Tuesday, January 21, 2025

సెప్టెంబర్ 17పై ఇన్ని వైరుధ్యాలా?

- Advertisement -
- Advertisement -

అప్పటి దాకా నిజాం స్టేట్‌లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాలు సెప్టెంబర్ 17ను విమోచన దివస్‌గా జరుపు కుంటున్నాయి. అక్కడ ఎలాంటి వైరుధ్యాలు లేవు. మన దగ్గరే భిన్న భావజాలాల కారణంగా తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా తమ స్వతంత్ర పండుగను స్వేచ్ఛగా జరుపుకోలేక పోతున్నారు. ప్రతిసారి ‘ఈ రోజును ఏమని పిలవాలి’ అనే రచ్చతోనే రోజులు గడిచిపోతున్నాయి. ఎవరి కోణంలో వారు పిలుచుకుంటున్నారు. ఎవరి ఇష్టప్రకారం వారు సభలు జరుపుకుంటున్నారు.

తెలంగాణలో నిజాం పాలనను అంతమొందించిన రోజు 17 సెప్టెంబర్ 1948. భారత్ యూనియన్ సైన్యాలు 13 సెప్టెంబర్ 1948 నాడు నిజాం స్టేట్‌లో ప్రవేశించి 5 రోజుల మిలిటరీ చర్యతో తెలంగాణను భారతదేశంలో కలుపుకున్న రోజు అది. రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామ్య పాలనలో భాగమైన సుదినమది. నిజాం పాలన ఎలా ఉండేదీ, గ్రామాల్లో జాగీర్దార్ల, పటేళ్ల పెత్తనం ఎంత క్రూరంగా ఉండేదీ అనేది తెలంగాణ చరిత్రలో సుస్పష్టంగా ఉంది. మొత్తానికి ఆనాడు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు లభించాయి అనవచ్చు. ఆపరేషన్ పోలోగా పిలుచుకునే ఈ మిలిటరీ యాక్షన్ పరమార్థంపై భిన్న రాజకీయ వ్యాఖ్యానాలున్నా ఈ చర్య వల్ల తెలంగాణ ప్రజలు ఓట్లేసి తమ పాలకులను ఎన్నుకొనే ప్రాథమిక హక్కును పొందగలిగారు.

దేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్య్రం లభిస్తే తెలంగాణకు అది ఒక ఏడాది తర్వాత వచ్చినట్లే. మీతో కలిసేది లేదని నిజాం తెగేసి చెబితే.. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఉంటే ఏడాది పాటు సైనిక చర్య ఉండదని ఆయనకు నెహ్రూ హామీ ఇచ్చారు. నిజాం కదలికలు, కమ్యూనిస్టుల పోరు, రజాకార్ల అరాచకాలు కలగలిసి సైనిక చర్యను అనివార్యం చేశాయి. అయితే ఆ 5 రోజులు ఇండియన్ యూనియన్ సైనికులు వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలను, ముస్లింలను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశారని రుజువులెన్నో ఉన్నాయి. కమ్యూనిస్టుల సారథ్యంలో రగులుతున్న రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేయడమే నెహ్రూ లక్ష్యమైతే, రజాకార్ల అరాచకాలను తుదముట్టించడమే పటేల్ ఆలోచన కావచ్చు.

మొత్తానికి తెలంగాణకు విముక్తి ప్రసాదించిన ఈ సైనిక చర్య ఒక దారుణ మారణకాండ. తెలంగాణ చరిత్రలో రక్తసిక్త అధ్యాయంగా మిగిలిపోయింది. గ్రామీణుల తిరుగుబాటు, స్త్రీలు సైతం ఆయుధాలు పూని దొరలను ఎదిరించిన విలక్షణలతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ ప్రజా ఉద్యమాల జాబితాలో చేరింది. కాంగ్రెస్, టిడిపి పాలనలో సెప్టెంబర్ 17కు ఎలాంటి గుర్తింపు, ప్రాధాన్యత లేకుండేది. దేశవ్యాపంగా జరిగినట్లే ఇక్కడ కూడా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు అదనంగా నవంబరు ఒకటి నాడు రాష్ట్ర అవతరణ పండుగ ప్రభుత్వాలు జరిపేవి. మలి తెలంగాణ ఉద్యమకాలంలో కెసిఆర్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ స్వాతంత్య్ర దినంగా ప్రభుత్వం కార్యక్రమాలు జరపాలని డిమాండ్ చేశారు. అందుకు ఆనాటి ప్రభుత్వాలు నిరాకరించాయి. విచిత్రమేమిటంటే కెసిఆర్ పాలించిన పదేళ్ల కాలంలోనూ సెప్టెంబర్ 17 నాడు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించలేదు. దాన్ని రాజకీయ పార్టీలకే వదిలేసి తమ పార్టీ ఆఫీసులో కూడా జాతీయ జెండా ఎగరేసి ఊరుకున్నారు.

” ప్రతి సంవత్సరం ఇదే తతంగం. ఎవరి మధ్యన సయోధ్య కుదరదు. ఎవరి వాదనలు వారికున్నా యి. ఒకరి మాటను మరొకరు అంగీకరించరు. చివరకు సెప్టెంబర్ 17 రాజకీయంగా ఒకరినొక రు విమర్శించుకొనే, వాదులాడుకొనే రోజుగానే వచ్చి వెళ్తోంది. దీనికి తెరపడాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన పేరును చరిత్రకారులో, భాషావేత్తలో సూచించాలి. అవసరమైతే ఒక కమిటీ వేసి కొత్త పదాన్ని స్థిరీకరించాలి. అన్ని పార్టీలు ఆ పేరిటే ఉత్సవాలు జరపాలి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లాగే తెలంగాణ ప్రజలు ఐక్యంగా తమ స్వేచ్ఛా దినాన్ని జరుపుకొనేలా వాతావరణం ఏర్పడాలి. లేదా కోర్టు ప్రమేయంతోనైనా ఒక పేరును చట్టబద్ధం చేయాలి. తమ ఇష్టమొచ్చిన పేరుతో ఉత్సవం జరిపితే ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. వచ్చే సెప్టెంబర్ 17 నాటికైనా తెలంగాణ ప్రజలంతా కలిసి ఒకే పేరుతో ఈ పండుగ జరుపుకోవాలి. “

అప్పటి దాకా నిజాం స్టేట్‌లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాలు సెప్టెంబర్ 17ను విమోచన దివస్‌గా జరుపుకుంటున్నాయి. అక్కడ ఎలాంటి వైరుధ్యాలు లేవు. మన దగ్గరే భిన్న భావజాలాల కారణంగా తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా తమ స్వతంత్ర పండుగను స్వేచ్ఛగా జరుపుకోలేక పోతున్నారు. ప్రతిసారి ‘ఈ రోజును ఏమని పిలవాలి’ అనే రచ్చతోనే రోజులు గడిచిపోతున్నాయి. ఎవరి కోణంలో వారు పిలుచుకుంటున్నారు. ఎవరి ఇష్టప్రకారం వారు సభలు జరుపుకుంటున్నారు. కమ్యూనిస్టులు విలీన దినం అంటే, బిజెపి వర్గాలు విమోచన దినం అంటున్నాయి. నిజాం రాచరిక పాలన అంతమొందేలా తెలంగాణ భారతదేశంలో కలిసిపోయింది కాబట్టి ఇది విలీన దినమని వారి వాదన. ఆ గొప్పతనం తమదే కాబట్టి కాంగ్రెస్ కూడా దీనిని ఒప్పుకున్నదే. ముస్లిం రాజు నుండి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించింది కాబట్టి ఇది విమోచన దినమని బిజెపి పట్టు వదలడం లేదు. స్థూలంగా చూస్తే ఆ రోజుకు ఈ రెండు పదాలు సరిపోతాయి. అయితే ఏ పదం వాడితే తమకు ఏ ముద్ర పడుతుందోనని ప్రజలు ఆ సంబరాలకు దూరమైపోతున్నారు. ఒక పార్టీ చేసిన ఉత్సవానికి మరో పార్టీ మనుషులు రాని పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ కొత్త సిఎం కొత్తగా ఆ రోజును ప్రజాపాలన దినంగా గుర్తించాలన్నారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ఆయన సెప్టెంబర్ 17న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగిరేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. మరోవైపు అదే రోజు సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. దీనిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. 2022 నుండి స్థానిక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్రం ఇలా అధికారికంగా విమోచన ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. సిపిఐ తరపున మఖ్దూమ్ భవన్‌లో విలీన దినోత్సవం జరిగింది. మహత్తర పోరాట చరిత్ర వక్రీకరించినంత మాత్రాన అది మారిపోదని ఆ పార్టీ నేతలు అన్నారు.

తెలంగాణ భవన్‌లో భారాస తరపున జాతీయ సమైక్యత దినోత్సవం జరిగింది. ఇలా నాలుగు పార్టీలు నాలుగు పేర్లతో తెలంగాణ ప్రజలకు ప్రియమైన, గౌరవప్రదమైన రోజును నాలుగు ముక్కలుగా చేశారు.ప్రతి సంవత్సరం ఇదే తతంగం. ఎవరి మధ్యన సయోధ్య కుదరదు. ఎవరి వాదనలు వారికున్నాయి. ఒకరి మాటను మరొకరు అంగీకరించరు. చివరకు సెప్టెంబర్ 17 రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకొనే, వాదులాడుకొనే రోజుగానే వచ్చి వెళ్తోంది. దీనికి తెరపడాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన పేరును చరిత్రకారులో, భాషావేత్తలో సూచించాలి. అవసరమైతే ఒక కమిటీ వేసి కొత్త పదాన్ని స్థిరీకరించాలి. అన్ని పార్టీలు ఆ పేరిటే ఉత్సవాలు జరపాలి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లాగే తెలంగాణ ప్రజలు ఐక్యంగా తమ స్వేచ్ఛా దినాన్ని జరుపుకొనేలా వాతావరణం ఏర్పడాలి. లేదా కోర్టు ప్రమేయంతోనైనా ఒక పేరును చట్టబద్ధం చేయాలి. తమ ఇష్టమొచ్చిన పేరుతో ఉత్సవం జరిపితే ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. వచ్చే సెప్టెంబర్ 17 నాటికైనా తెలంగాణ ప్రజలంతా కలిసి ఒకే పేరుతో ఈ పండుగ జరుపుకోవాలి.

బి. నర్సన్, 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News