Friday, November 22, 2024

శ్రీశైలం నుంచి కృష్ణ నీటిని మితిమించి తరలించకుండా ఎపిని ఆపండి

- Advertisement -
- Advertisement -

కృష్ణారివర్‌బోర్డుకు తెలంగాణ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి కృష్ణానదీ జలాలను తరలించకుండా ఆపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీయాజమాన్య బోర్డును కోరింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బుధవారం నాడు కృష్ణానదీయాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎం.పి సింగ్‌కు లేఖ రాశారు. ఈ నెల 8న రాసిన లేఖకు కొనసాగింపుగా ఈ మేరకు మరో లేఖ రాస్తున్నట్టు తెలిపారు. 202122నీటి సంవత్సరంలో జూన్ ఒకటి నుంచి ఈ నెల 20వరకూ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 76.39టిఎంసిల నీటిని తరలించినట్టు తెలిపారు.

హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి 9.28టిఎంసిల నీటిని ఎపి తరలించుకుపోయిందని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకూ శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 85.66 టిఎంసిలు, తెలంగాణ రా్రష్ట్రం 7.47టిఎంసిల నీటిని వినియోగించుకున్నట్టు తెలిపారు. 1976నాటి అంతర్ రాష్ట్ర ఒప్పందం, 1981నాటి కేంద్ర జల సంఘం ఆమోదం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 880అడుగులకు పైన ఉన్నప్పుడు ఆపైన ఉన్న నీటిమట్టం పరిధిలో ఉన్న నీటినుంచి మాత్రమే కృష్ణారివర్ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నీటి తరలించాల్సివుందని ,అది కూడా 34టిఎంసిల నీటిని మాత్రమే మళ్లించాల్సి వుందని ఈఎన్సీ మురళీధర్ లేఖలో పేర్కొన్నారు.

అయితే అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఇప్పటికే 85.67టింఎంసిల మేరకు కృష్ణానదీజలాలను మళ్లించుకుపోయిందని కృష్ణాబోర్డుకు లేఖద్వారా వివరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ , హంద్రీనీవా సుజల స్రవంతి పథకాలకు నీటిని విడుదల చేయకుండా వెంటనే ఆపాలని కృష్ణారివర్ బోర్డును కోరారు. కృష్ణానదీ నుంచి నీటికేటాయింపుల్లో వాటాకు విరుద్దంగా వరద సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లించిన నీటిని లెక్కించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ రాష్ట్రం తనకు కేటాయించిన కోటాలో మిగిలిన జలాలను ఉమ్మడి జలాశయాల్లో నిల్వ ఉంచుకొని ఆ నీటినుంచి వచ్చే ఏడాదికి వినియోగించుకునేలా అనుమంతించాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News