ఫిబ్రవరి 17 న తెలంగాణ సారథి, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమ ఊపిరి, కోటి గొంతుకుల హృదయ ఘోష, దుర్మార్గుల సింహస్వప్నం, లక్ష్య సాధకుడు, స్ఫూర్తి ప్రదాత అయిన కల్వకుర్తి చంద్రశేఖర రావు జన్మదినం. ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు అని అక్టోబర్ 2న యావత్ భారత జాతి ఏ విధంగా పండుగ చేసుకుంటామో అంతే గొప్పగా కెసిఆర్ జన్మదినాన్ని ఈ 17న తెలంగాణ అంతటా జరుపుకోవాల్సిన రోజు. ఆ గాంధీ ప్రాణాల్ని సహితం పణంగా పెట్టి బ్రిటిష్ వారి పాలనకు ఎదురొడ్డి భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించారు. అంతే కష్టంతో, అంతే దీక్షతో, మొక్కవోని ధైర్యంతో ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి తెలంగాణకు విముక్తి కల్గించి తెలంగాణ సింహంగా నిలబడ్డారు కెసిఆర్. అంతటి మహనీయుడి జన్మదినం నిజంగా తెలంగాణ ప్రజలకు పండుగ దినంగానే చెప్పవచ్చు. ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇది సత్యం. ఇది చరిత్ర. దీనిని ఎవ్వరూ కాదనలేరు. ఎవరూ వక్రీకరించలేరు. ఎవరూ విమర్శించలేరు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన నేపథ్యం గూర్చి వాస్తవాలు తెలుసుకోవడం అవసరం. తెలంగాణ సూరీడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫిబ్రవరి 17, 1954లో మెదక్ జిల్లాలోని చింతలమడక గ్రామంలో రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. తమ గారాల బిడ్డ తెలంగాణ సూరీడు అవుతారని, తెలంగాణకు విముక్తి కల్గిస్తారని వారెప్పుడూ ఊహించి వుండరు. అందరిలా తమ కొడుకూ ఓ సామాన్యుడిగా జీవితం గడుపుతారనే అనుకున్నారు. కానీ, ఆ చిన్ని బుడతడే యావత్ తెలంగాణ బిడ్డల్ని ఒక్క త్రాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆయన విజయం వెనుక తెలంగాణ గడ్డ గూర్చి, దాని చీకటి అధ్యాయాన్ని గూర్చి కూడా తెలుసుకోవాలి. తెలంగాణ తరతరాలుగా దోపిడీకి గురైన అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. నిజాం పాలనలో రాక్షస రజాకార్ల ఆకృత్యాలు, దోపిడీలతో చిక్కి శల్యమై దీనాతిదీనంగా మారిన దురదృష్ట భూమి. ఆ రాక్షసులే కాకుండా పట్వారీ, పటేల్‌ల కబంద హస్తాలలో కూడా బక్కచిక్కిన ప్రాంతం.
రజాకార్లు తెలంగాణ ప్రజల రక్తం తాగిన వారు. ఈ దోపిడీని, దుర్మార్గాన్ని అణచడానికి కొమరం భీం లాంటి మహా యోధులు, దాశరథి, కాళోజీ లాంటి ఎందరో మహా కవులు ఎంతగానో కృషి చేశారు. మహాకవి దాశరథి గూర్చి ఆయన రాసిన ‘అగ్నిధార’ పుస్తకం ఇక్కడ పేర్కొనడం అవసరం. తెలంగాణ ప్రజల కన్నీళ్లు ఆయన రచించిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ లో కన్పించి, మన హృదయాలలో ఆవేదన రాగాల్ని వినిపిస్తాయి. ఆయన ‘దగాకోరు, బడా చోరు, రజాకారు పోషకుడవు. దిగిపొమ్మని జగత్తంతా నగారాలు కొడుతున్నది. ‘దిగిపోవోయ్, తెగిపోవోయ్’ అంటూ తన క్రోధాన్ని అక్కసను, శౌర్యాన్ని ప్రదర్శిస్తాడు. చివరికి రక్కసుల కబంధ హస్తాల నుండి తెలంగాణ విముక్తి చేయబడింది. అదొక పీడిత చరిత్ర.
