మన తెలంగాణ / హైదరాబాద్ : తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా జలాలను కెసి కెనాల్‌కు తరలించాలని ఆంద్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి తరలింపును నిలిపివేయించాలని కోరింది. తెలంగాణ ఈఎన్‌సి మురళీధర్ ఈ మేరకు మగళవారం తుంగభద్ర బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. కెసి కెనాల్ ఆయకట్టుకు సుంకేశుల ఆనకట్ట ద్వారా తుంగభద్ర జాలాలను మాత్రమే వినియోగించాలని అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర జాలాలను తుంగభద్ర హైలెవల్ కెనాల్ (ఎగువ కాలువ)కు తరలించి శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను కెసి కెనాల్ (కాలువ)కు తరలించాలని భావిస్తోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇది కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్దమని అన్నారు. ఇలాంటి నీటి తరలింపు తెలంగాణకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
వెంటనే ఈ యత్నాలను ఆపివేయాలని కోరారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఒకటి, రెండు అవార్డుల ద్వారా అనుమతించిన దానికంటే ఎక్కువ నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ట్రిబ్యునల్ ఒకటో అవార్డు కెసి కెనాల్, తుంగభద్ర రైట్ బ్యాంక్ (కుడి కాలువ) హైలెవల్ కెనాల్ (ఎగువ కాలువ), రైట్ బ్యాంక్ లో లెవల్ కెనాల్(దిగువ కాలువ) తుంగభద్ర డ్యాం నుంచి మాత్రమే తుంగభద్ర నీటిని ఉపయోగించాలని నిర్దేశించిందని, ఎపి మాత్రం కృష్ణా నీటిని కెసి కెనాల్‌కు వినియోగిస్తుందని ఆరోపించారు. తుంగభద్ర రైట్ బ్యాంక్ హైలెవల్ కెనాల్ (ఎగువ కాలువ) దాని కేటాయింపులో 81.5 శాతం పెన్నా బేజిన్‌లోని కృష్ణా బేసిన్ వెలుపల ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ ఒకటి, రెండు అవార్డులు బెసిన్ ఆవలికి నీటిని తరలించేందుకు అనుమతించలేదన్నారు. దీనికి విరుద్దంగా తుంగభద్ర రైట్‌బ్యాంక్ కాని,తుంగభద్ర రైట్‌బ్యాంక్ హెచ్‌ఎల్‌సి ద్వారా ఎక్కువ నీటిని బెసిన్ ఆవలికి ఎపి మళ్ళిస్తోందన్నారు. సుంకేశుల ద్వారానే తుంగభద్ర జలాలను వినియోగించాలని , కెసి కెనాల్ ఆయకట్టుకు తుంగభద్ర జలాలు వాడాలన్నారు. కెసి కెనాల్‌కు కృష్ణా జలాల తరలింపును నిలిపివేయించాలని లేఖలో కోరారు.