Wednesday, January 22, 2025

రోగి సహాయకులకు ‘రూ.5కే భోజనం’

- Advertisement -
- Advertisement -

Telangana launches Rs 5 meal for servants of patients

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద సౌకర్యం రూ.38.66 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం హరేకృష్ణతో ఒప్పందం సిఎం కెసిఆర్ ఆలోచనకు రూపం : మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు పూటల భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు అన్నారు. మంగళవారం హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం తరపున టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి , హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ ఆసుపత్రులకు జిల్లాల నుంచి వస్తున్న దృష్టా వారి సహాయకులు బాగా ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కెసిఆర్ షెల్టర్లు కట్టాలని ఆదేశించారన్నారు. వారికి భోజన సౌకర్యం కల్పించాలన్న కెసిఆర్ ఆలోచన మేరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. వివిధ రకాల బ్రెక్ ఫాస్ట్ లు, మంచి హాట్ బాక్సుల్లో చక్కటి భోజనం పెట్టడం జరుగుతుందన్నారు. అవసరమైన నీటి సదుపాయం, తినడానికి షెల్టర్స్, ఫ్యాన్లు టిఎస్‌ఎండిసి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

పది రోజుల్లో ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులను, మంత్రులను భాగస్వాములను చేసి ఒకేసారి ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని టిఎస్‌ఎండిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను, ఎండి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రులు సందర్శించి సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. హరే కృష్ణ మూమెంట్ ఛైర్మన్ సత్య గౌరచంద్రకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టిఎస్‌ఎంఐడిసి ఒప్పందం మేరకు 18 ప్రభుత్వాస్పత్రుల్లో రూ.5 కే భోజనాన్ని పెట్టనున్నట్లు హరేకృష్ణ సంస్థ తెలిపింది. రూ.5 భోజనానికి ఏటా ప్రభుత్వానికి రూ.38.66 కోట్లు ఖర్చు అవుతుందని టిఎస్‌ఎంఐడిసి అధికారులు తెలిపారు. కార్యకమ్రంలో హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ సీఈవో కాంతేయదాసప్రభు, ధనుంజయ దాస ప్రభు, టిఎస్‌ఎంఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డిఎంఈ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్ పరిధిలోని ఈ ఆస్పత్రుల్లో..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు, సహాయకులుగా వచ్చే వారికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించనున్నారు. జిహెచ్‌ఎంసిలో 5 రూపాయలకే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా పేదలకు ఎలా భోజన సౌకర్యం అందిస్తున్నామో, అదే రీతిలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఈ సౌకర్యం ఇప్పటి నుంచి అందించనున్నారు. ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ పలావ్, సాంబర్ రైస్ తోపాటు పచ్చడి బ్రేక్ ఫాస్ట్ గా అందిస్తారు. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ గా అన్నం, సాంబర్ లేదా పప్పు, పచ్చడి, సబ్జీ వంటివి వడ్డిస్తారు. డిస్పోజబుల్ ప్లెట్, వాటర్ గ్లాస్ సైతం అందజేస్తారు. రోగి సహాయకులు ప్లేట్ భోజనానికి 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తే.. హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ కు మిగతా మొత్తం 21.25 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆస్పత్రుల వద్ద దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. రోగులకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన పౌష్టిక ఆహారం అందిస్తుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ, నీలోఫర్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, కోఠి ఈఎన్‌టి, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, కోఠి మెటర్నటీ ఆస్పత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, మలక్ పేట ఎం.ఎన్ ఏరియా ఆస్పత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రుల్లో ఐదు రూపాయల భోజన సౌకర్యం కల్పించనున్నారు. ఈ రాయితీ భోజనం గ్రేటర్ పరిధిలోని 18 ఆస్పత్రుల్లో అందించేందుకు రూ. 38.66 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వ్యయం చేయనున్నది. దాదాపు 20 వేల మందికి ఈ భోజన సదుపాయం కలగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News