అయితే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడేంత వరకు జరిగిన మరో దోపిడీ అధ్యాయం గూర్చి.. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా చేశారు. ఈ విశాలాంధ్రప్రదేశ్‌కు ఎక్కువ కాలం పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులే ముఖ్యమంత్రులుగా వున్నారు. నాటి నుండి నాయకుల దృష్టిలో తెలంగాణ వెనుకబాటుకు, నిర్లక్ష్యానికి గురిఅవుతూ వచ్చింది. సాగునీరు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, అభివృద్ధి అన్ని విషయాల్లోనూ తెలంగాణకు అన్యాయమే జరుగుతూ వచ్చింది. ఉద్యోగాల విషయంలో కూడా చాలా ద్రోహమే జరిగింది. స్వతహాగా తెలంగాణ ప్రజలు సాత్వికులు, శ్రమ వీరులు, వీరికి చాలా ఓర్పు, సహనం కూడా అబ్బాయి. కష్టించి పని చేయడమే తప్ప అందుకు తగిన ఫలాన్ని గూర్చి కూడా ఆలోచించేవారు కాదు. వాళ్లలో ఐక్యతను, తిరుగుబాటుతనాన్ని ఎగదోసేందుకు డా.మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకులు కొంత వరకు ప్రయత్నించి చివరికి కాంగ్రెస్ అధిష్టానానికే తలవొగ్గి వెనక్కు తగ్గారు. ప్రజల మనోరోదనల నుండి కసి పుట్టింది.
ఆ కసి తిరుగుబాటుకు ఐక్యతకు దోహదం చేశాయి. ఆనాటి తెలంగాణ స్థితిగతులు, పూర్వాపరాలు, రాజకీయ స్థితిగతులు అన్నీ కలసి కెసిఆర్‌లోని సింహాన్నినిద్ర లేపాయి. ఆ సింహం కాంగ్రెస్, బిజెపి పార్టీలకు నిద్ర లేకుండా చేసింది. చివరికి ఉద్యమ పోరాట తీవ్రత గొల్కొండ కోటపై తెలంగాణ జెండాను ఎగరవేసేలా చేసింది. అదే తెలంగాణ ఏర్పాటు. ఆత్మస్థైర్యంతో స్వయంపాలన కోసం, ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ ప్రజల్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి కెసిఆర్ వేసిన ఈల ఢిల్లీ పాలకుల గుండెలకి గుభేల్ అని తగిలింది. పాలకుల్లో నిద్రమత్తును వదలించి తెలంగాణకు నిజమైన సూర్యోదయాన్ని ప్రసాదించాయి. చివరికి 2014 జూన్, 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.
తెలంగాణ ఆవిర్భావ నూతన చరిత్రకు ముమ్మాటికీ ముఖచిత్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. చరిత్రను, ఆ ముఖచిత్రాన్ని ఎవరూ చెరపలేరు. ఎవరూ వక్రీకరించలేరు. అలా ఎవరైనా ప్రయత్నిస్తే సూర్యుడిపై ఉమ్మివేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు అత్యంత సునాయాసంగా వచ్చింది కాదు. ఎవరి దయాదాక్షిణ్యాలతోను ఇది ఏర్పడలేదు. కెసిఆర్ ఆలోచనలు, అకుంఠిత దీక్ష, లక్ష్యసాధన, ఉద్యమ స్ఫూర్తి, పట్టుదల, రగిలిన కసి అన్నీ కలగలిపి ఆయన్ని ఉద్యమ సారథిగా నిలిపాయి. కెసిఆర్ చాలా కాలంగా తెలుగుదేశం పాలనలో మంత్రిగానూ, ఇంకా అనేక హోదాలలోనూ సేవలు అందించారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కెసిఆర్ శక్తిని, విలువను తక్కువ అంచనా వేయడంతోనే తెలంగాణ మహోద్యమానికి బీజం పడింది. నిష్కళంక స్వభావిగా, నిస్వార్థ సేవలనందించిన కెసిఆర్‌ని మంత్రిగా కాకుండా కేవలం ఉత్సవ విగ్రహంగా చేసేందుకు బాబు 2000లో డిప్యూటీ స్పీకర్‌గా ఆయనను నియమించారు. వొక్కసారిగా ఆ ఘటన కెసిఆర్‌ని ఉలిక్కిపడేలా చేసి నిద్ర లేపింది.
