హైదరాబాద్ : సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. వీరిలో తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలానికి చెందిన 39యేళ్ల మహమ్మద్ జావిద్ కూడా ఉన్నాడు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న ఓ కుటుంబం దగ్గర అతడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను ఓ వసతి గృహంలో బంగ్లాదేశ్ కు చెందిన మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఉంటున్నాడు. వారి గదిలో ఎసి యూనిట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జావిద్ తో పాటు ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ముగ్గురు ఆ మంటల్లోనే సజీవ దహనం అయిపోయారు. ఎసిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునేసరికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. జావీద్ బంధువులు సౌదీలో ఉన్నారు. వారికి సమాచారం తెలిసి వెంటనే తెలంగాణలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు మహమ్మద్ జావీద్‌కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మీద ఆధారపడిన తల్లి కూడా ఉంది. వీరందరికీ జావిద్ ఒక్కడే ఆధారం. ఆరేళ్ల క్రితం జీవనోపాధి కోసం జావీద్ సౌదీకి వెళ్ళాడు. తండ్రి ఇటీవలే క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి పెద్దదిక్కు లేకపోవడంతో భారత్ తిరిగి రావాలని అనుకుంటున్నాడు. అంతలోనే అగ్ని ప్రమాదం రూపంలో ఘోరం జరిగిపోయింది. జావీద్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబం అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ఎంబసిని, సౌదీ అరేబియాలోని ఇండియన్ కమ్యూనిటీ కార్యకర్తల సహాయం చేయాలని కోరుతున్నారు.