Wednesday, January 22, 2025

రాజ్‌భవన్‌లో ఉంటూ రాజకీయాలా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వ పాలనలో నేరుగా జోక్యం చేసుకునే అధికారం ఆమె లేదన్నారు. ఇంకా ఆమె ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆ వాసనలు పోని కారణంగానే ఆమె తరుచూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్‌నామ్ చేయడం వంటి చర్యలను పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలకు ఇవ్వాల్సిన గౌరవం సిఎం కెసిఆర్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారన్నారు. గవర్నర్ స్థాయిని తగ్గించే ప్రయత్నం ఎప్పుడు జరగలేదన్నారు. పర్యటనకు వెళ్లే సమయంలో తమిళిసై ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడం లేదన్నారు. దీని కారణంగానే అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి ఆమెదే తప్పు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై తమిళిసై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూనే మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.

కేంద్రం ఎజెంట్‌గా వ్యవహరిస్తున్నారు
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవరి రాథోడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమె కేంద్రం ఎజెంట్‌గా వ్యవహరి స్తున్నారంటూ మండిపడ్డారు. ఆమె తన పరిధిని ధాటి వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు. మహిళల పట్ల సిఎం కెసిఆర్‌కు ఆపార గౌరవం ఉందన్నారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు దూరం ఎక్కడా పెరగలేదన్నారు. ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయన్నారు. గతంలో ఎంతో మంది గవర్నర్లు రాష్ట్రంలో పనిచేశారన్నారు. వారితో రాని ఇబ్బంది తమిళిసైతోనే ఎందుకు వస్తుంది? అని ప్రశ్నించారు. ఆమె బిజెపి అధ్యక్షురాలుగా పోటీ చేసి ఓడిపోయారు….ఇంకా ఆమె అధ్యక్షారాలుగానే వ్యవహరిస్తోందన్నారు. సిఎం రాజ్ భవన్ ఎప్పుడు రావాలి అన్నది ఆయన ఇష్టమన్నారు.
వరదలు వస్తే ప్రజలకు పూర్తిగా స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు. అయినప్పటికీ తమిళిసై వరదల ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సమంజసమేనా? మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. పైగా గవర్నర్‌కు తెలంగాణ చరిత్ర తెలియదని.. అందుకే సెప్టెంబర్ 17వ తేదీనీ విమోచనం అంటున్నారని విమర్శించారు. లేని సమస్యలను ఉన్నట్టు చూపడం సమంజసం కాదన్నారు. ఆమె ఏం సాధించిందో కూడ చెప్పాల్సిందన్నారు. ఆమె చేయాల్సింది… ఏం చేసిందని మీడియాతో సమావేశమని నిలదీశారు. ఆమె ఇప్పటికైనా గవర్నర్‌గా ఉంటారో? పార్టీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్రమే ప్రశంసిస్తే తమిళిసై మాత్రం ఇలా మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. ఆమె ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలన్నారు.

గవర్నర్ పదవికి వన్నె తేండి…చేతులెత్తి మొక్కుతున్నా!
గవర్నర్ పదవికి వన్నె తీసుకవచ్చేలా పనిచేయాలని తాను చేతులెత్తి మొక్కుతున్నానని తమిళిసైని ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. ఆమెగవర్నర్ పదవికి తగ్గ విధంగా హూందాగా వ్యవహరించడంలో విఫలమవుతు న్నారన్నారు. బిజెపి కార్యకర్తలా వ్యవహరించడం తగదని అన్నారు. దీంతో గౌరవనీయమైన గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారని విమర్శించారు. గవర్నర్‌గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయన్నారు. తమిళిసై రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలా వ్యవహరిస్తూ, బిజెపి నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే ఆమెకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు. ఆమెను తెలంగాణ ఆడపడుచులా చూసుకు న్నామన్నారు. కానీ ఆమె బిజెపి డైరెక్షన్‌లో పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.
సమస్యలపై ఆదేశాలు ఇవ్వాల్సిన గవర్నర్… రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరుస్తూ తిరగడం దేనికి? అని అని ఆయన ప్రశ్నించారు. మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రులుగా తమకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ వైద్యశాలలపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు తెలంగాణలో ఇస్తున్నంత మెరుగైన వైద్యం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారింది
రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం గవర్నర్ తమిళిసైకి ఫ్యాషన్‌గా మారిందని మంత్రి జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. కేవలం నిత్యం వార్తల్లో ఉండేందుకే ఆమె ప్రయత్నిస్తోందన్నారు. గవర్నర్ తమిళిసై పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరో మారు ఫైర్ అయ్యారు. కేవలం ప్రభుత్వంపై బురదజల్లడానికే ఆమె రాజ్‌భవన్‌ను ఉపయోగించు కుంటున్నారన మంత్రి విమర్శించారు. బిజెపికి రాజకీయ లబ్ధి కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే తరుచూ ఆమె ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడంలో సిఎం కెసిఆర్ వంటి పరిణితి చెందిన నాయకుడు మరొకరు లేరన్నారు. గౌరవంగా రాజ్ భవన్ ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రధాని, రాష్ట్రపతి తరహాలోనే రాష్ట్రంలో కూడా పాలన కొనసాగుతుందన్నారు.

గవర్నర్ తీరు బాధాకరం
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. ప్రభుత్వ విధానాలతో గవర్నర్ ఏకీభవించాలని లేకున్నప్పటికీ ప్రశ్నించే అధికారం మాత్రం ఆమెకు లేదన్నారు. సిఎం కెసిఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఎలా గౌరవించాలో ఆయనకు బాగా తెలుసన్నారు.రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి గవర్నర్ పదే పదే రాజకీయాలు మాట్లాడుతూ ఒక పార్టీకి లబ్ధి చేకూరే ప్రయత్నాలు తమిళిసై చేస్తున్నారన్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ఆమె రాజకీయాలలో జోక్యం చేసుకోడం మానేకోవాలని సూచించారు.

రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చారు
గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చారని ఎంఎల్‌సి కల్వకుంట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తమిళిసై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గవర్నర్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిఎంను అపఖ్యాతి పాలు చేయడానికే తమిళిసై రాజ్‌భవన్‌ను ఉపయోగించుకుం టున్నారని విమర్శించారు. బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించిన నేపథ్యంలో గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్నారు. ఇదంతా చూస్తుంటే ఢిల్లీ బిజెపి పెద్దల డైరెక్షన్‌లో ఆమె పనిచేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు.

Telangana Minister slams Governor Tamilisai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News