అప్పడే ఆయన మనసులో ఆంధ్రపాలకుల దుర్మార్గం, అవమాన ధోరణి కత్తిలా గుచ్చుకొన్నాయి. మనసు గాయపడింది. మనిషి అవమానంగా ఫీలయ్యారు. ఆ రోజు నుండి తెలంగాణ గూర్చి దాని దైన్య స్థితి గూర్చి కెసిఆర్ మెదడులో చింతలు రేకెత్తించాయి. ఆయన తెలంగాణను సమగ్రంగా శోధించారు. పరిశీలించారు. ప్రణాళికల్ని రూపొందించుకున్నారు. ఆలోచనలకు తోడుగా ఆయనకు ప్రొ. జయశంకర్ సాన్నిత్యం ఎంతో శక్తినిచ్చాయి. విశ్లేషించారు, చర్చించారు, మూలాల్ని కూడా త్వవ్వితీశారు. ఇద్దరిలోనూ తెలంగాణకు ఏదో ఒకటి చేయాలని, విముక్తి కల్గించి స్వరాష్ట్రం సాధించాలని పట్టుదలను రేకెత్తించాయి. ఇలాంటి పురిటి సమయంలోనే చంద్రబాబు ఉన్నపళంగా విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారు. అదే కెసిఆర్ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సాగునీటి సౌలభ్యం లేక, విపరీతమైన విద్యుత్ కోతలతో సతమతమవుతున్న రైతుల నెత్తిన ఒక్కసారిగా చంద్రబాబునాయుడు విద్యుత్ ధరల పెంపు అనే బండరాయిని వేశాడు.
రైతులందరి కళ్ళ ముందు చీకటి మేఘాలు క్రమ్ముకొన్నాయి. ఒక్కసారిగా అందరి గుండెలు రోదించాయి. వారి మూగరోదన కెసిఆర్‌ని తెలంగాణ సాధన దిశగా ఉపక్రమించేలా చేశాయి. వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవికి, 18 సంవత్సరాలుగా వున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర పోరాట సమితికి జీవం పోశారు. ఆయన రగిలించిన నిప్పు క్రమక్రమంగా తెలంగాణ ప్రజల గుండెల్లో ముఖ్యంగా యువత హృదయాల్లో మహోజ్వల దావాగ్ని రేపాయి. తెలంగాణ సాధన కోర్కె తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరిలో దావానంలా అల్లుకొనింది. జలవిహార్‌లో ఆయన పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ఘడియ ముహూర్తం ఎలాంటిదో ఏమో గాని అతి కొద్ది కాలంలోనే కెసిఆర్ ఉద్యమం ఫలవంతమై తెలంగాణ రాష్ట్రం నూతన రాష్ట్రంగా ఆవిర్భవించడం, కోట్లాది గుండెల్లో గంటలు మ్రోగడం జరిగాయి. 2014 జూన్, 2న తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ప్రజల హృదయాల అభిమానాన్ని చూరగొంటూనే కొనసాగుతున్నారు.
