Thursday, January 23, 2025

కెసి కాలువ నీటిపై ఎపిని కట్టడి చేయండి… కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ

- Advertisement -
- Advertisement -

Telangana letter to Krishna Board on KC canal

మనతెలంగాణ/హైదరాబాద్:  కర్నూలు కడప కాలువ ద్వారా కృష్ణానదీజలాలను అక్రమంగా వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని తెలంగాణ రాష్ట నీటి పారుదుల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీయాజమాన్యబోర్డుకు లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా కర్నూలుకడప కాలువకు కేటాయించిన నీటికంటే అధికంగా వినియోగించుకుంటున్నట్టు ఫిర్యాదు చేశారు. తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల ఆనకట్ట నుంచి మాత్రమే ఈ పథకానికి నీటిని వినియోగించుకోవాల్సివుందని, అది కూడా 31.90టిఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోవాలన్నారు.

అయితే ఎపి ప్రభుత్వం ప్రతియేటా కర్నూలుకడప కాలువ పథకానికి కేటాయించిన నీటి వాటా కంటే అధికంగా వాడుకుంటూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డను కూడా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణానదీజలాలను కూడా కర్నూలుకడప కాలువకు మళ్లించుకుంటున్నారని, అంతే కాకుండా కర్నూలు జిల్లాలోని మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం833అడుగుల స్థాయిలోకూడా నీటిని ఎత్తిపోసి కర్నూలుకడప కాలువకు మళ్లిస్తున్నారని బోర్డు దృష్టికి తెచ్చారు.

అదే జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 798అడుగుల వద్ద కూడా కృష్ణాజలాలను ఎత్తిపోసి కేసి కాలువలోకి తరలిస్తున్నట్టు ఫిర్యాదుచేశారు. తక్షణం బోర్డు చర్యలు చేపట్టిన కేసి కాలువకు అక్రమంగా నీటిని తరలించకుండా ఆపాలన్నారు. సుంకేసుల ఆనకట్ట నుంచి మాత్రమే ఈ పథకానికి నీటిని వాడుకునేలా కట్టడి చేయాలని కోరారు. తుంగభద్ర, కృష్ణానది జలాల వినియోగానికి సంబంధించి అన్ని ఔట్‌లెట్ల వద్ద రియల్ టైం సెన్సర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు లేఖ ద్వారా కృష్ణానదీయాజమాన్యబోర్డు ఛైర్మన్ ఎంపి సింగ్‌ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News