Wednesday, March 26, 2025

అసెంబ్లీలో లిక్కర్ లొల్లి

- Advertisement -
- Advertisement -

మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి
ప్రశాంత్‌రెడ్డి మధ్య వాగ్యుద్ధం బెల్టు
తీయాలన్న ప్రశాంత్‌రెడ్డి ఆదాయం
కోసం అడ్డగోలుగా లిక్కర్ ధరలు
పెంచుతున్నారని ఆరోపణ రేషన్
షాపుల్లో లిక్కర్ విక్రయించిన చరిత్ర
మీదని మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్
బెల్టు షాపులను పెట్టిందే నాటి
బిఆర్‌ఎస్ ప్రభుత్వమని
ప్రత్యారోపణ లిక్కర్ అమ్మకాలను
నాలుగింతలు పెంచిన ఘనత
బిఆర్‌ఎస్‌దే : మంత్రి జూపల్లి
కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్:కొత్త మద్యం పాల సీ, బెల్టు షాపుల నిర్వహణపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెం చుకునేందుకు లిక్కర్ రేట్లు అడ్డగోలుగా పెంచుతోందని, కొత్త మద్యం పాలసీని వెంటనే విత్ డ్రా చేసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కొత్త బ్రాండ్లు.. కొత్త బీర్లు, కొత్త బార్లు, కొత్త పబ్‌లు ఇదేనా ప్రభుత్వ పాలసీ అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులు తీసేయాలని డిమాండ్ చేశారు. ఆదాయ మార్గా న్ని పెంచేందుకు బెల్టు షాపులను పెంచే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. దీనికి శాసన సభా వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలోనే అడ్డగోలుగా.. ఇష్టానుసారంగా

మద్యం అమ్మకాలు జరిపారని ఆగ్రహం వ్యక్టం చేశారు. చివరికి రేషన్ షాపుల్లో కూడా లిక్కర్ సేల్స్‌కు పర్మిషన్ ఇచ్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. బెల్టుషాపులపై వారి తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. ‘బెల్టు షాపులు తామే తెచ్చామని ప్రశాంత్ రెడ్డి ఒప్పుకోవడం సంతోషకరమన్నారు. బెల్టు షాపులు తాము పెంచలేదని, అలాంటి వాటిని తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో లీకేజెస్ ఉండొద్దు అనే ఆదాయం పెంచుతామన్నామని, బీఆర్‌ఎస్ హయాంలో అడ్డగోలుగా ఇష్టారాజ్యాంగా చౌక షాపుల్లో మద్యం అమ్మకాలు జరిగాయని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖలో లీకేజెస్ లేకుండా సర్కార్ చేపడుతుందని, అడ్మినిస్ట్రేషన్ లో మార్పులు తీసుకువచ్చి రెవెన్యూ పెంచుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

మద్యం అమ్మకాలను నాలుగింతలు పెంచిన చరిత్ర మీదే?
బెల్టు షాపులు పెంచిన ఘనత బిఆర్‌ఎస్ దేనని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళంవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ నాయకులపై మంత్రి జూపల్లి మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అడిగిన మద్యం అమ్మకాలపై ప్రశ్నకు జూపల్లి సమాధానం ఇస్తూ గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో రూ. 9,000 కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 2023 వరకు రూ. 34,000 కోట్లకు ఎలా పెంచిందో అందరికీ తెలుసన్నారు. చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులను పెంచి వాటి ద్వారా అక్రమంగా మద్యం అమ్మించారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం స్మగ్లింగ్ ఆపడానికి దాడులు చేస్తోందని, ఫామ్ హౌస్‌లలో మద్యం తాగడాన్ని నిషేధించిందని సమాధానమిచ్చారు. ప్రశాంత్ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇస్తూ ఆర్‌ఆర్‌ఆర్ పనుల కోసం భూసేకరణ పనులకు అనుమతి వచ్చిందని, నిధుల విడుదలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని త్వరలోనే కలుస్తున్నామని చెప్పారు. విపక్ష నేతల నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేయడం లేదనేది అబద్దం అని, హరీష్ రావు, కేటీఆర్ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తుల కోసం, నూతన రోడ్లకు సరిపడా నిధులు కేటాయిస్తున్నామని వెంకటరెడ్డి సమాధానమిచ్చారు.

కెసిఆర్‌ను కించపరచలేదు.. మంత్రి జూపల్లి
కెసిఆర్‌ను తాను ఎప్పుడూ కించపరచలేదు, ఇకపైన కూడా కించపరచను అని మంత్రి జూపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ అంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని, ఉద్యమాన్ని ముందుండి నడిపిన నాయకుడు అని అన్నారు. 1969లో 360 మంది చనిపోయినా తెలంగాణ రాలేదన్నారు. బిజెపి పాలనలో 3 రాష్ట్రాలు ఇచ్చారు. కానీ తెలంగాణ ఇవ్వలేదని వెల్లడించారు. సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. రాజకీయంగా దెబ్బతిన్నా సోనియాగాంధీయే తెలంగాణ ఇచ్చారు అని మంత్రి జూపల్లి అన్నారు. మరోవైపు రాష్ట్రంలో బెల్టు షాపులు పెంచిన ఘనత బిఆర్‌ఎస్‌దేనని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News