కెసిఆర్ అనే మూడక్షరాలు తెలంగాణ ప్రజల గుండెల్లో మంత్రంలా పనిచేసి నిప్పుజ్వాలలు రేకెత్తించాయి. అప్పటి వరకు చంద్రశేఖర్ రావు పేరు పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. స్వార్థరహితంగా నిష్కళంక ప్రజాసేవ చేసినా, ఆయనకు తెలంగాణలో అంత గొప్ప పేరు రాలేదు. ఆంధ్ర పాలకుల అణచివేతతో కృంగిన బతుకులు సాగిస్తున్న ఈ గడ్డపై జీవిస్తున్న ప్రజల్లో పాలకులపై ఎలాంటి అభిమానం వుండేది కాదు. ఎవరి జీవితం వారిదే. ఎవరి స్ఫూర్తీ వాళ్లలో వెలుగుల్ని నింపలేదు. నందమూరి తారక రామారావు పటేల్, పఠ్వారీ వ్యవస్థను రద్దు చేసినపుడు మాత్రం వాళ్ళ పెదవులపై ఓ చిన్ని నవ్వు కన్పించింది. అదే ముఖాల్లో శాశ్వత చిరునవ్వుల్ని తారాజువ్వల్లా ఎగిసిపడేలా చేశారు కెసిఆర్.
అంతకాలం ఎంతో కాలం ఎవరెవరో గద్దె నెక్కుతుంటే పట్టించుకోక పల్లకిని బానిసల్లా మోస్తూనే వస్తున్న బిడ్డల హదయాల్లో ‘తిరుగుబాటు’ తత్త్వం కెసిఆర్ మాటల బాణాల వల్లే ఏర్పడ్డాయి. కాడె కింద పడేసి ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ అంటూ గళం విప్పారు. చేతులు కలిపారు. ఉద్యమ బావుటా ఎగరవేశారు. అంతటి పాఠవం ఒక్క కెసిఆర్ మాటలకే దక్కాయి. ఆయన చెప్పే ప్రతి మాటను జనం చెవులు రెక్కించి వినేవారు. కెసిఆర్ మాటల తూటాలు మంత్రాలై మనుషుల్ని నిద్ర లేపాయి. పసిబిడ్డ నుండి పండు ముదుసలి వరకు, అందరిదీ ఒకటే నినాదం అదే ‘జై తెలంగాణా’. ఆ నినాదమే, ఆ మంత్రాక్షరమే వాళ్ళకు తెలంగాణ స్వప్నం సాక్షాత్కరించేలా చేసింది.
కెసిఆర్ అకుంఠిత దీక్ష, పట్టుసడలని దృఢత్వం ఆయన్ని పోరాటంలో నెగ్గేలా చేశాయి. ఆయన సాగించిన ఉద్యమం అంతా హాయిగా సాగిపోలేదు. అనేక కష్టాల్ని, నష్టాల్ని, దూషణల్ని ఎదుర్కోవలసి వచ్చింది. మధ్య మధ్యలో ఎన్నో ఓటములు, ఆంధ్ర పాలకుల అవాకులు, అవహేళనలు. వాటన్నిటినీ పెద్ద కొండలా ఎదురొడ్డాడు. ఆయన్ని అవహేళన చేసిన అందరూ చివరికి సిగ్గుతో తలవొంచుకున్నారు. ఉద్యమ చివరి అంకంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కల్పించిన అవాంతరాలు అన్నీ ఇన్నీ కావు. ఇస్తామని ఒకసారి, ఆలోచిస్తామని మరోసారి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎన్నో కపట నాటకాల్ని ఆడింది. తెలంగణ ఇస్తే నీటి సమస్య వస్తుందని, విద్యుత్ సమస్య అందర్నీ మింగేస్తుందని రకరకాలుగా అనేక లెక్కల తక్కెళ్ళతో కిరణ్ కుమార్ తెలంగాణ ఉద్యమానికి మంగళం పాడాలని విఫల ప్రయత్నం చేశారు.
