Saturday, January 11, 2025

వెలుగు దివ్వెలు-ఉత్తేజ విజయాలు

- Advertisement -
- Advertisement -

సింహాలు తమ చరిత్ర తాము రాసుకోనంతకాలం వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది’ అంటారు – చినువా అచెబే. కండబలం, అండబలం, ఆర్థిక బలం కలవారే గన్నుల్ని పెన్నులుగా మలిచి చరిత్రలు రాయిస్తే అధికారాలు, ఆర్థిక వనరులు చరిత్రలుగా మిగులుతాయి తప్ప ప్రజల అవసరాలు, వ్యవస్థ అస్థిత్వాలు, మహనీయుల వ్యక్తిత్వాలు, ఆధిపత్య వ్యవస్థలు కూలిపోయిన విధానాలు చరిత్ర పుటల్లో నిలబడవు. కన్నీటి చారికలు, వెక్కిళ్ళపాటలు, మట్టి పాదాల ముద్రలు, పీడిత జనాల పోరాటాలు, పడిలేచిన బడుగు జీవుల విజయాలు, మధ్య తరగతి ప్రజల మందహసాలలేని చరిత్ర – మానవాళి ప్రస్థానంలో మరి ఇక కనబడదు కాక కనపడదు. అందుకే మన చరిత్రలు మనమే రాసుకోవాలి. గ్రంథస్తం చేయించుకోవాలి. ఈ శతాబ్దపు మలపు సామాజిక శాస్త్రవేత్తల పిలుపు అదే.
చరిత్ర అంటే విజయాల బావుటాలే కాదు, విలాసాల కోటల వికారాలే కాదు, పడినా లేచి నిలబడే మనసులదే చరిత్ర. పూరిగుడిసెల్లో పస్తులున్నా పదిమంది కోసం పాటుపడే మనుష్యులదీ చరిత్ర. సాటి మనిషిని బ్రతికించటం కోసం నిరంతరం కష్టించే నిస్వార్థ జీవితాలదే నిజమైన చరిత్ర. దురదృష్టం ఏమిటంటే అలాంటి చరిత్రల్ని అందరూ చూడలేరు. అలాంటి మనుష్యుల్ని అందరూ చేరలేరు – అలాంటి జీవన ప్రస్థానాల్ని అందరూ రాయలేరు. దానికి ఎంతో కార్యసాధన కావాలి. కర్తవ్య దీక్ష కావాలి. అన్నిటికీ మించి అందరి గొప్పతనాల్ని చూడగల నిస్వార్థమైన గుండె కావాలి. అదిగో అలాంటి మనిషి చేసిన పెద్ద యజ్ఞమే మూడు అనుభవసారాల పుస్తకాలు… ఒక జ్ఞాపకాల అనుబంధాల పొత్తిలి. మొత్తంగా నాలుగు పుస్తకాలు. బహుశా ఇది ఇప్పటి వర్తమానపు చరిత్ర పుస్తకాల కన్నా రేపటి తరాల వ్యక్తిత్వ వికాస దర్పణాలుగా అనిపిస్తాయి. నిజానికి వెలుతురు తోవలు, వెలుగు పూలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ”వెలుగు దివ్వెలు” అక్షర పుటల సంపుటిగా కన్న అక్షయమైన వ్యక్తిత్వాల అనుభవాల సారాల పొత్తిలి గానే నాకు కనిపిస్తున్నాయి.. నిలువెత్తు విజయాల పతాకలా ఎగురుతున్నాయి.
ఈ లిఖించాల్సిన విజేతల చరిత్రతో పాటు విస్మృతమైన రంగం మరొకటి కూ డా ఉంది. ఆదే వ్యవసాయ రంగం. వ్యవసాయం రైతు జీవన విధానం అనుకుంటారు చాలామంది. కానీ వ్యవసాయం వ్యయ సాయం కాకూడదని, వ్యవస్థలకు సాయంగా నిలబడాలని, మానవాళి మనుగడకు అదే జీవన వేదం కా వాలని గుర్తించరు. అందుకే అటు వ్యవసాయ ఘనత, ఇటు పుస్తకాల విలువ తెలిపిన మనకాలపు ఆర్యభట్టు మన గోపీచంద్ నాయకత్వంలో ”నభూతో నభవిష్యత్‌” అన్నట్టుగా తన జీవితాన్ని సఫలం చేసుకుంటూ గొప్ప పుస్తక యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ”మంచి పని చేసేటప్పుడు మనిషి కనపడకూడదు. ఆ పనే కనిపించాలి” అనే సూక్తిగా దర్పణంగా తాను కన్పించకుండా జీవితకాలమంతా పరితపించిన తన నిత్య ప్రేమిక బావ్యక కోసం, అందరూ కరోనా కాలంలో దిగులుగా తిని, పడుకుంటే తాను రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి అందర్ని ఆ మరణమృదంగ ధ్వని నుండి దూరంగా తీసుకొచ్చి అందరి చేత ఒక కొత్త ఉత్సాహంతో పనిచేయించి ’ఒక నేల అనేక ఆకాశాలు’ జ్ఞాపకాల సంపుటిగా అందించారు. అరే, ఇలాంటి పుస్తకం మనమూ వేసుకోవాలిగా అని ప్రతి విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్ధుల్లో ఒక స్ఫూర్తిని కల్గించారు.
