మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగం అభ్యన్నతి కోసం కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను తమిళనాడు రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రైతుసంఘాలు స్టాలిన్ సర్కారుపై వత్తిడి పెంచుతున్నాయి. శనివారం కోయంబత్తూర్ లోని చాంబార్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ మోడల్ పథకాలపై చర్చా కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా అమలు జరుగుతున్న రైతు అనుకూల పథకాలు, వివిధ రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని దేశం లో జరుగుతున్న అభివృద్ధితో పోల్చి, ఏ రంగంలో చూసినా కేవలం ఎనిమిది సంవత్సరాల లో రెట్టింపు స్థాయిలో తెలంగాణ ముందడుగులో దూసుకు పోతుందని వివరించారు.. సిఎం కేసిఆర్ నాయకత్వంలో రైతులు తమ ఆర్థిక స్థితిని గణనీయంగా పెంచుకొని తలెత్తుకొని సగౌరవంగా నిలబడగలుగుతున్నారని తెలిపారు.
పంటల సాగులో ప్రతిఏటా రెండు సీజన్లలో పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10వేలు అందజేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ కుంబాలకు పెద్దదిక్కుగా ఉన రైతు ఏ కారణం చేత మృతి చెందినా ఆ రైతుకుటుంబానికి అండగా ఉంటూ ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు రైతు బీమా పథకం అమలు చేస్తున్నట్టు వివరించారు. పంటసాగుకోసం రైతులకు 24గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా హరిక హాకం కార్యక్రమం కింద విరివిగా మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. అడవులు పెంచి ,పర్యావరణాన్ని కాపాడటం వల్ల రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నట్టు తెలిపారు. దేశ తలసరి ఆదాయంతోపోలిస్తే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం అన్నారు. సాగునీటి రంగం , ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, సేవారంగం విద్యుత్తు లో మిగులు, తదితర విషయాలను ఈ సమావేశంలో వివరించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దక్షిణ భారత రైతు సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.కె.దైవ శిగామణి మాట్లాడుతూ గత నెలలో తెలంగాణలో పర్యటించి కెసిఆర్ తో రెండు రోజులపాటు సమావేశం అయినట్టు వివరించారు. తన వంతుగా తమిళనాడులో ప్రజలను, రైతులను చైతన్యవంతం చేసి , కేసిఆర్ మోడల్ సథకాలను తమిళనాడులో అమలు అయ్యే వరకు ఆందోళన చేస్తామని ప్రకటించారు. ముందుగా రాష్ట్రంలోని మంత్రులు ,ఎంపీలు , ఎమ్మేల్యేలతోపాటు ప్రముఖలందరికీ లేఖలో రాసి కేసిఆర్ మోడల్ పథకాల అమలు కొరకు డిమాండ్ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల అనంతరం తమిళనాడు అంతటా రైతులను చైతన్యపరిచి కన్యాకుమారి నుండి చెన్నై వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో వక్తలుగా పాల్గొన్న కోయంబత్తూర్ వ్యవసాయ ఉత్పత్తుల కమిటీ సభ్యులు వికెఎస్‌కె సెంథెల్ కుమార , కాంచీపురం జిల్లా అధ్యక్షుడు కె.ఏజి హలన్ తదితరులు తెలంగాణ మోడల్ అభివృద్ధికై రైతులతో కలిసి ఉద్యమించడానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించారు.