మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి ముప్పేట దాడి చేశారు. బిజెపి మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నదని, టిఆర్‌ఎస్ అభివృద్ధిని చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్తోందన్నారు. మతాన్ని, మత విశ్వాసాల్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే బిజెపి నేతలు మూడ నమ్మకాలపై మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు, దేవున్ని గుండెల్లో పెట్టుకొని పూజించే నైజం మాదైతే, ఆ దేవున్ని అడ్డుపెట్టుకొని ఆ సెంటిమెంటును రాజకీయం చేస్తుంది బిజెపి అని బహిరంగంగా ప్రజలందరికి వాళ్లే చెప్తున్నారన్నారు, మోడీకి ప్రత్యామ్నాయం కెసిఆర్ అనే దేశం భావిస్తుందని, దేశంలోని అన్ని సహజ వనరుల్ని సంపూర్ణంగా వినియోగించే సమర్థ నాయకత్వం కెసిఆర్‌దే మాత్రమే అని అన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు టిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అడ్డగోలు మాటలతో, ఓర్వలేని తనంతో తెలంగాణపై ప్రధాని మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో అగ్రపథాన. సింహభాగం ఉన్నది కెసిఆర్ కుటుంబం.. ప్రజలతో ఎన్నుకోబడి.. వారి ఆశీర్వాదంతో కెటిఆర్, కవిత, హరీశ్‌రావు రాజకీయాల్లో ఉన్నారని, నామినేటడ్‌గా రాలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మోడీ అసమర్థ పాలనను తరిమికొట్టేందుకు, దేశ ప్రజలకు మంచి చేసేందుకు కెసిఆర్ యావద్దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనది కానీ మోడీ అది మర్చి పోయి రోజూ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లే మాట్లాడుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికార మార్పిడి కాదు ముందు మీ ఢిల్లీ పీఠం పైలం అని మంత్రి అన్నారు. కెసిఆర్ సైన్స్ ను నమ్ముతాడు…దేవుణ్ణి నమ్ముతాడు,మొక్కుతాడు. తెలంగాణ రాష్ట్రం అంటేనే బిజెపి, మోడీకి నరనరాన విద్వేషం ఉందన్నారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజలను అవమాన పర్చేలా మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయింది తెలంగాణ పై నీ ప్రేమ..? అని మోడీపై మంత్రులు తీవ్రస్థాయి మండిపడ్డారు.
Telangana Ministers slams PM Modi