మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు, 24వ తేదీ నుంచి శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గవర్నర్ జారీ చేశారు. మొదటి రోజున అసెంబ్లీలో కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ఉండనుంది. ఈ నెల 25వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈనెల 23న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధులను పరిశీలించి బడ్జెట్‌కు తుదిరూపం ఇవ్వనున్నారు. ఈనెల 25వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వనుంది. నాలుగు నెలల కోసం ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఆమోదించిన రూ.2.75 లక్షల కోట్ల ఓటాన్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది.
సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్‌తో పాటు ధరణి, రైతుభరోసా, స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు, జాబ్ క్యాలండర్, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వం చిహ్నం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ గైర్హజరయ్యారు. కానీ, ఈ సారి సమావేశాలకు తాను హాజరవుతానని ఇటీవలే కెసిఆర్ ప్రకటించడంతో రానున్న సమావేశాలపై ఆసక్తి నెలకొంది. అసెంబ్లీలో ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ఫిరాయింపుల చట్టంపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు 64, సిపిఐ ఒక సీటుతో కలిపి 65 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా ప్రస్తుతం బిఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 76కు చేరింది.
వారం క్రితం సమావేశాల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
ఈనెల 11వ తేదీన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో అసెంబ్లీ సమావేశాల గురించి సమీక్ష నిర్వహించారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆర్థిక శాఖ అధికారులతో కూడా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్చించారు. ఇప్పుడు రైతు రుణమాఫీ రూ.30 వేల కోట్లతో ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో నేడు రుణమాఫీ నిధులు మొదటి విడతగా రూ.7వేల కోట్లను రూ.1.50 లక్షల కంటే తక్కువ మాఫీ ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.