మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు మార్చారు. ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకూ మాత్రమే పనిచేయనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుండి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన నేపధ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఎస్‌ఎల్‌బిసి ఛైర్మన్ ఓపి మిశ్రా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు పనివేళల మార్పు, సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ తదితర అంశాలను చర్చించారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నన్ని రోజులు ఉదయం 8నుంచి 12గంటల వరకు పనివేళలు మార్పుపై చర్చించిన కమిటీ ఈ మేరకు తీర్మానించింది. నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సైతం పనివేళలు మధ్యాహ్నం 12గంటల వరకే ఉండేలా చూడాల విజ్ణప్తి చేశాయి. మొదటి రెండు గంటలు ఖాతాదారులకు సేవలు, అతర్వాత రెండు గంటలు బ్యాంకు అంతర్గత కార్యకలాపాలకు కేటాయించాలని కమిటీ తీర్మానించింది. అయితే అన్ని బ్యాంకుల్లో 50శాతం సిబ్బందితోనే పని చేయించాలన్న ప్రతిపాదనపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రతిపాదన అమలును ఆయా బ్యాంకుల మేనేజ్‌మెంట్ల నిర్ణయానికే వదిలి వేసింది. బ్యాంకుల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులకు వయస్సుతో నిమిత్తం లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని తీర్మానించింది. బ్యాంకర్ల కమిటీలో చర్చించి చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించింది.
Telangana Lockdown: Banks to work from 8 am to 12 pm