మన తెలంగాణ/హైదరాబాద్: మద్యం షాపులు ముందు మంగళవారం బారులు తీరినట్లుగానే బుధవారం సైతం రాష్ట్రంలో లాక్‌డౌన్ సందర్భంగా అన్ని కార్యకలాపాలకు అనుమతినివ్వడంతో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మద్యం షాపులు ఎదుట మందుబాబులు బారులు తీరి పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేశారు. దీంతో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రూ.94 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో మంగళ, బుధవారాలతో కలిపి రికార్డు స్థాయిలో మొత్తంగా రూ.219 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లుగా అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో రూ.125 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగాయి.
ఇక ఈ నెలలో ఇప్పటివరకూ అనగా ఈ నెల 1 నుంచి 12 వరకు రూ.770 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. బుధవారం సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వైన్‌షాపుల ఎదుట క్యూకట్టి మరీ మద్యం కొనుగోలు చేయడం గమనార్హం. అబ్కారీ శాఖ మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపు సమయంలో వైన్‌షాపులు ఓపెన్ అయ్యాయి. లాక్‌డౌన్ ప్రకటన, ప్రకటనానంతరం మంగళవారం ఒక్కసారిగా మందుబాబులు రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాపుల ఎదుట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఒకానొక సమయంలో వారిని నియంత్రించడం కూడా కష్టతరంగా మారిన సంగతి విదితమే. ఎట్టకేలకు పోలీసులు రంగ ప్రవేశం చేసి క్యూ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి మందుబాబులు మద్యం కొనుగోలు చేసుకునే విధంగా నియంత్రించగలిగారు.
Telangana Lockdown: Rs 219 Cr liquor sales in 2 days