Wednesday, January 22, 2025

ఇక రెండే రోజులే…!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మిగిలింది ఇక రెండురోజులే…ఈ నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచా రం 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఈ రెండు రోజుల వ్యవధిలో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బి జెపి, బిఆర్‌ఎస్ అధినేతలు అన్ని జిల్లాలో పర్యటిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేయగా, గడువు దగ్గర పడుతుండటంతో ప్ర ధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ నిత్యం సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు.నిత్యం ఓటర్లను కలవడానికి అభ్యర్థులు ఉదయం నుంచే తిరుగుతున్నారు. ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలు, పట్టణాల్లో ద్వితీయ శ్రేణి నాయకులతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే రాత్రి సమయాల్లో మున్సిపాలిటీల్లో ని ప్రధాన కూడళ్లలో కార్నర్ మీటింగ్‌లు పెడుతూ అభ్యర్థు లు ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ, సిఎం రేవంత్‌రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ వారివారి పార్టీలఅభ్యర్థులకు మద్ధతుగాపలుసార్లు ప్రచారం నిర్వహించారు. సమయం దగ్గరపడిన కొద్ది అభ్యర్ధులందరూ ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి తమకు మద్ధతు ఇవ్వాలని వారు కోరుతున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి గతంలో వారు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ ఈ నాలుగు నెలల్లో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బిజెపి అభ్యర్థి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు, తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తుండడం విశేషం. ఒకరిని మించి ఒకరు ప్రచారం చేస్తూ ప్రతి నిమిషం ప్రజల్లోనే గడుపుతూ అభ్యర్థులు ప్రజా క్షేత్రంలో ఉంటున్నారు.

హోరెత్తుతున్న మైకులు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామం, పట్టణం మైకులతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు వివిధ వాహనాలను ఏర్పాటు చేసుకొని డీజే మోతలతో వివిధ రకాల పాటలను ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో తిరుగుతూ ప్రజలకు పాటల ద్వారా అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల నాయకత్వం రోజుకు రెండేసి నియోజకవర్గాలను చుట్టేస్తూ బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నాయి. మరోపక్క గడువులోగా అధిష్టాన పెద్దలతో బహిరంగ సభల నిర్వహణ ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకొనే వ్యూహాలను అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి.

రాత్రి వేళల్లోనూ..
ఎండలతో ఉష్ణోగ్రతలు పెరిగి సభలు, ప్రచార కార్యక్రమాలకు ఇబ్బందిగా మారడంతో సభలు, సమావేశాలకు జనసమీకరణ, నిర్వహణ అభ్యర్థులకు కష్టతరంగా మారింది. ఇన్ని రోజులుగా ఉదయం వేళల్లో ప్రాంగణాల్లో సభలను అభ్యర్థులు నిర్వహించుకుంటూ వచ్చారు. ప్రచారానికి గడువు దగ్గర పడుతుండటంతో సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. చీకటి పడ్డాక ప్రచార సమయం ముగిసే వరకు అభ్యర్థులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గడువు దగ్గరపడే కొద్దీ ఎండను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే రోజువారి ప్రణాళిక మేరకు ఆయా గ్రామాలకు వెళ్లి ఉపాధి కూలీలు, రైతులను కలుస్తున్నారు.
చేరికలపై దృష్టి సారిస్తూ..
పార్టీలు ఓటర్లపై ప్రభావం చూపే అంశాలపై దృష్టి పెట్టాయి. బలాన్ని పెంచుకొనే క్రమంలో ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. బలమైన సామాజికవర్గాల్లో పెద్ద మనుషులను మూడు పార్టీల అభ్యర్థులు కలుస్తూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News