Monday, December 23, 2024

కృపాకర్ కవిత్వంలో స్త్రీ

- Advertisement -
- Advertisement -

కృపాకర్ మాదిగ పరిచయం అవసరం లేని వ్యకి. సామాజిక ఉద్యమాలలో,అస్తిత్వ ఉద్యమాలలో తనదైన ముద్ర వేసుకున్న కృపాకర్ కవిగా కూడా తనదైన గొంతును బలంగా వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవలే ‘పంచుకుందాం రా‘ అనే పేరుతో తన కవితా సంపుటిని వెలువరించారు.
స్త్రీవాద సాహిత్యం తెలుగులో ఎక్కువగా రావడం ప్రారంభమయింది 1980 ల కాలం నుండి. దాదాపు అదే సమయం నుండీ కృపాకర్ మాదిగ కవిత్వం రాస్తున్నారు. ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ సమాజం నుండి అంచులకు నెట్టివేయబడ్డారో వారి వేదనని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, వారి ఆశలను, ఆకాంక్షలను కూడా కృపాకర్ గారు కవిత్వీకరిస్తూ వచ్చారు.
చాలామంది ఇతర కవులలానే తాను కవిత్వం రాయడం ప్రారంభించిన తొలినాళ్ళ నుండీ ఆయన స్త్రీల సమస్యలను, స్త్రీలకి సంబంధించిన సమస్యలను తన కవిత్వంలో ప్రస్తావిస్తూనే వచ్చారు. స్త్రీల తరపున తన గొంతును వినిపిస్తూనే ఉన్నారు. మహిళలకు సంబంధించిన అంశాలపై కవిత్వం రాసిన కవులు అనేకమంది ఉన్నప్పటికీ కృపాకర్ ను వారి నుండి భిన్నంగా నిలబెట్టే అంశం ఏమిటి అనేది ఈ వ్యాసంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
స్త్రీ కేంద్రక కవిత్వం రాసే అనేకమంది ఇతర కవులను గమనిస్తే స్త్రీలు వంటింటి కుందేళ్ళుగా మారిపోయారనీ, వంటిళ్ళు వారికి జైళ్ళుగా మారిపోయాయనీ, వాటి గోడలు బద్దలు కొట్టాలనీ రాస్తుంటారు. వారికి భిన్నంగా కృపాకర్ అసలు వంటిళ్ళే లేని మహిళల గురించి రాస్తారు. పొద్దున లేచిన దగ్గర నుండీ పనికోసం ఇంటి బయటే ఉండాల్సిన మహిళల తరపున మాట్లాడతారు.
స్త్రీవాద సాహిత్యాన్ని తొలినాళ్ళ నుండీ నిశితంగా పరిశీలిస్తే అది ఎప్పుడూ స్త్రీ జనాభాలో ఒక పది శాతం మంది మహిళల సమస్యలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. కాస్తో కూస్తో చదువుకుని, కొద్దో గొప్పో అవకాశాలు అందిపుచ్చుకుని, సామాజికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా కొంత మెరుగైన స్థాయిలో ఉన్న మహిళల సమస్యలనే సాహిత్యం కూడా ప్రతిఫలిస్తూ వచ్చింది. ఎవరైతే అంచులకు నెట్టివేయబడ్డారో, ఎవరైతే నిచ్చెన మెట్ల పితృస్వామ్య వ్యవస్థలో అత్యంత దిగువ స్థాయిలో ఉంచబడ్డారో వారిసమస్యలు సాహిత్యంలో కనిపించేది చాలా అరుదు. అటువంటి అరుదైన కవిత్వం కృపాకర్ రాశారు. నిచ్చెన మెట్ల పితృస్వామ్య వ్యవస్థలో అత్యంత దిగువన ఉండేది ఎవరు అని చూస్తే అది నిరుపేద దళిత మహిళ అయి ఉంటుంది. పేదరాలు కావడం, దళిత వర్గానికి చెంది ఉండడం, మహిళ కావడం అనే మూడు రకాల వివక్షల బరువును మోస్తున్న మహిళ వేదన అర్ధం కావాలంటే కాస్తోకూస్తో ఆ బరువును మోసి ఉండాలి, ఏదో ఒక రూపంలో ఆ వివక్షను అనుభవించి ఉండాలి. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టే కృపాకర్ ఇలాంటి కవిత్వం రాయగలిగారు. ఆయన ఒక కవితలో ఇలా రాస్తారు. /జోగినీతనం/ మాతంగితనం/ మాతమ్మతనం/ బసవితానం/ లైంగిక వెట్టితనం/ సిగ్గుకు తడికల్లేని తనం/ చావు కంటే హీనం కాదా/ అంటారు. ఈ కవితలో సిగ్గుకు తడికల్లేని తనం అని చదవగానే నాకు ఒక సంఘటన గుర్తు వచ్చింది. నేను పాల్గొన్న ఒక మహిళా సదస్సులో ఒక సభ్యురాలు లేచి తాను ఆ సదస్సుకు విమానంలో వచ్చే ముందు ఎయిర్పోర్ట్ లో ఉన్న టాయిలెట్ కు వెళితే అక్కడ తన హ్యాండ్ బ్యాగ్ తగిలించుకునేందుకు ఒక్క హాంగర్ కూడా లేదనీ, టాయిలెట్ లు డిజైన్ చేసేది, నిర్మించేది ఎక్కువగా మగవారే కాబట్టి వారికి ఇటువంటి అవసరం ఉండదు కాబట్టి హాంగర్ లు పెట్టాలనే ఆలోచన రాదు అన్నారు. మహిళలకు సంబంధించిన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగిన అటువంటి సదస్సులలో కూడా టాయిలెట్ కు హాంగర్ లేదు అనే అంశం చర్చకు వచ్చింది కానీ అసలు టాయిలెట్లే లేని కుటుంబాల గురించి, ఇంకా బహిర్భూమిని ఉపయోగించాల్సి రావాల్సిన వారి వెతల గురించి ఏ సదస్సులలోనూ చర్చకు రావడం లేదు. సాహిత్యంలో కూడా చాలా అరుదుగా చర్చకు వచ్చాయి. ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే కృపాకర్ ఎవరి తరపున తన గొంతును వినిపిస్తున్నారో గుర్తుచేసేందుకు.
నేను ముందు ప్రస్తావించిన అదే సదస్సులో సినీ నటి నందితా దాస్ కూడా పాల్గొన్నారు. ఆమె తన ప్రసంగంలో భాగంగా ఇలా అన్నారు. ఎవరైతే సమస్యల బరువులను మోస్తున్నారో ఆ సమస్యలను పరిష్కరించుకునే పోరాటాల బరువును కూడా వారే మోయాల్సి ఉంటుంది. వాటి వలన ఎదురయ్యే సవాళ్లు కావొచ్చు, సమస్యలు కావొచ్చు, ఘర్షణ కావొచ్చు, అవి కూడా వారే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారామె. అది చాలా కఠినమైన ప్రయాణం. అటువంటి పోరాటాల ప్రయాణంలో ఇటువంటి సహానుభూతి గల గొంతులు కలిస్తే ఆ ప్రయాణం కాస్త తేలికవుతుందేమో అనిపించింది ఈ కవిత్వం చదువుతుంటే.
ముందే అనుకున్నట్లు స్త్రీవాద సాహిత్యం ఎప్పుడూ ఒక వర్గానికి చెందిన మహిళల సమస్యలనే ప్రతిఫలిస్తూ వచ్చింది. కృపాకర్ కూడా ఒక చోట ఇలా రాస్తారు.
మేము మా బిడ్డల తల్లుల/ ఆర్తనాదాల దుఃఖంలో మునిగినప్పుడల్లా/ మీరు మా మట్టి మహిళల సమస్యలను/ ఊరి మహిళల, అగ్రహారాల మహిళల/ సమస్యలలో కలిపేస్తారు/ మనుషులంతా ఒక్కటేనని దబాయిస్తారు/ మనుషులందరూ సమానమే అనే ఆదర్శం అందరూ వల్లించేదే కానీ వాస్తవానికి మనుషులంతా కులాలుగా, మతాలుగా,వర్గాలుగా విడిపోయి ఉన్నారు అనేది అందరకూ తెలిసిన విషయమే. ఈ భిన్నత్వాల నుండి పుట్టుకొచ్చిన ఎన్నో అసమానతలు కూడా ఉన్నాయి. ఇలా మనుషులంతా ఎలాగైతే ఒకటే కారో మహిళలంతా కూడా ఒకటి కారు, ఊరి మహిళ వేరు, వారి సమస్యలు వేరు, వాడ మహిళ వేరు, ఆమె సమస్యలు వేరు అనేది కృపాకర్ కవిత్వం స్పష్టం చేస్తుంది.
పైన ప్రస్తావించిన కవిత చదివినప్పుడు మనకు బ్లాక్ ఫెమినిస్ట్ ఉద్యమం కూడా గుర్తు వస్తుంది. పాశ్చాత్య స్త్రీవాద ఉద్యమాలన్నీ కూడా మధ్యతరగతికి, ఎగువ మధ్యతరగతికి చెందిన స్త్రీల సమస్యలనే ప్రతిఫలిస్తూ వచ్చాయి అనే ఉద్దేశంతో దిగువ, పేద వర్గాలకు చెందిన నల్లజాతి మహిళలు ప్రారంభించిన బ్లాక్ ఫెమినిస్ట్ ఉద్యమం, అలాగే ‘యామ్ ఐ నాట్ ఎ వుమన్?‘ అని ప్రశ్నించిన బెల్ హుక్స్ పుస్తకం కూడా గుర్తు వస్తుంది ఈ కవితలు చదువుతున్నప్పుడు.
అసమానతల గురించి మాట్లాడేటప్పుడు మరొక విషయం ప్రస్తావించాలి. లింగ వివక్ష అంశంపై పనిచేసే కార్యకర్తలు సాధారణంగా ఎదుర్కునే ఒక సందిగ్ధం ఏమిటి అంటే లింగ వివక్షకు మద్దతుగా ఉన్న విధానాలను మార్చడంపై దృష్టి పెట్టి పనిచేయాలా లేదా లింగ వివక్ష ఏ పునాదులపై అయితే వేళ్ళూనుకుని ఉందో ఆ సామాజిక నిర్మాణాలను కూల్చే దిశగా పనిచేయాలా అనేది. మన వనరులను, ప్రయత్నాలను విధానాలు మార్చడంపై కేంద్రీకరించాలా లేక సమాజపు ఆలోచనా ధోరణులను మార్చడంపై పనిచేయాలా అనే సందిగ్ధం కార్యకర్తలకు ఎప్పుడూ ఉండేదే.
నేనేమంటాను అంటాను రెండింటి మీదా సమాంతరంగా ప్రయత్నాలు జరగాల్సిందే. గతంతో పోలిస్తే విధానాలలో అనేక మార్పులు వచ్చాయి. మహిళలకు అనుకూలమైన చట్టాలు ఎన్నో వచ్చాయి. మహిళా ప్రగతికి అనువైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. కానీ సమాజ ధోరణులకు, ఈ చట్టాలకు మధ్య ఎంతో వైరుధ్యం ఉంది, ఘర్షణ కూడా ఉంది. ఈ పరిస్థితి మారాలి అంటే మనుషుల ధోరణులలో, ఆలోచనా దృక్పధాలలో మార్పు రావాలి. ఆ మార్పు పురుషులలోనూ రావాలి, స్త్రీల లోనూ రావాలి. దానిని ఆశిస్తూనే కృపాకర్ మగవారిని ఉద్దేశిస్తూ మనిషివికా అనే తన కవితలో ఇలా అంటారు.
భర్తగానో తండ్రిగానో/ తాతగానో కొడుకుగానో/ అల్లుడుగానో మామగానో/ మగాడుగానో మాత్రమే ఉండకు/ పాకుడు పట్టిన పాత్రల విలువలను పారబొయ్యి/ జీవితమంటే స్నేహపాత్ర అనే ఎరుకలోకి వచ్చెయ్యి/ నువ్వు కొమ్ములున్న మృగాడివి కాదు మగాడా, నువ్వు మనిషిగా మారు అంటారు కృపాకర్. మగవారికి ఇలా సందేశమివ్వడమే కాకుండా స్త్రీలలో కూడా మార్పును కోరుకుంటూ, వారు కూడా తమ అభిప్రాయాలను, ఆకాంక్షలను వ్యక్తపరచడంలో మరింత బలంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ’కల్లోలిత’ అనే తన కవితలో ఇలా అంటారు.
నటించడం నావల్ల కాదిక/ నేను ముసుగును చింపేస్తున్నాను/ క్షమయా ధరిత్రిని కానందుకు/ క్షమాపణ కోరే ప్రశ్నే లేదు/ అరిటాకుతనాన్ని, పాచిపోయిన పవిత్రతని/ చుట్టూ గోడల్ని నేనెప్పుడూ కోరుకోలేదు/ నువ్వే తయారు చేసావు/ నీ ఆధిక్యతలోని రక్షక స్వభావం/ చాపకింద నీరులా పొంచి ఉన్న పులిలా/ ఉందని ఇప్పుడే అర్ధమయింది అంటారు. ఇదే కవితలో ముగింపు వాక్యంగా కృపాకర్ ‘నీలోని రాజ్యాన్ని కూల్చక తప్పదు‘ అని రాశారు. వ్యక్తి స్వేచ్ఛను గౌరవిస్తూ,వ్యక్తుల సంపూర్ణ వికాసానికి తోడ్పడాల్సిన రాజ్యం ఎలా అయితే ఒక అధికార వ్యవస్థగా మారిపోయిందో, పీడనకు దోహదపడే ఒక వ్యవస్థగా మారిపోయిందో అదేవిధంగా స్త్రీ పురుష సంబంధాలు కూడా అధికార వ్యవస్థలుగా, పీడిత, పీడక సంబంధాలుగా మారిపోయాయి అనే ఎరుకతో రాసిన వాక్యం ఇది అనిపించింది చదవగానే. ఇదంతా అలా ఉంచితే ఈ పుస్తకం చదివి పక్కన పెట్టిన తర్వాత కూడా ఈ పుస్తకంలోని ఒక కవిత నాకు అనేక సందర్భాలలో పదే పదే గుర్తు వస్తూ ఉంది. ‘మరియమ్మల మానిఫెస్టో‘ అనే ఆ కవితలో కొన్ని వాక్యాలు ఇక్కడ ప్రస్తావిస్తాను./ మీ పధకాల వల మా మీద విసరకు/ మాపై మేమే ఆధారపడనీ/ మీ వెచ్చాల బిచ్చాలు మాకెయ్యకు/ మా స్వయం సమృద్ధిని మేమే అందుకోనీ/ గొర్రెలు గేదెలు చేపలు చాకిరేవులు అట్లుండనీ/ అధికారపగ్గాలు మాకందనీ అంటారు ఈ కవితలో. విధానాలను, ప్రభుత్వాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న సభలలోకి, సదస్సులలోకి ఇటువంటి మరియమ్మల మానిఫెస్టోలు, అలీసమ్మల అజెండాలు ఎప్పటికి వెళ్లగలవో అనేది నాకు ఇది చదవగానే కలిగిన, నన్ను వెంటాడిన ఆలోచన. అటువంటి ఆలోచన రేకెత్తించగలిగేదే అసలైన, బలమైన కవిత్వం అని నేను అంటాను. మాకు కావాల్సింది మీ సంక్షేమ పధకాల భిక్ష కాదు స్వాధికారత, స్వయం సమృద్ధి అనే మహిళల ఆత్మగౌరవ ప్రకటన ఈ కవితలోనే కాదు ఈ పుస్తకంలోని అనేక కవితల్లో కనిపిస్తుంది. స్త్రీవాద కవిత్వం లేదా స్త్రీ కేంద్రక కవిత్వాన్ని స్త్రీలు రాయడం వేరు, పురుషులు రాయడం వేరు. స్త్రీల సమస్యలను స్త్రీల కోణం నుండి అర్ధం చేసుకుని, వారి వేదనను వారి గొంతుతో వ్యక్తీకరించగలగాలంటే అందుకు రాయగలిగే శక్తి మాత్రమే ఉంటే సరిపోదు, భాష మాత్రమే ఉంటే సరిపోదు. ఎవరి సమస్యలను వారి కోణం నుండి అర్ధం చేసుకునే సహానుభూతి కావాలి. ఆ సహానుభూతి ఉన్న కవి కృపాకర్ అని నాకు అర్ధమయ్యింది. ఆ సహానుభూతి అలాగే నిలుపుకుంటూ ఎవరి సమస్యలను మెయిన్ స్ట్రీమ్ సమాజం నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందో అటువంటి వారి తరపున మాట్లాడుతూ కృపాకర్ తన సాహిత్య ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను.

భారతి కోడె

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News