పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై నిలదీస్తున్న ఓటర్లు
ప్రచారానికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్న కమలనాథులు
పిఆర్సీ పెంచాలని టిఆర్‌ఎస్ నేతలను కోరుతున్న ఉద్యోగులు
బిజెపి అభ్యర్థి హామీలపై జోకులు వేసుకుంటున్న పట్టభద్రులు
హైదరాబాద్: గత రెండు నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు, వంటింటి గ్యాస్ ధరలు రెండింతలు పెరిగాయని మండిపడుతున్నారు. సామాన్య ప్రజల కష్టాలు గుర్తించిన నాయకులకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేస్తూ ప్రాణా లు బలిగొంటున్న పార్టీ నాయకులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల సమయంలోనే తాము కనిపిస్తామని, తమకు సమస్యలు వస్తే జాడలేకుండా పోతారని కన్నెర్ర చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా, మూడు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రచారానికి వెళ్లితే కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచుతుందని, ప్రజలు గగ్గోలు పెడుతున్న రాష్ట్ర నాయకులు మౌనం గా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ పాలనలో జరిమానాలు, పన్నులు తప్ప ప్రజల సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని విరుచుకుపడుతున్నారు.
ఇప్పటికే టిఆర్‌ఎస్ అభ్యర్థి మాజీ ప్రధాని పివి కూతురు సురభివాణిదేవి ప్రచారంలో దూసుకపోతున్నారు. సిఎం కెసిఆర్ పాలనలో చేపట్టిన ఉద్యోగ నియామకాలు, అభివృద్ధిని వివరిస్తూ ఈసారి తమకు పట్టం కట్టాలని కోరుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి, టిడిపి నుంచి బరిలో ఉన్న ఎల్. రమణలు పట్టభద్రులను మచ్చిక చేసుకునేందుకు గతం లో వారి పార్టీలు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈసారి తమను ఆదరించాలని కోరుతున్నారు. ధరల ఘాటు బిజెపి అభ్యర్థి ప్రచారానికి పెద్ద సంకటంగా మారింది. ఓటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పార్టీ నాయకులు ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. తమ పార్టీ గెలుపునకు చమురు ధరలు దెబ్బకొడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు మార్చి 14న జరుగుతుండటంతో ప్రచారం 12వ తేదీ సాయంత్రం వరకు ముగించుకోవాలి, కానీ కమలనాథులు రెండు రోజుల నుంచి ఓటర్లను నేరుగా కలవాలంటే వెనకడుగు వేస్తున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రధాన కూడళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇష్టానుసారంగా పెరిగే ధరలపై అధికార టిఆర్‌ఎస్, కేంద్ర సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూ ఈఎన్నికల్లో బిజెపి తగిన గుణపాఠం చెప్పి, గులాబీ పార్టీ జోరు పెంచాలని కోరుతున్నారు.
Telangana MLC Elections 2021