తానొక్కడి సంకల్పం వల్లనే అయిందనుకోకుండా అందరిని సంఘటితం చేసి బాపట్ల విద్యార్థుల సమైక్య స్ఫూర్తిని అందరికీ అందిస్తూ 55 మంది జీవన రేఖల్ని హరిత రేఖలుగా సంబోధిస్తూ వేసిన ’వెలుతురుతోవలు” 100 మంది బ్రతుకు కధల్ని రేపటి తరపు స్ఫూర్తి బాటలుగా వెలువరించిన ’వెలుగుపూలు’, 70 మందితో ఇప్పుడు తీసుకొస్తున్న ’వెలుగు దివ్వెలు’ ఈ కోవలోకే వస్తాయి. నిజానికి రేపటితరం వీళ్ళని దర్శించుకునే అదృష్టం చేసుకోలేకపోవచ్చు. కానీ మన తరంలోనే జీవించిన ఇలాంటి గొప్ప మౌనుల్ని ఆ వికాస బావ్యక మానుల్ని, మౌన్యుల్ని దగ్గరుండి చూడలేకపోయినా, వారి జీవన ప్రస్థానాన్ని నిత్యస్మరణీయంగా, ప్రాతఃస్మరణీయంగా, చిరస్మరణీయంగా అందరికీ చెప్పడానికి మనం ఈ పుస్తకాలు చదవాలి.
నామటుకు నేను ఎందుకో ఈ పుస్తకాల్ని అన్ని పుస్తకాలుగా ఏకబిగిన చదవలేకపోయాను. కాఫీని సిప్ చేస్తున్నట్లుగా ఒక్కో పుటని నింపాదిగా తెరుస్తూ, ఒక్కో మనిషి జీవితాన్ని దృశ్యమానం చేసుకుంటూ ఒక ఆర్ట్ సినిమా చూస్తున్నంత దీక్షగా ఆస్వాదించాను. ఎన్నెన్నో మలుపులు, మరకలు, మెరుపులు, గెలుపులు. కొన్ని కథనాలు మెలితిప్పాయి. కొన్ని కన్నీళ్ళు పెట్టించాయి. మరికొన్ని పాఠాలు నేర్పించాయి. కొన్ని శాల్యూట్ చేయించాయి. ప్రతి ఒక్కరి జీవితం కొండంత స్ఫూర్తిని కలిగించింది. మరికొన్ని వ్యక్తిత్వ వికాస పాఠాలుగా పిల్లలకు బోధించాలనిపించింది.
ఈ బ్రతుకు పుటల్ని తిరగేస్తే – – మృత్తికా శాస్త్రాన్ని 30 ఏళ్ళపాటు బోధించిన యలమంచిలి నాగరాజారావు,- వెయ్యి ఎకరాల పోడుభూముల్ని జీడితోటలుగా మార్చిన ఇల్లూరి,- తాను అణచివేసిన త్రిపుర తిరుగుబాటుదారులే వారు ఉంటే చర్చలకు వస్తామని ప్రతిపాదించిన నిలువెత్తి వ్యక్తి అయ్యంగారు,- ఆత్మ విశ్వాస హరిత వృక్షంగా ఎదిగిన గుజరాత్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అందె, అదే విభాగానికి చెందిన రవికిరణం, శేఖర్ బాబు గడ్డం, యు. ప్రకాశం,- కానిస్టేబుల్ బిడ్డగా పుట్టి క్యాన్సర్‌ని ఎదిరించి పోరాడి గెలిచిన ఐఆర్‌ఎస్ ప్రిన్సిపల్ కమీషనర్ సలగాల నర్సమ్మ, పుస్తక భాండాగారాన్ని క్రోణలాజీకరించిన పోగుల,- రైతు కుటుంబంలో పుట్టి శాస్త్రవేత్తగా ఎదిగి రైతురుణం తీర్చుకున్న ప్రతిభ,- అంతర్జాతీయ వ్యవసాయ అవనికపై కొత్త ఆవిష్కరణల పతాకాన్ని ఎగురవేసిన కొమర్నేని,- పసితనంలో పశులకాపరిగా పనిచేసి కలపదొంగల్ని పట్టించిన అటవీ ముఖ్య సంరక్షణాధికారి సూర్యనారాయణ,- పర్యావరణ పరిరక్షకుడిగా ఎదిగిన త్రినాధ్‌కుమార్- 18 విత్తన పరిశోధనా ప్రాజక్టులకు రూపకల్పన చేసిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి- ఇల్లీగల్ మైనింగ్‌కు ముకుతాడు వేసిన పవన్‌కుమార్, ఐపిఎస్- భారత ప్రభుత్వం నుండి 9 మెడల్స్ సాధించిన అధికారి బత్తిన శ్రీనివాసుల టెర్రరిస్టులనే హడలెత్తించిన జొన్నలగడ్డ ప్రభాకర్/ సూడాన్‌లో యుఎన్‌ఓ తరఫున సలహాదారుగా పనిచేసిన ఆజాద్, ఐపిఎస్/ దేశంలో క్రికెట్ ఒక్కటే మతమంటూ యువతను ఒక్కటి చేసిన ఆవుల రమేష్, ఐపిఎస్./ కేరళ రాష్ట్రానికే శాంతిభద్రతలను అందించిన స్పర్జన్ కుమార్, ఐపిఎస్,/దేశ భద్రతలో 6 మెడల్స్ సాధించిన జీవి శివప్రసాద్, ఐపిఎస్/ ఐక్యరాజ్య సమితిలో ఎఫ్‌ఏఓ స్థాయికి ఎదిగిన జగన్నాధరావు/ మానవీయ విలువలకు చిరునామాగా వెలిసిన ముహ్మద్ ఆరీజ్ అహ్మద్, ఐఏఎస్/ ఎన్నో అవార్డులను సాధించిన అర్జా శ్రీకాంత్, ఐఆర్‌టియస్/ పలు మంత్రిత్వశాఖలు కోరుకునేంతగా ఎదిగిన అయ్యేశ్వరరావు/ మందుల పరిశ్రమల విస్తరణ సేవలు అందించిన మిక్కిలినేని అజయ్‌కుమార్/ కూలీ బిడ్డగా పుట్టి ఆర్మీ ఎయిర్‌ఫోర్సులకే ఆర్థిక సలహాలదారుగా పనిచేస్తున్న కటికెల వెంకట్రావ్/ – ఎన్నో దేశ సంస్కృతులను చూసి పని సంస్కృతిని భారత్‌లో చాటిన వంకెన జ్యోతిశ్రీ/ ప్రధాని మెచ్చిన ఐఎఫ్‌ఎస్ ప్రసాదరావు/ అంతర్జాతీయ శాస్త్రవేత్తగా అరుదైన విశేషాలు సాధించిన సుంకర/ ఇండియన్ బిజినెస్ స్కూల్స్‌కే జీవన పాఠాలు నేర్పించిన నాగదేవర/ భారత అటవీసేనలో ఎదిగిన బావ్యక తొలి మహిళా శిఖరం నిమ్మగడ్డ హైమవతి/ … వీళ్ళేంటి? చెప్పుకుంటూ పోతుంటే మరింకో పుస్తకం తయారవుతుంది. వీళ్ళ జీవన చరిత్రలన్నీ చదువుతుంటే నాకో కవిత గుర్తు వస్తుంది.
”అపజయాలు కొత్త కాదు, విజయాలుకు సోపానాలవి, అపస్వరాలు లేకపోలేదు, సుస్వరాలకి సుప్రభాతాలు, అవహేళలను లెక్కకాదు, భావి సన్మానాలకవి ప్రాతిపదికలు”. వీరి స్నేహితం చూస్తుంటే ”కండలో బలముంటే పదిమందిని కొట్టి భయంతో బానిసల్ని చేసుకోవచ్చు. కానీ గుండెలో ప్రేముంటే చేసే ప్రతి పనిలో వేల మంది మనస్సులో స్నేహంతో నిలిచి వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు” అన్నమాట అక్షర సత్యం అన్పించక మానదు. వీరందరి స్నేహం గొప్పది. సమైక్య స్ఫూర్తి మరీ గొప్పది. మనల్ని ప్రేమించే వారిని హార్ట్ లోను, మనల్ని ద్వేషించే వారిని మ్యూట్‌లోను పెట్టి, లైఫ్‌ని క్యూట్‌గా సాగిస్తున్న ఎంతోమంది మేధావుల జీవన ప్రస్థానాల్ని ఇలా పుస్తకాలుగా సమాజానికి బహూకరించటం బావ్యక విద్యార్థులు చేసిన గొప్ప పని. ఇందుకు మా వలేటి గోపీచందర్ బృందం ఒక నేలగా నిలిచి, అనేక భావపురి ఆకాశాన్ని తన వేలికొసల మీద నిలబెట్టిన సవ్యసాచిలా అనిపిస్తున్నారు. ఇందుకు పరిశ్రమించిన అందరికీ నా అభినందనలు.