అయినా వెరవక, బెదరక పట్టువిడవక, చివరికి మృత్యుకోరల వరకూ కూడా వెళ్ళి చిరంజీవిగా విజయబావుటా ఎరగేశారు కెసిఆర్. మాట తప్పడం, మడమ తిప్పడం ఆయన వొంట్లోనేలేవు. తన గూర్చి ఎవరికీ తెలియకపోయినా, తన ఆశయం గూర్చి మాత్రం పార్టీ పెట్టిన స్వల్పకాలంలోనే అందరికీ తెలిసిపోయింది. 2001 ఏప్రిల్ 15న మొదటిసారిగా కరీంనగర్‌లో ఆయన ఏర్పాటు చేసిన బహిరంగ సభకు 2 లక్షలకు పైగా జనాలు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడే తెలంగాణ అంశం, కెసిఆర్ శక్తి సామర్థ్యాల గూర్చి జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ ఆరంభమైంది.
కెసిఆర్ జీవితానికి కోట్లాది ప్రజల ఆశీస్సులే ఒక లక్ష్యాన్ని నిర్దేశించాయి. ఆనాటి నుండి ఎన్నో పథకాలు, ఎన్నో ప్రణాళికలతో కెసిఆర్ ముందుకెళ్ళారు. ఓటమిలు కూడా అప్పుడప్పుడు ఆయనతో దోబూచులాడేవి. ఆయన దీక్షకు పరీక్షలు పెట్టేవి. అలా ప్రతి ఓటమి ఆయన్ని మరింత గెలుపుదిశగా పరుగులెత్తించేవి. పాలకులు ఆయన్న ఎలాగైనా పాతాళానికి తొక్కేయాలని చూస్తే ఆయన నేలపై కొట్టిన బంతిలా మరింత పైకి ఎగిరేవారు. బక్కచిక్కిన వీడా తెలంగాణా సాధించేది అని కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పార్టీల పెద్దలు అవహేళన కూడా చేసేవారు. వారి వెకిలి చేష్టల్ని, ఆశీస్సులుగా మార్చుకొంటూ ముందుకెళ్లి ఆయన విజయాన్ని సాధించారు. ఆయనెప్పుడూ పదవులు పట్టుకొని వేళ్లాడలేదు.
కేంద్ర మంత్రి పదవికి, ఎంఎల్‌ఎ, ఎంపిల పదవికి కూడా ఎన్నో సార్లు రాజీనామా చేసి, తమ వారితో రాజీనామా చేయించి, మళ్ళీ ఎన్నికల రంగంలో విజయదుంధుభి మోగించేవారు. ఒక్కోసారి ఓటమి పెద్ద దొంగ దెబ్బ తీసినా వెంటనే విజయుడు పరుగెత్తుకుంటూ వచ్చి కెసిఆర్‌ను అక్కున చేర్చుకొని ఆనందపరిచేవారు. ఇలాంటి అదృష్టం అందరు రాజకీయ నాయకులకు దొరకదు. కెసిఆర్ నిజంగా కారణజన్ముడు. 2013 నవంబర్ 30న ఆమరణ నిరాహార దీక్షతో ఆయన ఆరోగ్యం క్షీణించి హైద్రాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయినా ఆయన దీక్ష విరమించలేదు. చివరికి మిత్రుడు, గురువు అయిన జయశంకర్ ఆస్పత్రికి వచ్చి ఈ ప్రభుత్వానికి హృదయం లేదు. నీవు తెలంగాణకు కావాలి. దీక్ష విరమించు అని ఎంతగానో ప్రాధేయపడినా కెసిఆర్ అంగీకరించలేదు.
‘తెలంగాణ ఇస్తే జైత్రయాత్ర-లేదా నా శవయాత్ర దీక్ష విరమించి చరిత్ర హీనుడిగా మిగిలిపోకూడదు’ అని ధీరత్వంతో ఆయన పలికిన పలుకులు కోట్లాది తెలంగాణ ప్రజల్ని కంటతడి పెట్టించాయి. బోరున విలపించారు. మరింత పట్టుదలతో ఉద్యమించారు. కెసిఆర్ వాక్కులు తెలంగాణనే కాదు యావత్ భారతదేశాన్ని కదిలించాయి. అంతటి మహోన్నత శక్తిని దేవుడు కెసిఆర్‌కు ఇచ్చారు. ఉద్యమ సాధనకు చివరికి గొంగళి పురుగునైనా ముద్దాడుతాను అని చెప్పే కెసిఆర్ కార్యసాధన కోసం చివరికి కాంగ్రెస్ పార్టీతోనూ, తెలుగుదేశం పార్టీతోనూ కూడా కలసి పొత్తు పెట్టుకున్నారు. ఆఖరు అంకంలో అందరికీ చుక్కలు చూపించి తన ఆశయాన్ని నెరవేర్చుకొన్నారు. ఉద్యమ హోరు చూసి మధ్యలోనే కాంగ్రెస్‌కి, బిజెపికి చెందిన హేమాహేమీలందరూ కెసిఆర్‌కు ‘జై’ కొట్టారు. ఆయన నిర్విరామ కృషి ఫలితంగా కాంగ్రెస్ పెద్దలు దిగిరాక తప్పలేదు.
చివరికి 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు నెగ్గింది. మార్చి 1న, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకంతో ప్రత్యేక తెలంగాణ రూపుదిద్దుకొంది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినంగా నిర్ణయం జరిగిపోయింది. కెసిఆర్ మేధస్సు, ఎత్తుగడలు వాక్చాతుర్యం ఆయన్ని విజేతగా నిలిపాయి. రవాణా శాఖమంత్రిగా ఆయన్ని చాలా దగ్గరగా చూసేవాణ్ని. చాలా సౌమ్యంగా ఎంతో నిగర్విగా కన్పించేవారు. మాటలు కూడా మామూలుగా ఉండేవి. తర్వాతే ఆయన మాటలలో తెలంగాణ మాండలికం తొంగి చూసింది. ఆశయం మహోన్నతమైనందున కెసిఆర్‌ని ప్రజలు సులువుగా అర్థం చేసుకుని స్వాగతించారు. ఆయన కృషి, ఎత్తుగడలు ఒక ఎత్తు అయితే, ఆయన మాటలు మాత్రం తూటాల్లా పేలేవి. అవి అగ్నిని సృష్టించాయి. భూకంపాల్ని రేపాయి. ఇప్పటికీ ఆయన కొన్ని మాటలు తెలంగాణ గుండెల్లో ‘ఘీ’ పెడుతూనే వుంటాయి.
‘తెలంగాణ ఇస్తే సోనియా కాళ్లయినా పట్టుకొంటా’, ‘తెలంగాణ చంద్రబాబు జాగీరా?’ ‘భూకంపం పుట్టించాల, ఢిల్లీ పీఠం కదలాల’ ‘లక్ష మంది చంద్రబాబులు, కిరణ్ రెడ్డిలు వచ్చినా మా వెంట్రుకలు కూడా పీక్కోలేరు’, ‘మాలో ఎవడైనా మడం తిప్పితే రాళ్లతో కొట్టి చంపండి. ‘ఎవడి భిక్షా మనకు అవసరం లేదు’ – ఇలాంటి కోకొల్లలు మాటలు ఆయన విసిరిన శూలాలు. తెలంగాణ చరిత్ర కెసిఆర్‌సార్ పాత్ర అన్న అంశం అన్ని క్లాసుల పాఠ్యాంశాలలో తప్పక చోటు చేసుకోవాలి. దేశంలో ఏ ఉద్యమానికైనా కెసిఆర్ స్ఫూర్తి, ఆదర్శం. ఆయన మరొక… యుగపురుషుడు.
డా. సమ్మెట
విజయ్ కుమార్
8886381999