Monday, December 23, 2024

ఆర్థిక తీర్మానం?

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధానాలతో వేలాది కోట్ల రూపాయల నిధులను నష్టపోయినందున, వాటిని విడుదల చేసేంత వరకూ ఢిల్లీపై రాజీలేని పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. డిసెంబర్ నెలలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో రాష్ట్రం ఎన్ని విధాలుగా ఆర్థ్ధికంగా నష్టపోయిందో సభలో చర్చించిన తర్వాత ఒక తీర్మానం చేయ నుంది. ఆ తీర్మానంతో నష్టపోవడానికి దారితీసిన అంశాలపై సాక్షాధారాలతో సహా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలనే ప్రతిపాదన కూడా ఉందని కొందరు సీనియ ర్ అధికారులు వివరించారు. కేంద్రం అనుసరించిన తప్పుడు విధానాల మూలంగా వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రజలు నష్టపోయారని, ఆ నష్టాలను భర్తీ చేస్తూ నిధులన్నింటినీ విడుదల చేసేవరకూ జాతీయస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడమే కా కుండా అవసరమైతే సుప్రీంకోర్టులో కేసుపెట్టి న్యాయపోరాటం కూడా చేయాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు.

ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం 2022-23వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.54వేల కోట్లను రుణాలుగా సేకరించాలని లక్షంగా పెట్టుకొని బడ్జెట్‌లో కూడా పొందుపరిచామని, తీరా ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో ఈ చట్టంలో మార్పులు చేసి ఆ రుణాల పరిమితిని 39 వేల కోట్లకు కేంద్రం కుదించిందని, దాంతో 15 వేల కోట్ల రూపాయలను నష్టపోయామని వివరించారు. ఇంతా చేసి ఆ చట్టాన్ని ఏమైనా పర్‌ఫెక్ట్‌గా అమలు చేస్తున్నారా? అని అంటే అదీలేదని, ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టాన్ని కేంద్రంతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ ఉల్లంఘించాయని, చట్టాన్ని గౌరవించిన తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతూ వచ్చిన కేంద్రమే ఇప్పుడు ఆ 15 వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రమే ఇవ్వాలని డిమాండ్ చేయబోతున్నామని, దీనిపై కూడా అసెంబ్లీ తీర్మానం చేస్తుందని తెలిపారు.

ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టంలో మార్పులు చేసి కొత్త రూల్సును 2020వ సంవత్సరం, 2021వ సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నట్లుగా తప్పుడు లెక్కలు వేసి తెలంగాణకు రావాల్సిన రుణాల నిధులు రాకుండా అడ్డుకున్నారని, ఈ నిబంధనలు దేశంలోని ఏ రాష్ట్రానికి వర్తింపజేయలేదని, ఒక్క తెలంగాణపైనే కక్షసాధిస్తున్నట్లుగా అమలుచేశారని వివరించారు. ఏ ప్రభుత్వంలోనైనా కొత్తగా తెచ్చిన రూల్సును సాధారణంగా ఆ ఉత్తర్వులు జారీచేసిన తేదీ నుంచి అమలులోకి తెస్తారని, కానీ కేంద్రప్రభుత్వం మాత్రం గతించిన రెండేళ్ళ నుంచి అమలుచేసిందని, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా&? అనే అంశాలపై కేంద్రాన్ని అసెంబ్లీలోనే కాకుండా సుప్రీంకోర్టులో కూడా ఎండగడతామని అంటున్నారు.

పన్నుల వాటాలో కేంద్రానిది అంకెల గారడి

రెండో అంశం ఏమిటంటే కేంద్రం దేశ ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 41 శాతం వాటా నిధుల్లోనూ అతి పెద్ద మోసం జరుగుతోందని ఆ అధికారులు వివరించారు. తెలంగాణకే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన 41 శాతం నిధులు రావడంలేదని, ఈ నిధులపై లోతుగా అధ్యయనం చేస్తే రాష్ట్రాలకు కేవలం 29.6 శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని, తద్వారా కేంద్ర ప్రభుత్వ అంకెలగారడీ స్పష్టమవుతుందని వివరించారు.

కేంద్రం బీఆర్‌జిఎఫ్ పథకాన్ని, మోడల్ స్కూల్స్ రద్దు చేయడం మూలంగా ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొనసాగిస్తూనే ఉందని, దీంతో ఆ పథకాలకు అయ్యే ఖర్చుల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపైనే పడుతోందని తెలిపారు. గతంలో కొన్ని కేంద్ర పథకాలకు 80 శాతం నుంచి 90 శాతం వరకూ నిధులు వచ్చేవని, ఇప్పుడు కేంద్రం ఆ పథకాలకు తన వాటాను 60 శాతానికి తగ్గించుకొందని, దీంతో ఆ భారమంతా రాష్ట్రాలపైనే పడుతోందని, అందుచేతనే న్యాయంగా లెక్కలు వేస్తే రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న వాటా నిధులు 29.6 శాతానికి పడిపోయాయని వివరించారు. ఇలా అంకెలగారడీతో తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలనూ కేంద్రం దగా చేస్తోందని తెలిపారు.

బకాయిలిచ్చే వరకూ వదిలేదే లేదు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ సిఫారసులను కూడా పట్టించుకోవడంలేదని, 14వ ఆర్ధిక సంఘం సిఫారసులు, 15వ ఆర్ధిక సంఘం సిఫారసులను కూడా గౌరవించకుండా ఆ సంస్థలను అగౌరవపరుస్తోందనే విషయం తేటతెల్లమయ్యిందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ ప్రతిష్టాత్మకమైన సంస్థల సిఫారసులను అమలుచేసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి గడచిన ఏడేళ్ళ నుంచి ఇప్పటి వరకూ 34,149 కోట్ల రూపాయల నిధులు వచ్చి ఉండేవని, ఆ నిధులన్నీ నేడు బకాయిలుగా మిగిలిపోయాయని, ఆ బకాయిలు ఇచ్చే వరకూ కేంద్రాన్ని వదిలిపెట్టేదే లేదని అధికారవర్గాలే గట్టిపట్టుదలతో ఉన్నాయి. 14వ ఫైనాన్స్ కమీషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 315 కోట్ల 32 లక్షల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 502 కోట్ల 61 లక్షల రూపాయలు కలిపి స్థానిక సంస్థలకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంవత్సరానికి 450 కోట్ల రూపాయల లెక్కన గడచిన మూడేళ్ళకు కలిపి 1,350 కోట్ల రూపాయల నిధులను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు పన్నులవాటాలో తెలంగాణకు ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయలను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం న్యూట్రిషన్ రంగంలో తెలంగాణకు మరో 171 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సి ఉంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు 15వ ఆర్ధిక సంఘం 3,024 కోట్ల రూపాయల నిధులను గ్రాంటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని సిఫారసు చేసింది. ఆ నిధులను కూడా ఇవ్వలేదు.

మిషన్ భగీరథ పథకానికి 15వ ఆర్ధిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి మరో 2,350 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇదిలావుండగా నీతి ఆయోగ్ సంస్థ కూడా మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్ల రూపాయలను గ్రాంటుగా తెలంగాణకు ఇవ్వాలని సిఫారసు చేసిందని, అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి మరో అయిదు వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కూడా సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయిని కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని, ఇలా ఈ మొత్తం బకాయిలను కలిపితే 34,149 కోట్ల 71 లక్షల రూపాయల వరకూ ఉన్నాయని వివరించారు.

సెస్, సర్‌చార్జీలపై రాష్ట్రాలకూ వాటా ఇవ్వాల్సిందే

కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా నిధులను ఎగ్గొట్టడానికి సెస్, సర్‌చార్జీల రూపంలో లక్షలాది కోట్ల రూపాయల నిధులను వసూలు చేస్తోందని, అందులోనూ అన్ని రాష్ట్రాలకూ 41 శాతం వాటా నిధులు ఇవ్వాల్సిందేనని, దీనిపై కేంద్రప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగట్టడం జరుగుతుందని వివరించారు. సెస్, సర్‌చార్జీల వసూళ్ళ లక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అధికారవర్గాలంటున్నాయి. పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు వచ్చే ఆదాయంలో ఏదైనా ఒక అభివృద్ధి పథకానికి నిధులు సరిపోకపోతే సెస్, సర్‌చార్జీ రూపంలో కొద్ది మొత్తాన్ని వసూలు చేసుకొని ఆ నిధులను అదే పథకానికి ఖర్చు చేసేందుకు వీలుగా ఈ విధానం అమలులో ఉందని తెలిపారు.

కానీ కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెస్, సర్‌చార్జీలను కేవలం ఖజానాకు లక్షాలాది కోట్ల రూపాయలను సంపాదించడానికి, రాష్ట్రాలకు వాటాలు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికే ఈ విధానాలను అమలు చేస్తున్నారనే అంశాలు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా కేంద్రం కుట్రలు బహిర్గతం చేస్తామని అంటున్నారు. బి.జె.పి. అధికారంలోనికి రాకమునుపు సెస్ 10 శాతం మాత్రమే ఉండేదని, అది ఇప్పుడు 20 నుంచి 30 శాతం వరకూ పెంచి వసూలు చేస్తున్నారని వివరించారు. సెస్, సర్‌చార్జీల రూపంలో కేంద్రం దేశ ప్రజల నుంచి వసూలు రికార్డుస్థాయిలో 21 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేసిందని, ఈ నిధుల్లో రాష్ట్రాలకు 41 శాతం మేరకు వాటా నిధులు ఇచ్చినా కనీసం 8 లక్షల 60 వేల కోట్ల రూపాయలను అన్ని రాష్ట్రాలకూ ఇవ్వాల్సి ఉంటుందని, అందులో తెలంగాణకు 2.102 శాతం నిధులను ఇవ్వాల్సి ఉంటుందని, అంటే ఆ లెక్కన 42 వేల కోట్ల రూపాయలను కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందని ఆ అధికారులు వివరించారు. ఈ మొత్తం అంశాలపై అసెంబ్లీలో చర్చోప చర్చలు జరుగుతాయని, ఈ డిసెంబర్ నెలలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జాతీయస్థాయిలో సంచలనాత్మకం అవుతాయని అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News