హాయిగా ఎక్కడా కథా గమనం దెబ్బతినకుండా, ప్రయోజన పూర్వకంగా నడపడం విస్మయం. ప్రతి కథలోనూ సంభాషణల్లో సహజత్వం, సహజ వాతావరణ చిత్రణ, మాండలిక పదాల సమయోచిత ప్రయోగం, సన్నివేశాల కూర్పు ఆయన్ను ఒక మేలిమి కథా రచయితగా నిలబెడుతున్నాయి.అంతేగాక ఆయన తన కథల్లో వాడే సామెతలు, జాతీయాలు కథకు అతికినట్టు సరిపోయి కథా గమనానికి బలం చేకూరుస్తాయు.కొన్ని చోట్ల సూచనప్రాయంగా ఆయన చేసే పోలికలు కథకు ఒక తూగును , గాఢతను ఇచ్చేవే. ఉదాహరణకు’ తానొకటి తలిస్తే ..’కథలో అరవింద ఆత్మార్పణను ‘ అదే సమయానికి ఊరి వెలుపల చెరువులో నిశ్చలంగా నిద్రపోతున్న నీళ్లు గూడా శబ్దం చేసి త్రుళ్లిపడి లేచినవి.‘ అని ధ్వన్యాత్మకంగా ముగించడం ఏ ఆధునిక కథా ముగింపుకు తీసిపోదు. ‘చీకటి తెరలు’ కథలో ముగింపులో ఊహించని దిగ్భ్రాంతి కి రాధ గురయినట్టు పాఠకుడు కూడా గురవుతాడు.ఏం జరిగిందో తెలిసేప్పటికే కథ ముగిసి చదువరి మనసులో ప్రారంభం అవుతుంది.ఈ కథ ఓ హెన్రీ కొసమెరుపు కథల స్థాయి కథ.
ఈ పుస్తకంలో వున్న యాభై ఎనిమిది కథలూ చదవడం ఒక దివ్యమైన అనుభవం. ఆయన తన కథల ద్వరా మన మనోఫలకాల మీద వేసే ప్రభావం సామాన్యమైనది ఏ మాత్రం కాదు.పొరలు పొరలుగా 1940- 1975 ప్రాంత మధ్యతరగతి మనుషుల , శ్రామిక జీవుల జీవనాలను, అంతరంగాలను, అంతర్యుద్ధాలను ప్రతిబింబించిన ఈ కథలు ఈ విధంగా ఇప్పటికయినా వెలుగు చూడటం ఆనందదాయకం. ఈ కథలు విస్తృతంగా ప్రజల మధ్యకు చేరాల్సిన అవసరం వుంది.విశ్వవిద్యాలయాలలో పరిశోథక విద్యార్థులకు పాఠ్యాంశంగా వుండాల్సిన అవసరం వుంది.ఎంతో శ్రమకు ఓర్చి ఈ గ్రంథం ఇలా రావడానికి కారణం అయిన అందే నారాయణస్వామి గారి కుమారుడు బాబా ప్రసాద్ గారు తన తండ్రి ఋణం తీర్చుకున్నాడనే చెప్పాలి. బాబాప్రసాద్ గారికి సహకరించిన సహచరి విద్యాధరి, శ్రమ,
పట్టుదలతో ౄTP చేసి పుస్తక ముద్రణకు అత్యంత శ్రద్ధ తీసుకున్న అవ్వారు శ్రీనివాస రావు గారు..అందంగా ముద్రించిన కలిమిశ్రీ, శ్రామిక జన జీవనం ప్రతిబింబించే ముఖచిత్రం అందజేసిన పి.ధనుంజయ ప్రసాద్ గారులకు సాహిత్య ప్రపంచం బాకీ పడింది.
అందే నారాయణస్వామి గారి కథల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే …కవిసామ్రాట్ విశ్వనాథ గారు అన్నట్టు అందే వారు తెలుగువారి ’ మొపాసా’ ( Guy de Maupassant ). ఆయన కథలను కొని,చదివి,తెలుగునేల నాలుగు చెరగులా చేరేలా చేయాల్సిన బాధ్యత కథాభిమానుల అందరి మీదా వుంది. ‘ We are all storytellers. We all live in a Network of stories. There isn’t a stronger connection between people than storytelling.’ JIMMY NIEL SMITH
పుస్తకం : అందే నారాయణస్వామి కథలు
రచయిత : అందే నారాయణస్వామి
ప్రచురణ : మల్లెతీగ ముద్రణలు
పేజీలు : 454
వెల : 400/-
ప్రతులకు : కలిమి శ్రీ -92464 15150
అవ్వారు శ్రీనివాస రావు -94920 80519

పి.శ్రీనివాస్ గౌడ్
9949429449

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News