ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పిఆర్‌టియు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో 53 ఏళ్ల వయసు పూర్తయి, తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం(టిఎస్‌జిఎల్‌ఐ) బాండ్ కోసం దరఖాస్తులు సమర్పించని వారు అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రతిపాదనలు సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 53 ఏళ్ల వయసు పూర్తయిన ఉద్యోగులు తమ సబ్‌స్క్రిప్షన్ మొత్తంలో పెంపుదలను చేసుకొని ఆ పెంపుదలకు సంబంధించిన బాండ్ ప్రతిపాదనలు సమర్పించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2017లో ఎంఎల్‌సి కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి పరిశీలించిన ప్రభుత్వం జిఒ 904ను జారీ చేసింది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ మొత్తాన్ని ఉద్యోగి అభ్యర్థన మేరకు ఎలాంటి వడ్డీ చెల్లించకుండా తిరిగి ఇచ్చేవారు. కానీ ఈ ఉత్తర్వుల ప్రకారం పెంపుదలకు సంబంధించిన నూతన పాలసీ బాండ్‌ను ఇస్తారు. ఈ ఉత్తర్వుల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది.