హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియను ఆబ్కారీ శాఖ షురూ చేసింది. మొదటిరోజు రంగారెడ్డి జిల్లాలో 10 దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో 07, సంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 12, ఇంకా మిగతా జిల్లాలోనూ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యిందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
ఒకే వ్యక్తి రాష్ట్రంలోని ఎక్కడైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడ్ దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించి ఈ లైసెన్సులు జారీచేస్తారు. వార్షిక ఆర్‌ఎస్‌ఈటీ (రీటెయిల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్) ఆరు సమానా వాయిదాల్లో చెల్లించవచ్చు. మొత్తం ఆర్‌ఎస్‌ఈటీలో 25 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసి పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు , ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలను అనుమతిస్తారు. 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారు, ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్ష పడినవారు, గతంలో ఎక్సైజ్ రెవెన్యూ ఎగ్గొట్టిన వారు, కోర్టు ద్వారా దివాలా తీసినట్టు ప్రకటించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని ఆబ్కారీ శాఖ తెలిపింది.