అందుకే మన ప్రియతమ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుగారు సయితం ”ఈ నేలను పునాదిగా చేసుకుని అనేకమంది ఆకాశమంత ఎదిగారు. వివిధ రంగాల్లో బావ్యక విద్యార్థులు అందిస్తున్న విలువైన సేవల్ని వివరంగా తెలియచేస్తూ తీసుకొచ్చిన పుస్తకం, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని పంచగలదని భావిస్తున్నానని” ’ఒక నేల అనేక ఆకాశాలు’ పుస్తకం చదివాక తన స్పందనను తెలియచేశారు. ఎప్పుడో 75 ఏళ్ళ క్రితం పురుడు పోసుకున్న ఆ సేద్యాలయంలోని చెమట చుక్కలు ఎన్ని ముత్యపు చిప్పల్లో పడి ముత్యాలుగా మారాయో తెలుసుకోవడమనేది ఒక పెద్ద గ్రంధమంత పనే.
ఇప్పుడు బాపట్ల వ్యవసాయ కళాశాల కన్నా, బావ్యక విద్యార్ధుల ఐక్యత మీద, వారి స్నేహం మీదే ఎక్కువ చర్చలు నడుస్తున్నాయి. ఈ పుస్తక ముద్రణలు కూడా వారి జీవితాలంత ఆహ్లాదంగా, కళాత్మకంగా, చిత్రకళా రాజాలాతో, మనసును దోచే పసందైన కవితా పంక్తులతో, స్ఫూర్తిని కలిగించే సూక్తులతో, ఆకర్షణీయంగా మలచబడటం గొప్ప విషయం.
చివరగా ఒక్కమాట వినమ్రంగా తెలియజేద్దామనుకుంటున్నా. ”ఆస్తులు” ఉంటే ఆపదల్లో ఆదుకుంటాయి. బంగారాలు ఉంటే అవసరాలకు పిలుస్తుంటాయి. పుస్తకాలు ఉంటే బ్రతుకునే సాదుకుంటాయి. ఘన చరితాత్ముల జీవనాలు ఉన్న ఈ పుస్తకాలు వ్యక్తిత్వ వికాస పాఠాలుగా భావించి కొనండి. కొని చదవండి. చదివాక నచ్చితే మళ్ళీ కొని మిత్రులకు ఇవ్వండి. అన్నింటి కన్నా ముఖ్యంగా మీ పిల్లలచేత, మీ మనవళ్ళ చేత సివిల్స్ పరీక్షలంత దీక్షగా చదివించండి.
ఇదంతా చదివాక మీకు తప్పకుండా బాపట్ల వ్యవసాయ కళాశాల చూడాలనిపించడం సహజం. తొందరపడి బయలుదేరకండి. ఈ విశిష్ట వ్యక్తులను కలుద్దామని రాష్ట్రం మొత్తం తిరక్కండి. వారంతా భారతదేశం మొత్తంగా విస్తరించి ఉన్నారని మరవకండి. ఒక్కసారి బుద్ధిగా వినాయకుడిని ఫాలో అయిపోండి. గణాధిపత్యం కోసం విశ్వనదుల్లో స్నానం చేసి రమ్మంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టుగా మీరు ఈ నాలుగు పుస్తకాలను ఔపోసన పట్టండి. అప్పుడు వారందరి జీవితాల్లో ఎంతు వెలుగుందో, విజ్ఞానముందో, జీవం ఉందో, చైతన్యం ఉందో అది తప్పకుండా అంతో ఇంతో మనలోకి ప్రసరిస్తునట్లుగా అనిపిస్తుంది. నిన్నటి కంటే ఈ పుస్తకాలు చదివిన రోజు నుండి మన జీవితం మనకే కొత్తగా కనిపిస్తుంది. జీవచైతన్యం తొణికసలాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ అనుభూతి మీకు నిజంగా కలిగినప్పుడే ఈ పుస్తక ప్రచురణలు సార్థకమయినట్లు లెక్క! బావ్యక మరొక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లు మీకు అన్పించడం పక్కా!!
అభినందనలతో…

శ్రీలక్ష్మి ఐనంపూడి
99899 28562

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News